Revenue System
-
సంక్రాంతికి గ్రామానికో రెవెన్యూ అధికారి: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి లోపు రాష్ట్రంలోని 10,956 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ అధికారులను నియమిస్తామని, తద్వారా రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. తమ స్వలాభం కోసం వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థలను గత ప్రభుత్వం రద్దు చేయడంతో గ్రామాల్లోని ప్రభుత్వ భూముల రక్షణ, రెవెన్యూ శాఖతో ప్రభుత్వానికి సమన్వయం విషయంలో సమస్యలు వస్తున్నాయని చెప్పారు. ధరణి పోర్టల్‌ను సరళీకృతం చేస్తామని, ఇప్పుడున్న 33 మాడ్యూల్స్ స్థానంలో 11–13 మాడ్యూల్స్ మాత్రమే ఉంచుతామని చెప్పారు. పహాణీల్లో ఇప్పటివరకు ఒక్కటే కాలమ్ ఉందని, ఇక నుంచి 12 లేదా 13 కాలమ్స్ పెడతామని, భూముల పుట్టు పూర్వోత్తరాలన్నింటినీ నమోదు చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా బుధవారం ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..5 లక్షలకు పైగా ధరణి దరఖాస్తులకు పరిష్కారంఅధికారంలోకి రాగానే ధరణి ప్రక్షాళన ప్రారంభించాం. ఏడాదిన్నర కాలంగా పెండింగ్‌లో ఉన్న 2.46 లక్షలు, ఈ ఏడాదిలో వచ్చిన 2.60 లక్షల దరఖాస్తులు కలిపి 5 లక్షలకు పైగా దరఖాస్తులను పరిష్కరించాం. ఇంకా 60–70 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ధరణి పునర్నిర్మాణ కమిటీని నియమించాం. 18 రాష్ట్రాల్లో అధ్యయనం చేసి రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్) చట్టాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ చట్టం ముసాయిదాను ప్రజల్లో చర్చకు పెట్టాం. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దేశానికి రోల్ మోడల్‌గా ఉండేలా బిల్లు ప్రవేశపెడతాం. అటవీ, రెవెన్యూ, దేవాదాయ, వక్ఫ్ భూముల సరిహద్దు వివాదాలు వచ్చాయి. వీటిని సర్వే చేసి డీ మార్కింగ్ చేస్తాం. ఏ శాఖ భూములు ఆ శాఖకు ఇచ్చేస్తాం. పార్ట్–బీలో ఉన్న భూముల సంబంధిత సమస్యలను పరిష్కరిస్తాం. అసైన్డ్ భూములకు హక్కులు కల్పించే విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. బీఆర్ఎస్ హయాంలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములు తీసేసుకుంటాం. జీవో 59 కింద పెండింగ్‌లో ఉన్న సరైన దరఖాస్తులను త్వరలోనే పరిష్కరిస్తాం.వైఎస్ స్ఫూర్తితో ఇందిరమ్మ ఇళ్ల పథకంహైడ్రా కారణంగా రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయని, రియల్ ఎస్టేట్ దెబ్బతిందన్న వార్తల్లో వాస్తవం లేదు. ఈ ఏడాది ఆరు నెలల కాలంలో 6–7 శాతం మేర రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరిగింది. మూసీ ప్రక్షాళన విషయానికొస్తే.. ప్రజలు నివసించే ప్రాంతాల జోలికి ఇప్పుడే వెళ్లబోం. ఇళ్లు తక్కువ ఉండి ప్రజలు లేనిచోట్ల ముందు అభివృద్ధి చేస్తాం. ఆ అభివృద్ధిని ప్రజలకు చూపించి వారిని ఒప్పించి మిగిలిన చోట్ల ముందుకెళతాం. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పరిధిలో 18.56 లక్షల ఇందిరమ్మ ఇళ్లను పేదలకు అందించారు. ఆ స్ఫూర్తితో ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని చేపట్టింది. మొదటి విడతలో 4.50 లక్షల ఇళ్లను కేటాయిస్తున్నాం. కనీసం 400 చ.అ.లకు తగ్గకుండా వంట గది, టాయిలెట్‌తో కూడి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నాం. ఇది వచ్చే నాలుగేళ్లు కొనసాగుతుంది.కేంద్ర యాప్ తయారీలో ఆలస్యం వల్లే జాప్యంఇందిరమ్మ లబ్ధిదారుల వివరాల నమోదులో కేంద్రం రూపొందించిన యాప్‌ను వాడుతున్నాం. ఆ యాప్ సిద్ధమైతే తప్ప లబ్ధిదారుల వివరాల నమోదు సాధ్యం కాదు. ఆ యాప్ తయారీలో కేంద్ర జాప్యం వల్ల ఈ పథకం గ్రౌండ్ అవటంలో ఆలస్యం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించి 1.52 లక్షల ఇళ్లకు టెండర్లు పిలిచి 96 వేలే పూర్తి చేసింది. మిగతా వాటిని కూడా పూర్తి చేసి నిరుపేదలకిస్తాం. రూ.187 కోట్లతో డిసెంబర్ కల్లా పూర్తి చేస్తాం. బాంబు పేలడమంటే జైల్లో పెట్టడం కాదుఅధికారంలో ఉన్న పదేళ్లు బీఆర్ఎస్ అరాచకంగా, అక్రమంగా వ్యవహరించింది. ఇందుకు సంబంధించి 10–12 అంశాలపై సమాచారం తీసుకుంటున్నాం. బాంబులు పేలడమంటే ఎవరినో జైల్లో పెట్టడం కాదు. ఇందిరమ్మ రాజ్యంలో కక్ష సాధింపు చర్యలుండవు. ఉద్దేశ పూర్వకంగా ఏ వ్యక్తిని, కుటుంబాన్ని, పార్టీని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన మాకు లేదు. కానీ ఈ–రేస్, కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లు, విదేశాలకు నిధుల సరఫరా, ఫోన్ ట్యాపింగ్ లాంటి విషయాల్లో తప్పు చేసిన వారు తప్పించుకోలేరు. తప్పని తేలితే శిక్ష తప్పదు. నేనూ ఫోన్ ట్యాపింగ్ బాధితుడినే. బట్ట కాల్చి మీద వేయడమే బీఆర్ఎస్ పని. నా ఇంట్లో ఈడీకి దొరికిన డబ్బులు లెక్కపెట్టేందుకు వేలసంఖ్యలో కౌంటింగ్ మెషీన్లు తీసుకెళ్లారని చెప్పారు. ఈడీ అనే వ్యవస్థతో సంబంధముండే పార్టీతోనే కదా వారు అంటకాగింది. ఆ పార్టీని అడిగి నా ఇంట్లో ఎన్ని డబ్బులు దొరికాయో తెలుసుకోవచ్చు కదా. ఈ–రేస్ వ్యవహారం తెరపైకి రాగానే ఢిల్లీకి వెళ్లి ఎవరు ఎవరి కాళ్లు పట్టుకున్నారో అందరికీ తెలుసు. ప్రభుత్వంలోకి వచ్చాక నేను ఒక్క గజం భూమి కొనుగోలు చేశానని నిరూపిస్తే దేనికైనా సిద్ధమే. మా పార్టీలోకి చేరికలు ఆగలేదు. కాంగ్రెస్‌లో చేరేందుకు బీఆర్ఎస్ నేతల క్యూ చాలా పెద్దగా ఉంది. బీఆర్ఎస్ పార్టీలో ఎవరూ ఉండరు. ఆ పార్టీలో జబ్బలు చరుచుకుంటున్న వాళ్లు, 1, 2 స్థానాల కోసం పోటీలు పడుతున్న వాళ్లు కూడా ఉండరు. స్వేచ్ఛగా పని చేసుకుంటూ ఆనందంగా ఉన్నా..ఏడాది పాటు కీలక శాఖలకు మంత్రిగా పనిచేయడం సంతృప్తినిచ్చింది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్మోహన్రెడ్డి పెట్టిన పార్టీలో చేరి ఎంపీనయ్యా. ఐదేళ్లు ప్రజలకు సేవ చేశా. తర్వాతి ఐదేళ్లూ మాజీ సీఎం పుణ్యాన ప్రజలతో కలిసి అరణ్యవాసం చేశా. ఆ తర్వాత అదే ప్రజల దీవెనలు, ఆశీస్సులతో ఇందిరమ్మ రాజ్యంలో సముచిత స్థానంలో ఉన్నా. ఎలాంటి కట్టుబాట్లు లేకుండా స్వేచ్ఛగా పనిచేసుకుంటూ ఆనందంగా ఉన్నా. భవిష్యత్తులో ప్రజలకు మరింత మంచి చేసేందుకు నా వంతు ప్రయత్నిస్తా. -
రెండోదశ రీ సర్వే గ్రామాల్లో 2.69 లక్షల మ్యుటేషన్లు
సాక్షి, అమరావతి: భూముల రీ సర్వే జరుగుతున్న క్రమంలో క్లిష్టతరమైన అంశాలు కూడా తేలిగ్గా పరిష్కారమవుతున్నాయి. రెవెన్యూ వ్యవస్థలో తమ భూములకు సంబంధించి మ్యుటేషన్లు, సబ్ డివిజన్లు చేయించుకోవడం ఎంత కష్టమైన వ్యవహారమో అందరికీ తెలిసిందే. వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ పనుల్ని చాలా సులభతరంగా మార్చింది. రీ సర్వేలో రైతులు అడగకుండానే అవసరమైతే మ్యుటేషన్, సబ్ డివిజన్ చేస్తున్నారు. అలా ఇప్పటివరకు రెండేళ్లలో లక్షల సంఖ్యలో మ్యుటేషన్లు, సబ్ డివిజన్లు జరిగాయి. ప్రస్తుతం రెండోదశగా రెండువేల గ్రామాల్లో రీ సర్వే జరుగుతున్న క్రమంలో 2.69 లక్షల మ్యుటేషన్లు, 4.4 లక్షల సబ్ డివిజన్లు చేశారు. తొలిదశ రీ సర్వే పూర్తయిన రెండువేల గ్రామాల్లో గతంలోనే రెండులక్షల మ్యుటేషన్లు, 4.3 లక్షల సబ్ డివిజన్లు చేశారు. మొత్తం ఈ నాలుగువేల గ్రామాల్లో ఇప్పటివరకు 4.69 లక్షల మ్యుటేషన్లు, 8.7 లక్షల సబ్ డివిజన్లు చేయడం గమనార్హం. అదే రైతులు చేయించుకుంటే రూ.80 కోట్లు కట్టాలి మామూలుగా అయితే పట్టా సబ్ డివిజ న్, మ్యుటేషన్ కోసం రైతులు దరఖాస్తు చేసుకుని ఫీజు కట్టాలి. సబ్ డివిజన్‌కి రూ.600, మ్యుటేషన్‌కి రూ.100 చెల్లించాలి. దానికి గతంలో ఎక్కువ సమయం పట్టేది. దాంతోపాటు అనేక సమస్యలు. తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సివచ్చేది. మధ్యలో లంచావతారులు. ఇప్పుడు రీ సర్వేలో ఇవేమీ లేకుండానే ప్రభుత్వం రైతుల భూమిని కొలిచి వారికి యాజమాన్య హక్కు పత్రాలు ఇవ్వడం, డిజిటల్ రికార్డులు రూపొందించడంతోపాటు అవసరమైతే సొంత ఖర్చులతో మ్యుటేషన్, సబ్ డివిజన్లు కూడా చేసేస్తోంది. నాలుగువేల గ్రామాల్లో చేసిన మ్యుటేషన్లు, సబ్ డివిజన్లకు రైతులు ఫీజు చెల్లిస్తే.. రూ.80 కోట్లకుపైనే కట్టాలి. కానీ ప్రభుత్వమే ఉచితంగా చేసి రైతులకు వాటిని బహుమానంగా ఇస్తోంది. అది కూడా రికార్డు సమయంలో లక్షల మ్యుటేషన్లు, సబ్ డివిజన్లు పూర్తిచేస్తోంది. రెండేళ్లలో ఇన్ని లక్షల మ్యుటేషన్లు జరగడం సాధారణ విషయం కాదని నిపుణులు సైతం చెబుతున్నారు. -
వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్ : కొత్త రెవెన్యూ చట్టానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులను కలెక్టర్లు స్వాధీనం చేసుకునే పని వేగవంతంగా సాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోలంతా రెవెన్యూ రికార్డులను కలెక్టర్లకు అప్పగించే పనిలో బిజీగా ఉన్నారు. అవినీతి నిర్మూలనే లక్ష్యంగా సాగుతున్న కేసీఆర్ సర్కార్ వీఆర్వో వ్యవస్థ రద్దుకు యోచిస్తుంది. రాష్ట్రంలోని వీఆర్వోల వద్దనున్న రికార్డులను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ నిన్న స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లుగా సమాచారం. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకల్లా రికార్డులను స్వాధీనం చేసుకోవాలని, సాయత్రం 5 గంటల వరకు రికార్డుల స్వాధీనం ఏ మేరకు పూర్తయిందో నివేదికలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ అయినట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. (తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం!) ఈ నేపధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోల వద్ద నుంచి రికార్డులను స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగుతోంది. కరీంనగర్ జిల్లాలో మధ్యాహ్నం వరకు 60 శాతం రెవెన్యూ రికార్డులు కలెక్టరేట్‌కు చేరాయి. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా, వీఆర్వోలు, వీఆర్ఏలు ఎలాంటి ఆందోళన వ్యక్తం చేయకుండా, స్వచ్ఛందంగా రెవెన్యూ రికార్డులను అప్పగిస్తున్నారని కరీంనగర్ అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ స్పష్టం చేశారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టానికి శ్రీకారం చుట్టడంతో ఒకింత ఆందోళన, మరికొంత ఆనందం నెలకొంది. వీఆర్వోలు, వీఆర్ఏలు బాధపడుతుండగా ప్రజలు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని బాధతో వీఆర్ఏ, వీఆర్వోలు స్వాగతిస్తూనే తమ కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండేందుకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు. మాతృసంస్థ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వేరే శాఖకు వెళ్లమంటే తమకు ఇబ్బందేనని అభిప్రాయపడుతున్నారు. -
