
సాక్షి, హైదరాబాద్: కొత్త రెవెన్యూ చట్టం విషయంలో సీఎం కేసీఆర్ హడావుడి నిర్ణయాలు తీసుకుని రైతులకు అన్యాయం చేయొద్దని కాంగ్రెస్ పార్టీ కోరింది. కొత్త రెవెన్యూ చట్టం తయారు చేసే ముందు అఖిలపక్ష కమిటీలో చర్చించి, అందరి అభిప్రాయాలు తెలుసుకున్నాకే ఓ నిర్ణయం తీసుకోవాలని ఏఐసీసీ కిసాన్ సెల్ వైస్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి సూచించారు. ఏఐసీసీ ఓబీసీ విభాగం వైస్‌చైర్మన్ పి.వినయ్‌కుమార్, టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌లతో కలసి మంగళవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. రైతుబంధు పథకాన్ని అమలు చేయడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ఆలోచనతో హడావుడిగా భూరికార్డుల ప్రక్షాళన చేపట్టారని, తద్వారా రాష్ట్రంలోని 30 శాతం మంది పేద రైతుల భూములకు ఇంతవరకు పట్టాలివ్వలేదని చెప్పారు. బెంజికార్లు ఉన్నవారికి, వ్యవసాయం చేయని వాళ్లకు వేల రూపాయలు బ్యాంకుల్లో వేశారని ఆరోపించారు.
భూముల సర్వే జరగకుండా రికార్డుల సవరణ ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు మళ్లీ కొత్త రెవెన్యూ చట్టం, కలెక్టర్ల పేరు మార్పు అంటూ కేసీఆర్ తన మనసుకు ఏది తోస్తే అది చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వినయ్‌కుమార్ మాట్లాడుతూ.. రెవెన్యూ వ్యవస్థ అంతా గత మూడు నెలలుగా ఎన్నికల నిర్వహణలో బిజీగా ఉందని, అలాంటప్పుడు ఎవరితో సంప్రదింపులు చేసి కొత్త రెవెన్యూ చట్టాన్ని తయారు చేస్తున్నారని ప్రశ్నించారు. గత ఐదేళ్లుగా ఈ రాష్ట్రంలోని భూములపై ప్రభుత్వ పక్షాన ఇన్‌చార్జి అయిన భూపరిపాలన ప్రధాన కమిషనర్ లేరని, ఏ పునాదులపై చట్టాలు తెస్తున్నారో కేసీఆర్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఓట్ల కోసమే పథకాలు..: దయాకర్
ఓట్ల పంట పండించుకునే పథకాల కోసం ప్రభుత్వ ఖజానాను లూటీ చేస్తున్నారని అద్దంకి దయాకర్ విమర్శించారు. అసైన్డ్‌భూముల చట్టానికి కేసీఆర్ ప్రభుత్వం చేసిన సవరణలతో పేద రైతులు, దళితులు, ఆదివాసీలు, బీసీలు నష్టపోయారని, ఆ భూములపై హక్కులు ప్రభుత్వానికి బదలాయింపు చేసుకోవడం ద్వారా వారు తమ హక్కులను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ చట్టాన్ని కూడా ఇదే తరహాలో లొసుగులతో రూపొందించారని, ఇప్పుడు తెస్తున్న కొత్త రెవెన్యూ చట్టం కూడా కేసీఆర్ ఆలోచనలకు రూపమిచ్చే విధంగా కాకుండా జాతి, ప్రజల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా ఉండాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment