రాచపుండులా లంచం | KCR Focus To Bring Reforms In Revenue System In Telangana | Sakshi

రాచపుండులా లంచం

Published Sun, Apr 14 2019 2:45 AM | Last Updated on Sun, Apr 14 2019 6:54 PM

KCR Focus To Bring Reforms In Revenue System In Telangana - Sakshi

తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న కోటగిరి మాలమణి కుటుంబం

సాక్షి, హైదరాబాద్‌ : ‘ప్రజల నుంచి వేల సంఖ్యలో ఫిర్యాదులొస్తున్నాయి. లంచం ఇవ్వకుంటే పనులు కావట్లేదని మొరపెట్టుకుంటున్నారు. ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. ప్రభుత్వం ఎందుకు తిట్లు పడాలి? ప్రజలు లంచాలు ఎందుకివ్వాలి? లంచాలు లేని వ్యవస్థ కోసం పటిష్టమైన రెవెన్యూ, మున్సిపల్‌ చట్టాలు రూపొందించాలి’అని ఇటీవల రాష్ట్ర ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం కేసీఆర్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. వాస్తవానికి అవినీతి మన వ్యవస్థలో వేళ్లూనుకుపోయింది. చేయి తడపనిదే ప్రభుత్వ శాఖల్లో పనులు జరగడం లేదు. ప్రజల నిరంతర అవసరాలు ముడిపడి ఉన్న రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్, పోలీస్‌ శాఖల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. అందులోనూ ముఖ్యంగా భూముల వ్యవహారాలు, పట్టణాల్లో ఉండే ప్రజల అవసరాలు చాలా కీలకమైనవి. ప్రతి వ్యక్తి పుట్టుక నుంచి మరణం వరకు ధ్రువీకరించడం, సొంతింటి కలసాకారం చేసుకోవడం దగ్గర్నుంచి.. వ్యాపారం చేసుకునేందుకు లైసెన్స్‌లు ఇవ్వడం వరకు మున్సిపల్‌ వర్గాల ద్వారా ప్రజలకు అందాల్సిన సేవలు కీలకం. 

చట్టాల ప్రకారం అయితే సామాన్యుడికి అవసరమైన ఏ పనైనా.. ఉచితంగా నిర్దిష్ట కాలపరిమితిలోపు చేసి పెట్టాల్సిన బాధ్యత అధికార వర్గాలది. కానీ, ఆయా శాఖల్లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు, పైస్థాయి అధికారుల ధన దాహం.. పేదోడి జేబు చమురు వదిలిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఆవేదన, అభిప్రాయంతో ఈ అవినీతి, లంచాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. భూపాలపల్లి జిల్లాలో వృద్ధ దంపతుల భిక్షాటన, మంచిర్యాల జిల్లాలో ఓ యువకుడు పెట్టిన ఫేస్‌బుక్‌ పోస్టు.. ప్రజల్లో ఉన్న అసంతృప్తికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం సమీక్ష జరగడంతో.. రాష్ట్రంలో ఎలాంటి సంస్కరణలు వస్తాయోననే ఆసక్తి అందరిలో నెలకొంది. రెవెన్యూ, మున్సిపల్‌ వర్గాలపై రాష్ట్ర ప్రజల్లో నెలకొన్న అభిప్రాయం, అపవాదు, వారు విమర్శలకు గురవుతున్న తీరుపై ‘సాక్షి’ప్రత్యేక కథనం. 
 
పైసలిస్తేనే పనయ్యేది! 
రెవెన్యూ శాఖలో అవినీతి తీవ్రంగా ఉంది. ఇందుకు వ్యవస్థీకృతమైన లోపాలతో పాటు అడ్డగోలు సంపాదనపై అధికారుల అత్యాశే కారణాలుగా కనిపిస్తున్నాయి. పనిని బట్టి, మనిషిని బట్టి, అవసరాన్ని బట్టి, స్థాయిని బట్టి రెవెన్యూ శాఖలో వసూళ్లు జరుగుతుంటాయనేది బహిరంగ సత్యమే. అందిన కాడికి గుంజుతారంటూ అధికారులపై చాలాసార్లు ఫిర్యాదులొచ్చాయి. అడిగినంత ఇవ్వకపోతే తిప్పించుకోవడం, సమయానికి ఇవ్వకపోవడం, ఉన్నతాధికారులను అడగాలని, కంప్యూటర్లు పనిచేయడం లేదని, పైనే అలా ఉంటే కింద మేమేం చేస్తామని, సర్వర్‌ డౌన్‌ ఉందని, పాసుపుస్తకాలు ప్రింటింగ్‌కు వెళ్లాయని, ఎమ్మార్వో లేడని, ఆర్డీవో పంపలేదని, జేసీ డిజిటల్‌ సంతకం కాలేదని రకరకాల సాకులు చెప్పటం పరిపాటిగా మారింది. అనుకున్నంత వసూలు చేసిన తర్వాతే.. పనిచేసి పెడతారనే విమర్శలున్నాయి. 50 పైసల ఫామ్‌కు 10రూపాయలు తీసుకోవడం, ఏదైనా ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే నిర్దేశిత రుసుము ఎక్కువ వసూలు చేస్తారనే అభియోగమూ రెవెన్యూ శాఖపై ఉంది. 
 