తెలంగాణలో అన్ని రిజిస్ట్రేషన్లు బంద్
-
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రాష్ట్రంలో అన్ని రిజిస్ట్రేషన్లు బంద్ చేస్తూ ఆదివారం ఉత్తర్వులిచ్చింది. కొత్త రెవెన్యూ చట్టం రానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈరోజు రాత్రి జరిగే కేబినెట్ భేటీలో నూతన రెవెన్యూ చట్టానికి మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. ఇక ముందు నుంచీ అనుకుంటున్నట్టుగా గ్రామ అధికారుల వ్యవస్థ రద్దు దిశగా కేసీఆర్ సర్కార్ యోచిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. కొత్త రెవెన్యూ చట్టం రానున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం సాయంత్రం కేబినెట్లో ఆమోదం పొందనున్న కొత్త చట్టం ఇక ముందు రిజిస్ట్రేషన్లు ఎలా ఉండాలో నిర్ణయించనున్న ప్రభుత్వం రిజిస్ట్రేషన్లలో తహశీల్దార్ అధికారాలను సమీక్షించనున్న ప్రభుత్వం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ను తహశీల్దార్లకు అప్పగించే యోచన గృహ, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లను సబ్ రిజిస్ట్రార్లకు అప్పగించే యోచన తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కొన్ని కార్యాలయాలు తగ్గించి, మరికొన్ని చోట్ల కొత్తగా ఏర్పాటు చేసే యోచన పట్టణ ప్రాంతాల్లో కొత్తగా 20కి పైగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఏర్పాటు! గ్రామీణ ప్రాంతాల్లో 20కి పైగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు తగ్గించే యోచన ఇక నుంచి ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు లేని మండలాలు 443 తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర భూరికార్డుల ప్రక్షాళనకు ఏర్పాట్లు ధరణి వెబ్సైట్లో ఇక పూర్తి పారదర్శకంగా భూముల వివరాలు అక్రమాలకు అవకాశం లేకుండా రిజిస్ట్రేషన్ల వ్యవస్థను తీర్చిదిద్దే యత్నం వీఆర్వోల వద్ద రికార్డులను స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్లకు ఆదేశం రికార్డుల స్వాధీనం ఏ మేరకు వచ్చిందో నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులు కాగా, అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. కోవిడ్ నిబంధనలు పాటించి సభ్యులంతా సమావేశాలకు హాజరయ్యారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుని, నెగటివ్ వచ్చినవారినే సభలోకి అనుమతించారు. సోమవారం నాటి సమావేశంలో ఇటీవల మృతి చెందిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మొదలగు వారికి శాసన సభ సంతాపం ప్రకటించింది. అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడింది. (చదవండి: వీఆర్వో వ్యవస్థ రద్దుకు అంతా సిద్ధమైనట్టేనా!) -
కలెక్టర్ కనుమరుగు
సాక్షి, హైదరాబాద్ : కలెక్టర్ అనే పదం ఇక కనుమరుగు కానుంది. రెవెన్యూ వ్యవస్థలో కీలక సంస్కరణలు తేవాలని నిర్ణయించిన సర్కారు.. అధికారుల హోదాలో కూడా మార్పుచేర్పులు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా జిల్లా పాలనాధి కారిగా వ్యవహరించే కలెక్టర్ పేరును ఇకపై జిల్లా మేజిస్ట్రేట్ (డీఎం)గా మార్చాలనుకుంటోంది. ప్రస్తుతం జిల్లా పాలనాధికారిని సీడీఎం (కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్)గా పిలుస్తున్నప్పటికీ ఇం దులో కలెక్టర్ అనే పదాన్ని తొలగిం చాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయించినట్లు తెలి సింది. బ్రిటిష్ పాలనలో భూమి శిస్తు వసూలు చేసే అధికారులను కలెక్ట ర్లుగా పిలిచేవారు. ప్రస్తుతం భూమి శిస్తు రద్దయినా కలెక్టర్ వ్యవస్థ కొనసాగుతోంది. ప్రస్తుత కాలంలో కలెక్టర్ పదం సరికాదని పలు సంద ర్భాల్లో సీఎం కేసీఆర్ అభిప్రాయ పడ్డారు. ఈ నేపథ్యంలో వచ్చే శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టా లని భావిస్తున్న కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదాలో ఈ అంశాన్ని చేర్చే విధంగా ఉన్నతాధికారులు ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్ తదితర రాష్ట్రాల్లో జిల్లా పాలనాధికారిని కలెక్టర్ బదులు జిల్లా మేజిస్ట్రేట్‌గానే పిలుస్తున్నందున రాష్ట్రంలోనూ ఆ విధానాన్నే వర్తింపజేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అలాగే జిల్లా అదనపు కలెక్టర్ల పోస్టుల్లోనూ మార్పులు జరగనున్నాయి. కొన్నాళ్ల క్రితం జాయింట్ కలెక్టర్ (జేసీ) పేరు, స్థాయి మార్చిన ప్రభుత్వం... ప్రతి జిల్లాకు జేసీ స్థానే ఇద్దరు అదనపు కలెక్టర్లను నియమించింది. ఇకపై వారి పేర్లలోనూ కలెక్టర్ అదృశ్యం కానుంది. వారిని అదనపు జిల్లా మేజిస్ట్రేట్లుగా పరిగణించాలని చట్టంలో పొందుపరుస్తున్నట్లు సమాచారం. తహసీల్దార్ పోస్టులోనూ.. మండల స్థాయిలో ముఖ్య అ«ధికారిగా వ్యవహరించే తహసీల్దార్ పేరు మార్పుపైనా ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతోంది. రెవెన్యూ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించే తహసీల్దార్ల అధికారాలకు కత్తెరపెట్టాలని భావిస్తున్న సర్కారు.. రిజిస్ట్రేషన్ శాఖతో వారిని అనుసంధానం చేయాలని భావిస్తోంది. అందులో భాగంగానే భూముల క్రయవిక్రయాలు జరిగిన మరుక్షణమే మ్యుటేషన్, పాస్ పుస్తకాలను అక్కడికక్కడే జారీ చేయాలని యోచిస్తోంది. ఈ క్రమంలోనే కొత్త చట్టంలో కీలక సంస్కరణలు చేయాలని భావిస్తున్న సర్కారు.. తహసీల్దార్ అనే పదంపైనా పునరాలోచన చేస్తోంది. మండల వ్యవస్థ అమలులోకి రావడంతో అప్పటివరకు ఉన్న తహసీల్దార్ పేరును రద్దు చేసిన అప్పటి సీఎం ఎన్టీ రామారావు.. దాని స్థానే మండల రెవెన్యూ అధికారిగా నామకరణం చేశారు. అయితే దేశవ్యాప్తంగా తహసీల్దార్ హోదా ప్రాచుర్యం చెందడంతో కొన్ని ధ్రువపత్రాల చెలామణిలో గందరగోళం ఏర్పడింది. ఈ క్రమంలో ఎమ్మార్వో పేరును మార్చిన వై.ఎస్. సర్కారు.. మళ్లీ తహసీల్దార్‌గా పిలవడం మొదలుపెట్టింది. అయితే తాజాగా కొత్త రెవెన్యూ చట్టంలో ఈ పేరు మార్పిడిపైనా ఆలోచన జరుగుతోంది. భూ నిర్వహణాధికారి లేదా భూ మేనేజర్‌గా పిలిచే అంశాన్ని పరిశీలిస్తోంది. ఒకవేళ పాత సమస్యలే ఉత్పన్నమవుతాయని భావిస్తే మాత్రం ప్రస్తుత పేరును కొనసాగించే వీలుందని ప్రచారం జరుగుతోంది. -
వీఆర్వో వ్యవస్థ రద్దు?
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ వ్యవస్థను సమగ్రంగా మార్చాలన్న యోచనలో ఉన్న సీఎం కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టంలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టనున్నారు. సత్వర సేవలు, అవినీతి నియంత్రణ లక్ష్యంతో ఈ వ్యవస్థను కొత్తపుంతలు తొక్కించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్వో) వ్యవస్థ రద్దు, క్వాలిఫైడ్ వీఆర్వోలను జూనియర్ అసిస్టెంట్లుగా నిర్వచిస్తూ రెవెన్యూ శాఖలో కొనసాగించే అంశాన్ని ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు మంగళ, బుధవారాల్లో జరిగిన కలెక్టర్ల సమావేశంలో కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనపై కలెక్టర్లతో సీఎం చర్చించారు. కొత్త చట్టంలో పొందుపరిచే అంశాలపై చర్చించడమే కాకుండా.. కలెక్టర్ల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. చివరకు వీఆర్వో వ్యవస్థ రద్దు మంచిదనే భావనలో సీఎం ఉన్నట్లు స్పష్టమవుతోంది. వారి వల్లే చెడ్డపేరు భూ రికార్డుల ప్రక్షాళనలో వీఆర్వోల భాగ స్వామ్యంతో అక్రమాలు జరిగాయని అంచనాకొచ్చిన ప్రభుత్వం.. భూ రికార్డుల నిర్వ హణ నుంచి వారిని తప్పించాలని నిర్ణయించింది. భూ రికార్డుల్లో కాస్తు కాలమ్‌ను తొలగించినందున.. వీరి అవసరం లేదనే అంచనాకొచి్చంది. భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా రెవెన్యూ రికార్డులను సవరించే క్రమంలో వీఆర్వోల వల్లే ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందనే అభిప్రాయంతో సీఎం ఉన్నారు. ఈ వ్యవస్థను రద్దు చేస్తే ఉద్యోగవర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందని భావిస్తున్న సర్కారు.. వీరి సేవలను వేరే విధంగా వాడుకోవాలని భావిస్తోంది. విద్యార్హతలు, నైపుణ్యం, నిబద్ధత ఉన్న వారినే రెవెన్యూలో కొనసాగించి.. మిగిలిన వారిని పూలింగ్‌లో పెట్టడం ద్వారా వేరే శాఖ (పంచాయతీరాజ్, వ్యవసాయశాఖ)ల్లోకి బదిలీ చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. వీఆర్ఏలను పంచాయతీరాజ్ పరిధిలోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. సర్వే ప్రైవేటుపరం!: సర్వేయర్ల వ్యవస్థ రద్దునూ ప్రభుత్వం పరిశీలిస్తోంది. రెవెన్యూ లో అవినీతికి సర్వేయర్లు ప్రధాన కారణమని అంచనాకు వచ్చిన సర్కారు.. వీరిపై వేటు వేసేలా ఆలోచన చేస్తోంది. సర్వేను ప్రైవేటు పరంచేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ బాధ్యతలను లైసెన్స్డ్ సర్వేయర్లకు అప్పగించనుంది. ఒకే రోజులో మ్యూటేషన్! భూముల మ్యూటేషన్‌ను సరళతరం చేయనుంది. రిజి్రస్టేషన్ అయిన రోజే మ్యూటేషన్ అయ్యేలా కొత్త విధానాన్ని తీసుకురానుంది. 24 గంటల్లో అభ్యంతరాలు రాకపోతే.. తహసీల్దార్ మ్యూటేషన్ ప్రోసీడింగ్స్ (ఆటోమేటిక్ డిజిటల్ సంతకం జరిగేలా) ఇవ్వడమే కాకుండా.. ఆన్లైన్ పహాణీలో నమోదు చేసేలా చట్టంలో పొందుపరచనున్నారు. అలాగే 10 రోజుల్లో పట్టాదారు పాస్ పుస్తకాన్ని నేరుగా రైతు ఇంటికే పంపనున్నారు. సమగ్ర సర్వేకు మొగ్గు: భూరికార్డుల ప్రక్షాళనను సంపూర్ణం చేసేందుకు సమగ్ర భూసర్వే చేయించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. టైటిల్ గ్యారంటీ అమలుకు ఈ సర్వే అనివార్యమైనందున భూసమగ్ర సర్వేకు ఆదేశాలివ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. టైటిల్ గ్యారెంటీ చట్టం అమల్లోకి తేవడానికి ముందు సరిహద్దు వివాదాలు, క్లియర్ టైటిల్ ఉండాలనే కారణాలతోనే సమగ్ర భూసర్వే నిర్వహించనుంది. ఏపీలో ఉన్న టైటిల్ గ్యారంటీ చట్టం పేరు మారి వేరే చట్టాన్ని తీసుకురావాలని చూస్తోంది. తహసీల్దార్ల అధికారాలకు కోత? తహసీల్దార్ల అధికారాల కుదింపుపై కలెక్టర్ల భేటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమై నట్లు తెలుస్తోంది. మ్యూటేషన్లతోపాటు భూరికార్డుల మార్పులు, చేర్పుల అధికారాన్ని జాయింట్ కలెక్టర్లకు బదలాయిస్తే కొత్త సమస్యలు వస్తాయని కొందరు కలెక్టర్లు సూచించినట్లు సమాచారం. ప్రస్తుత విధానమే మంచిదనే వాదనలు వినిపించినట్లు తెలిసింది. వీరి అధికారాలపై రెవెన్యూ ముసాయిదాలో స్పష్టత రానుంది. -
పార్ట్–బీ తంటా.. ఈ రైతులకేదీ ఊరట!
సాక్షి, హైదరాబాద్: అధికారుల నిర్లక్ష్యం ఆ రైతులకు శాపంగా మారింది. భూ యాజమాన్య హక్కులపై స్పష్టతనివ్వకపోవడంతో లక్షలాది మంది రైతులకు పెట్టుబడి సాయం అందకుండా పోతోంది. ఇప్పటికీ రెండు దఫాలు రైతుబంధు సాయం పంపిణీ చేసిన సర్కారు.. తాజాగా ఖరీఫ్ సీజన్‌కు గాను నగదును బ్యాంకుల్లో జమ చేస్తోంది. అయితే, పార్ట్–బీ జాబితాలో చేర్చిన భూములకు రైతుబంధు ఇవ్వకుండా నిలిపివేసింది. వివాదాస్పద/అభ్యంతరకర భూములుగా పరిగణించిన వాటిని పార్ట్–బీ కేటగిరీ కింద పరిగణించిన సర్కారు.. ఆ భూములకు పట్టాదార్ పాస్‌పుస్తకాలను జారీ చేయలేదు. పెట్టుబడి సాయానికి పాస్‌బుక్కును ప్రాతిపదికగా తీసుకోవడంతో ఈ కేటగిరీ కింద చేరిన భూముల రైతులకు రైతుబంధు రాకుండా పోయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 4,14,534 ఖాతాల్లోని 9,92,295 ఎకరాల మేర భూములను పెట్టుబడి సాయం కింద పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ప్రతి సీజన్లో సుమారు రూ.496 కోట్ల మేర నిధులు రైతుల ఖాతాల్లోకి చేరడంలేదు. అడ్డగోలుగా నమోదు రెవెన్యూ వ్యవస్థలో సరికొత్త విప్లవానికి నాంది పలికిన కేసీఆర్ సర్కారు.. 2017లో భూ రికార్డుల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత ఈ రికార్డుల ఆధారంగా రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ పథకం కింద వివాదరహిత భూములకు పాస్ పుస్తకాలను పంపిణీ చేసింది. వివాదాస్పద, అభ్యంతర భూములకు మాత్రం వాటి జారీని పక్కనపెట్టింది. పార్ట్–బీ కేటగిరీలో ప్రభుత్వ భూములు/ఆస్తులు, అటవీ భూములు, దేవాదాయ తదితర భూములతోపాటు, వ్యవసాయేతర భూములను చేర్చింది. భూవిస్తీర్ణంలో తేడా, కోర్టు కేసులు, అన్నదమ్ముల భూపంపకాల విస్తీర్ణంలో వ్యత్యాసం, అసైన్డ్ చేసిన భూమికి, క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి తేడా., ఫారెస్టు, రెవెన్యూ శాఖల మధ్య తగాదా, ఫారెస్టు, పట్టా భూముల మధ్య వివాదాస్పదమైనవాటిని కూడా పార్ట్–బీలో నమోదు చేసింది. భూ రికార్డుల ప్రక్షాళనకు ప్రభుత్వం డెడ్‌లైన్ విధించడం, ఖరీఫ్‌లోపు కొత్త పాస్‌పుస్తకాలను జారీ చేసి రైతుబంధును ప్రవేశపెట్టాలనే ఒత్తిడితో రెవెన్యూ యంత్రాంగం.. లోతుగా పరిశీలించకుండా వివాదరహిత భూములను కూడా పార్ట్–బీలో నమోదు చేసింది. దాయాదులు, ఇతరత్రా ఎవరి నుంచి ఫిర్యాదు అందినా.. ఆ భూములకు పాస్‌బుక్కులు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టింది. ఈ విషయం తెలిసిన రైతులు.. తహసీళ్ల చుట్టూ ప్రదక్షణలు చేసినప్పటికీ, ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోవడం, ఒకసారి నమోదు చేసిన సమాచారంలో మార్పులు, చేర్పులు చేసే అధికారం లేకపోవడంతో ఈ భూముల వ్యవహారం రెవెన్యూ యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. పార్ట్–బీ భూముల జాబితాను పరిశీలించి పరిష్కారం చూపెట్టకపోవడంతో మూడు సీజన్లలోను సంబంధిత రైతులకు నిరాశే మిగిలింది. కనీసం ఈ సారైనా వివాదాస్పద/అభ్యంతరకర భూముల జాబితాను సవరించకపోతే లక్షలాది మంది అన్నదాతలకు ఆర్థిక సాయం అందని ద్రాక్షగానే మారనుంది. -
రెవెన్యూపై సీఎం ఫోకస్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల క్రతువు పూర్తికావడంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పాలనా వ్యవహారాలపై దృష్టి సారించారు. రాష్ట్రంలో వివిధ ఎన్నికలు జరుగుతుండటంతో గత 9 నెలలుగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. శనివారంతో ఈ కోడ్ ముగిసిపోతుండటంతో పరిపాలనకు పదునుపెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. వచ్చేవారం ఆయన కలెక్టర్లతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ముఖ్యమంత్రిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన అనంతరం జరుగుతున్న తొలి కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఇది. ఈ సమావేశంలో రెవెన్యూ సంబంధిత అంశాలే ప్రధాన ఎజెండా కానున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో మ్యూటేషన్లు, డిజిటల్ సంతకాలు, భూ రికార్డుల ప్రక్షాళన పురోగతిపై చర్చించే అవకాశం ఉంది. రెవెన్యూ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తానని కేసీఆర్.. లోక్‌సభ ఎన్నికలప్పుడు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన శరత్ అనే రైతుతో ఫోన్లో చెప్పిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రెవెన్యూ శాఖలో సంస్కరణలు తెస్తామని, వీటిని జూన్‌లో మొదలు పెడతామని ప్రకటించారు. స్థానిక సంస్థల కోడ్ కూడా రేపటితో ముగియనుండటంతో పూర్తిస్థాయిలో పాలనా వ్యవహారాలపై ఫోకస్ పెట్టాలని సీఎం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ రికార్డుల నవీకరణలో జాప్యం, ధరణి వెబ్సైట్లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు, మ్యూటేషన్లు, పాస్‌పుస్తకాల జారీ పెండింగ్‌పై స్పష్టమైన వివరాలు పంపాలని భూ పరిపాలనా ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ) కార్యాలయం కలెక్టర్లను ఆదేశించింది. మరోవైపు కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావాలని భావిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ సమావేశం అనంతరం తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. చట్టంలో పొందుపరచాల్సిన అంశాలు, రెవెన్యూ శాఖ రద్దు, విలీనం, సంస్కరణలు ఇతరత్రా అంశాలపై కీలక అడుగు వేసే వీలుంది. 4.56 లక్షలు పెండింగ్ భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం వివాదరహిత ఖాతాలకు కూడా ఇంకా పట్టాదార్ పాస్‌పుస్తకాలు జారీకాకపోవడంతో రైతాంగంలో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. 4.56 లక్షల ఖాతాలకు సంబంధించి తహసీల్దార్ల డిజిటల్ సంతకాలు కాకపోవడంతో పాస్‌పుస్తకాల జారీ నిలిచిపోయింది. ఇవేగాకుండా సెప్టెంబర్ అనంతరం క్రయ విక్రయాలు జరిగిన భూముల మ్యూటేషన్లు కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఎన్నికల కోడ్ ఒక కారణమైతే.. ధరణి వెబ్సైట్ పుణ్యమా అని రోజుకో ఆంక్షతో రికార్డుల అప్డేషన్ ముందుకు సాగడంలేదు. మరోవైపు వివాదాస్పద/అభ్యంతరకర భూముల జాబితా(పార్ట్–బీ)లో చేర్చిన భూముల విషయంలో ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టమైన మార్గదర్శకాలు వెలువరించకపోవడంతో రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష అనంతరమైనా.. వీటికి మోక్షం కలుగుతుందేమో వేచి చూడాలి. -
రెవెన్యూ ఉద్యోగులు అధైర్యపడొద్దు
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ వ్యవస్థను రద్దు చేస్తారని.. ఇతర శాఖల్లో విలీనం చేస్తారని జరుగుతున్న ప్రచారం కేవలం అపోహ మాత్రమేన ని తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల సంఘం (టీడీసీఏ) అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి, తెలంగాణ తహసీల్దార్ల సంఘం(టీజీటీఏ) అధ్యక్షుడు కె.గౌతమ్‌కుమార్ పేర్కొన్నారు. రెవెన్యూ ఉద్యోగులు అధైర్యపడవద్దని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని టీజీటీఏ కేంద్ర కార్యాలయంలో ‘రెవెన్యూ ఉద్యోగుల రౌండ్‌టేబుల్ సమావేశం’జరిగింది. ఇందులో లచ్చిరెడ్డి, గౌతమ్‌కుమార్ మాట్లాడారు. ఇటీవల పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో రెవెన్యూ వ్యవస్థను రద్దు చేస్తున్నారని, ఇతర శాఖల్లో విలీనం చేస్తున్నారని వస్తున్న వార్తలను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రచారంతో రెవెన్యూ ఉద్యోగుల్లో అభద్రతాభావం, ఆందోళన నెలకొన్నాయన్నారు. ఇప్పటివరకు శాఖను రద్దు చేస్తున్నామని, విలీనం చేస్తున్నామని కానీ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదన్నది గుర్తుంచుకోవాలన్నారు. ఉద్యోగులెవరూ ఆందోళనకు గురికావొద్దని చెప్పారు. కొత్త చట్టంతో పటిష్టం చేయాలి ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తున్నట్లు లచ్చిరెడ్డి, గౌతమ్‌కుమార్ స్పష్టం చేశారు. రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేసే విధంగా ఈ చట్టం ఉండాలన్నారు. పాలనాపరమైన సంస్కరణలు తీసుకొచ్చి శాఖను మరింత పటిష్టం చేయాలని తాము చాలా రోజులుగా కోరుతున్న విషయాన్ని గుర్తు చేశారు. కొత్త చట్టం, సంస్కరణల రూపకల్పనలో రెవెన్యూ ఉద్యోగులను భాగస్వాములను చేయాలని కోరారు. క్షేత్రస్థాయిలో పనిచేసే రెవెన్యూ ఉద్యోగులకు వాస్తవ పరిస్థితులపై అవగాహన ఉంటుందని, కాబట్టి ఉద్యోగుల అభిప్రాయాలను, సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. భూసమస్యల్లేని గ్రామాలుగా ప్రకటించాలి ఏడాదిన్నరగా భూ రికార్డుల ప్రక్షాళన ఉద్యోగులంతా తీరిక లేకుండా పనిచేశారని, అయినా కొన్ని చోట్ల తలెత్తిన సమస్యల వల్ల రెవెన్యూ శాఖపై నిందలు పడ్డాయని వారు చెప్పారు. ఈ చెడ్డపేరు తొలగించుకునేందుకు ముందడుగు వేయాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు. భూ రికార్డుల ప్రక్షాళనలో మిగిలి ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా ఉద్యోగులు పనిచేయాలని కోరారు. భూ సమస్యలు పరిష్కరించి రెవెన్యూ వివాదాలు లేని గ్రామాలుగా ప్రకటించాలని సూచించారు. భూ చట్టాల నిపుణుడు ఎం.సునీల్‌కుమార్, మా రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు లక్ష్మయ్య మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖను మరింత పటిష్టం చేయాలని వారు పేర్కొన్నారు. సమావేశంలో రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రవినాయక్, చిన్నరాజు, గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఈశ్వర్, రాములు, డిప్యూటీ కలెక్టర్ల సంఘం ప్రతినిధి రాజాగౌడ్, టీజీటీఏ ప్రధాన కార్యదర్శి ఏ.వెంకట భాస్కర్, అసోసియేట్ అధ్యక్షుడు పూల్‌సింగ్ చౌహాన్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
రాచపుండులా లంచం
సాక్షి, హైదరాబాద్ : ‘ప్రజల నుంచి వేల సంఖ్యలో ఫిర్యాదులొస్తున్నాయి. లంచం ఇవ్వకుంటే పనులు కావట్లేదని మొరపెట్టుకుంటున్నారు. ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. ప్రభుత్వం ఎందుకు తిట్లు పడాలి? ప్రజలు లంచాలు ఎందుకివ్వాలి? లంచాలు లేని వ్యవస్థ కోసం పటిష్టమైన రెవెన్యూ, మున్సిపల్ చట్టాలు రూపొందించాలి’అని ఇటీవల రాష్ట్ర ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం కేసీఆర్ తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. వాస్తవానికి అవినీతి మన వ్యవస్థలో వేళ్లూనుకుపోయింది. చేయి తడపనిదే ప్రభుత్వ శాఖల్లో పనులు జరగడం లేదు. ప్రజల నిరంతర అవసరాలు ముడిపడి ఉన్న రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్, పోలీస్ శాఖల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. అందులోనూ ముఖ్యంగా భూముల వ్యవహారాలు, పట్టణాల్లో ఉండే ప్రజల అవసరాలు చాలా కీలకమైనవి. ప్రతి వ్యక్తి పుట్టుక నుంచి మరణం వరకు ధ్రువీకరించడం, సొంతింటి కలసాకారం చేసుకోవడం దగ్గర్నుంచి.. వ్యాపారం చేసుకునేందుకు లైసెన్స్‌లు ఇవ్వడం వరకు మున్సిపల్ వర్గాల ద్వారా ప్రజలకు అందాల్సిన సేవలు కీలకం. చట్టాల ప్రకారం అయితే సామాన్యుడికి అవసరమైన ఏ పనైనా.. ఉచితంగా నిర్దిష్ట కాలపరిమితిలోపు చేసి పెట్టాల్సిన బాధ్యత అధికార వర్గాలది. కానీ, ఆయా శాఖల్లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు, పైస్థాయి అధికారుల ధన దాహం.. పేదోడి జేబు చమురు వదిలిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆవేదన, అభిప్రాయంతో ఈ అవినీతి, లంచాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. భూపాలపల్లి జిల్లాలో వృద్ధ దంపతుల భిక్షాటన, మంచిర్యాల జిల్లాలో ఓ యువకుడు పెట్టిన ఫేస్బుక్ పోస్టు.. ప్రజల్లో ఉన్న అసంతృప్తికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం సమీక్ష జరగడంతో.. రాష్ట్రంలో ఎలాంటి సంస్కరణలు వస్తాయోననే ఆసక్తి అందరిలో నెలకొంది. రెవెన్యూ, మున్సిపల్ వర్గాలపై రాష్ట్ర ప్రజల్లో నెలకొన్న అభిప్రాయం, అపవాదు, వారు విమర్శలకు గురవుతున్న తీరుపై ‘సాక్షి’ప్రత్యేక కథనం. పైసలిస్తేనే పనయ్యేది! రెవెన్యూ శాఖలో అవినీతి తీవ్రంగా ఉంది. ఇందుకు వ్యవస్థీకృతమైన లోపాలతో పాటు అడ్డగోలు సంపాదనపై అధికారుల అత్యాశే కారణాలుగా కనిపిస్తున్నాయి. పనిని బట్టి, మనిషిని బట్టి, అవసరాన్ని బట్టి, స్థాయిని బట్టి రెవెన్యూ శాఖలో వసూళ్లు జరుగుతుంటాయనేది బహిరంగ సత్యమే. అందిన కాడికి గుంజుతారంటూ అధికారులపై చాలాసార్లు ఫిర్యాదులొచ్చాయి. అడిగినంత ఇవ్వకపోతే తిప్పించుకోవడం, సమయానికి ఇవ్వకపోవడం, ఉన్నతాధికారులను అడగాలని, కంప్యూటర్లు పనిచేయడం లేదని, పైనే అలా ఉంటే కింద మేమేం చేస్తామని, సర్వర్ డౌన్ ఉందని, పాసుపుస్తకాలు ప్రింటింగ్‌కు వెళ్లాయని, ఎమ్మార్వో లేడని, ఆర్డీవో పంపలేదని, జేసీ డిజిటల్ సంతకం కాలేదని రకరకాల సాకులు చెప్పటం పరిపాటిగా మారింది. అనుకున్నంత వసూలు చేసిన తర్వాతే.. పనిచేసి పెడతారనే విమర్శలున్నాయి. 50 పైసల ఫామ్‌కు 10రూపాయలు తీసుకోవడం, ఏదైనా ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే నిర్దేశిత రుసుము ఎక్కువ వసూలు చేస్తారనే అభియోగమూ రెవెన్యూ శాఖపై ఉంది. భూరికార్డుల ప్రక్షాళనతో.. రెవెన్యూ శాఖలో అవినీతి వ్యవహారాలు ఎప్పటినుంచో ఉన్నప్పటికీ.. 2017 సెప్టెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమంతో ఇది తారస్థాయికి చేరింది. భూ–రికార్డులను పరిశీలించి రైతులకు కొత్త పాసుపుస్తకాలివ్వాల్సిన ఈ కార్యక్రమాన్ని ఆసరాగా చేసుకుని రెవెన్యూ సిబ్బంది ఇష్టారాజ్యంగా సంపాదించారనే ఆరోపణలు, విమర్శలున్నాయి. రైతుకు ఇవ్వాల్సిన యాజమాన్య హక్కుల కోసం ఎకరానికి 5 నుంచి 10వేల వరకు వసూలు చేశారని ఎన్నో ఫిర్యాదులొచ్చాయి. ఈ లంచాల వ్యవహారంపై.. రెవెన్యూ శాఖకు వ్యతిరేకంగా నిరసనలు, సిబ్బందిపై దాడులు చేసేంతవరకు కూడా వెళ్లింది. రైతుకు భూమే జీవనాధారం. ఆ భూమిపై తనకు హక్కు ఉంటేనే రైతుకు మనుగడ ఉంటుంది. తరాలుగా భూమితో రైతు పెంచుకుంటున్న మమకారాన్ని ఆసరాగా చేసుకుని క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న రెవెన్యూ సిబ్బంది.. ఉన్నతాధికారుల పేరు చెప్పి పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడడం గమనార్హం. ఎలుకలు పడ్డాయని..: రెవెన్యూ సంఘాలు ఇటీవల మంచిర్యాల జిల్లా నెన్నెల మండలానికి చెందిన ఓ యువకుడు భూమి పట్టాకోసం లంచం అడుగుతున్నారంటూ పెట్టిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయి.. సీఎం దృష్టికెళ్లింది. ఈ పోస్టింగ్‌కు స్పందించిన సీఎం నేరుగా ఆ యువకునితో మాట్లాడి త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటానని, అప్పుడు ప్రజలంతా తనకు అండగా నిలబడాలని కోరారు. దీంతో రెవెన్యూశాఖను రద్దు చేస్తారనే ప్రచారం మొదలయింది. భూముల వ్యవహారాలన్నింటినీ రెవెన్యూ శాఖ నుంచి తప్పిస్తారనే చర్చ మొదలయింది. ఇందులో నిజానిజాలను పక్కనపెడితే.. ఈ చర్చపై రెవెన్యూ సంఘాలు పెదవి విరుస్తున్నాయి. కొందరు చేసిన పనిని అందరికీ ఆపాదించడం.. ఏకంగా శాఖనే రద్దు చేయాలనే ఆలోచనపై మండిపడుతున్నాయి. ఇంట్లో ఎలుకలు పడ్డాయని ఇల్లు తగలబెట్టుకుంటామా? అని ప్రశ్నిస్తున్నాయి. రెవెన్యూ సేవలతో పాటు ఇతర శాఖలకు పనిభారాన్నీ తామే మోస్తున్నామని.. సమగ్ర కుటుంబ సర్వే, భూ–రికార్డుల ప్రక్షాళన లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించిన తమపై అపవాదు వేయడం సరికాదంటున్నాయి. రెవెన్యూ వ్యవస్థ జవాబుదారీతనం కోసం రాష్ట్రంలో సమగ్ర భూసర్వే చేపట్టాలని, ధరణి ప్రాజెక్టును తహశీల్దార్లకు అనుకూలంగా ఉండేలా మార్చాలని, అర్థరహితమైన ఆదాయ, కుల, తదితర ధ్రువపత్రాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. పురపాలికల్లో అవినీతి జాఢ్యం పురపాలికలు ‘అవినీతి’కి అడ్డాగా మారిపోయాయి. దశాబ్దాలుగా పట్టిన అవినీతి కంపు మున్సిపాలిటీలను వదలడం లేదు. అవినీతి నిర్మూలన కోసం ప్రభుత్వం నూతన సంస్కరణలు, విధానాలను ప్రవేశపెట్టినా పరిస్థితిలో మార్పురావడం లేదు. నగర, పుర ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు, ఇతర సేవలందించాల్సిన పురపాలికలు.. కొందరు ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతిధులు, అధికారుల అక్రమార్జనకు కేరాఫ్ అడ్రస్‌లుగా మారాయి. చేతులు తడపందే.. సామాన్యులకు కనీస అనుమతులు కూడా లభించడం లేదు. ఏ ధ్రువీకరణ పత్రం జారీ కాదు. ఏటా నగరపాలికలు, మునిసిపాలిటీల్లో జరిగే.. వందల కోట్ల విలువైన అభివద్ధి పనుల్లో ఏ మాత్రం నాణ్యత ఉండదు. ఎందుకంటే.. అక్కడ బినామీల ముసుగులో కీలకమైన పనులు, కాంట్రాక్టులు దక్కించుకునేది స్థానిక ఎమ్మెల్యేలు, మేయర్లు, చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులే. రాష్ట్రంలోని ప్రతి కార్పొరేషన్, మునిసిపాల్టీలో నిబంధనలకు విరుద్ధంగా స్థానిక ప్రజాప్రతినిధుల బంధువులు, అనుచరులే కాంట్రాక్టర్లుగా చెలామణి అవుతున్నారు. ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేసే ఆస్తి పన్నులు, ఇతరాత్ర పన్నులు, చార్జీలతో ఏటా పురపాలికలకు కోట్లలో ఆదాయం వస్తోంది. దీనికి తోడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వందల కోట్ల రూపాయలు వివిధ గ్రాంట్ల రూపంలో వస్తున్నాయి. వీటితో చేపట్టే ప్రతి అభివద్ధి పనిలో 25–30% కమీషన్లు వాటాల రూపంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల జేబుల్లోకి వెళ్తున్నాయి. కొందరు ఎమ్మెల్యేలైతే.. తమ పరిధిలోని మునిసిపాలిటీల్లో జరిగే ప్రతిపనిలో 5% కమీషన్‌ను దర్జాగా దండుకున్నారు. పురపాలికల్లో కాంట్రాక్టర్ల బిల్లుల మంజూరు కావాలంటే మునిసిపల్ చైర్మన్లు, మేయర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, కమిషనర్లు, ఇంజనీర్లు, అకౌంటెంట్లకు కలిపి మొత్తం 25% కమీషన్లు ఇవ్వాల్సిందే. కాదు,కుదరదంటే.. ఏళ్లు గడిచినా ఆ కాంట్రాక్టర్ల బిల్లులు మంజూరు కావు. పుట్టినా.. చచ్చినా! జనన, మరణ ధ్రువీకరణ పత్రాల నుంచి గృహ నిర్మాణ అనుమతుల జారీ వరకు ప్రతి పనికీ యథేచ్చగా లంచాలు వసూలు చేస్తున్నారు. భవనాలు, లేఔట్ల నిర్మాణ అనుమతుల్లో అవినీతి నిర్మూలనకు మూడేళ్ల కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టం’(డీపీఎమ్మెస్) కొద్దిరోజులకే నీరుగారిపోయింది. డీపీఎంఎస్ కింద ఇంటి నిర్మాణ అనుమతులకు దరఖాస్తు చేసుకుంటే, 14 రకాల చార్జీలను విధించి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. దీనికి తోడు ఇంటి స్థాయిని బట్టి 10వేల నుంచి 25 వేల రూపాయల వరకు మామూళ్లు తప్పవు. డీపీఎంఎస్ వచ్చిన తర్వాత కూడా ఇళ్ల అనుమతుల జారీకి లంచాలు స్వీకరిస్తూ కొందరు మునిసిపల్ అధికారులు ఏసీబీకి పట్టుబడడం ఇందుకు నిదర్శనం. ఇక ఆస్తుల మ్యుటేషన్లు, వ్యాపారులకు ట్రేడ్ లైసెన్సులు, నల్లా కనెక్షన్, అడ్డగోలుగా పెరిగిన ఆస్తి పన్నులపై పునఃసమీక్ష వంటి సేవలకు సైతం వందలు, వేలల్లో మామూళ్లు వసూలు చేస్తున్నారు. టెండర్ వేయాలంటే భయం! జీహెచ్ఎంసీతో సహా రాష్ట్రంలోని ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో వింత పరిస్థితి నెలకొని ఉంది. మేయర్లు, చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు కమీషన్ల వాటా ముట్టజెప్పనిదే కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించడానికి వీల్లేదు. కాంట్రాక్టర్ అయితే వారి బినామీ ఉండాలి.. లేదా వారికి కోరినంత పర్సెంటేజీని ముట్టజెప్పాలి. కొన్ని పురపాలికల్లో బినామీలు తప్ప ఇతర కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేయడానికి వీల్లేదు. బయటి వ్యక్తులు టెండరు వేయడానికి వస్తే బెదిరింపులు, దాడులకు దిగుతారు. ఎవరైనా కొత్త కాంట్రాక్టర్లు వచ్చి పనులు ప్రారంభించినా, క్షణాల్లో స్థానిక కార్పొరేటర్లు, కౌన్సిలర్లు రంగంలో దిగి.. మాకేంటి? అని వేధింపులకు గురిచేస్తున్నారు. తమ కమీషన్ వాటా లభించకపోతే పనిని సజావుగా జరిగే ప్రసక్తే ఉండదు. ఇక పురపాలికల్లో చేపట్టే పనుల్లో నాణ్యత డొల్లగా మారింది. కోట్ల ఖర్చుతో వేసిన సీసీ రోడ్లు, మురికి కాల్వలు ముణ్ణాళ్ల ముచ్చటగా మారుతున్నాయి. దీంతో వేసిన చోటే పదేపదే రోడ్లు వేసి నిధులను దుర్వినియోగం చేస్తున్నారు. కొందరు కార్పొరేటర్లు, కౌన్సిలర్లయితే వాటాల కోసం ప్రైవేటు వ్యక్తుల ఇళ్లు, భవన నిర్మాణాలను సైతం అడ్డుకుంటున్నారు. మామూళ్లు ఇవ్వకుంటే అనుమతి లేకుండా భవన నిర్మాణం జరుపుతున్నారని మునిసిపల్ అధికారులకు ఫిర్యాదు చేసి పనులను నిలుపుదల చేయిస్తారు. దీంతో బాధితులు ఎంతోకొంత సెటిల్మెంట్ చేసుకుని పనిచేసుకుంటున్నారు. కాగ్ నివేదికలు బుట్టదాఖలు! మున్సిపాలిటీల్లో కోట్ల రూపాయల అవినీతిపై కాగ్ సమర్పించిన నివేదికలు బుట్టదాఖలయ్యాయి. పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అవుతున్నాయని కాగ్ నిర్థారించినా బాధ్యులపై చర్యలు చేపట్టలేదు. అవినీతి ఆరోపణలపై శాఖాపరమైన విచారణల పేరుతో కాలయాపన చేస్తున్నారు. తీవ్రమైన అవినీతి ఆరోపణలున్న అధికారులు, ఉద్యోగులు పదవీ విరమణ చేసి శాఖాపరమైన చర్యల నుంచి తప్పించుకుంటున్నారు. రాష్ట్రంలోని పురపాలక శాఖ పరిధిలో పనిచేసే ఉద్యోగుల్లో వందల మందిపై విజిలెన్స్ కేసులు పెండింగ్‌లో ఉండడం గమనార్హం. విజిలెన్స్ కేసులు పెండింగ్‌లో ఉన్నా ఇటీవల కాలంలో కొందరికి పదోన్నతులు రావడం విమర్శలకు దారితీసింది. తీవ్ర ఆరోపణలున్న ఉద్యోగుల నుంచి డబ్బులు తీసుకుని కేసులనుంచి తప్పిస్తున్నారని పురపాలక శాఖ ఉన్నతాధికారులపై ఆరోపణలున్నాయి. మునిసిపాలిటీల్లో అవినీతి నిర్మూలన కోసం ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొస్తున్న నేపథ్యంలో, అవినీతి ఆరోపణలపై నిర్దిష్ట కాలపరిమితిలోగా విచారణ పూర్తి చేసి చర్యలు తీసుకునే విధంగా కొత్త నిబంధనలు తీసుకువస్తే కొంత వరకు పరిస్థితిలో మార్పు రావచ్చు. రెండేళ్లుగా పాసుపుస్తకం కోసం తిరుగుతున్నా ‘జాల గ్రామంలోని 330 సర్వే నెంబర్లో 20 గుంటల భూమి తండ్రి ద్వారా వారసత్వంగా వచ్చింది. కొంతకాలం సేద్యం చేసిన. కానీ వర్షాలు రాకపోవడంతో ఉపాధి కోసం పదేళ్లు హైదరాబాద్‌లో ఉండి వచ్చిన. 2017 నవంబర్‌లో రెవెన్యూ అధికారులు నాకు 1–బీ ఫారం ఇచ్చిండ్రు. కానీ, ఇప్పటిదాకా పాసుపుస్తకం ఇయ్యలేదు. వీఆర్వోను అడిగితే.. నాకు భూమి లేదని.. వేరేవాళ్లకు అమ్ముకున్నానని అంటున్నడు. జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. రేపు, ఎల్లుండి అనుకుంట చెబుతున్నరు’– కోటగిరి మాలమణి, జాల గ్రామం, రాజాపేట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా భూమి ఒకరిది.. పరిహారం మరొకరికి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్‌లో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్యాకేజీ–10లో భూసేకరణలో భాగంగా విద్యుత్ సబ్‌స్టేషన్ కోసం అవారి లచ్చవ్వ అనే మహిళ భూమిని సేకరించారు. ఆమెకు సర్వే నంబరు 227లో 20 గుంటల భూమి ఉంది. విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణ పనుల్లో ఈ మొత్తం భూమి పోయింది. లచ్చవ్వకు పరిహారంగా రూ.3.25 లక్షలు రావాల్సి ఉంది. కానీ.. ఆ డబ్బులను ఈ భూమితో ఏమాత్రం సంబంధం లేని మేచినేని మనోహర్‌రావు పేరుతో రెవెన్యూ అధికారులు చెక్కు జారీ చేశారు. లచ్చవ్వ రెవెన్యూ అధికారులను ఆశ్రయిస్తే పొరపాటు జరిగిందని చెప్పారు. కానీ.. ఇంతవరకు పరిహారం రాలేదు. డబ్బులు అడిగితే ప్రామిసరీ నోటు చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు రొడ్డరాజం. ఈయనది జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం, వేంపల్లి. తన భూమిని పట్టాచేయాలని రెండేళ్ల కిందట వీఆర్వో ఆంజనేయులును కలిశాడు. పట్టాచేయాలంటే రూ.32,000 ఇవ్వాలని వీఆర్వో డిమాండ్చేశాడు. భూమి పట్టా చేతికొస్తుందని ఆశతో రొడ్డరాజం అడిగినంతా ముట్టజెప్పాడు. నెలలు గడుస్తున్నా పట్టా కాకపోవడంతో వీఆర్వోను నిలదీశాడు. తన డబ్బు తిరిగి ఇవ్వమని కోరాడు. దీంతో వీఆర్వో 32 వేలకు ప్రామీసరి నోటు రాసిచ్చి చేతులు దులుపుకోవడంతో రైతు లబోదిబోమన్నాడు. ఇలాగా ఆ గ్రామంలోని దాదాపు వందమంది రైతుల నుంచి సదరు వీఆర్వో లక్షలు దండుకున్నాడని ఆరోపణలున్నాయి. దీంతో కలెక్టర్ ఇతన్ని సస్పెండ్ చేయాల్సి వచ్చింది. పైసలు ముడ్తెనే పాస్‌పుస్తకం! ‘వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి మండలం సీతంపేట గ్రామం మాది. మా మామయ్య మేక నారాయణ రెడ్డి పేరుతో 1.20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మామయ్య కొద్దిరోజుల క్రితం మరణించడంతో అత్తమ్మ మేక రాజమ్మ పేరుమీదకి మార్చి పాసుపుస్తకం ఇవ్వాలి. కానీ, వీఆర్వో ఆర్నెల్లు తప్పించుకున్నడు. కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో దరఖాస్తు ఇచ్చినా పట్టించుకోలేదు. చివరకు డబ్బులు ఇస్తెనే.. పాసుపుస్తకం, రైతు బంధు చెక్ ఇచ్చారు’– రవీందర్‌రెడ్డి, రైతు, వరంగల్ అర్బన్ జిల్లా అనుమతుల కోసం వసూలు ‘నాకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నర్సంపేట రోడ్డులో 126గజాల స్థలముంది. అక్కడ ఇల్లు కట్టేందుకు అన్ని అనుమతులు తీసుక్నున్నాను. అయితే ఇల్లు కడుతుండంగనే.. ఆ స్థలానికి 3–5–55, 3–5–56 ఇంటి æనెంబర్లతో పన్నులు చెల్లించాలని నోటీసులు పంపారు. నిర్మాణ దశలో ఉండగా ఇంటిపన్ను ఎలా ఇస్తారని అడిగితే గతంలో ఇక్కడ ఇల్లు ఉందని, 3–5–55 ఇంటి నెంబర్ మీద రూ.6,244 పన్ను వసూలు చేశారు. అది చెల్లించిన తర్వాతే ఇల్లు కట్టుకునేందుకు అనుమతించారు’– మందుల వెంకట్రాంనర్సయ్య, మహబూబాబాద్. సైనికుడినీ వదల్లేదు ఈ ఫోటోలో కనిపిస్తున్నది జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని విస్నూరు గ్రామానికి చెందిన బాలగాని ప్రవీణ్‌కుమార్. 