సాక్షి, హైదరాబాద్: భూ రికార్డుల ప్రక్షాళన ప్రక్రియ నల్లగొండ జిల్లాలో వేగంగా సాగుతోంది. ఈ నెల 15న ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు 80 వేలకుపైగా సర్వే నంబర్ల పరిశీలన పూర్తయింది. దీంతో రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే నల్లగొండ ముందు నిలిచింది. మహబూబ్‌నగర్, సూర్యా పేట జిల్లాలు కూడా వేగంగా ప్రక్షాళన ప్రక్రియ జరుగుతోంది. పక్కా ప్రణాళికతో..: భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని నల్లగొండ జిల్లా యంత్రాంగం పక్కా ప్రణాళికతో నడిపిస్తోంది. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 70 బృందాల్లో 500 మందికిపైగా సభ్యులు ఈ ప్రక్రియలో తలమునకలై ఉన్నారు. జిల్లాలో మొత్తంగా 14.17 లక్షల సర్వే నంబర్ల పరిధిలో 17.95 లక్షల ఎకరాల భూమి ఉంది.
మంగళవారం నాటికి 80,795 సర్వే నంబర్ల లోని 1.35 లక్షల ఎకరాలకు సంబంధించిన రికార్డుల పరిశీలన పూర్తయిం ది. సిబ్బంది తమకు కేటాయించిన గ్రామంలోకి వెళ్లడానికి ముందే.. ఆ గ్రామంలోని ఏయే సర్వే నంబర్ల భూముల్లో సమస్యలున్నాయి, ఏ సర్వే నంబర్‌లో పట్టాదారుల పేర్లు మార్చా ల్సి ఉందనే దానిపై వీఆర్వోలకు అవ గాహన కల్పించడంతో ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ప్రతి గ్రామంలో క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేసు కుని ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతున్నామని నల్లగొండ జేసీ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు.
నిర్ణీత గడువులోగా పూర్తి చేయండి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడు తోన్న భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఆర్ మీనా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా భూరికార్డుల ప్రక్షాళన చురుకుగా సాగుతోందన్నారు. ఇందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు, వారి బృందాలను మెచ్చుకున్నారు. దేవాదాయ, వక్ఫ్, భూదాన్ భూములపై హక్కు రెవెన్యూ శాఖకే ఉంటుందని, అటవీ భూముల విషయంలో ఏమైనా సమస్యలు వస్తే సంబంధిత శాఖతో సంప్రదించి చర్యలు తీసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమ ప్రత్యేక అధికారి వాకాటి కరుణ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు, జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్ తదితరులు పాల్గొన్నారు.