రెవెన్యూ ఉద్యోగులు అధైర్యపడొద్దు | Revenue system cancels is a Myth | Sakshi
Sakshi News home page

రెవెన్యూ ఉద్యోగులు అధైర్యపడొద్దు

Published Thu, Apr 18 2019 1:39 AM | Last Updated on Thu, Apr 18 2019 1:39 AM

Revenue system cancels is a Myth - Sakshi

రెవెన్యూ ఉద్యోగుల రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న వి.లచ్చిరెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: రెవెన్యూ వ్యవస్థను రద్దు చేస్తారని.. ఇతర శాఖల్లో విలీనం చేస్తారని జరుగుతున్న ప్రచారం కేవలం అపోహ మాత్రమేన ని తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల సంఘం (టీడీసీఏ) అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి, తెలంగాణ తహసీల్దార్ల సంఘం(టీజీటీఏ) అధ్యక్షుడు కె.గౌతమ్‌కుమార్‌ పేర్కొన్నారు. రెవెన్యూ ఉద్యోగులు అధైర్యపడవద్దని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని టీజీటీఏ కేంద్ర కార్యాలయంలో ‘రెవెన్యూ ఉద్యోగుల రౌండ్‌టేబుల్‌ సమావేశం’జరిగింది. ఇందులో లచ్చిరెడ్డి, గౌతమ్‌కుమార్‌ మాట్లాడారు. ఇటీవల పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో రెవెన్యూ వ్యవస్థను రద్దు చేస్తున్నారని, ఇతర శాఖల్లో విలీనం చేస్తున్నారని వస్తున్న వార్తలను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రచారంతో రెవెన్యూ ఉద్యోగుల్లో అభద్రతాభావం, ఆందోళన నెలకొన్నాయన్నారు. ఇప్పటివరకు శాఖను రద్దు చేస్తున్నామని, విలీనం చేస్తున్నామని కానీ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదన్నది గుర్తుంచుకోవాలన్నారు. ఉద్యోగులెవరూ ఆందోళనకు గురికావొద్దని చెప్పారు. 

కొత్త చట్టంతో పటిష్టం చేయాలి 
ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తున్నట్లు లచ్చిరెడ్డి, గౌతమ్‌కుమార్‌ స్పష్టం చేశారు. రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేసే విధంగా ఈ చట్టం ఉండాలన్నారు. పాలనాపరమైన సంస్కరణలు తీసుకొచ్చి శాఖను మరింత పటిష్టం చేయాలని తాము చాలా రోజులుగా కోరుతున్న విషయాన్ని గుర్తు చేశారు. కొత్త చట్టం, సంస్కరణల రూపకల్పనలో రెవెన్యూ ఉద్యోగులను భాగస్వాములను చేయాలని కోరారు. క్షేత్రస్థాయిలో పనిచేసే రెవెన్యూ ఉద్యోగులకు వాస్తవ పరిస్థితులపై అవగాహన ఉంటుందని, కాబట్టి ఉద్యోగుల అభిప్రాయాలను, సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. 

భూసమస్యల్లేని గ్రామాలుగా ప్రకటించాలి 
ఏడాదిన్నరగా భూ రికార్డుల ప్రక్షాళన ఉద్యోగులంతా తీరిక లేకుండా పనిచేశారని, అయినా కొన్ని చోట్ల తలెత్తిన సమస్యల వల్ల రెవెన్యూ శాఖపై నిందలు పడ్డాయని వారు చెప్పారు. ఈ చెడ్డపేరు తొలగించుకునేందుకు ముందడుగు వేయాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు. భూ రికార్డుల ప్రక్షాళనలో మిగిలి ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా ఉద్యోగులు పనిచేయాలని కోరారు. భూ సమస్యలు పరిష్కరించి రెవెన్యూ వివాదాలు లేని గ్రామాలుగా ప్రకటించాలని సూచించారు.

భూ చట్టాల నిపుణుడు ఎం.సునీల్‌కుమార్, మా రెవెన్యూ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు లక్ష్మయ్య మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖను మరింత పటిష్టం చేయాలని వారు పేర్కొన్నారు. సమావేశంలో రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రవినాయక్, చిన్నరాజు, గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఈశ్వర్, రాములు, డిప్యూటీ కలెక్టర్ల సంఘం ప్రతినిధి రాజాగౌడ్, టీజీటీఏ ప్రధాన కార్యదర్శి ఏ.వెంకట భాస్కర్, అసోసియేట్‌ అధ్యక్షుడు పూల్‌సింగ్‌ చౌహాన్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement