tasildar
-
విశాఖలో తహసీల్దార్ దారుణ హత్య..
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగుడు అర్ధరాత్రి తహసీల్దార్‌పై దాడి చేయడంతో ఆయన మృతిచెందాడు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల ప్రకారం.. కొమ్మాదిలోని చరణ్ క్యాస్టల్ అపార్ట్మెంట్లో తహసీల్దార్ రమణయ్య నివాసం ఉంటున్నారు. కాగా, శుక్రవారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చాడు. ఈ క్రమంలో అపార్ట్మెంట్ వద్దనే ఉన్న రమణయ్యతో సదరు వ్యక్తి వాగ్వాదానికి దిగాడు. అనంతరం, తన వెంట తెచ్చుకున్న ఐరన్ రాడ్‌తో రమణయ్యపై దాడి చేశాడు. దీంతో, తలకు తీవ్ర గాయాలు కావడంతో కుప్పకూలారు. అది గమనించిన అపార్ట్‌మెంట్‌వాసులు దుండగుడిని పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ తప్పించుకున్నాడు. రమణయ్యను వెంటనే స్థానికంగా ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన మృతిచెందాడు. ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితం వరకు రమణయ్య విశాఖ రూరల్ తహశీల్దార్‌గా పనిచేశారు. రమణయ్య విధుల్లో చాలా నిజాయితీగా ఉండేవారని తోటి అనుచరులు చెబుతున్నారు. ఇక, ఈ హత్య కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. సిటీ పోలీసు కమిషనర్ రవిశంకర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, రమణయ్య హత్య కేసుకు సంబంధించి నలుగురు అనుమానితులను విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీసీపీ మణికంఠ ఆధ్వర్యంలో నిందితుడి కోసం 12 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. రమణయ్యపై ఇనుప రాడ్‌తో దాడి చేసిన వ్యక్తి కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. -
నాయబ్.. సీనియారిటీ గాయబ్!
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల విభజనలో భాగంగా రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న నాయబ్ (డిప్యూటీ) తహసీల్దార్లకు అన్యాయం జరుగుతోందనే వాదన వినిపిస్తోంది. ఉద్యోగాల్లో నేరుగా భర్తీ అయిన (డైరెక్ట్ రిక్రూట్మెంట్) ఈ నాయబ్ తహసీల్దార్ల సీనియారిటీని పరిగణనలోకి తీసుకునే విషయంలో భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయ వర్గాలు గందరగోళంగా వ్యవహరిస్తున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయి. వాస్తవానికి, రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహసీల్దార్లుగా పనిచేస్తున్న వారిలో 70 శాతం మంది పదోన్నతిపై వచ్చినవారు కాగా, 30 శాతం మంది నేరుగా భర్తీ అయినవారు ఉంటారు. ఇందులో పదోన్నతుల ద్వారా నాయబ్ తహసీల్దార్లుగా పనిచేస్తున్న వారి సీనియారిటీ సాధారణంగానే ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో జోనల్ స్థాయి అయిన ఈ పోస్టుకు సీనియారిటీ జాబితాలు తయారు చేసేందుకు కొత్త జోనల్ విధానంలో కాకుండా పాత జోన్ పరిధిలోకి వచ్చే అన్ని ఉమ్మడి జిల్లాల నుంచి సీనియారిటీని లెక్కగడుతున్నారని డైరెక్ట్ రిక్రూటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఇటీవల వారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలసి ఫిర్యాదు కూడా చేశారు. కానీ, సీసీఎల్ఏ వర్గాలు మాత్రం తాము అనుకున్న పద్ధతిలోనే వెళుతున్నాయని రెవెన్యూ సంఘాల నేతలంటున్నారు. అలా చేయడం ద్వారా పాత జోన్లవారీగా అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాలు, ఇతర ముఖ్య పట్టణాల ప్రాంతాల్లోకి ప్రమోటీ నాయబ్ తహసీల్దార్లు వెళితే, మారుమూల ప్రాంతాలు, చిన్న జిల్లాలకు డైరెక్ట్ రిక్రూటీలు వెళ్లాల్సి ఉంటుందని అంటున్నారు. కొత్త జోన్ల ప్రకారం సీనియారిటీ జాబితా తయారు చేస్తే కొన్ని జిల్లాల్లో అయినా డైరెక్ట్ రిక్రూటీలు మంచి ప్రాంతాల్లో పోస్టింగులు పొందే అవకాశం ఉంటుందని, లేదంటే సర్వీసు పూర్తిగా మారుమూల ప్రాంతాలకే పరిమితం అవుతుందని అంటున్నారు. ఇదిలా ఉంటే సీనియర్ అసిస్టెంట్లు, తహసీల్దార్లు, డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల సీనియారిటీ జాబితాలను సీసీఎల్ఏ సిద్ధం చేస్తుండగా, సీనియర్ అసిస్టెంట్ కంటే కింది కేడర్ జాబితాలను ఆయా జిల్లాల కలెక్టర్లు, డీఆర్వోలు తయారు చేస్తున్నారు. అయితే, ఏ స్థాయిలోనూ వీరి సీనియారిటీ జాబితాలను ప్రదర్శించడం లేదని, కనీసం ఏదైనా అభ్యంతరం తెలిపేందుకు, సూచన చేసేందుకు కూడా అవకాశం లేకుండా పోతోందని రెవెన్యూ సంఘాలంటున్నాయి. ఇదే విషయమై ఉన్నతాధికారులను అడిగితే ఇప్పుడు వారి అభ్యంతరాలు, సూచనలు తీసుకోవాలంటే ప్రభుత్వం తమకిచ్చిన గడువు సరిపోదని, వీలున్నంత పారదర్శకంగా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని వివిధ స్థాయిల్లో సీనియారిటీ జాబితాలు సిద్ధం చేస్తున్నామని చెపుతున్నారు. వీఆర్వో.. నోఆప్షన్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో)గా పనిచేస్తున్న 5,500 మంది ఉద్యోగుల ఆప్షన్లను ప్రభుత్వం స్వీకరించడం లేదు. ఇప్పటికే ఈ వ్యవస్థను రద్దు చేస్తున్నట్టు ప్రకటించి 14 నెలలు దాటినా ఇంతవరకు వారి జాబ్‌చార్టును ప్రభుత్వం ఖరారు చేయలేదు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి వారి నుంచి ఆప్షన్ల స్వీకరణను నిలిపివేసినట్టు తెలుస్తోంది. అన్ని శాఖల్లో విభజన పూర్తయిన తర్వాత ఏర్పడే ఖాళీలు, ఆయా శాఖల్లోని అవసరాల ఆధారంగా వీఆర్వోలను సర్దుబాటు చేసి ఆ తర్వాత లోకల్ కేడర్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, తమ నుంచి ఆప్షన్లు స్వీకరించకపోవడం, స్కేల్ ఉద్యోగులందరితో సమానంగా తమను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడం సరైంది కాదని, దీనిపై తాము కోర్టుకు వెళతామని వీఆర్వోల సంఘాలు చెపుతున్నాయి. -
140 ఎకరాల భూమిపై ధర్మారెడ్డి కన్ను
సాక్షి, హైదరాబాద్: కీసర నాగరాజు కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. రూ.కోటీ పది లక్షల లంచం తీసుకుంటూ దొరకడం జాతీయస్థాయిలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు స్థానికులు, రియల్టర్లతో కలిసి చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలికితీస్తున్నారు. కీసర తహసీల్దార్‌గా ఉన్న సమయంలో నాగరాజు రాంపల్లికి చెందిన కందాడి ధర్మారెడ్డి పేరిట, తన స్నేహితులు, బంధువుల పేరిట రెండెకరాలకుపైగా భూమిని దక్కించుకున్నాడు. ఈ భూములతోపాటు మొత్తం 24 ఎకరాల భూములకు నకిలీపత్రాల సాయంతో పాసుబుక్కులు జారీ చేసిన నాగరాజును రెండోసారి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు మొదలుపెట్టిన ఏసీబీకి నాగరాజు అక్రమాలకు సంబంధించిన అనేక ఆధారాలు లభిస్తున్నాయని తెలిసింది. అనేక భూ సెటిల్మెంట్లు.. స్థానికంగా పలుకుబడి కలిగిన కందాడి ధర్మారెడ్డితో కలిసి నాగరాజు అనేక భూ సెటిల్మెంట్లు చేసినట్లు ఏసీబీ గుర్తించింది. గ్రామపరిధిలో ఉన్న 140 ఎకరాలను ధర్మారెడ్డి కాజేద్దామని ప్రయత్నించిన సమయంలోనూ నాగరాజు సహాయసహకారాలు అందించినట్లు సమాచారం. సర్వే నంబరు 621, 639లలో 140 ఎకరాల వివాదాస్పద భూమి ఉంది. దీనిపై కన్నేసిన ధర్మారెడ్డి దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని 24 ఏళ్ల నుంచి ప్రయత్నాలు చేస్తున్నాడు. 1996లో ఆ భూమి తనదే అంటూ ప్రొటెక్ట్ టెనెంట్ (పీటీ) పత్రాలను సృష్టించాడు. దీనిపై సుమారు 20 మంది స్థానికులు అభ్యంతరం తెలిపారు. 1958లో తాము కిషన్‌సేఠ్ అనే వ్యక్తి వద్ద భూమిని కొనుగోలు చేశానంటూ నకిలీపత్రాలను అప్పటి ఎమ్మార్వోకు సమర్పించారు. అయితే, అప్పుడు తన పాచిక పారలేదు. కీసరకు నాగరాజు తహసీల్దార్‌గా రాగానే మళ్లీ పైరవీ మొదలుపెట్టాడు. ఈ మేరకు ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఈ విషయాలన్నీ ప్రస్తుత ఏసీబీ దర్యాప్తులో వెలుగు చూస్తున్నాయని తెలిసింది. ఇటీవల 24 ఎకరాలకు అక్రమంగా పాసుబుక్కులు జారీ చేయడంపైన స్థానికులు ఫిర్యాదు చేయడంతో నాగరాజు, ధర్మారెడ్డితోపాటు అతని కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ వెంకటేశ్, రియల్టర్లు వెంకటేశ్వర్రావు, జగదీశ్వరరావు, భాస్కర్‌రావులను ఏసీబీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ 24 ఎకరాల భూమి విలువ రూ.48 కోట్లకుపైనే ఉంటుందని ఏసీబీ వర్గాలు పేర్కొన్నాయి. ఆగస్టు 14న పట్టుబడిన సమయంలోనూ దాదాపు 53 ఎకరాలను హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. -
కీసర నాగరాజా మజాకా!
సాక్షి, హైదరాబాద్: రూ.కోటి పది లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజుపై ఏసీబీ మరో కేసు నమోదు చేసింది. కోట్లాది రూపాయల ప్రభుత్వ భూములను కె.ధర్మారెడ్డి అతని మనుషులకు అక్రమంగా ధారాదత్తం చేశాడన్న ఆరోపణలపై ఇటీవల విజిలెన్స్ విభాగం నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా నాగరాజుపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఏసీబీ డీజీని ఆదేశించింది. దీంతో ఏసీబీ అధికారులు కుట్ర, అధికారదుర్వినిæయోగం ఆరోపణల కింద శుక్రవారం నాగరాజుతోపాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని రాంపల్లి గ్రామపరిధిలో సర్వేనం 621లో కందాడి లక్ష్మమ్మ పేరిట 14 గుంటలు, సర్వే నం.623లో కందాడి బుచ్చిరెడ్డికి 33 గుంటలు, సర్వే నం.625లో కందాడి మీనమ్మ పేరిట 19 గుంటలు, సర్వే నం 633/ఏలో కందాడి ధర్మారెడ్డి పేరిట ఎకరం రెండు గుంటలకు జూలై 9వ తేదీన అప్పటి తహసీల్దార్‌గా ఉన్న నాగరాజు నిబంధనలకు విరుద్ధంగా డిజిటల్ సైన్లతో పాసుబుక్కులు జారీ చేశాడు. నాగరాజు మరికొందరితో కలిసి మొత్తంగా 24 ఎకరాల 16 గుంటల భూములకు నకిలీ పత్రాలు సృష్టించి, రికార్డులు తారుమారు చేసి ఈ నేరానికి పాల్పడ్డాడని విచారణలో తేలింది. ఈ విషయం కీసర ఆర్డీవో వద్ద ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నా అతనిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం.. ఈ భూముల ధర రూ.2.68 కోట్లు కాగా, బహిరంగ మార్కెట్లో విలువ రూ.48.8 కోట్లుగా ఉంటుందని ఏసీబీ అంచనా వేస్తోంది. -
తెలుగు తమ్ముళ్ల ఒత్తిళ్లు
- దీర్ఘకాలిక సెలవుపై వెళుతున్న తహశీల్దార్లు - ఐదు మండలాలు ఖాళీ - కుంటుపడుతున్న రెవెన్యూ వ్యవస్థ నెల్లూరు(రెవెన్యూ): టీడీపీకి పదేళ్ల తర్వాత అధికారం రావడంతో తెలుగు తమ్ముళ్ల ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది. తాము చెప్పింది తప్పకుండా చేయాలంటూ మండల అధికారులపై ఒత్తిళ్లు చేస్తున్నారనే ఫలితంగా జిల్లాలో ముగ్గురు తహశీల్దారు దీర్ఘకాలిక సెలవులు పెట్టారు. మరొకరు అధికారపార్టీ నాయకుల ఒత్తిళ్లు తట్టుకోలేక, వారు చెప్పింది చేయలేక అంతర్ జిల్లా బదిలీ చేయించుకున్నారు. దగదర్తి తహశీల్దార్, గూడూరు డీఏఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అధికారపార్టీ ఎమ్మెల్యే చెప్పినట్లు కలువాయి తహశీల్దార్ పనులు చేయలేదు. దీంతో ఆగ్రహించిన ఆ ఎమ్మెల్యే తహశీల్దార్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయలేక తహశీల్దార్ దీర్ఘకాలిక సెలవుపెట్టి వెళ్లిపోయారు. దుత్తలూరు, సైదాపురం తహశీల్దార్ల పరిస్థితీ అంతే. అధికారపార్టీ నాయకులు చెప్పి దానికి తల ఊపలేక దీర్ఘకాలిక సెలవుపెట్టి వెళ్లారు. చిల్లకూరు తహశీల్దార్ రాజకీయ ఒత్తిళ్లకు తట్టుకోలేక అంతర జిల్లా బదిలీ చేయించుకున్నారు. ఫలితంగా రెవెన్యూ వ్యవస్థ కుంటుపడుతోంది. తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయింది. జిల్లాలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఏడుగురు, టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. మండల కార్యాలయాల్లో అధికారపార్టీ నాయకుల మాటచెల్లుబాటు అవుతోంది. అధికారపార్టీ నాయకులకే అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. భూ వ్యవహారాలు, పింఛన్లు, రేషన్ కార్డులు, నీరు-చెట్టు పనులు అధికారపార్టీ నాయకుల కనుసన్నల్లో సాగుతున్నాయి. పథకాలకు సంబంధించి లబ్ధిదారలను అధికారులు ఎంపిక చేయాల్సి ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జన్మభూమి కమిటీలను ఎంపిక చేసింది. తెలుగుదేశంపార్టీ నాయకులు, కార్యకర్తలు జన్మభూమి కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు. టీడీపీ అధికారంలోకి రావడంతోనే రేషన్ కార్డులు, పింఛన్లు పరిశీలన చేపట్టింది. జన్మభూమి కమిటీ సభ్యులు పరిశీలించి అనుమతి ఇస్తే లబ్ధిదారులకు కార్డులు, పింఛన్లు కొనసాగించారు. టీడీపీకి ఓట్లు వేయని వారి రేషన్‌కార్డులు, పింఛన్లు తొలగించారు. పథకాలకు అర్హులని అధికారులు చెబుతున్నా తాము చెప్పిన విధంగా చేయండంటూ అధికారులపై ఒత్తిడి చేశారు. జన్మభూమి కమిటీలతోనే జిల్లాలో వేలాది మంది రేషన్‌కార్డులు, పింఛన్లు కోల్పోయారు. తాము సూచించిన వారికే పథకాలకు ఎంపిక చేయమని అధికారపార్టీ నాయకుల ఒత్తిళ్లు అధికంగా ఉన్నాయి. మీరు సూచించిన వారిని ఎంపిక చేస్తాం ఎదురుగా ఉన్న వ్యక్తి అన్ని విధాలా అర్హుడని అతడ్ని ఎంపిక చేస్తామని అధికారులు చెబుతున్నా దానికి నాయకులు ఒప్పుకోవడంలేదనే విమర్శలున్నాయి. ఇటువంటి సంఘటనలు జిల్లాలో అనేకం జరిగాయి. నాయకులు చెప్పిన విధంగా నడుచుకోలేక సెలవులు పెట్టి వెళ్లిపోతున్నారు. తహశీల్దార్లపై పని ఒత్తిడి అధికంగా ఉంది. అనేక మండలాల్లో తహశీల్దార్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా రికార్డుల నిర్వహణ, పథకాల అమలు తదితర విషయాలు కుంటుపడుతున్నాయి. ప్రజల నుంచి వచ్చిన అర్జీలు నెలల తరబడి పరిష్కారానికి నోచుకోకుండా ఎదురు చూస్తున్నాయి. వివిధ పనుల నిమిత్తం తహశీల్దార్ కార్యాలయాలకు వచ్చే ప్రజలు పడిగాపులు కాయాల్సి వస్తుంది. అడహక్ పద్దతిలో తహశీల్దార్ పోస్టులను భర్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఖాళీలను భర్తీ చేసేలా చర్యలు చేపడతాం : -ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ జిల్లాలో ఖాళీగా ఉన్న తహశీల్దార్ పోస్టులను గుర్తిస్తాం. ఖాళీగా ఉన్న మండలాల్లో తహశీల్దార్లను నియమించేలా చర్యలు తీసుకుంటాం. వ్యక్తిగత కారణాలతో తహశీల్దార్లు సెలవులు పెడుతున్నారు.