భూరికార్డుల ప్రక్షాళనతో.. 
రెవెన్యూ శాఖలో అవినీతి వ్యవహారాలు ఎప్పటినుంచో ఉన్నప్పటికీ.. 2017 సెప్టెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమంతో ఇది తారస్థాయికి చేరింది. భూ–రికార్డులను పరిశీలించి రైతులకు కొత్త పాసుపుస్తకాలివ్వాల్సిన ఈ కార్యక్రమాన్ని ఆసరాగా చేసుకుని రెవెన్యూ సిబ్బంది ఇష్టారాజ్యంగా సంపాదించారనే ఆరోపణలు, విమర్శలున్నాయి. రైతుకు ఇవ్వాల్సిన యాజమాన్య హక్కుల కోసం ఎకరానికి 5 నుంచి 10వేల వరకు వసూలు చేశారని ఎన్నో ఫిర్యాదులొచ్చాయి. ఈ లంచాల వ్యవహారంపై.. రెవెన్యూ శాఖకు వ్యతిరేకంగా నిరసనలు, సిబ్బందిపై దాడులు చేసేంతవరకు కూడా వెళ్లింది. రైతుకు భూమే జీవనాధారం. ఆ భూమిపై తనకు హక్కు ఉంటేనే రైతుకు మనుగడ ఉంటుంది. తరాలుగా భూమితో రైతు పెంచుకుంటున్న మమకారాన్ని ఆసరాగా చేసుకుని క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న రెవెన్యూ సిబ్బంది.. ఉన్నతాధికారుల పేరు చెప్పి పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడడం గమనార్హం. 
 
ఎలుకలు పడ్డాయని..: రెవెన్యూ సంఘాలు 
ఇటీవల మంచిర్యాల జిల్లా నెన్నెల మండలానికి చెందిన ఓ యువకుడు భూమి పట్టాకోసం లంచం అడుగుతున్నారంటూ పెట్టిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్‌ అయి.. సీఎం దృష్టికెళ్లింది. ఈ పోస్టింగ్‌కు స్పందించిన సీఎం నేరుగా ఆ యువకునితో మాట్లాడి త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటానని, అప్పుడు ప్రజలంతా తనకు అండగా నిలబడాలని కోరారు. దీంతో రెవెన్యూశాఖను రద్దు చేస్తారనే ప్రచారం మొదలయింది. భూముల వ్యవహారాలన్నింటినీ రెవెన్యూ శాఖ నుంచి తప్పిస్తారనే చర్చ మొదలయింది. ఇందులో నిజానిజాలను పక్కనపెడితే.. ఈ చర్చపై రెవెన్యూ సంఘాలు పెదవి విరుస్తున్నాయి. కొందరు చేసిన పనిని అందరికీ ఆపాదించడం.. ఏకంగా శాఖనే రద్దు చేయాలనే ఆలోచనపై మండిపడుతున్నాయి. 

ఇంట్లో ఎలుకలు పడ్డాయని ఇల్లు తగలబెట్టుకుంటామా? అని ప్రశ్నిస్తున్నాయి. రెవెన్యూ సేవలతో పాటు ఇతర శాఖలకు పనిభారాన్నీ తామే మోస్తున్నామని.. సమగ్ర కుటుంబ సర్వే, భూ–రికార్డుల ప్రక్షాళన లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించిన తమపై అపవాదు వేయడం సరికాదంటున్నాయి. రెవెన్యూ వ్యవస్థ జవాబుదారీతనం కోసం రాష్ట్రంలో సమగ్ర భూసర్వే చేపట్టాలని, ధరణి ప్రాజెక్టును తహశీల్దార్లకు అనుకూలంగా ఉండేలా మార్చాలని, అర్థరహితమైన ఆదాయ, కుల, తదితర ధ్రువపత్రాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. 
 
