సాక్షి, హైదరాబాద్ : కలెక్టర్ అనే పదం ఇక కనుమరుగు కానుంది. రెవెన్యూ వ్యవస్థలో కీలక సంస్కరణలు తేవాలని నిర్ణయించిన సర్కారు.. అధికారుల హోదాలో కూడా మార్పుచేర్పులు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా జిల్లా పాలనాధి కారిగా వ్యవహరించే కలెక్టర్ పేరును ఇకపై జిల్లా మేజిస్ట్రేట్ (డీఎం)గా మార్చాలనుకుంటోంది. ప్రస్తుతం జిల్లా పాలనాధికారిని సీడీఎం (కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్)గా పిలుస్తున్నప్పటికీ ఇం దులో కలెక్టర్ అనే పదాన్ని తొలగిం చాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయించినట్లు తెలి సింది. బ్రిటిష్ పాలనలో భూమి శిస్తు వసూలు చేసే అధికారులను కలెక్ట ర్లుగా పిలిచేవారు. ప్రస్తుతం భూమి శిస్తు రద్దయినా కలెక్టర్ వ్యవస్థ కొనసాగుతోంది. ప్రస్తుత కాలంలో కలెక్టర్ పదం సరికాదని పలు సంద ర్భాల్లో సీఎం కేసీఆర్ అభిప్రాయ పడ్డారు.
ఈ నేపథ్యంలో వచ్చే శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టా లని భావిస్తున్న కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదాలో ఈ అంశాన్ని చేర్చే విధంగా ఉన్నతాధికారులు ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్ తదితర రాష్ట్రాల్లో జిల్లా పాలనాధికారిని కలెక్టర్ బదులు జిల్లా మేజిస్ట్రేట్‌గానే పిలుస్తున్నందున రాష్ట్రంలోనూ ఆ విధానాన్నే వర్తింపజేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అలాగే జిల్లా అదనపు కలెక్టర్ల పోస్టుల్లోనూ మార్పులు జరగనున్నాయి. కొన్నాళ్ల క్రితం జాయింట్ కలెక్టర్ (జేసీ) పేరు, స్థాయి మార్చిన ప్రభుత్వం... ప్రతి జిల్లాకు జేసీ స్థానే ఇద్దరు అదనపు కలెక్టర్లను నియమించింది. ఇకపై వారి పేర్లలోనూ కలెక్టర్ అదృశ్యం కానుంది. వారిని అదనపు జిల్లా మేజిస్ట్రేట్లుగా పరిగణించాలని చట్టంలో పొందుపరుస్తున్నట్లు సమాచారం.
తహసీల్దార్ పోస్టులోనూ..
మండల స్థాయిలో ముఖ్య అ«ధికారిగా వ్యవహరించే తహసీల్దార్ పేరు మార్పుపైనా ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతోంది. రెవెన్యూ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించే తహసీల్దార్ల అధికారాలకు కత్తెరపెట్టాలని భావిస్తున్న సర్కారు.. రిజిస్ట్రేషన్ శాఖతో వారిని అనుసంధానం చేయాలని భావిస్తోంది. అందులో భాగంగానే భూముల క్రయవిక్రయాలు జరిగిన మరుక్షణమే మ్యుటేషన్, పాస్ పుస్తకాలను అక్కడికక్కడే జారీ చేయాలని యోచిస్తోంది. ఈ క్రమంలోనే కొత్త చట్టంలో కీలక సంస్కరణలు చేయాలని భావిస్తున్న సర్కారు.. తహసీల్దార్ అనే పదంపైనా పునరాలోచన చేస్తోంది. మండల వ్యవస్థ అమలులోకి రావడంతో అప్పటివరకు ఉన్న తహసీల్దార్ పేరును రద్దు చేసిన అప్పటి సీఎం ఎన్టీ రామారావు.. దాని స్థానే మండల రెవెన్యూ అధికారిగా నామకరణం చేశారు. అయితే దేశవ్యాప్తంగా తహసీల్దార్ హోదా ప్రాచుర్యం చెందడంతో కొన్ని ధ్రువపత్రాల చెలామణిలో గందరగోళం ఏర్పడింది. ఈ క్రమంలో ఎమ్మార్వో పేరును మార్చిన వై.ఎస్. సర్కారు.. మళ్లీ తహసీల్దార్‌గా పిలవడం మొదలుపెట్టింది. అయితే తాజాగా కొత్త రెవెన్యూ చట్టంలో ఈ పేరు మార్పిడిపైనా ఆలోచన జరుగుతోంది. భూ నిర్వహణాధికారి లేదా భూ మేనేజర్‌గా పిలిచే అంశాన్ని పరిశీలిస్తోంది. ఒకవేళ పాత సమస్యలే ఉత్పన్నమవుతాయని భావిస్తే మాత్రం ప్రస్తుత పేరును కొనసాగించే వీలుందని ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment