శుక్రవారం ప్రగతిభవన్‌లో భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం పురోగతిపై సమీక్ష జరుపుతున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం ఆశించిన లక్ష్యానికి అనుగుణంగా జరుగుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతృప్తి వ్యక్తం చేశారు. భూమి యాజమాన్య హక్కులపై స్పష్టత రావటంతో రైతులు ఆనందంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఇంటింటికీ తిరిగి భూ రికార్డులను సరిచేస్తున్న రెవెన్యూ అధికారులు, సిబ్బందికి ప్రత్యేక నగదు ప్రోత్సాహకం అందజేస్తామని ప్రకటించారు. ఈ నెల 15న ప్రారంభమైన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం తొలివారం పురోగతిపై కేసీఆర్ శుక్రవారం ప్రగతిభవన్‌లో సమీక్షించారు. భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం రైతులకు ఎంతో ప్రయోజనకరమని, ఏళ్లుగా పరిష్కా రం కాని సమస్యలు ఓ కొలిక్కి వస్తున్నాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘‘వారసత్వం, హక్కులను కచ్చితంగా నిర్ధారిం చడం, సాదా బైనామాలపై జరిగిన క్రయ విక్రయాలను క్రమబద్ధీకరించడం, పేరు మార్పిడి వంటి పనులు చకచకా జరుగుతున్నాయి.
గ్రామాల్లో సగటున 82 శాతానికిపైగా భూముల విషయంలో ఇప్పటికే స్పష్టత రావడం మంచి పరిణామం. పార్ట్–బి కార్య క్రమంలో మరిన్ని భూములపై స్పష్టత వస్తుంది. కోర్టు కేసుల్లో ఉన్న భూముల విషయంలో కోర్టు తీర్పులకు లోబడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. పార్ట్–ఎ కార్యక్రమం పూర్తయిన వెంటనే స్పష్టత వచ్చిన భూములకు సంబంధించి కొత్త పాస్ పుస్తకాలు అందిస్తాం. సవరించిన రికార్డుల ఆధారంగానే రైతులకు వ్యవసాయ పెట్టుబడి అందించే కార్యక్రమం అమలు చేస్తాం..’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. తొలివిడత ఎకరానికి రూ.4 వేల చొప్పున మే 15లోగా రైతుల ఖాతాలో వేస్తామని, అక్టోబర్ 15లోగా రెండో విడత రూ.4 వేలను బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎంవో అధికారులు నర్సింగరావు, స్మితా సబర్వాల్, భూపాల్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
1,252 గ్రామాల్లో తొలి విడత
తొలివిడతలో 1,252 గ్రామాల్లో భూ రికార్డుల పరిశీలన, ప్రక్షాళన జరుగుతోంది. ఈ గ్రామాల్లో మొత్తంగా 30.04 లక్షల ఎకరాల భూములుంటే.. ఇప్పటివరకు వివాదాల్లేని 11.55 లక్షల ఎకరాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అందులో 9.48 లక్షల (82.10 శాతం) ఎకరాల భూముల యాజమాన్య హక్కులపై రైతుల సమ్మతితోనే స్పష్టత ఇచ్చారు. వివాదాల్లేని భూములకు సంబంధించిన రికార్డులను ‘పార్ట్–ఎ’లో భాగంగా స్వీకరించారు. మిగతా భూములకు సంబంధించి ఫిర్యాదులు, అభ్యంతరాలను తీసుకుంటున్నారు. వాటిని ‘పార్ట్–బి’ కార్య క్రమంలో పరిగణిస్తారు. ‘పార్ట్–ఎ’కు సంబం ధించి కొన్ని గ్రామాల్లో వందకు వంద శాతం రికార్డుల ప్రక్షాళన పూర్తయింది. డిసెంబర్ 31 వరకు ఈ కార్యక్రమం పూర్తవుతుంది. తర్వాత ‘పార్ట్–బి’ కార్యక్రమాన్ని చేపడతారు. గట్టు వివాదాలు, వారసత్వ సమస్యలను పరిష్కరిస్తే ‘పార్ట్–బి’లో మరో పది శాతానికి పైగానే భూములపై స్పష్టత రానుంది. అన్ని జిల్లాల కలెక్టర్లు స్వయంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.
కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు...
భూ రికార్డుల ప్రక్షాళన, నవీకరణకు హైదరా బాద్‌తో పాటు జిల్లాల్లో ప్రత్యేక కంట్రోల్ రూములను ఏర్పాటు చేశారు. దానికి ఫోన్ చేస్తే అవసరమైన వివరాలను అందిస్తారు. ఇక ఈ కార్యక్రమంపై రైతులు, ప్రజలకు అవగాహన కల్పించడానికి సోషల్ మీడి యాను వినియోగిస్తున్నారు. సందేహాల నివృత్తికి కరపత్రాలు, బుక్‌లెట్లు పంచుతున్నా రు. భూ రికార్డుల ప్రక్షాళనలో కేవలం రైతుల భూములనే కాకుండా గ్రామ పరిధిలోని అన్ని ప్రభుత్వ భూముల లెక్కలూ తీస్తున్నారు.
ఎన్నారైలు రికార్డులు పంపిస్తే చాలు
విదేశాల్లో ఉన్న ఎన్నారైలు అక్కడే ఉండి తమ భూముల రికార్డులు పంపిస్తే.. వాటిని పరిశీలించి యాజమాన్య హక్కులపై స్పష్టత ఇచ్చే విధంగా అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించిన విధి విధానాలు నాలుగైదు రోజుల్లో ఖరారు కానున్నాయి.
కంట్రోల్ రూమ్ నంబర్లు
రాష్ట్ర స్థాయిలో... 040–23201345/040–23201346/040–23201347/
040–23201348/040–23201349
భద్రాద్రి 08744–243022
జనగాం 08716–227116
జయశంకర్ భూపాలపల్లి 08713–248043
కామారెడ్డి 08468–220008
కరీంనగర్ 0878–2234731
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ 08733–279403
మహబూబాబాద్ 08719–240216
మంచిర్యాల 08736–250107
నాగర్‌కర్నూల్ 08540–230221
నిర్మల్ 08734–242122
నిజామాబాద్ 08462–220183
పెద్దపల్లి 08728–223314
రంగారెడ్డి 040–23237416
సంగారెడ్డి 08455–272525
సిద్దిపేట 08457–234000
సుర్యాపేట 08684–231008
వనపర్తి 08545–233550
వరంగల్ (అర్బన్) 0870–2510777
యాదాద్రి భువనగిరి 08685–234020
ఆదిలాబాద్ 9491053564
జగిత్యాల 9849195398
జోగుళాంబ గద్వాల 08546–27400
ఖమ్మం 9849906076
మహబూబ్‌నగర్ 9000101507
మెదక్ 7989894430
మేడ్చల్ 7995073762
నల్లగొండ 8333055771
రాజన్న సిరిసిల్ల 9396675221
వికారాబాద్ 9704039194
వరంగల్ (రూరల్) 7702434499