పురపాలికల్లో అవినీతి జాఢ్యం 
పురపాలికలు ‘అవినీతి’కి అడ్డాగా మారిపోయాయి. దశాబ్దాలుగా పట్టిన అవినీతి కంపు మున్సిపాలిటీలను వదలడం లేదు. అవినీతి నిర్మూలన కోసం ప్రభుత్వం నూతన సంస్కరణలు, విధానాలను ప్రవేశపెట్టినా పరిస్థితిలో మార్పురావడం లేదు. నగర, పుర ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు, ఇతర సేవలందించాల్సిన పురపాలికలు.. కొందరు ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతిధులు, అధికారుల అక్రమార్జనకు కేరాఫ్‌ అడ్రస్‌లుగా మారాయి. చేతులు తడపందే.. సామాన్యులకు కనీస అనుమతులు కూడా లభించడం లేదు. ఏ ధ్రువీకరణ పత్రం జారీ కాదు. ఏటా నగరపాలికలు, మునిసిపాలిటీల్లో జరిగే.. వందల కోట్ల విలువైన అభివద్ధి పనుల్లో ఏ మాత్రం నాణ్యత ఉండదు. 

ఎందుకంటే.. అక్కడ బినామీల ముసుగులో కీలకమైన పనులు, కాంట్రాక్టులు దక్కించుకునేది స్థానిక ఎమ్మెల్యేలు, మేయర్లు, చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మున్సిపల్‌ అధికారులే. రాష్ట్రంలోని ప్రతి కార్పొరేషన్, మునిసిపాల్టీలో నిబంధనలకు విరుద్ధంగా స్థానిక ప్రజాప్రతినిధుల బంధువులు, అనుచరులే కాంట్రాక్టర్లుగా చెలామణి అవుతున్నారు. ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేసే ఆస్తి పన్నులు, ఇతరాత్ర పన్నులు, చార్జీలతో ఏటా పురపాలికలకు కోట్లలో ఆదాయం వస్తోంది. దీనికి తోడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వందల కోట్ల రూపాయలు వివిధ గ్రాంట్ల రూపంలో వస్తున్నాయి. 

వీటితో చేపట్టే ప్రతి అభివద్ధి పనిలో 25–30% కమీషన్లు వాటాల రూపంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల జేబుల్లోకి వెళ్తున్నాయి. కొందరు ఎమ్మెల్యేలైతే.. తమ పరిధిలోని మునిసిపాలిటీల్లో జరిగే ప్రతిపనిలో 5% కమీషన్‌ను దర్జాగా దండుకున్నారు. పురపాలికల్లో కాంట్రాక్టర్ల బిల్లుల మంజూరు కావాలంటే మునిసిపల్‌ చైర్మన్లు, మేయర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, కమిషనర్లు, ఇంజనీర్లు, అకౌంటెంట్లకు కలిపి మొత్తం 25% కమీషన్లు ఇవ్వాల్సిందే. కాదు,కుదరదంటే.. ఏళ్లు గడిచినా ఆ కాంట్రాక్టర్ల బిల్లులు మంజూరు కావు. 
 
పుట్టినా.. చచ్చినా! 
జనన, మరణ ధ్రువీకరణ పత్రాల నుంచి గృహ నిర్మాణ అనుమతుల జారీ వరకు ప్రతి పనికీ యథేచ్చగా లంచాలు వసూలు చేస్తున్నారు. భవనాలు, లేఔట్ల నిర్మాణ అనుమతుల్లో అవినీతి నిర్మూలనకు మూడేళ్ల కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘డెవలప్‌మెంట్‌ పర్మిషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం’(డీపీఎమ్మెస్‌) కొద్దిరోజులకే నీరుగారిపోయింది. డీపీఎంఎస్‌ కింద ఇంటి నిర్మాణ అనుమతులకు దరఖాస్తు చేసుకుంటే, 14 రకాల చార్జీలను విధించి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. దీనికి తోడు ఇంటి స్థాయిని బట్టి 10వేల నుంచి 25 వేల రూపాయల వరకు మామూళ్లు తప్పవు. డీపీఎంఎస్‌ వచ్చిన తర్వాత కూడా ఇళ్ల అనుమతుల జారీకి లంచాలు స్వీకరిస్తూ కొందరు మునిసిపల్‌ అధికారులు ఏసీబీకి పట్టుబడడం ఇందుకు నిదర్శనం. ఇక ఆస్తుల మ్యుటేషన్లు, వ్యాపారులకు ట్రేడ్‌ లైసెన్సులు, నల్లా కనెక్షన్, అడ్డగోలుగా పెరిగిన ఆస్తి పన్నులపై పునఃసమీక్ష వంటి సేవలకు సైతం వందలు, వేలల్లో మామూళ్లు వసూలు చేస్తున్నారు. 
 
