
తహసీల్దార్ రాజేంద్రప్రసాద్, వీఆర్వో వెంకటరమణ
వరదయ్యపాళెం: డబ్బులకు ఆశపడి డీకేటీ పట్టాలను అక్రమంగా వేరేవాళ్ల పేర్ల మీదకు మార్చేసిన పలువురు రెవెన్యూ అధికారులపై కేసు నమోదైంది. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలంలోని చిన్న పాండూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 95/4, 96/1, 88/8లలో టి.వెంకటేష్ పేరిట 1.5 ఎకరాలకు, ఎం.రంగమ్మ పేరిట 1.5 ఎకరాలకు, కె.కన్నయ్య పేరిట 1.5 ఎకరాలకు 1992 ఏప్రిల్ 9న డీకేటీ పట్టాలు పంపిణీ చేశారు. అయితే అవే భూములను 2005లో అక్రమంగా పి.అమ్ములు, జి.నాగమ్మ, ఆర్.నాగమ్మల పేరిట కూడా రికార్డు చేసి.. పట్టాలిచ్చారు.
అనంతర కాలంలో అపోలో టైర్ల పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ఈ ప్రాంతంలోని 216 మంది ఎస్సీ, ఎస్టీ రైతులకు చెందిన 251.24 ఎకరాలను కేటాయించారు. పి.అమ్ములు, జి.నాగమ్మ, ఆర్.నాగమ్మలకు సి కేటగిరి కింద పరిహారం అందింది. అయితే తమకు ఏ కేటగిరి కింద రూ.6.5 లక్షల పరిహారమివ్వాలని వారు కోర్టుకు వెళ్లారు. దీన్ని విచారించిన హైకోర్టు పట్టాల మంజూరులో జరిగిన అవకతవకలను గుర్తించి.. గతేడాది కలెక్టర్‌ను విచారణకు పిలిపించింది.
న్యాయస్థానం ఆదేశాలతో కలెక్టర్ క్షేత్రస్థాయిలో రికార్డులను పరిశీలించి అక్రమాలను గుర్తించారు. పి.అమ్ములు, జి.నాగమ్మ పేరిట అక్రమంగా పట్టాలిచ్చినందుకు అప్పటి ఇన్‌చార్జ్ తహసీల్దార్ మహదేవయ్య, ఆర్‌ఐ సదాశివయ్య, స్థానిక వీఆర్వో రఘునాథరెడ్డిలపై కేసు నమోదు చేశారు. రాపూరు నాగమ్మ పేరిట అక్రమంగా పట్టా ఇచ్చినందుకు అప్పటి మండల తహసీల్దార్ బాబు రాజేంద్రప్రసాద్, అప్పటి ఆర్‌ఐ మురళీమోహన్, ప్రస్తుత చిలమత్తూరు వీఆర్వో దొడ్డి వెంకటరమణపై కేసు నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment