ఈ ఇళ్లనే అధికారులు పట్టా చేశారు
హుస్నాబాద్ రూరల్: తాతలు, తండ్రులు కట్టిన ఇళ్లు 12...చనిపోయిన వారి సమాధులు 18... ఒక వ్యవసాయ బావి, మిషన్ భగీరథ ద్వారా మంచినీరు సరఫరా చేసే పైప్‌లైన్. ఇవన్నీ కాకుండా 1984 నుంచి ఆ భూముల్లో కబ్జాలోనే ఉంటూ సాగు కూడా చేసుకుంటున్నారు. అయితే రెవెన్యూ అధికారులకు ఇవేమీ కనిపించలేదు. మోక (పొజిషన్) విచారణ జరపలేదు. కబ్జాలో ఎవరు ఉన్నారో తెలుసుకోలేదు. ధరణిలో కబ్జా కాలమ్ తొలగించడంతో పాత పట్దాదారుల పేర్లు రెవెన్యూ రికార్డుల్లో ఉన్నాయి.
దీనిని పసిగట్టిన కొందరు స్థానిక రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకొని, సాదాబైనామాలు సృష్టించి 2021లో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్) గ్రామంలో సర్వే నంబర్ 250లో 2.00 ఎకరాలు, 263లో 1.30 ఎకరాల వ్యవసాయ భూమిని కొంతమంది పట్టా చేయించుకున్నారు. మోక మీద రాజయ్య కుటుంబ సభ్యులే ఉన్న విషయమూ రెవెన్యూ అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. దీంతో బోగస్ సాదాబైనామాలు సృష్టించి నలుగురు పేరున పట్టా చేయించుకున్నారని బాధితులు ఆరోపిస్తూ ఆర్డీఓ, తహసీల్దార్‌కు బాధితులు ఫిర్యాదు చేశారు.
మోక చూడకుండానే పట్టా మార్పిడి..
భూ రికార్డుల మార్పు సమయంలో రెవెన్యూ అధికారులు మోక(పొజిషన్) విచారణ జరిపాక పట్టా చేయాలి. కానీ అవేమీ పట్టించుకోలేదు. ఒకరు మోక మీద ఉంటే మరొకరి పేరున పట్టా చేశారు. దీనివల్ల 250లో సర్వే నంబర్‌లో రక్బా తక్కువ వస్తుంది. మోక మీద ఇళ్లు నిర్మించుకొని ఉంటున్న దళిత కుటుంబాలకు పట్టాలు లేవు, కొత్తగా పట్టాదార్ పాసు పుస్తకాలు పొందినవారికి మోక మీద భూమి లేదు.
మా తాత ఇల్లు కట్టిన భూమి మాది కాదంటున్నారు
యాబై ఏళ్ల క్రితమే మా తాత ఇల్లు కట్టాడు. అయితే ఇప్పుడు ఆ భూమి మాది కాదని ఎవరో అమ్మారని రియల్ ఎస్టేట్ వ్యాపారులు మా దగ్గరకు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. సర్వేనంబర్ 250లో రెండు ఎకరాలు, 263 సర్వేనంబరులో 1.30 ఎకరాల్లో మా తాత కాలేష్ రాజయ్యనే పహాణీలో, కబ్జాలో ఉన్నారు. ఇప్పుడు మా వారికి పట్టా మారిన సంగతి తెలియదు. మేమంతా మా అయ్యలు చూపించిన భూములనే దున్నుకొని బతుకుతున్నాం. ఇప్పుడు ఈ భూములు మావి కావంటే ఎలా? మోక విచారణ జరిపించి అక్రమంగా పట్టా చేయించుకున్న వారి పాస్‌పుస్తకాలు రద్దు చేసి మాకు న్యాయం చేయాలి.
– కాలేష్ రాజేశ్, పోతారం(ఎస్)
మా తాతల సమాధులను పట్టా చేశారు
1980లోనే 250 సర్వే నంబరులో మా తాతల సమాధులు కట్టాం. ఒకటి కాదు రెండు కాదు 18 సమాధులు ఉన్నాయి. వ్యవసాయ బావి, మా ఇళ్లకు కరెంట్ మీటర్లు ఉన్నాయి. మిషన్ భగీరథ నుంచి తాగునీరు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరో వచ్చి ఈ భూములు కావాలంటే ఎలా? 50 ఏళ్ల నుంచి ఈ భూమిని నమ్ముకొని బతికినోళ్లం...ఇప్పుడు భూమి లేదంటే ఎక్కడకు పోవాలి. మా పాత రికార్డులను పరిశీలించి మోక విచారణ జరిపి మా భూములకు పట్టాలు ఇవ్వాలి.
– కాలేష్ శివకుమార్, పోతారం(ఎస్)
విచారణ జరిపిస్తాం
పోతారం(ఎస్) దళిత కాలనీ పేదల భూముల విషయమై మోక విచారణ జరిపిస్తాం. అదే సర్వే నంబర్‌లో పేదల ఇళ్లు ఉంటే పట్టాదారుల పాసు పుస్తకాలు రద్దు చేసి పేదలకు న్యాయం చేయాలని కలెక్టర్‌కు నివేదిస్తాం.
– రవీందర్‌రెడ్డి, తహసీల్దార్,హుస్నాబాద్
Comments
Please login to add a commentAdd a comment