63 రాష్ట్ర రైఫిల్స్, కాలకూట్, జమ్మూలో జవాన్‌గా పనిచేస్తున్నాడు. ఆయన తండ్రి పేరు మీద విస్నూరు గ్రామంలోని 4 సర్వేనంబర్లలో 12.17 ఎకరాల భూమి ఉంది. భూమి విస్తీర్ణం తక్కువగా ఉందని కొలత కోసం మండల సర్వేయర్‌కు దరఖాస్తు చేస్తే డబ్బులు ఇస్తేనే చేస్తానని డిప్యూటీ సర్వేయర్ నాంపల్లి శ్రీనివాస్ తెగేసి చెప్పాడు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో సర్వేయర్‌కు బుద్ధిచెప్పాలని నిర్ణయించుకున్న ఆ జవాను ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సర్వేయర్ అడిగిన రూ.10 వేలు తీసుకుని జనగామ జిల్లా కేంద్రంలో ఇస్తుండగా ఏసీబీకి అప్పగించాడు. శ్రీనివాస్ మీద కేసు నమోదైంది. ఫొటోలో కన్పిస్తున్న ఈ దంపతుల పేరు దేవేంద్రప్ప, శకుంతల. వీరిది జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం మాచర్ల గ్రామం. మాచర్ల గ్రామ శివారులోని సర్వే నంబర్ 246లో దేవేంద్రప్ప పేరున 2.23 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిని ఇప్పటికీ వీళ్లే సాగు చేస్తున్నారు. అయితే 2013లో ఈ భూమిని పట్టాదారులతో సంబంధం లేకుండా.. అప్పటి తహసీల్దార్ అదే గ్రామానికి చెందిన జానకమ్మ పేరున మార్పు చేస్తూ, ప్రొసీడింగ్ ఇచ్చారు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న దేవేంద్రప్ప తన భూమిని తనకు తెలియకుండా జానకమ్మ పేరున ఎలా మార్చుతారంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో భార్యతో కలిసి గట్టు తహసీల్దార్ కార్యాలయం ఎదుట న్యాయపోరాటానికి దిగినా ఫలితం లేకుండాపోయింది. ఈ వ్యవహారంలో రెవెన్యూ సిబ్బంది లంచం తీసుకునే జానకమ్మ పేరిట ప్రొసీడింగ్ జారీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. -
రైతులకు అన్యాయం చేయొద్దు
సాక్షి, హైదరాబాద్: కొత్త రెవెన్యూ చట్టం విషయంలో సీఎం కేసీఆర్ హడావుడి నిర్ణయాలు తీసుకుని రైతులకు అన్యాయం చేయొద్దని కాంగ్రెస్ పార్టీ కోరింది. కొత్త రెవెన్యూ చట్టం తయారు చేసే ముందు అఖిలపక్ష కమిటీలో చర్చించి, అందరి అభిప్రాయాలు తెలుసుకున్నాకే ఓ నిర్ణయం తీసుకోవాలని ఏఐసీసీ కిసాన్ సెల్ వైస్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి సూచించారు. ఏఐసీసీ ఓబీసీ విభాగం వైస్‌చైర్మన్ పి.వినయ్‌కుమార్, టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్లతో కలసి మంగళవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. రైతుబంధు పథకాన్ని అమలు చేయడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ఆలోచనతో హడావుడిగా భూరికార్డుల ప్రక్షాళన చేపట్టారని, తద్వారా రాష్ట్రంలోని 30 శాతం మంది పేద రైతుల భూములకు ఇంతవరకు పట్టాలివ్వలేదని చెప్పారు. బెంజికార్లు ఉన్నవారికి, వ్యవసాయం చేయని వాళ్లకు వేల రూపాయలు బ్యాంకుల్లో వేశారని ఆరోపించారు. భూముల సర్వే జరగకుండా రికార్డుల సవరణ ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు మళ్లీ కొత్త రెవెన్యూ చట్టం, కలెక్టర్ల పేరు మార్పు అంటూ కేసీఆర్ తన మనసుకు ఏది తోస్తే అది చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వినయ్‌కుమార్ మాట్లాడుతూ.. రెవెన్యూ వ్యవస్థ అంతా గత మూడు నెలలుగా ఎన్నికల నిర్వహణలో బిజీగా ఉందని, అలాంటప్పుడు ఎవరితో సంప్రదింపులు చేసి కొత్త రెవెన్యూ చట్టాన్ని తయారు చేస్తున్నారని ప్రశ్నించారు. గత ఐదేళ్లుగా ఈ రాష్ట్రంలోని భూములపై ప్రభుత్వ పక్షాన ఇన్చార్జి అయిన భూపరిపాలన ప్రధాన కమిషనర్ లేరని, ఏ పునాదులపై చట్టాలు తెస్తున్నారో కేసీఆర్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఓట్ల కోసమే పథకాలు..: దయాకర్ ఓట్ల పంట పండించుకునే పథకాల కోసం ప్రభుత్వ ఖజానాను లూటీ చేస్తున్నారని అద్దంకి దయాకర్ విమర్శించారు. అసైన్డ్‌భూముల చట్టానికి కేసీఆర్ ప్రభుత్వం చేసిన సవరణలతో పేద రైతులు, దళితులు, ఆదివాసీలు, బీసీలు నష్టపోయారని, ఆ భూములపై హక్కులు ప్రభుత్వానికి బదలాయింపు చేసుకోవడం ద్వారా వారు తమ హక్కులను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ చట్టాన్ని కూడా ఇదే తరహాలో లొసుగులతో రూపొందించారని, ఇప్పుడు తెస్తున్న కొత్త రెవెన్యూ చట్టం కూడా కేసీఆర్ ఆలోచనలకు రూపమిచ్చే విధంగా కాకుండా జాతి, ప్రజల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా ఉండాలని అన్నారు. -
ఇక రెవెన్యూ రేంజ్‌లు..!
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు పాలనలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. జిల్లా స్థాయిలోని సమస్యలను వెంటనే పరిష్కరించడంతో యంత్రాంగానికి సూచనలిచ్చేలా మార్పులు చేయబోతోంది. ఇందుకు పోలీసు శాఖ తరహాలోనే రెవెన్యూ వ్యవస్థలోనూ రేంజ్‌లు ఏర్పాటు చేయాలని యోచి స్తోంది. ఐదారు జిల్లాలకో రేంజ్‌ను ఏర్పాటు చేసి, సీనియర్ ఐఏఎస్‌ను ప్రత్యేకాధికారిగా పర్యవేక్షణకు నియమిస్తే మెరుగైన ఫలితాలొస్తాయని భావిస్తోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో..: రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటై ఏడాది కావస్తోంది. జిల్లాలు పెరగడం, రాష్ట్రంలో ఐఏఎస్‌ల కొరత వల్ల జూనియర్ ఐఏఎస్‌లకు కలెక్టర్లుగా పనిచేసే అవ కాశం లభించింది. 31 జిల్లాల్లో ఆరుగురు మినహా మిగతా వారంతా జూనియర్ ఐఏఎస్‌లే కలెక్టర్లుగా ఉన్నారు. ఏడాది కాలంలో వీరి పనితీరు బాగుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సీఎం సైతం కలెక్టర్లు చురుగ్గా పని చేస్తున్నారని ప్రశంసించారు. అయితే అనుభవం లేకపోవటంతో అప్పుడ ప్పుడు క్షేత్రస్థాయి సమస్యలొస్తున్నాయి. జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వానికి ఇవి ఇబ్బంది పెడుతున్నాయి. మరోవైపు ప్రజా ప్రతినిధులతో సమన్వయ లోపాలతో చిక్కులొస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్లకు సూచనలిచ్చేందుకు రేంజ్‌లు ఏర్పాటు చేయాలని, ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి విధానం అమల్లో ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులకు బాధ్యతలు? రాష్ట్రంలోని 10 మంది ప్రత్యేక ప్రధాన కార్యదర్శు లకు ‘రేంజ్’ బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం యోచి స్తోంది. వివిధ హోదాల్లో పనిచేసిన అనుభం, ప్రభుత్వ కార్యక్రమాలపై స్పష్టమైన అవగాహన వీరి పర్యవేక్షణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత వేగవంతం చేయొచ్చని భావిస్తోంది. ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీపీ ఆచార్య ఈ దిశగా కొంత మేర ప్రయత్నం చేస్తున్నారు. పాత వరంగల్ జిల్లా పరిధిలోని ఐదుగురు కలెక్టర్లకు సలహాలిస్తున్నారు. టీం కాకతీయ పేరుతో ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. ఇదే తరహాలో మిగతా కలెక్టర్లకూ సీనియర్ ఐఏఎస్‌ల మార్గదర్శనం ఉండాలన్న ప్రతిపాదన అధికార వర్గాల్లో వినిపిస్తోంది. -
‘అసైన్డ్’ సమస్యకు ‘ప్రక్షాళన’తో పరిష్కారం!
భూ రికార్డుల ప్రక్షాళనలో అసైన్డ్ భూముల సమస్యకు చెక్ - అన్యాక్రాంతమైన భూముల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు - కబ్జాలో ఉన్న వారి ‘సామాజిక, ఆర్థిక హోదా’ వివరాలు చెప్పాలని ఉత్తర్వులు - నివేదికల ఆధారంగా రీ అసైన్ లేదా క్రమబద్ధీకరణ! - లక్షల ఎకరాలు పట్టాలయ్యే చాన్స్ - దళితులైతే మూడెకరాల పంపిణీ కింద అందజేత సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ వ్యవస్థలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న మరో సమస్యకు భూ రికార్డుల ప్రక్షాళన పరిష్కారం చూపుతుందా.. అంటే అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. ఈనెల 15 నుంచి జరగనున్న ఈ ప్రక్రియలో అసైన్డ్ భూముల సమస్యకు ఫుల్స్టాప్ పెట్టే దిశలో రెవెన్యూ యంత్రాంగం నిబంధనలు రూపొందించింది. అసైన్డ్ భూములు నిజమైన లబ్ధిదారుల చేతిలో ఉంటే మళ్లీ వారి పేరు మీద రికార్డుల్లో నమోదు చేసుకోవాలని, వేరొకరి కబ్జాలో ఉంటే తర్వాత నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం ‘సామాజిక, ఆర్థిక హోదా’ అనే పదాన్ని భూ రికార్డుల ప్రక్షాళన కోసం రూపొందించిన మార్గదర్శకాల్లో చేర్చింది. 20 లక్షల ఎకరాల పైమాటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైనప్పటి నుంచే భూమి లేని నిరుపేదలకు భూ పంపి ణీ చేశారు. వ్యవసాయ, నివాస భూముల ను దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి అసైన్ చేసేవారు. తర్వాత రాజకీయ బాధి తులు, స్వాతంత్య్ర సమరయోధులకు భూములు అసైన్ చేశారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకు పైగానే అసైన్ చేసిన భూములు ఉంటాయని అంచనా. 40 శాతం అన్యాక్రాంతం అయితే ఈ అసైన్డ్ భూములను అమ్ముకునే అవకాశం లేదు. వేరొకరి పేరు మీద రిజిస్టర్ కూడా కావు. కానీ దాదాపు 40 శాతం పైగా అసైన్డ్ భూములు అన్యాక్రాంతం అయ్యాయని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన భూములను లబ్ధిదారులు అమ్ముకోవడం.. లేదంటే వ్యవసాయ యోగ్యం కాక వదిలివేయడంతో వేరొకరు కబ్జా చేశారని, ఇలా రాష్ట్రంలో 8 లక్షల వరకు అసైన్డ్ భూములు ఇతరుల చేతుల్లో ఉన్నాయని అంటున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీ కూడా ఓ నివేదిక ఇచ్చింది. అసైన్డ్ భూములు అన్యాక్రాంతమైతే వాటిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవచ్చని చట్టాలు చెబుతున్న నేపథ్యంలో.. 15 నుంచి ప్రారంభం కానున్న భూ రికార్డుల ప్రక్షాళనలో అసైన్డ్ భూముల వాస్తవ పరిస్థితి తేలనుంది. అన్యాక్రాంత అసైన్డ్ భూములను ఏకపక్షంగా తిరిగి తీసుకునే దానికంటే కబ్జాలో ఉన్న వారి జీవన పరిస్థితి ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అసైన్డ్ భూముల కబ్జాలో ఉన్న వారి సామాజిక ఆర్థిక హోదా వివరాలు పేర్కొంటూ ప్రత్యేక నివేదిక పంపాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ప్రక్షాళనకు వెళ్లినప్పుడు ఏం చేస్తారంటే? రికార్డుల ప్రక్షాళనకు వెళ్లినప్పుడు ప్రభుత్వం అసైన్ చేసిన భూముల్లో నిజమైన లబ్ధిదారులే ఉంటే అక్కడే వారికి 1–బీ రిజిస్టర్ ప్రతిని అందజేస్తారు. పాసు పుస్తకాలు లేని వారుంటే వివరాలు నమోదు చేసుకుంటారు. ఒకవేళ లబ్ధిదారు కాకుండా వేరొకరు కబ్జాలో ఉంటే వారి సామాజిక, ఆర్థిక హోదాను తెలి యజేస్తూ నివేదిక పంపాలని కలెక్టర్లకు పంపిన మార్గదర్శకాల్లో సీఎస్ ఎస్పీ సింగ్ స్పష్టంగా పేర్కొన్నారు. కబ్జాలో ఉన్న వారి పేరు, విస్తీర్ణం, వ్యవసాయ యోగ్యమా కాదా, వారి సామాజిక, ఆర్థిక పరిస్థితి ఏంటి, కులం తదితర వివరాలను పేర్కొనాలని సూచించారు. ఈ వివరాలు తెలుసుకోవడం ద్వారా కబ్జాలో ఉన్నది నిజంగా పేదలైతే వారికే రీ అసైన్ లేదా నామమాత్రపు ధర మీద క్రమబద్ధీకరించే ఆలోచనతోనే ఈ నిబంధన చేర్చామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఇక కులం తెలుసుకోవడం ద్వారా కబ్జాలో ఉన్నది దళితులైతే వారికి మూడెకరాల భూ పంపిణీ కింద నేరుగా పట్టాలిచ్చే యోచనలో ప్రభుత్వం ఉందని పేర్కొంటున్నాయి. -
వీఆర్ఏల ‘వేతన’ వ్యథ..!
