సాక్షి, హైదరాబాద్: ఎన్నికల క్రతువు పూర్తికావడంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పాలనా వ్యవహారాలపై దృష్టి సారించారు. రాష్ట్రంలో వివిధ ఎన్నికలు జరుగుతుండటంతో గత 9 నెలలుగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. శనివారంతో ఈ కోడ్ ముగిసిపోతుండటంతో పరిపాలనకు పదునుపెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. వచ్చేవారం ఆయన కలెక్టర్లతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ముఖ్యమంత్రిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన అనంతరం జరుగుతున్న తొలి కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఇది. ఈ సమావేశంలో రెవెన్యూ సంబంధిత అంశాలే ప్రధాన ఎజెండా కానున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.
కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో మ్యూటేషన్లు, డిజిటల్ సంతకాలు, భూ రికార్డుల ప్రక్షాళన పురోగతిపై చర్చించే అవకాశం ఉంది. రెవెన్యూ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తానని కేసీఆర్.. లోక్‌సభ ఎన్నికలప్పుడు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన శరత్ అనే రైతుతో ఫోన్‌లో చెప్పిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రెవెన్యూ శాఖలో సంస్కరణలు తెస్తామని, వీటిని జూన్‌లో మొదలు పెడతామని ప్రకటించారు. స్థానిక సంస్థల కోడ్ కూడా రేపటితో ముగియనుండటంతో పూర్తిస్థాయిలో పాలనా వ్యవహారాలపై ఫోకస్ పెట్టాలని సీఎం భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో రెవెన్యూ రికార్డుల నవీకరణలో జాప్యం, ధరణి వెబ్‌సైట్‌లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు, మ్యూటేషన్లు, పాస్‌పుస్తకాల జారీ పెండింగ్‌పై స్పష్టమైన వివరాలు పంపాలని భూ పరిపాలనా ప్రధాన కమిషనర్(సీసీఎల్‌ఏ) కార్యాలయం కలెక్టర్లను ఆదేశించింది. మరోవైపు కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావాలని భావిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ సమావేశం అనంతరం తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. చట్టంలో పొందుపరచాల్సిన అంశాలు, రెవెన్యూ శాఖ రద్దు, విలీనం, సంస్కరణలు ఇతరత్రా అంశాలపై కీలక అడుగు వేసే వీలుంది.
4.56 లక్షలు పెండింగ్
భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం వివాదరహిత ఖాతాలకు కూడా ఇంకా పట్టాదార్ పాస్‌పుస్తకాలు జారీకాకపోవడంతో రైతాంగంలో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. 4.56 లక్షల ఖాతాలకు సంబంధించి తహసీల్దార్ల డిజిటల్ సంతకాలు కాకపోవడంతో పాస్‌పుస్తకాల జారీ నిలిచిపోయింది. ఇవేగాకుండా సెప్టెంబర్ అనంతరం క్రయ విక్రయాలు జరిగిన భూముల మ్యూటేషన్లు కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఎన్నికల కోడ్ ఒక కారణమైతే.. ధరణి వెబ్‌సైట్ పుణ్యమా అని రోజుకో ఆంక్షతో రికార్డుల అప్‌డేషన్ ముందుకు సాగడంలేదు. మరోవైపు వివాదాస్పద/అభ్యంతరకర భూముల జాబితా(పార్ట్–బీ)లో చేర్చిన భూముల విషయంలో ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టమైన మార్గదర్శకాలు వెలువరించకపోవడంతో రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష అనంతరమైనా.. వీటికి మోక్షం కలుగుతుందేమో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment