తెలుగు తమ్ముళ్ల ఒత్తిళ్లు
- దీర్ఘకాలిక సెలవుపై వెళుతున్న తహశీల్దార్లు
- ఐదు మండలాలు ఖాళీ
- కుంటుపడుతున్న రెవెన్యూ వ్యవస్థ
నెల్లూరు(రెవెన్యూ): టీడీపీకి పదేళ్ల తర్వాత అధికారం రావడంతో తెలుగు తమ్ముళ్ల ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది. తాము చెప్పింది తప్పకుండా చేయాలంటూ మండల అధికారులపై ఒత్తిళ్లు చేస్తున్నారనే ఫలితంగా జిల్లాలో ముగ్గురు తహశీల్దారు దీర్ఘకాలిక సెలవులు పెట్టారు. మరొకరు అధికారపార్టీ నాయకుల ఒత్తిళ్లు తట్టుకోలేక, వారు చెప్పింది చేయలేక అంతర్ జిల్లా బదిలీ చేయించుకున్నారు. దగదర్తి తహశీల్దార్, గూడూరు డీఏఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అధికారపార్టీ ఎమ్మెల్యే చెప్పినట్లు కలువాయి తహశీల్దార్ పనులు చేయలేదు.
దీంతో ఆగ్రహించిన ఆ ఎమ్మెల్యే తహశీల్దార్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయలేక తహశీల్దార్ దీర్ఘకాలిక సెలవుపెట్టి వెళ్లిపోయారు. దుత్తలూరు, సైదాపురం తహశీల్దార్ల పరిస్థితీ అంతే. అధికారపార్టీ నాయకులు చెప్పి దానికి తల ఊపలేక దీర్ఘకాలిక సెలవుపెట్టి వెళ్లారు. చిల్లకూరు తహశీల్దార్ రాజకీయ ఒత్తిళ్లకు తట్టుకోలేక అంతర జిల్లా బదిలీ చేయించుకున్నారు. ఫలితంగా రెవెన్యూ వ్యవస్థ కుంటుపడుతోంది. తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయింది. జిల్లాలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఏడుగురు, టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. మండల కార్యాలయాల్లో అధికారపార్టీ నాయకుల మాటచెల్లుబాటు అవుతోంది.
అధికారపార్టీ నాయకులకే అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. భూ వ్యవహారాలు, పింఛన్లు, రేషన్ కార్డులు, నీరు-చెట్టు పనులు అధికారపార్టీ నాయకుల కనుసన్నల్లో సాగుతున్నాయి. పథకాలకు సంబంధించి లబ్ధిదారలను అధికారులు ఎంపిక చేయాల్సి ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జన్మభూమి కమిటీలను ఎంపిక చేసింది. తెలుగుదేశంపార్టీ నాయకులు, కార్యకర్తలు జన్మభూమి కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు. టీడీపీ అధికారంలోకి రావడంతోనే రేషన్ కార్డులు, పింఛన్లు పరిశీలన చేపట్టింది. జన్మభూమి కమిటీ సభ్యులు పరిశీలించి అనుమతి ఇస్తే లబ్ధిదారులకు కార్డులు, పింఛన్లు కొనసాగించారు. టీడీపీకి ఓట్లు వేయని వారి రేషన్‌కార్డులు, పింఛన్లు తొలగించారు.
పథకాలకు అర్హులని అధికారులు చెబుతున్నా తాము చెప్పిన విధంగా చేయండంటూ అధికారులపై ఒత్తిడి చేశారు. జన్మభూమి కమిటీలతోనే జిల్లాలో వేలాది మంది రేషన్‌కార్డులు, పింఛన్లు కోల్పోయారు. తాము సూచించిన వారికే పథకాలకు ఎంపిక చేయమని అధికారపార్టీ నాయకుల ఒత్తిళ్లు అధికంగా ఉన్నాయి. మీరు సూచించిన వారిని ఎంపిక చేస్తాం ఎదురుగా ఉన్న వ్యక్తి అన్ని విధాలా అర్హుడని అతడ్ని ఎంపిక చేస్తామని అధికారులు చెబుతున్నా దానికి నాయకులు ఒప్పుకోవడంలేదనే విమర్శలున్నాయి.
ఇటువంటి సంఘటనలు జిల్లాలో అనేకం జరిగాయి. నాయకులు చెప్పిన విధంగా నడుచుకోలేక సెలవులు పెట్టి వెళ్లిపోతున్నారు. తహశీల్దార్లపై పని ఒత్తిడి అధికంగా ఉంది. అనేక మండలాల్లో తహశీల్దార్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా రికార్డుల నిర్వహణ, పథకాల అమలు తదితర విషయాలు కుంటుపడుతున్నాయి. ప్రజల నుంచి వచ్చిన అర్జీలు నెలల తరబడి పరిష్కారానికి నోచుకోకుండా ఎదురు చూస్తున్నాయి. వివిధ పనుల నిమిత్తం తహశీల్దార్ కార్యాలయాలకు వచ్చే ప్రజలు పడిగాపులు కాయాల్సి వస్తుంది. అడహక్ పద్దతిలో తహశీల్దార్ పోస్టులను భర్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఖాళీలను భర్తీ చేసేలా చర్యలు
చేపడతాం :
-ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్
జిల్లాలో ఖాళీగా ఉన్న తహశీల్దార్ పోస్టులను గుర్తిస్తాం. ఖాళీగా ఉన్న మండలాల్లో తహశీల్దార్లను నియమించేలా చర్యలు తీసుకుంటాం. వ్యక్తిగత కారణాలతో తహశీల్దార్లు సెలవులు పెడుతున్నారు.