♦ పేరుకే ప్రభుత్వ ఉద్యోగం.. ♦ కనీస వేతనం మాత్రం లేదు ♦ రూ.6 వేల నెల వేతనంతో సేవలందిస్తున్న 24 వేల మంది ♦ కనీస పేస్కేలు వర్తింప చేయాలని,పదోన్నతుల కోటా పెంచాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: పేరుకే ప్రభుత్వ ఉద్యోగం.. కనీస వేతనం మాత్రం లేదు.. ఇస్తామన్న వేతనమైనా నెలనెలా రాదు. ఆ వచ్చేది కూడా వరద బాధితుల పద్దులోంచే. నాడు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేటపుడు పార్ట్‌టైమ్ ఉద్యోగమే అన్నారు. కానీ, ఇప్పుడు ఫుల్‌టైమ్ పని చేయిస్తున్నారు. ఇదీ రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తోన్న 24 వేల మంది గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్ఏ) వేతన వ్యథ. గ్రామస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను లబ్ధిదారులకు చేర్చడంలో, గ్రామాల్లోని భూముల పరిరక్షణ, రెవెన్యూ రికార్డుల నిర్వహణలో కీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ, తమ బాధలను ప్రభుత్వ పెద్దలుగానీ, ఉన్నతాధికారులుగానీ పట్టించుకోవడం లేదని వీఆర్ఏలు వాపోతున్నారు. తెలంగాణ ఏర్పడితే తమ కష్టాలు తొలిగిపోతాయని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నామని, అయితే రాష్ట్రం ఏర్పడి రెండేళ్లయినా వీఆర్ఏల దుస్థితి గురించి పాలకులు పట్టించుకోవడం లేదని తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆరోపిస్తోంది. చాలీచాలని వేతనాలతో తమ కుటుంబాలను పోషించలేని పరిస్థితి నెలకొందని, తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వీఆర్ఏల సంఘం(డెరైక్ట్ రిక్రూట్మెంట్) ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యావంతులే వీఆర్ఏలుగా.. 2012లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ కనీస విద్యార్హతతో వీఆర్వో, టెన్త్ విద్యార్హతతో వీఆర్ఏ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. డిగ్రీలు, పీజీలు(ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ, బీటెక్, బీఫార్మసీ తదితర కోర్సులు) చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు వీటికి దరఖాస్తు చేసుకున్నారు. రాతపరీక్షలో ప్రతిభ కనబరిచిన కొంతమంది వీఆర్వోలుగానూ, మరికొంత మంది వీఆర్ఏలుగానూ నియమితులయ్యారు. వీఆర్ఏల నియామకాల సమయంలో పార్ట్‌టైమ్ ఉద్యోగమే కనుక నెలకు రూ.3 వేలు చొప్పున వేతనం ఇచ్చిన ప్రభుత్వం, వారు ఆందోళన చేయడంతో దానిని రూ.6 వేలకు పెంచింది. అయితే.. రెవెన్యూ వ్యవస్థలో పెరిగిన పనిభారం, మండల స్థాయిలో సిబ్బంది కొరత కారణంగా వీఆర్ఏలకు అదనపు పనులను అప్పగిస్తున్నారు. గ్రామంలో పనితో పాటు మండల, రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లోనూ పూర్తిస్థాయిలో అదనపు విధులు నిర్వహిస్తున్నా వేతనం మాత్రం పెరగలేదు. పేరుకే ప్రభుత్వ ఉద్యోగం.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులైన వీఆర్ఏలు.. పేరుకే ప్రభుత్వ ఉద్యోగులు. వారికి కనీస వేతన స్కేలును అప్పటి ప్రభుత్వం వర్తింపజేయలేదు. ఇదే రెవెన్యూ శాఖలో ఏడో తరగతి కనీస విద్యార్హతతో పనిచేస్తున్న అటెండర్ వేతనం వీఆర్ఏల కంటే మూడు రె ట్లు అధికంగా ఉండడం గమనార్హం. తెలంగాణ ఏర్పడినాక ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతం చేయడంలో వీఆర్ఏలు కీలకంగా వ్యవహరించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలైన ఆసరా పింఛన్లు, ఆహార భద్రతా కార్డుల పంపిణీ, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి తదితర పథకాలకు అర్హులను గుర్తించడంలోనూ వీఆర్ఏల కృషి ఎంతో ఉంది. ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత ్వంగా చెబుతున్న పెద్దలు తమ బాధలను అర్థం చేసుకుని, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగానే వేతనాలు, సదుపాయాలు కల్పించాలని వీఆర్ఏలు కోరుతున్నారు. అటెండర్‌కు ఇచ్చే వేతనమైనా ఇవ్వమంటున్నాం మాకంటే తక్కువ విద్యార్హతతో పనిచేస్తున్న అటెండర్‌కు ఇచ్చే వేతన స్కేలును మాకూ వర్తింపజేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. డెరైక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియమితులై మూడేళ్లకుపైగా సర్వీసు పూర్తి చేసుకున్న వీఆర్ఏలకు వీఆర్వో లేదా జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించాలి. వీఆర్ఏలకు పదోన్నతుల కోటాను 30 నుంచి 70 శాతానికి పెంచాలి. 010 పద్దు ద్వారా నెలనెలా వేతనం చెల్లించాలి. - ఈశ్వర్, తెలంగాణ వీఆర్ఏ(డెరైక్ట్ రిక్రూట్ మెంట్)ల సంఘం అసోసియేట్ అధ్యక్షుడు -
రిజిస్ట్రేషన్ మర్నాడే మ్యుటేషన్!
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయడంలో భాగంగా భూపరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ) రేమండ్ పీటర్ మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ పూర్తయిన భూములకు, ఆ మర్నాడే మండల కార్యాలయంలో తహశీల్దారు మ్యుటేషన్ ప్రక్రియను (రికార్డుల్లో పేర్ల మార్పిడి) పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టారు. మే నెల నుంచి ఈ విధానాన్ని అమలు చేసేందుకు భూపరిపాలన విభాగం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న 8 లక్షల మ్యుటేషన్ దరఖాస్తులను నెలాఖరులోగా క్లియర్ చేయాలని అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లను సీసీఎల్ఏ ఆదేశించారు. అలాగే, మ్యుటేషన్ ప్రక్రియతో పాటు సెక్షన్ 22ఎ ప్రకారం నిషేధిత భూముల వివరాలను నిర్దేశిత నమూనాల్లో (ఫారం 1ఎ నుంచి 1ఇ వరకు) పదిరోజుల్లోగా సమర్పించాలని కోరారు. ఫారం 1ఎ లో.. విక్రయించేందుకు గానీ, రిజిస్ట్రేషన్లు చేసేందుకు కానీ వీల్లేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భూములు, 1బిలో ప్రభుత్వ అసైన్డ్ భూములు, ప్రభుత్వ పోరంబోకు భూములు, 1సిలో సెక్షన్ 43 కింద రిజిస్టర్ అయిన దేవాదాయశాఖ భూములు, సెక్షన్ 37 ప్రకారం రిజిస్టర్ అయిన వక్ఫ్ భూములు, 1డిలో పట్టణ భూ గరిష్ట పరిమితి(యూఎల్సీ) చట్టం ప్రకారం ప్రభుత్వ అదీనంలో ఉన్న భూములు, 1ఇలో రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం స్వాధీనం చేసుకున్న భూములు, అవినీతి నిరోధక శాఖ అటాచ్ చేసిన భూములు, పన్నులు చెల్లించని ఆస్తుల వివరాలు, గ్రీన్‌పార్కుల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇచ్చిన ఖాళీస్థలాల వివరాలను నింపాలని సూచించారు. భూముల క్రయ విక్రయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సమాచారం సబ్ రిజిస్ట్రార్ నుంచి ఆన్లైన్ ద్వారా నేరుగా తహసీల్దారుకు అందేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్(ఎన్ఐసీ) అధికారులను సీసీఎల్ఏ ఆదేశించారు. -
నెలలోగా వెబ్‌ల్యాండ్ రికార్డులు అప్డేట్
రెవెన్యూ అధికారుల వీడియో కాన్ఫరెన్స్‌లో సీసీఎల్ఏ రేమండ్ పీటర్ సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ వ్యవస్థకు రికార్డులే పునాదులని, అవి బాగుంటేనే వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని భూపరిపాలన ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్ అన్నారు. ఇటీవల కొత్తగా ప్రవేశపెట్టిన మాభూమి పోర్టల్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, అయితే.. ఆన్లైన్లో ఉంచిన రికార్డుల్లో దొర్లిన తప్పులపై ఫిర్యాదులు కూడా వస్తున్నాయన్నారు. పోర్టల్‌లో ఉన్న వెబ్‌ల్యాండ్ రికార్డులన్నింటినీ నెలరోజుల్లో అప్డేట్ చేయాలని గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పనిచేసే గ్రామ రెవెన్యూ అధికారు(వీఆర్వో)లకు ట్యాబ్లెట్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్(ఆర్ఐ)లకు ల్యాప్‌ట్యాప్‌లను త్వరలోనే అందజేయనున్నట్లు పీటర్ తెలిపారు. మాభూమి పోర్టల్‌లోని గ్రామ పహాణీలను డౌన్లోడ్ చేసి తనిఖీ నిమిత్తం సంబంధిత వీఆర్వోలకు అందజేయాలని, రెండువారాల్లోగా వాటిని అప్డేట్ చేసేవిధంగా చర్యలు చేపట్టాలని తహసీల్దార్లను ఆదేశించారు. రెవెన్యూ డివిజన్‌స్థాయిలో ఆర్డీవోలు, జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్లు రికార్డుల అప్డేషన్పై ప్రతివారం సమీక్షలు నిర్వహించాలని సూచించారు. జిల్లాకు 200 వీఆర్వో కార్యాలయాలు రెవెన్యూ వ ్యవస్థను మరింత పటిష్టం చేయడంలో భాగంగా ఈ ఏడాది జిల్లాకు 200 చొప్పున 9 జిల్లాల్లో మొత్తం 1,800 గ్రామ రెవెన్యూ, అవసరమైనచోట మండల రెవెన్యూ కార్యాలయాలకు సొంత భవనాలను సమకూర్చనున్నట్లు సీసీఎల్ఏ రేమండ్ పీటర్ తె లిపారు. రెవెన్యూ వ ్యవస్థను పూర్తిస్థాయిలో కంప్యూటరీకరణ చేయనున్నామని, వీఆర్వోలు, ఆర్ఐలకు జిల్లా కేంద్రాల్లోనే క ంప్యూటర్ శిక్షణ ఇప్పించనున్నామని చెప్పారు. నెలాఖరు కల్లా అర్హులైన డిప్యూటీ తహసీల్దార్లకు పదోన్నతులు కల్పిస్తున్నామని, ఖాళీగా ఉన్న వీఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని వెల్లడించారు. రెవెన్యూ రికార్డుల నిర్వహణ, ఆన్లైన్ విధానాలపై దశలవారీగా డీటీలకు, తహసీల్దార్లకు ఎంసీఆర్హెచ్ఆర్డీలో శిక్షణ ఇప్పించనున్నట్లు తెలిపారు. అపోహను పోగొడదాం... భూములకు సంబంధించి రికార్డుల్లో సరైన సమాచారం లేకపోవడం, మ్యుటేషన్లలో నెలకొన్న గందరగోళంతో ప్రజల్లో రెవెన్యూ వ్యవస్థపట్ల అపోహ ఉందని సీసీఎల్ఏ అన్నారు. రికార్డుల్లో తాము రాసిచ్చిన దానికి ఆన్లైన్లో డేటాఎంట్రీకి వ్యత్యాసం ఉంటోందని వీఆర్వోల సంఘాలు చెబుతున్నాయన్నారు. మాభూమి పోర్టల్‌లో లభ్యమౌతున్న సదుపాయాలను ప్రజలకు వివరించి నేరుగా పోర్టల్‌ను సందర్శించి వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సీసీఎల్ఏ కార్యదర్శి రవీంద్రబాబు, డిప్యూటీ కలెక్టర్ సత్యశారద, ఎన్ఐసీ ప్రతినిధి మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిష్ట మీకు.. అప్రతిష్ట మాకా..?
♦ ‘డబుల్ బెడ్రూం’ పథకం బాధ్యతలు వద్దంటున్న తహసీల్దార్లు ♦ అవకతవకలకు బాధ్యులుగా చేస్తామనడంపై తీవ్ర అసంతృప్తి ♦ టీజీటీఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కీలక అంశాలపై తీర్మానాలు సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు పడక గదుల ఇళ్ల పథకంలో అవతవకలు జరిగితే తహసీల్దార్లను బాధ్యులను చేస్తామంటూ కొందరు మంత్రులు చేస్తున్న ప్రకటనల పట్ల తెలంగాణ తహసీల్దార్ల సంఘం (టీజీటీఏ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇళ్లను మంజూరు చేసే అధికారం ఎమ్మెల్యేలు, మంత్రులకే అప్పగించడంతో... వారు చెప్పిన పేర్లనే లబ్ధిదారుల జాబితాలో చేర్చాలంటూ ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేస్తున్నారని పేర్కొంది. ఆదివారం టీజీటీఏ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ భేటీలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఈ విషయంగా తమ అసంత ృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిరుపేద ల గుర్తింపుపై ఇప్పటికే సర్వే చేసిన గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) వద్ద పూర్తి సమాచారం ఉండగా... అర్హుల ఎంపిక బాధ్యతను మళ్లీ తహసీల్దార్లకు అప్పగించడమేమిటని కొందరు తహసీల్దార్లు ప్రశ్నించారు. ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేసే అధికారాన్ని ఎమ్మెల్యేలకు, మంత్రులకు 50:50 నిష్పత్తిలో అప్పగించడంతో... అర్హతతో నిమిత్తం లేకుండా వారు చెప్పిన పేర్లనే లబ్ధిదారుల జాబితాలో చేర్చాలంటూ ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. తహసీల్దార్లను రెవెన్యూ అంశాలకే పరిమితం చేయాలని, అభివృద్ధి పనులను ఎంపీడీవోలకు అప్పగించాలని సూచించారు. సమగ్ర కుటుంబ సర్వే, ఆసరా పెన్షన్లు, రేషన్ కార్డులు, ఎన్నికల ఆధార్ సీడింగ్, భూముల క్రమబద్ధీకరణ పథకం, ప్రోటోకాల్ తదితర కార్యక్రమాలకు సంబంధించిన ఖర్చుల నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తహసీల్దార్లు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పథకాల అమలు కోసం అలుపెరగకుండా పనిచేస్తున్న రెవెన్యూ వ్యవస్థపై వస్తున్న అవినీతి ఆరోపణలను ఖండించాలని.. తహసీల్దార్లకు ఇళ్ల స్థలాల కోసం హౌసింగ్ సొసైటీ ఏర్పాటు తదితర అంశాలపై చేసిన తీర్మానాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇక సమావేశంలో అద్దె వాహనాలకు చార్జీల అలవెన్స్ పెంపు, పదోన్నతుల అంశాలపై చర్చించారు. ప్రధానమంత్రి విజ్ఞాపన మేరకు వంట గ్యాస్ సబ్సిడీని వదులుకునేందుకు సభ్యులంతా అంగీకారం తెలిపినట్లు టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి ప్రకటించారు. ఈ సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి నరేందర్, కోశాధికారి చంద్రకళ, అసోసియేట్ అధ్యక్షుడు గోపీరామ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు వంశీమోహన్, కోశాధికారి సుజాత, ఇతర జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. -
తెలుగు తమ్ముళ్ల ఒత్తిళ్లు
- దీర్ఘకాలిక సెలవుపై వెళుతున్న తహశీల్దార్లు - ఐదు మండలాలు ఖాళీ - కుంటుపడుతున్న రెవెన్యూ వ్యవస్థ నెల్లూరు(రెవెన్యూ): టీడీపీకి పదేళ్ల తర్వాత అధికారం రావడంతో తెలుగు తమ్ముళ్ల ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది. తాము చెప్పింది తప్పకుండా చేయాలంటూ మండల అధికారులపై ఒత్తిళ్లు చేస్తున్నారనే ఫలితంగా జిల్లాలో ముగ్గురు తహశీల్దారు దీర్ఘకాలిక సెలవులు పెట్టారు. మరొకరు అధికారపార్టీ నాయకుల ఒత్తిళ్లు తట్టుకోలేక, వారు చెప్పింది చేయలేక అంతర్ జిల్లా బదిలీ చేయించుకున్నారు. దగదర్తి తహశీల్దార్, గూడూరు డీఏఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అధికారపార్టీ ఎమ్మెల్యే చెప్పినట్లు కలువాయి తహశీల్దార్ పనులు చేయలేదు. దీంతో ఆగ్రహించిన ఆ ఎమ్మెల్యే తహశీల్దార్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయలేక తహశీల్దార్ దీర్ఘకాలిక సెలవుపెట్టి వెళ్లిపోయారు. దుత్తలూరు, సైదాపురం తహశీల్దార్ల పరిస్థితీ అంతే. అధికారపార్టీ నాయకులు చెప్పి దానికి తల ఊపలేక దీర్ఘకాలిక సెలవుపెట్టి వెళ్లారు. చిల్లకూరు తహశీల్దార్ రాజకీయ ఒత్తిళ్లకు తట్టుకోలేక అంతర జిల్లా బదిలీ చేయించుకున్నారు. ఫలితంగా రెవెన్యూ వ్యవస్థ కుంటుపడుతోంది. తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయింది. జిల్లాలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఏడుగురు, టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. మండల కార్యాలయాల్లో అధికారపార్టీ నాయకుల మాటచెల్లుబాటు అవుతోంది. అధికారపార్టీ నాయకులకే అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. భూ వ్యవహారాలు, పింఛన్లు, రేషన్ కార్డులు, నీరు-చెట్టు పనులు అధికారపార్టీ నాయకుల కనుసన్నల్లో సాగుతున్నాయి. పథకాలకు సంబంధించి లబ్ధిదారలను అధికారులు ఎంపిక చేయాల్సి ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జన్మభూమి కమిటీలను ఎంపిక చేసింది. తెలుగుదేశంపార్టీ నాయకులు, కార్యకర్తలు జన్మభూమి కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు. టీడీపీ అధికారంలోకి రావడంతోనే రేషన్ కార్డులు, పింఛన్లు పరిశీలన చేపట్టింది. జన్మభూమి కమిటీ సభ్యులు పరిశీలించి అనుమతి ఇస్తే లబ్ధిదారులకు కార్డులు, పింఛన్లు కొనసాగించారు. టీడీపీకి ఓట్లు వేయని వారి రేషన్‌కార్డులు, పింఛన్లు తొలగించారు. పథకాలకు అర్హులని అధికారులు చెబుతున్నా తాము చెప్పిన విధంగా చేయండంటూ అధికారులపై ఒత్తిడి చేశారు. జన్మభూమి కమిటీలతోనే జిల్లాలో వేలాది మంది రేషన్‌కార్డులు, పింఛన్లు కోల్పోయారు. తాము సూచించిన వారికే పథకాలకు ఎంపిక చేయమని అధికారపార్టీ నాయకుల ఒత్తిళ్లు అధికంగా ఉన్నాయి. మీరు సూచించిన వారిని ఎంపిక చేస్తాం ఎదురుగా ఉన్న వ్యక్తి అన్ని విధాలా అర్హుడని అతడ్ని ఎంపిక చేస్తామని అధికారులు చెబుతున్నా దానికి నాయకులు ఒప్పుకోవడంలేదనే విమర్శలున్నాయి. ఇటువంటి సంఘటనలు జిల్లాలో అనేకం జరిగాయి. నాయకులు చెప్పిన విధంగా నడుచుకోలేక సెలవులు పెట్టి వెళ్లిపోతున్నారు. తహశీల్దార్లపై పని ఒత్తిడి అధికంగా ఉంది. అనేక మండలాల్లో తహశీల్దార్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా రికార్డుల నిర్వహణ, పథకాల అమలు తదితర విషయాలు కుంటుపడుతున్నాయి. ప్రజల నుంచి వచ్చిన అర్జీలు నెలల తరబడి పరిష్కారానికి నోచుకోకుండా ఎదురు చూస్తున్నాయి. వివిధ పనుల నిమిత్తం తహశీల్దార్ కార్యాలయాలకు వచ్చే ప్రజలు పడిగాపులు కాయాల్సి వస్తుంది. అడహక్ పద్దతిలో తహశీల్దార్ పోస్టులను భర్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఖాళీలను భర్తీ చేసేలా చర్యలు చేపడతాం : -ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ జిల్లాలో ఖాళీగా ఉన్న తహశీల్దార్ పోస్టులను గుర్తిస్తాం. ఖాళీగా ఉన్న మండలాల్లో తహశీల్దార్లను నియమించేలా చర్యలు తీసుకుంటాం. వ్యక్తిగత కారణాలతో తహశీల్దార్లు సెలవులు పెడుతున్నారు. -
రైతులకు ఎలక్ట్రానిక్ పాస్ పుస్తకాలు
* రేషన్ దుకాణాల్లో ప్యాకింగ్ విధానం అమలు * జేసీ బాబూరావునాయుడు వెల్లడి దుద్దుకూరు (దేవరపల్లి) : జిల్లాలోని రైతులందరికీ త్వరలో ఎలక్ట్రానిక్ పట్టాదార్ పాస్‌పుస్తకాలు అందజేయనున్నట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు తెలిపారు. దేవరపల్లి మండలం దుద్దుకూరులో శుక్రవారం సాయంత్రం సంబావారి చెరువు వద్ద ముస్లింలకు శ్మశానానికి కేటాయించిన భూమిని జేసీ, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా బాబూరావునాయుడు మాట్లాడుతూ జిల్లాలో దొంగ పట్టాదార్ పాస్‌పుస్తకాల ఎక్కువగా చెలామణిలో ఉన్నాయన్నారు. చింతలపూడి, జంగారెడ్డిగూడెం, నరసాపురం, ఉంగుటూరు మండలాల్లో సుమారు 500 దొంగపాస్ పుస్తకాలతో బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నట్టు నిర్దారణ అయ్యిందన్నారు. రెవెన్యూ వ్యవస్థను పంచాయతీలో విలీనం చేసిన సమయంలో రెవెన్యూ రికార్డుల్లో కొన్ని అవకతవకలు జరిగాయని ఆయన తెలిపారు. కొన్ని మండలాల్లో ఆర్‌ఎస్‌ఆర్‌లో కూడా పో యాయని ఆయన తెలిపారు. డిసెంబరు నాటికి రైతులందరికీ ఎలక్ట్రానిక్స్ పాస్‌పుస్తకాలు అందజేస్తామని చెప్పారు. రేషన్ దుకాణాల్లో ప్యాకింగ్ విధానం అమలు చేయనున్నట్టు చెప్పారు. 4, 8, 12, 16, 20 కిలోల చొప్పున ప్యాకింగ్ చేసి వినియోగదారులకు తరుగులులేకుండా సరఫరా చేయటం జరుగుతుందన్నారు. గోపాలపురం నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీలకు శ్మశానవాటికల సమస్య ఎక్కువగా ఉందని, స్థలాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. దేవరపల్లి మండలంలోని నల్లరాతి క్వారీలను ఎన్యూమరేషన్ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఎకరం భూమికి అనుమతి తీసుకుని మూడు ఎకరాల్లో క్వారీలు తవ్వుతున్నట్టు ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయన్నారు. సర్వే నిర్వహించి క్వారీల యజమానులపై చర్యలు తీసుకంటామని జేసీ తెలిపారు. పందులు పంటపొలాలను ధ్వసం చేస్తున్నాయని రైతులు జేసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఆర్డీవో ఎన్.శ్రీనివాసరావు, సర్పంచ్ కె.సౌధామణి, ఉప సర్పంచ్ ముళ్లపూడి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. -
‘దిల్’ భూములు గాలికి..
శంషాబాద్: ప్రభుత్వ హౌసింగ్ బోర్డు అనుబంధ సంస్థగా ఉన్న దిల్ (దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్) భూములు అక్రమార్కులకు వరంగా మారుతున్నాయి. సర్కారు సీలింగ్ భూములను తీసుకున్న సదరు సంస్థ వాటిని గాలికొదిలేయడంతో క్రషర్, మట్టి మాఫియాతో పాటు కాలుష్యకారక డాంబర్ దందాలతో జంటజలాశయాల్లో ఒకటైన హిమాయత్సాగర్కే ముప్పు తీసుకొస్తున్నారు. శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడలో సర్వేనంబర్లు 56, 57, 58, 59, 60, 61, 62, 63, 66, 69, 70, 71, 72, 73, 74, 76, 77, 78 లలో సుమారు 250 ఎకరాల సీలింగ్ భూములను 8 ఏళ్ల కిందట హౌసింగ్‌బోర్డు అనుబంధ సంస్థ దిల్‌కు అప్పగించింది. దిల్ ఆధీనంలోనున్న ఈ భూముల్లో ఏడాదిన్నర కిందటి వరకు సుమారు ఇరవైకి పైగా క్రషర్ యంత్రాలు నడిచేవి. వీటితో పాటు అనుమతులు లేకుండానే భారీ ఎత్తున పేలుడుపదార్థాలతో బ్లాస్టింగ్ కొనసాగించేవారు. పర్యావరణానికి హానికరంగా మారడంతో పాటు హిమాయత్‌సాగర్‌కు కలుగుతున్న ముప్పుపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఎట్టకేలకు అవి మూతపడ్డాయి. అయితే ఇది కొంతకాలం మాత్రమే. స్థానికంగా దిల్ భూముల్లో ప్రస్తుతం అక్రమ మట్టితవ్వకాలతో పాటు డాంబర్ ప్లాంట్లు, కొన్ని క్రషర్లు కూడా కొనసాగుతున్నాయి. అక్రమ దందాను నియంత్రించడానికి రెవిన్యూ యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలు కూడా విఫలమవుతున్నాయి. భూములు దిల్ సంస్థ ఆధీనంలో ఉండడంతో వాటిపై కేసులు నమోదు చేయలేని పరిస్థితిని రెవిన్యూ అధికారులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌కు నివేదించడానికి కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం. చెంతనే... ప్రస్తుతం కొత్వాల్‌గూడ పరిధిలో ఓ క్రషర్ యూనిట్ సాగర్‌కు అత్యంత చేరువలోనే భారీ ఎత్తున కొనసాగుతోంది. అయినా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. గతంలో మాదిరిగా కొండలను బ్లాస్టింగ్ చేయడం లేదనే వాదనలు వినిపిస్తున్నా ఇంత పెద్ద మొత్తం రాళ్లను రవాణా చేయడం కూడా ఔటర్ రింగురోడ్డుపై ప్రమాదకరంగా మారుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమాలను ఆపుతూనే ఉన్నాం: వెంకట్‌రెడ్డి, శంషాబాద్ తహసీల్దార్ దిల్ భూముల్లో ఇప్పటివరకు జరుగుతున్న క్రషర్, మట్టి తవ్వకాలను అడ్డుకుంటున్నాం. అయినప్పటికీ పూర్తి స్థాయిలో నియంత్రించలేకపోతున్నాం. ఈ విషయాన్ని ఉన్నతస్థాయి అధికారులకు కూడా నివేదించనున్నాం. దిల్ సంస్థ పరిధిలో అక్రమార్కులపై ఫిర్యాదులు చేయాల్సి ఉంటుంది. -
రెవెన్యూ ఉద్యోగులకు గ్రేడింగ్
ఏలూరు, న్యూస్‌లైన్ : ప్రజలకు సత్వర సేవలు అందించేం దుకు గ్రామ రెవెన్యూ వ్యవస్థ ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని, వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ టి.బాబూరావు నాయుడు హెచ్చరించారు. కలెక్టరేట్లో శుక్రవారం డెప్యూ టీ తహసిల్దార్ల సమావేశంలో రెవెన్యూ వ్యవస్థ ప్రాధాన్యతను జేసీ వివరించారు. గ్రామస్థాయి నుంచి రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేయాలనే ఉద్దేశ్యంతోనే వీఆర్వోల వ్యవస్థను బలోపేతం చేశారని, అయితే వీఆర్వోల పనితీరు ఆశించిన మేర లేదని ఆయన ఆవేదన వ్యక్తం చే శారు. గ్రామస్థాయిలో అన్ని శాఖలతో సమన్వయంగా పనిచేయాల్సిన వీఆర్వోలు సరైన సమాచారాన్ని యంత్రాంగానికి ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తేలిందన్నారు. దశాబ్దాల తరబడి గ్రామాల్లో పాతుకుపోయిన వీఆర్వోలను బదిలీ చేసి రెవెన్యూ వ్యవస్థను జిల్లాలో పటిష్టం చేయడానికి కలెక్టర్ సిద్ధార్థజైన్ ఆలోచిస్తున్నట్లు జే సీ వివరించారు. వీఆర్వో స్థారుు నుంచి ప్రగతి నివేదికలు వీఆర్వో స్థాయి నుంచి ప్రగతి నివేదికలు ప్రతినెలా సమగ్రంగా సమర్పించాలని, గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు రెవెన్యూ అధికారులు ప్రతి విషయంపై సమగ్ర అవగాహనతో విధులు నిర్వర్తించాలన్నారు. ఎవరైనా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తే ఊపేక్షించబోమని జేసీ హెచ్చరించారు. జిల్లాలో ఒక్క గజం కూడా స్థలం అన్యాక్రాంతం కాకూడదని, భూముల సమగ్ర సమాచారం, జమాబందీ రికార్డులు, మీ సేవ కేంద్రాల పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని ఆయన ఆదేశించారు. త్వరలో మండల స్థాయిలో వీఆర్వోలు, ఆర్ఐలతో సమావేశాలు నిర్వహించి రెవెన్యూ వ్యవస్థను ఏ విధంగా పటిష్టం చేయా లో సూచించాలని డీటీలను కోరారు. డీఆర్వో కె.ప్రభాకర్‌రావు మాట్లాడుతూ ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఎవరికైనా భూమి కేటాయించాలంటే ఆయా శాఖల ప్రధాన కార్యాలయాల నుంచి అవసరమైన భూ ప్రతిపాదనలు కలెక్టర్‌కు అందాలని చెప్పారు. 10 ఎకరాలు లేదా రూ.50 లక్షల విలు వ లోపు భూములను ప్రభుత్వం సంస్థలకు కేటాయిం చే అధికారం కలెక్టర్‌కు ఉందని, ఆపై ప్రతిపాదనలను ప్రభుత్వానికి అనుమతి కోసం పంపాలని ఆయన వివరించారు. కేటాయించిన భూములు లీజుకు ఇచ్చినా చట్ట విరుద్ధంగా వినియోగిస్తున్నా అటువంటి వాటిపై నివేదిక సమర్పిస్తే జిల్లా స్థాయి ల్యాండ్ ఆడిట్ మోనటరింగ్ కమిటీ పరిధిలోకి తీసుకువచ్చి వాటిని రద్దు పరుస్తామని డీఆర్వో తెలిపారు. ఉద్యోగుల పనితీరు తెలుసుకునేందుకు గ్రేడింగ్ విధానం జిల్లాలో పనిచేస్తున్న రెవెన్యూ ఉద్యోగుల పనితీరును తెలుసుకునేందుకు గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామని, ఇందుకు రెవెన్యూ స్కోర్ కార్డును ఆన్లైన్లో పొందుపర్చామని జారుుంట్ కలెక్టర్ చెప్పారు. ప్రతి నెలాఖరున గ్రామాల వారీగా ప్రగతి వివరాలను డీటీలు సేకరించి ఆన్లైన్లో రెండో తేదీలోగా డేటాను పొందుపర్చాలన్నారు. ప్రభుత్వ లక్ష్యాలను నూరు శాతంపైగా సాధించిన ఉద్యోగులకు గ్రేడ్-ఏ 90 నుంచి 100 శాతం లక్ష్యాలు సాధిస్తే గ్రేడ్ బి, 80 నుంచి 90లోపు సాధిస్తే గ్రేడ్ సీ, 80 శాతం లోపు ఉంటే వారిని డి గ్రేడ్‌లో ఉంచుతామన్నారు. పనితీరును బట్టి పదోన్నతులు కల్పిస్తామన్నారు. రెవెన్యూ స్కోర్ కార్డులో తప్పుడు సమాచారం పొందుపరిస్తే అటువంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. -
జంగల్ జానా ఫల్లీ ఖానా
ఆయన రెవెన్యూ వ్యవస్థలో కీలక భూమిక పోషించారు. నైజాం నాటి వ్యవస్థను,నేటి పాలనా తీరుపట్ల స్పష్టత ఏర్పరుచుకున్న వ్యక్తి. పట్టణాభివృద్ధిలో తానూ మమేకమై ఇక్కడి మార్పులకు ప్రత్యక్ష సాక్షి. పేరుకు సార్థక తెచ్చుకున్న మహబూబ్ నగర్ అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఒకప్పుడు ఇక్కడ పాలూ, పెరుగూ సమృద్ధిగా ఉండడమే కాదు... మహెబూబ్ (ప్రేమ) కూడా ఎక్కువే ఉండేదంటారు. ‘ సభా ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ’ ని స్థాపించి విద్య,వైద్య, ఉపాధి రంగాల్లో చేయూతను అందిస్తున్న రిటైర్డు తహసీల్దార్, 61 ఏళ్ళ మహ్మద్ మంజూర్ అహ్మద్ జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే..... ఇప్పటిలాగ మాకు విజ్ఞాన వినోద యాత్రలు లేవు... ఏడాదికోసారి జరిపే ‘సీతాఫల్ డే’నే విహార యాత్ర... చట్టుపక్కల ఉన్న జంగల్‌కు తీసుకెళితే అక్కడున్న గుట్టల్లో సీతాఫల కాయలు తెంచుకోవడంతో పాటు ఇండ్ల నుంచి తెచ్చుకున్న తిండి పదార్థాలతో సహపంక్తి భోజనం చేయడమే మాకు పెద్ద విందు. మేం చదివేటప్పుడు హోటళ్లకు పోయే వాళ్లం కాదు. అప్పట్లో మా టీచర్లు విద్యార్థుల ఇండ్లు ఉండే ప్రాంతాల్లో తిరిగే వాళ్లు. తల్లిదండ్రులతో మా చదువుల గురించి చర్చించేటోళ్లు. అందుకే బజార్లలో కనబడాలంటే భయం. సారోళ్లు కూడా తమ పిల్లల కంటే ఎక్కువ మమ్మల్ని చూసేది. షాబజార్ స్కూల్ ఇప్పుడున్న హనుమాన్ థియేటర్ స్థలంలో కిరాయి భవనంలో ఉండే. దాని పక్కనే గంజ్ ఉండడంతో రైతులు ఆరబోసుకున్న పల్లీలను దొంగిలించి తినేవాళ్లం. రాంమందిర్ చౌరస్తా నుంచి గడియారం చౌరస్తా వరకు కొత్తగా పట్టణంలో తొలి సిమెంటు రోడ్డు వేస్తే అదో వింతగా చూసేటోళ్లం. మదీనా మసీదు ప్రాంతం నుంచి జూనియర్ కాలేజీకి పోవాలంటే నటరాజ్ టాకీస్ సమీపంలో గల లోతైన వాగులో దిగి నడిచే వాళ్లం. పైంట్లు పైకి మడత చేయకంటే బురదలో తడిసేవి. 1972 తర్వాత అక్కడ బ్రిడ్జిని కట్టారు. నిజాం పాలనలో ఉర్దూభాషకు ప్రాధాన్యమున్నా...అంగ్రేజీకి ( ఆంగ్లం) కూడా ఎక్కువ గుర్తింపు ఉండేది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన అనంతరం ఉర్దూ, తెలుగు తరగతులను సమాంతరంగా ఒకే పాఠశాలలో నిర్వహిస్తుండ్రి. జిల్లా కేంద్రంలో అప్పట్లో మెన్నోనైట్ బ్రదరన్ క్రిస్టియన్ సంస్థ ఆధ్వర్యంలో ఇంగ్లీషు మీడియంలో స్కూలు నడిచేది.ధనవంతుల పిల్లలు అందుట్ల చదివేది.పేదోళ్లకు మాత్రం సర్కారీ బడులే దిక్కు. మదీనా మసీదు పీఎస్‌లో ప్రాధమిక, షాబజార్ హైస్కూల్లో ఉన్నత విద్యను, ఇప్పటి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్‌ను ఉర్దూ మీడియంలోనే చదివాం...ఆడపిల్లలకు ప్రత్యేక స్కూళ్లు లేవు. అంతా కో- ఎడ్యుకేషన్ పద్దతి ఉండే. ముస్లింలు చాలా తక్కువగా ఆడపిల్లలను చదివించేటోళ్లు. 1971-72లో ఇంటర్మీడియట్ విధానం ఏర్పాటైతే మాది ఫస్టు బ్యాచ్. అందులో ముస్లిం అమ్మాయీలు ఆరుగురే. జిల్లా కేంద్రంలో పురాతన నిర్వహణా కేంద్రాలు.. ఇప్పుడున్న కలెక్టరేట్ నిజాం నవాబ్ మీర్ అలీఖాన్ నివాస భవనం. జిల్లా కోర్టు, తహసీల్దార్, హెడ్ పోస్టాఫీసు, డీఎఫ్ఓ , మైనర్ ఇరిగేషన్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఫైర్ స్టేషన్, దూద్‌ఖానా, పాత పోస్టాఫీసు, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్, ఎంజీ రోడ్ హైస్కూలు, పాత జైలు, బీపీహెచ్ఎస్, మోడ్రన్ బేసిక్ స్కూలు, పాత గ్రంథాలయం తదితర భవనాలు నైజాం కాలం నాటివే. అప్పటిరోజుల్లో అందరిలో చక్కని అవగాహన ఉండేది. ఒకరినొకరు గౌరవించుకోవడం, పెద్దలంటే భయం ఉండేది. నేటి తరం ఇవన్నీ అనుసరిస్తేనే భావితరానికి నేర్పగలుగుతారు. ఇన్ని సౌకర్యాలున్నా అనురాగం, ఆప్యాయత కొంచెం తగ్గుతున్నాయి. ఇవి పెరగాలి. రెవెన్యూకే అన్ని బాధ్యతలు... నైజాం కాంల నుంచి ప్రభుత్వ కార్యకలపాలు మాల్ గుజారీ ( రెవిన్యూ శాఖ)కు అత్యధిక ప్రాముఖ్యత ఉంది. అన్ని శాఖలకు పెద్దన్న పాత్ర పోషిస్తున్నది. అప్పట్లో ఉన్న పాత తాలూకా కేంద్రాల్లో ‘ దఫ్తరే తహసీల్దార్‌ను’ నిర్వహించే వారు. నైజాం నాటి తహసీల్‌లలో అన్ని ప్రభుత్వ విభాగాలు పని చేసేవి. అందులో మహెకుమా ఖజానా ( ట్రెజరీ), ఆబ్కారీ (ఎక్సైజ్), రి/ిస్ట్రేషన్, ,పోలీస్ సర్కిల్ , నాయబ్ తాలీమి( డిప్యుటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ తదితర ఆఫీసులన్నీ ఉండేవి. తాలూకాను కొన్ని మాల్గుజారీ‘ ఫిర్కా’లుగా ఏర్పాటు చేసి వాటికి గిర్దావర్లను నియమించే వారు. వాటి స్థానంలోనే మండల వ్యవస్థ ఏర్పడింది. భూముల శిస్తులతో పాటు అన్ని రకాల ప్రభుత్వ వసూళ్లను చేస్తారు. జిల్లా స్థాయిలో కలెక్టర్‌కు ఉన్న అన్ని అధికారాలు తహసీల్దార్లకు ఉంటాయి. కలెక్టరేట్‌కు, తహసీల్ వ్యవస్థకే నేరుగా సంబంధాలు ఉండగా, వాటని డివిజన్ స్థాయిల్లో ఆర్డీఓలు పర్యవేక్షిస్తారు. గ్రామాల్లో పోలీస్ పటేల్, మాలీ పటేల్, పట్వారీతో పాటు కావలికారు లేదా తలారీ వ్యవస్థల ద్వారా నైజాం పాలనలో శాంతి భద్రతలు, ఆస్తులు, భూమి రికార్డుల పరిరక్షణ , నిర్వహణ ఉండేది. భూములకు సంబంధించి పహాణి, చౌఫస్లా ( ల్యాండ్ హోల్డింగ్), కాస్రా తదితర రికార్డులను ఎప్పటికప్పుడు రాస్తారు. ఫైసల్పట్టి ( వార్షిక ఖాతా)ని ఏటా రాయాల్సి ఉంటుంది. దానినే జమాబందీ అని కూడా అంటారు. 144 సెక్టన్ ఉత్తర్వులు, సెక్షన్ 174ల( అనుమానాస్పద మృతి కేసు) ఎఫ్ఐఆర్లు స్వీకరించడం, శవ పంచనామా, మరణ వాంగ్మూలాలు, ఇంక్వెస్టు రిపోర్టులు తదితర సీఆర్పీసీ చట్టాలు తహసీల్దార్ ద్వారా అమలు అవుతాయి. పాత నేరస్థులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా పోలీసులు తహసీల్దార్ల ఎదుటనే బైండోవర్ చేస్తారు. అందుకే వారిని సెక ండ్క్లాస్ మెజిస్ట్రేట్లుగా వ్యవహరిస్తారు.