సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జరిగిన ప్రగతి నివేదన సభకు భారీగా తరలివచ్చిన ప్రజలు, బీఆర్‌ఎస్ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్
సాక్షి, నాగర్‌కర్నూల్/గద్వాల రూరల్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్‌తో రైతులను దోచుకునే రాబందులు మాయమయ్యాయని.. అలాంటి ధరణిని తీసేస్తామంటూ మళ్లీ దళారులు మోపయ్యారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రైతుబంధు కింద డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లో పడేందుకు కారణమైన ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తారా? అని మండిపడ్డారు. అప్పట్లో దళారుల దయతో వాళ్లు రాసిందే లెక్క, గీసిందే గీతగా సాగేదని.. ధరణితో దళారులు, పైరవీకారులు, పట్వారీలు లేకుండా పోయారని చెప్పారు.
మూడేళ్ల పాటు కష్టపడి రూపొందించిన ధరణిని బంగాళాఖాతంలో వేయడమంటే ప్రజలను వేసినట్టేనని వ్యాఖ్యానించారు. గతంలో పంట డబ్బుల కోసం నెలల తరబడి వేచి చూసేవాళ్లమని, ఇప్పుడు రోజుల్లోనే ఖాతాల్లో పడుతున్నాయని చెప్పారు. రిజిస్ట్రేషన్లు సైతం పది నిమిషాల్లో పూర్తయి పట్టా చేతికందుతోందన్నారు. సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ నిర్వహించిన ప్రగతి నివేదన సభలో కేసీఆర్ ప్రసంగించారు.
పాలమూరు కళకళలాడుతోంది
గతంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఎందరో మంత్రులుగా పనిచేశారని.. వారు ఎన్నో మాటలు చెప్పినా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని కేసీఆర్ విమర్శించారు. ఉద్యమ సమయంలో నడిగడ్డ పరిస్థితులను చూసి కన్నీళ్లు పెట్టుకున్నానని గుర్తు చేసుకున్నారు. తుంగభద్ర, కృష్ణా నదుల మధ్య ఉన్నా తాగు, సాగు నీటికి కష్టాలు ఉండేవన్నారు. ఒకప్పుడు ఎండిపోయి ఎడారిని తలపించిన పాలమూరు.. ఇప్పుడు ధాన్యపు రాశు లు, కొనుగోలు కేంద్రాలు, హార్వెస్టర్లతో కళకళలాడుతోందన్నారు.
గతంలో ఇక్కడ బతకలేక, బతుకులేక వలసపోయారని.. అలాంటిది ఈ రోజు రాయచూర్, బిహార్, జార్ఖండ్ నుంచి మిర్చి, పత్తి ఏరేందుకు మన దగ్గరికి వలస వస్తున్నారని చెప్పారు. మహబూబ్‌నగర్ పట్టణంలో 14 రోజులకు ఒకసారి మంచినీళ్లు వచ్చేవని.. అలాంటిది ఇప్పుడు రాష్ట్రం వచ్చాక ప్రతి ఇంటికి నల్లా పెట్టుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో పుట్టుక నుంచి చావు వరకు ప్రతి అంశంలో, ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సాయం అందుతోందన్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల ద్వారా 20 లక్షల ఎకరాలకు నీరందిస్తున్నామని చెప్పారు.
గద్వాల జిల్లాకు ప్రత్యేక నిధులు
జిల్లాలోని 255 గ్రామ పంచాయతీలకు రూ.10 లక్ష ల చొప్పున, 12 మండల కేంద్రాలకు రూ.15 లక్షల చొప్పున, గద్వాల మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, మిగతా మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. జిల్లా సరిహద్దుల్లో మరో వంద పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సభలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీ, జెడ్పీ చైర్‌పర్సన్ సరిత, ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామ్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, రవీందర్‌రావు, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహం, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, రాజేందర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, అంజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
13 నిమిషాలే ప్రసంగం
గద్వాల బహిరంగ సభలో సీఎం కేసీఆర్ తన ప్రసంగాన్ని త్వరగా ముగించారు. సాయంత్రం 6.10 గంటలకు బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకున్న ఆయన.. 6.13 గంటలకు మాట్లాడటం ప్రారంభించి 6.26 గంటలకు ముగించారు. కాసేపటికే హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు బయల్దేరారు.
సీఎం సభలో కూచుకుళ్ల గద్వాల బీఆర్‌ఎస్ సభలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. ఆయన రెండు రోజుల క్రితం కాంగ్రెస్ నేత మల్లు రవి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. దీనితో కూచుకుళ్ల బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు ప్రచారం జరిగింది. అయితే సోమవారం ఆయన సీఎం కేసీఆర్‌తో కలసి వేదిక పంచుకోవడం గమనార్హం.
ఉద్యోగులు పట్టు వదలొద్దు.. జట్టు చెదరొద్దు..
దేశంలో చాలా రంగాల్లో తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచిందని.. ఇదే స్ఫూర్తితో ఉద్యోగులంతా పట్టు వదలకుండా, జట్టు చెదరకుండా పనిచేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలతోపాటు బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. తర్వాత కలెక్టరేట్‌లో ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
దేశవ్యాప్తంగా తలసరి ఆదాయంతోపాటు విద్యుత్ వినియోగంలో రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచిందని వివరించారు. రాష్ట్రంలో మానవీయ కోణంలో పాలన సాగుతోందని.. ఓట్ల కోసం, చిల్లర రాజకీయాల కోసం పథకాలను రూపొందించలేదని చెప్పారు. దేశంలో 90 లక్షల ఎకరాల్లో వరి పండిస్తే.. అందులో తెలంగాణ వాటానే 50 శాతానికిపైగా 56 లక్షల ఎకరాలు అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment