శంషాబాద్: ప్రభుత్వ హౌసింగ్ బోర్డు అనుబంధ సంస్థగా ఉన్న దిల్ (దక్కన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్) భూములు అక్రమార్కులకు వరంగా మారుతున్నాయి. సర్కారు సీలింగ్ భూములను తీసుకున్న సదరు సంస్థ వాటిని గాలికొదిలేయడంతో క్రషర్, మట్టి మాఫియాతో పాటు కాలుష్యకారక డాంబర్ దందాలతో జంటజలాశయాల్లో ఒకటైన హిమాయత్‌సాగర్‌కే ముప్పు తీసుకొస్తున్నారు.
శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడలో సర్వేనంబర్లు 56, 57, 58, 59, 60, 61, 62, 63, 66, 69, 70, 71, 72, 73, 74, 76, 77, 78 లలో సుమారు 250 ఎకరాల సీలింగ్ భూములను 8 ఏళ్ల కిందట హౌసింగ్‌బోర్డు అనుబంధ సంస్థ దిల్‌కు అప్పగించింది. దిల్ ఆధీనంలోనున్న ఈ భూముల్లో ఏడాదిన్నర కిందటి వరకు సుమారు ఇరవైకి పైగా క్రషర్ యంత్రాలు నడిచేవి. వీటితో పాటు అనుమతులు లేకుండానే భారీ ఎత్తున పేలుడుపదార్థాలతో బ్లాస్టింగ్ కొనసాగించేవారు.
పర్యావరణానికి హానికరంగా మారడంతో పాటు హిమాయత్‌సాగర్‌కు కలుగుతున్న ముప్పుపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఎట్టకేలకు అవి మూతపడ్డాయి. అయితే ఇది కొంతకాలం మాత్రమే. స్థానికంగా దిల్ భూముల్లో ప్రస్తుతం అక్రమ మట్టితవ్వకాలతో పాటు డాంబర్ ప్లాంట్లు, కొన్ని క్రషర్‌లు కూడా కొనసాగుతున్నాయి. అక్రమ దందాను నియంత్రించడానికి రెవిన్యూ యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలు కూడా విఫలమవుతున్నాయి. భూములు దిల్ సంస్థ ఆధీనంలో ఉండడంతో వాటిపై కేసులు నమోదు చేయలేని పరిస్థితిని రెవిన్యూ అధికారులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌కు నివేదించడానికి కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం.
చెంతనే...
ప్రస్తుతం కొత్వాల్‌గూడ పరిధిలో ఓ క్రషర్ యూనిట్ సాగర్‌కు అత్యంత చేరువలోనే భారీ ఎత్తున కొనసాగుతోంది. అయినా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. గతంలో మాదిరిగా కొండలను బ్లాస్టింగ్ చేయడం లేదనే వాదనలు వినిపిస్తున్నా ఇంత పెద్ద మొత్తం రాళ్లను రవాణా చేయడం కూడా ఔటర్ రింగురోడ్డుపై ప్రమాదకరంగా మారుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అక్రమాలను ఆపుతూనే ఉన్నాం: వెంకట్‌రెడ్డి, శంషాబాద్ తహసీల్దార్
దిల్ భూముల్లో ఇప్పటివరకు జరుగుతున్న క్రషర్, మట్టి తవ్వకాలను అడ్డుకుంటున్నాం. అయినప్పటికీ పూర్తి స్థాయిలో నియంత్రించలేకపోతున్నాం. ఈ విషయాన్ని ఉన్నతస్థాయి అధికారులకు కూడా నివేదించనున్నాం. దిల్ సంస్థ పరిధిలో అక్రమార్కులపై ఫిర్యాదులు చేయాల్సి ఉంటుంది.
‘దిల్’ భూములు గాలికి..
Published Thu, Oct 2 2014 11:30 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement
Advertisement