టెండర్‌ వేయాలంటే భయం! 
జీహెచ్‌ఎంసీతో సహా రాష్ట్రంలోని ప్రధాన మున్సిపల్‌ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో వింత పరిస్థితి నెలకొని ఉంది. మేయర్లు, చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు కమీషన్ల వాటా ముట్టజెప్పనిదే కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించడానికి వీల్లేదు. కాంట్రాక్టర్‌ అయితే వారి బినామీ ఉండాలి.. లేదా వారికి కోరినంత పర్సెంటేజీని ముట్టజెప్పాలి. కొన్ని పురపాలికల్లో బినామీలు తప్ప ఇతర కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేయడానికి వీల్లేదు. బయటి వ్యక్తులు టెండరు వేయడానికి వస్తే బెదిరింపులు, దాడులకు దిగుతారు. ఎవరైనా కొత్త కాంట్రాక్టర్లు వచ్చి పనులు ప్రారంభించినా, క్షణాల్లో స్థానిక కార్పొరేటర్లు, కౌన్సిలర్లు రంగంలో దిగి.. మాకేంటి? అని వేధింపులకు గురిచేస్తున్నారు. తమ కమీషన్‌ వాటా లభించకపోతే పనిని సజావుగా జరిగే ప్రసక్తే ఉండదు. 

ఇక పురపాలికల్లో చేపట్టే పనుల్లో నాణ్యత డొల్లగా మారింది. కోట్ల ఖర్చుతో వేసిన సీసీ రోడ్లు, మురికి కాల్వలు ముణ్ణాళ్ల ముచ్చటగా మారుతున్నాయి. దీంతో వేసిన చోటే పదేపదే రోడ్లు వేసి నిధులను దుర్వినియోగం చేస్తున్నారు. కొందరు కార్పొరేటర్లు, కౌన్సిలర్లయితే వాటాల కోసం ప్రైవేటు వ్యక్తుల ఇళ్లు, భవన నిర్మాణాలను సైతం అడ్డుకుంటున్నారు. మామూళ్లు ఇవ్వకుంటే అనుమతి లేకుండా భవన నిర్మాణం జరుపుతున్నారని మునిసిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేసి పనులను నిలుపుదల చేయిస్తారు. దీంతో బాధితులు ఎంతోకొంత సెటిల్మెంట్‌ చేసుకుని పనిచేసుకుంటున్నారు. 
 
కాగ్‌ నివేదికలు బుట్టదాఖలు! 
మున్సిపాలిటీల్లో కోట్ల రూపాయల అవినీతిపై కాగ్‌ సమర్పించిన నివేదికలు బుట్టదాఖలయ్యాయి. పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అవుతున్నాయని కాగ్‌ నిర్థారించినా బాధ్యులపై చర్యలు చేపట్టలేదు. అవినీతి ఆరోపణలపై శాఖాపరమైన విచారణల పేరుతో కాలయాపన చేస్తున్నారు. తీవ్రమైన అవినీతి ఆరోపణలున్న అధికారులు, ఉద్యోగులు పదవీ విరమణ చేసి శాఖాపరమైన చర్యల నుంచి తప్పించుకుంటున్నారు. రాష్ట్రంలోని పురపాలక శాఖ పరిధిలో పనిచేసే ఉద్యోగుల్లో వందల మందిపై విజిలెన్స్‌ కేసులు పెండింగ్‌లో ఉండడం గమనార్హం. విజిలెన్స్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నా ఇటీవల కాలంలో కొందరికి పదోన్నతులు రావడం విమర్శలకు దారితీసింది. తీవ్ర ఆరోపణలున్న ఉద్యోగుల నుంచి డబ్బులు తీసుకుని కేసులనుంచి తప్పిస్తున్నారని పురపాలక శాఖ ఉన్నతాధికారులపై ఆరోపణలున్నాయి. మునిసిపాలిటీల్లో అవినీతి నిర్మూలన కోసం ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొస్తున్న నేపథ్యంలో, అవినీతి ఆరోపణలపై నిర్దిష్ట కాలపరిమితిలోగా విచారణ పూర్తి చేసి చర్యలు తీసుకునే విధంగా కొత్త నిబంధనలు తీసుకువస్తే కొంత వరకు పరిస్థితిలో మార్పు రావచ్చు. 


రెండేళ్లుగా పాసుపుస్తకం కోసం తిరుగుతున్నా 

‘జాల గ్రామంలోని 330 సర్వే నెంబర్‌లో 20 గుంటల భూమి తండ్రి ద్వారా వారసత్వంగా వచ్చింది. కొంతకాలం సేద్యం చేసిన. కానీ వర్షాలు రాకపోవడంతో ఉపాధి కోసం పదేళ్లు హైదరాబాద్‌లో ఉండి వచ్చిన. 2017 నవంబర్‌లో రెవెన్యూ అధికారులు నాకు 1–బీ ఫారం ఇచ్చిండ్రు. కానీ, ఇప్పటిదాకా పాసుపుస్తకం ఇయ్యలేదు. వీఆర్వోను అడిగితే.. నాకు భూమి లేదని.. వేరేవాళ్లకు అమ్ముకున్నానని అంటున్నడు. జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. రేపు, ఎల్లుండి అనుకుంట చెబుతున్నరు’– కోటగిరి మాలమణి, జాల గ్రామం, రాజాపేట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా 
 
భూమి ఒకరిది.. పరిహారం మరొకరికి 
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్‌లో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్యాకేజీ–10లో భూసేకరణలో భాగంగా విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ కోసం అవారి లచ్చవ్వ అనే మహిళ భూమిని సేకరించారు. ఆమెకు సర్వే నంబరు 227లో 20 గుంటల భూమి ఉంది. విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనుల్లో ఈ మొత్తం భూమి పోయింది. లచ్చవ్వకు పరిహారంగా రూ.3.25 లక్షలు రావాల్సి ఉంది. కానీ.. ఆ డబ్బులను ఈ భూమితో ఏమాత్రం సంబంధం లేని మేచినేని మనోహర్‌రావు పేరుతో రెవెన్యూ అధికారులు చెక్కు జారీ చేశారు. లచ్చవ్వ రెవెన్యూ అధికారులను ఆశ్రయిస్తే పొరపాటు జరిగిందని చెప్పారు. కానీ.. ఇంతవరకు పరిహారం రాలేదు. 
 
డబ్బులు అడిగితే ప్రామిసరీ నోటు 
చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు రొడ్డరాజం. ఈయనది జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం, వేంపల్లి. తన భూమిని పట్టాచేయాలని రెండేళ్ల కిందట వీఆర్వో ఆంజనేయులును కలిశాడు. పట్టాచేయాలంటే రూ.32,000 ఇవ్వాలని వీఆర్వో డిమాండ్‌చేశాడు. భూమి పట్టా చేతికొస్తుందని ఆశతో రొడ్డరాజం అడిగినంతా ముట్టజెప్పాడు. నెలలు గడుస్తున్నా పట్టా కాకపోవడంతో వీఆర్వోను నిలదీశాడు. తన డబ్బు తిరిగి ఇవ్వమని కోరాడు. దీంతో వీఆర్వో 32 వేలకు ప్రామీసరి నోటు రాసిచ్చి చేతులు దులుపుకోవడంతో రైతు లబోదిబోమన్నాడు. ఇలాగా ఆ గ్రామంలోని దాదాపు వందమంది రైతుల నుంచి సదరు వీఆర్వో లక్షలు దండుకున్నాడని ఆరోపణలున్నాయి. దీంతో కలెక్టర్‌ ఇతన్ని సస్పెండ్‌ చేయాల్సి వచ్చింది. 
 
