రెవెన్యూకు కొత్త పేరు! | CM KCR‌ Sensational Decisions In Review On Revenue Reforms | Sakshi
Sakshi News home page

రెవెన్యూకు కొత్త పేరు!

Published Fri, Feb 19 2021 1:32 AM | Last Updated on Fri, Feb 19 2021 9:42 AM

CM KCR‌ Sensational Decisions In Review On Revenue Reforms - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘మారిన పరిస్థితుల్లో రెవెన్యూ శాఖ స్వరూపం కూడా మారింది. విధులు, బాధ్యతల్లో మార్పులు వచ్చాయి. గతంలో భూమి శిస్తు వసూలు చేసినప్పుడు రెవెన్యూ అనే పదం, శాఖ వచ్చాయి. ఇప్పుడు రెవెన్యూ వసూలు చేయకపోగా, ప్రభుత్వమే రైతు బంధు ద్వారా ఎకరానికి ఏటా రూ.10 వేల సాయం అందిస్తు న్నది. కాబట్టి రెవెన్యూ అనే పేరు ఇప్పుడు సరిపోదు. పేరు మారే అవకాశం ఉంది. ధరణి పోర్టల్, డిజిటల్‌ సర్వే తదితర కారణాల వల్ల భూ రికార్డుల నిర్వహణ, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు కూడా సులభంగా, అధికా రుల ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి. రైతులు తహశీల్దార్‌ కార్యా లయాల చుట్టూ తిరిగే ప్రయాస ఉండదు. ఇదే ధరణి ప్రధాన లక్ష్యం. కాబట్టి రెవెన్యూ శాఖ విధుల్లో మార్పులు అనివార్యం. రెవెన్యూ శాఖలో ఎవరే పని చేయాలనే విషయంలో ప్రభుత్వం త్వరలోనే జాబ్‌ చార్టు రూపొందిస్తుంది. ఆర్‌ఐ ఏం చేయాలి? తహశీల్దార్‌ ఏం చేయాలి? ఆర్డీవో ఏం చేయాలి? అనే విషయాల్లో స్పష్టత ఇస్తాం.

రెవెన్యూ అధికారులను పనిచేయగలిగే, పని అవ సరం ఉండే చోట ప్రభుత్వం వాడుకుం టుంది’ అని సీఎం కేసీఆర్‌ సంచలన ప్రకటన చేశారు. రెనెన్యూ సంస్కర ణలు, ధరణి పోర్టల్‌ పనితీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురు వారం ప్రగతిభవన్‌లో సమీక్షించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా త్వరలో డిజిటల్‌ సర్వే నిర్వహించి, వ్యవసాయ భూము లకు కో ఆర్డినేట్స్‌ (అక్షాంశ, రేఖాంశాలు) ఇస్తామని ప్రకటించారు. సర్వే కోసం వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించారు. ‘ఏమైనా సమ స్యలు, సందేహాలుంటే రైతులు ఇకపై కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలి. కలెక్టర్లు ఆ దరఖాస్తులను పరిశీలించాలి. సీఎస్‌ నుంచి వచ్చే మార్గదర్శ కాలకు అనుగుణంగా వాటిని పరిష్కరించాలి’అని సీఎం ఆదేశించారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌ పూర్తి పారదర్శకంగా జరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ధరణి పోర్టల్‌ వంద శాతం విజయవంతమైందని సంతృప్తి వ్యక్తం చేశారు.

సమస్యలన్నీ కొలిక్కి వస్తాయి..
‘ప్రభుత్వం జరిపిన సమగ్ర భూరికార్డుల ప్రక్షాళన, కొత్త పాసు పుస్తకాలు, ధరణి పోర్టల్‌ తదితర సంస్కరణ వల్ల వ్యవసాయ భూములకు సంబంధించిన చాలా సమస్యలు పరిష్కారం అయ్యాయి. అసెంబ్లీలో ప్రకటించినట్లు త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్‌ సర్వే నిర్వహిస్తాం. ప్రతి భూమికి కో–ఆర్డినేట్స్‌ ఇస్తాం. వాటిని ఎవరూ మార్చలేరు. గందరగోళానికి, తారుమారు చేయడానికి ఆస్కారం ఉండదు. ఒకసారి సర్వే పూర్తయితే అన్ని విషయాలపై స్పష్టత వస్తుంది. రైతుల భూముల మధ్య, అటవీ– ప్రభుత్వ భూముల మధ్య, అటవీ–ప్రైవేటు భూముల మధ్య హద్దుల పంచాయతీ కూడా పరిష్కారం అవుతుంది. పోడు భూముల సమస్య కూడా పరిష్కారం అవుతుంది. మూడు, నాలుగు నెలల్లో మొత్తం సమస్యలు కొలిక్కి వస్తాయి’అని సీఎం స్పష్టం చేశారు. 

రెవెన్యూలో అవినీతి అంతమైంది..
‘ధరణి పోర్టల్‌తో రెవెన్యూలో అవినీతి అంతమైంది. నోరులేని, అమాయక రైతులకు న్యాయం జరిగింది. ఒకరి భూమిని ఇంకొకరి పేరు మీద రాసే అరాచకం ఆగింది. జుట్టుకు జుట్టుకు ముడేసి పంచాయతీ పెట్టే దుష్ట సంప్రదాయం ఆగింది. డాక్యుమెంట్లు గోల్‌మాల్‌ చేసి, రెవెన్యూ కోర్టుల పేరిట జరిగే దుర్మార్గం పోయింది. దేశంలో మరెక్కడా లేనివిధంగా, చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ప్రభుత్వం ఎన్నో వ్యయ, ప్రయాసలకోర్చి మూడేళ్లు కసరత్తు చేసి కొత్త చట్టం తెచ్చింది. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు పారదర్శకంగా, అవినీతికి అవకాశం లేకుండా జరిగిపోతున్నాయి. ఎలాంటి గందరగోళం, అస్తవ్యస్తం లేకుండా భూముల అమ్మకాలు, కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగుతున్నది. బయోమెట్రిక్, ఆధార్‌ ఆధారంగా అమ్మేవారు, కొనేవారు వస్తేనే భూముల రిజిస్ట్రేషన్‌ జరుగుతున్నది. ధరణిలో నమోదైన భూములను మాత్రమే అమ్మే, కొనే వీలున్నది. ఆ భూములు మాత్రమే వారసత్వం ద్వారా, గిఫ్ట్‌ డీడ్‌ ద్వారా మరొకరికి సంక్రమించే అవకాశం ఉన్నది.

ప్రభుత్వం అనుసరిస్తున్న పకడ్బందీ వ్యూహం వల్ల ఎవరూ ధరణిలో వేలుపెట్టి మార్పులు చేసే అవకాశం లేదు. చివరికి సీసీఎల్‌ఏ, సీఎస్‌ కూడా రికార్డులను మార్చలేరు. అంతా వ్యవస్థానుగతంగా మానవ ప్రమేయం లేకుండా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జరుగుతున్నది. రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇంత సజావుగా సాగడం కొందమందికి మింగుడు పడుతలేదు. లేని సమస్యలు సృష్టించి, పైరవీలు చేసి అక్రమంగా సంపాదించుకునే వారు ఇప్పుడు అవకాశం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వారే అపోహలు సృష్టించి గందరగోళపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు తికమక పడొద్దు. కొన్ని పత్రికలు కావాలని తప్పుడు వార్తలు, అసంబద్ధమైన కథనాలు ప్రచురిస్తున్నాయి. ఈ వార్తలపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు స్పందించి సంపూర్ణ వివరాలు అందించాలి. సందేహాలను నివృత్తి చేయాలి’అని సీఎం చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement