
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాలనను పరుగులు పెట్టించేందుకు ఐఏఎస్ అధికారుల బదిలీలతో శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్.. కలెక్టర్ల సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 15వ తేదీతో సహకార ఎన్నికలు ముగియనున్నాయి. దీంతో ఏడాదిగా సాగుతున్న ఎన్నికల హడావుడికి తెర పడనుంది. ఈ నేపథ్యంలో పాలనపై పూర్తిస్థాయి దృష్టి పెట్టాలని భావిస్తున్న ముఖ్యమంత్రి.. కలెక్టర్ల సదస్సు నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్‌లో కలెక్టర్లతో సమావేశమై.. ప్రభుత్వ ప్రాధమ్యాలను తెలియజేయడంతోపాటు ముఖ్యమైన పథకాలు, కార్యక్రమాల అమలుపై దిశానిర్దేశం చేస్తారు.
అలాగే రెండో విడత ‘పల్లె ప్రగతి’లో సాధించిన పురోగతిని జిల్లాలవారీగా సమీక్షిస్తారు. ఇక ఈనెల 15వ తేదీ తర్వాత రాష్ట్రంలో ‘పట్టణ ప్రగతి’కార్యక్రమానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణ పారిశుద్ధ్యంతోపాటు పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్నవివిధ రకాల సమస్యలను పరిష్కరించాలని సీఎం నిర్ణయించారు. ఈ కార్యకమంలో భాగంగా చేపట్టనున్న పనులను, వాటి లక్ష్యాలను కలెక్టర్ల్లకు వివరించనున్నారు. ప్రభుత్వం ఆదివారం భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేసింది. 21 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది. వీరిలో చాలామంది తొలిసారిగా జిల్లా పగ్గాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రభుత్వ ఉద్దేశాలను తెలియజేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అలాగే, రెవెన్యూ చట్టం తీసుకురావాలని కృతనిశ్చయంతో ఉన్న సీఎం.. ఆ చట్టం ఎలా ఉండాలనే అంశంపై కలెక్టర్ల అభిప్రాయాలను అడిగి తెలుసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment