
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూరికార్డుల సమీకృత నిర్వహణ కోసం రూపొందిస్తోన్న ‘ధరణి’వెబ్‌సైట్‌ను తెలుగు భాషలో అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లోని రైతాంగానికి సంబంధించిన భూముల వివరాలన్నింటినీ పొందుపరిచే ఈ వెబ్‌సైట్‌ను అందరికీ అర్థమయ్యేలా తొలిసారి మాతృభాషలో రూపొందిస్తున్నారు. డాటా మొత్తాన్ని తెలుగులోనే అందుబాటులో ఉంచనున్నారు. తెలుగుతో పాటు ఇంగ్లీషులో కూడా ఈ వెబ్‌సైట్ రూపొందిస్తున్నారు.
జిల్లాకో మండలంలో..
కాగా, ధరణి వెబ్‌సైట్‌ను ఈనెల 19 నుంచి జిల్లాకో మండలంలో ప్రారంభించాలని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. గుడిహత్నూర (ఆదిలాబాద్), పాల్వంచ రూరల్ (భద్రాద్రి కొత్తగూడెం), రాయికల్ (జగిత్యాల), రఘునాథపల్లి (జనగామ), మొగుళ్లపల్లి (భూపాలపల్లి), ఐజ (గద్వాల), యెల్లారెడ్డి (కామారెడ్డి), మానకొండూరు (కరీంనగర్), ముదిగొండ (ఖమ్మం), ఆసిఫాబాద్ (కొమురం భీం), కేసముద్రం (మహబూబాబాద్), దేవరకద్ర (మహబూబ్‌నగర్), నెన్నెల్ (మంచిర్యాల), రామాయంపేట (మెదక్), మేడిపల్లి (మేడ్చల్), బిజినేపల్లి (నాగర్‌కర్నూలు), కట్టంగూరు (నల్లగొండ), నిర్మల్ రూరల్ (నిర్మల్), బాల్కొండ (నిజామాబాద్), అంతర్గాం (పెద్దపల్లి), ఇల్లంతుకుంట (రాజన్న సిరిసిల్ల), శేరిలింగంపల్లి (రంగారెడ్డి), రామచంద్రాపురం (సంగారెడ్డి), చేర్యాల (సిద్దిపేట), చివ్వెంల (సూర్యాపేట), నవాబ్‌పేట (వికారాబాద్), పెబ్బేర్ (వనపర్తి), హసన్‌పర్తి (వరంగల్ అర్బన్), నర్సంపేట (వరంగల్ రూరల్), తుర్కపల్లి (యాదాద్రి) మండలాల్లో ఈ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తేనున్నారు. అదే రోజు నుంచి తహశీల్దార్లకు భూముల రిజిస్ట్రేషన్ బాధ్యతలు కూడా అప్పగించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. అయితే, ఈ బాధ్యతల అమలును పైలట్ ప్రాజెక్టు తరహాలో పరిశీలించాలా లేక రాష్ట్రంలోని అన్ని మండలాల్లో (సబ్‌రిజిస్ట్రార్లు లేని మండలాలు) ఒకేసారి అప్పగించాలా అన్నదానిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
అన్ని సేవలతో అనుసంధానం
ధరణి వెబ్‌సైట్‌తో రాష్ట్రంలోని వ్యవసాయ భూముల సమగ్ర సమాచారం అందుబాటులోకి రానుంది. గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా రైతుల సర్వే నంబర్లతో సహా భూముల వివరాలను ఈ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నారు. ఫలానా భూమిపై జరిగిన లావాదేవీలకు సంబంధించిన వివరాలు క్షణాల్లో అప్‌డేట్ అయ్యే లా సాఫ్ట్‌వేర్ రూపొందిస్తున్నారు. ముఖ్యం గా కోర్‌బ్యాంకింగ్, రిజిస్ట్రేషన్, సర్వే సెటిల్‌మెంట్ తదితర వివరాలన్నింటినీ అందు బాటులోకి తెస్తున్నారు. బ్యాంకర్లు ఆన్‌లైన్‌లోనే రైతుల భూముల వివరాలు చూసు కుని రుణాలు ఇచ్చే వెసులుబాటు కల్పిం చేలా డేటా రూపొందిస్తున్నారు. ఈ వెబ్‌సైట్‌ను ప్రయోగాత్మకంగా ఈనెల 8వ తేదీ నుంచి రాష్ట్రంలోని ఐదు మండలాల్లో అమల్లోకి తెస్తున్నారు. జగదేవ్‌పూర్ (సిద్దిపేట), ఘట్‌కేసర్ (మేడ్చల్), కొత్తూరు (రంగారెడ్డి), సదాశివపేట (కామారెడ్డి), కూసుమంచి (ఖమ్మం) మండలాలకు సంబంధించిన అన్ని భూముల వివరాలు ఆ రోజునుంచి ధరణి వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment