నెలలోగా వెబ్‌ల్యాండ్ రికార్డులు అప్‌డేట్
రెవెన్యూ అధికారుల వీడియో కాన్ఫరెన్స్‌లో సీసీఎల్‌ఏ రేమండ్ పీటర్
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ వ్యవస్థకు రికార్డులే పునాదులని, అవి బాగుంటేనే వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని భూపరిపాలన ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్ అన్నారు. ఇటీవల కొత్తగా ప్రవేశపెట్టిన మాభూమి పోర్టల్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, అయితే.. ఆన్‌లైన్‌లో ఉంచిన రికార్డుల్లో దొర్లిన తప్పులపై ఫిర్యాదులు కూడా వస్తున్నాయన్నారు. పోర్టల్‌లో ఉన్న వెబ్‌ల్యాండ్ రికార్డులన్నింటినీ నెలరోజుల్లో అప్‌డేట్ చేయాలని గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పనిచేసే గ్రామ రెవెన్యూ అధికారు(వీఆర్వో)లకు ట్యాబ్‌లెట్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్(ఆర్‌ఐ)లకు ల్యాప్‌ట్యాప్‌లను త్వరలోనే అందజేయనున్నట్లు పీటర్ తెలిపారు. మాభూమి పోర్టల్‌లోని గ్రామ పహాణీలను డౌన్‌లోడ్ చేసి తనిఖీ నిమిత్తం సంబంధిత వీఆర్వోలకు అందజేయాలని, రెండువారాల్లోగా వాటిని అప్‌డేట్ చేసేవిధంగా చర్యలు చేపట్టాలని తహసీల్దార్లను ఆదేశించారు. రెవెన్యూ డివిజన్‌స్థాయిలో ఆర్డీవోలు, జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్లు రికార్డుల అప్‌డేషన్‌పై ప్రతివారం సమీక్షలు నిర్వహించాలని సూచించారు.
జిల్లాకు 200 వీఆర్వో కార్యాలయాలు
రెవెన్యూ వ ్యవస్థను మరింత పటిష్టం చేయడంలో భాగంగా ఈ ఏడాది జిల్లాకు 200 చొప్పున 9 జిల్లాల్లో మొత్తం 1,800 గ్రామ రెవెన్యూ, అవసరమైనచోట మండల రెవెన్యూ కార్యాలయాలకు సొంత భవనాలను సమకూర్చనున్నట్లు సీసీఎల్‌ఏ రేమండ్ పీటర్ తె లిపారు. రెవెన్యూ వ ్యవస్థను పూర్తిస్థాయిలో కంప్యూటరీకరణ చేయనున్నామని, వీఆర్వోలు, ఆర్‌ఐలకు జిల్లా కేంద్రాల్లోనే క ంప్యూటర్ శిక్షణ ఇప్పించనున్నామని చెప్పారు. నెలాఖరు కల్లా అర్హులైన డిప్యూటీ తహసీల్దార్లకు పదోన్నతులు కల్పిస్తున్నామని, ఖాళీగా ఉన్న వీఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని వెల్లడించారు. రెవెన్యూ రికార్డుల నిర్వహణ, ఆన్‌లైన్ విధానాలపై దశలవారీగా డీటీలకు, తహసీల్దార్లకు ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో శిక్షణ ఇప్పించనున్నట్లు తెలిపారు.
అపోహను పోగొడదాం...
భూములకు సంబంధించి రికార్డుల్లో సరైన సమాచారం లేకపోవడం, మ్యుటేషన్లలో నెలకొన్న గందరగోళంతో ప్రజల్లో రెవెన్యూ వ్యవస్థపట్ల అపోహ ఉందని సీసీఎల్‌ఏ అన్నారు. రికార్డుల్లో తాము రాసిచ్చిన దానికి ఆన్‌లైన్‌లో డేటాఎంట్రీకి వ్యత్యాసం ఉంటోందని వీఆర్వోల సంఘాలు చెబుతున్నాయన్నారు. మాభూమి పోర్టల్‌లో లభ్యమౌతున్న సదుపాయాలను ప్రజలకు వివరించి నేరుగా పోర్టల్‌ను సందర్శించి వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సీసీఎల్‌ఏ కార్యదర్శి రవీంద్రబాబు, డిప్యూటీ కలెక్టర్ సత్యశారద, ఎన్‌ఐసీ ప్రతినిధి మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.