పైసలు ముడ్తెనే పాస్‌పుస్తకం! 
‘వరంగల్‌ అర్బన్‌ జిల్లా హసన్‌పర్తి మండలం సీతంపేట గ్రామం మాది. మా మామయ్య మేక నారాయణ రెడ్డి పేరుతో 1.20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మామయ్య కొద్దిరోజుల క్రితం మరణించడంతో అత్తమ్మ మేక రాజమ్మ పేరుమీదకి మార్చి పాసుపుస్తకం ఇవ్వాలి. కానీ, వీఆర్వో ఆర్నెల్లు తప్పించుకున్నడు. కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌లో దరఖాస్తు ఇచ్చినా పట్టించుకోలేదు. చివరకు డబ్బులు ఇస్తెనే.. పాసుపుస్తకం, రైతు బంధు చెక్‌ ఇచ్చారు’– రవీందర్‌రెడ్డి, రైతు, వరంగల్‌ అర్బన్‌ జిల్లా 
 
అనుమతుల కోసం వసూలు 
‘నాకు మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని నర్సంపేట రోడ్డులో 126గజాల స్థలముంది. అక్కడ ఇల్లు కట్టేందుకు అన్ని అనుమతులు తీసుక్నున్నాను. అయితే ఇల్లు కడుతుండంగనే.. ఆ స్థలానికి 3–5–55, 3–5–56 ఇంటి æనెంబర్లతో పన్నులు చెల్లించాలని నోటీసులు పంపారు. నిర్మాణ దశలో ఉండగా ఇంటిపన్ను ఎలా ఇస్తారని అడిగితే గతంలో ఇక్కడ ఇల్లు ఉందని, 3–5–55 ఇంటి నెంబర్‌ మీద రూ.6,244 పన్ను వసూలు చేశారు. అది చెల్లించిన తర్వాతే ఇల్లు కట్టుకునేందుకు అనుమతించారు’– మందుల వెంకట్రాంనర్సయ్య, మహబూబాబాద్‌. 
 
సైనికుడినీ వదల్లేదు 
ఈ ఫోటోలో కనిపిస్తున్నది జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని విస్నూరు గ్రామానికి చెందిన బాలగాని ప్రవీణ్‌కుమార్‌. 63 రాష్ట్ర రైఫిల్స్, కాలకూట్, జమ్మూలో జవాన్‌గా పనిచేస్తున్నాడు. ఆయన తండ్రి పేరు మీద విస్నూరు గ్రామంలోని 4 సర్వేనంబర్లలో 12.17 ఎకరాల భూమి ఉంది. భూమి విస్తీర్ణం తక్కువగా ఉందని కొలత కోసం మండల సర్వేయర్‌కు దరఖాస్తు చేస్తే డబ్బులు ఇస్తేనే చేస్తానని డిప్యూటీ సర్వేయర్‌ నాంపల్లి శ్రీనివాస్‌ తెగేసి చెప్పాడు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో సర్వేయర్‌కు బుద్ధిచెప్పాలని నిర్ణయించుకున్న ఆ జవాను ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సర్వేయర్‌ అడిగిన రూ.10 వేలు తీసుకుని జనగామ జిల్లా కేంద్రంలో ఇస్తుండగా ఏసీబీకి అప్పగించాడు. శ్రీనివాస్‌ మీద కేసు నమోదైంది.  


ఫొటోలో కన్పిస్తున్న ఈ దంపతుల పేరు దేవేంద్రప్ప, శకుంతల. వీరిది జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం మాచర్ల గ్రామం. మాచర్ల గ్రామ శివారులోని సర్వే నంబర్‌ 246లో దేవేంద్రప్ప పేరున 2.23 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిని ఇప్పటికీ వీళ్లే సాగు చేస్తున్నారు. అయితే 2013లో ఈ భూమిని పట్టాదారులతో సంబంధం లేకుండా.. అప్పటి తహసీల్దార్‌ అదే గ్రామానికి చెందిన జానకమ్మ పేరున మార్పు చేస్తూ, ప్రొసీడింగ్‌ ఇచ్చారు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న దేవేంద్రప్ప తన భూమిని తనకు తెలియకుండా జానకమ్మ పేరున 
ఎలా మార్చుతారంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో భార్యతో కలిసి గట్టు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట న్యాయపోరాటానికి దిగినా ఫలితం లేకుండాపోయింది. ఈ వ్యవహారంలో రెవెన్యూ సిబ్బంది లంచం తీసుకునే జానకమ్మ పేరిట ప్రొసీడింగ్‌ జారీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement