ప్రతిష్ట మీకు.. అప్రతిష్ట మాకా..?
♦ ‘డబుల్ బెడ్రూం’ పథకం బాధ్యతలు వద్దంటున్న తహసీల్దార్లు
♦ అవకతవకలకు బాధ్యులుగా చేస్తామనడంపై తీవ్ర అసంతృప్తి
♦ టీజీటీఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కీలక అంశాలపై తీర్మానాలు
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు పడక గదుల ఇళ్ల పథకంలో అవతవకలు జరిగితే తహసీల్దార్లను బాధ్యులను చేస్తామంటూ కొందరు మంత్రులు చేస్తున్న ప్రకటనల పట్ల తెలంగాణ తహసీల్దార్ల సంఘం (టీజీటీఏ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇళ్లను మంజూరు చేసే అధికారం ఎమ్మెల్యేలు, మంత్రులకే అప్పగించడంతో... వారు చెప్పిన పేర్లనే లబ్ధిదారుల జాబితాలో చేర్చాలంటూ ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేస్తున్నారని పేర్కొంది. ఆదివారం టీజీటీఏ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ భేటీలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఈ విషయంగా తమ అసంత ృప్తిని వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో నిరుపేద ల గుర్తింపుపై ఇప్పటికే సర్వే చేసిన గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) వద్ద పూర్తి సమాచారం ఉండగా... అర్హుల ఎంపిక బాధ్యతను మళ్లీ తహసీల్దార్లకు అప్పగించడమేమిటని కొందరు తహసీల్దార్లు ప్రశ్నించారు. ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేసే అధికారాన్ని ఎమ్మెల్యేలకు, మంత్రులకు 50:50 నిష్పత్తిలో అప్పగించడంతో... అర్హతతో నిమిత్తం లేకుండా వారు చెప్పిన పేర్లనే లబ్ధిదారుల జాబితాలో చేర్చాలంటూ ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. తహసీల్దార్లను రెవెన్యూ అంశాలకే పరిమితం చేయాలని, అభివృద్ధి పనులను ఎంపీడీవోలకు అప్పగించాలని సూచించారు.
సమగ్ర కుటుంబ సర్వే, ఆసరా పెన్షన్లు, రేషన్ కార్డులు, ఎన్నికల ఆధార్ సీడింగ్, భూముల క్రమబద్ధీకరణ పథకం, ప్రోటోకాల్ తదితర కార్యక్రమాలకు సంబంధించిన ఖర్చుల నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తహసీల్దార్లు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పథకాల అమలు కోసం అలుపెరగకుండా పనిచేస్తున్న రెవెన్యూ వ్యవస్థపై వస్తున్న అవినీతి ఆరోపణలను ఖండించాలని.. తహసీల్దార్లకు ఇళ్ల స్థలాల కోసం హౌసింగ్ సొసైటీ ఏర్పాటు తదితర అంశాలపై చేసిన తీర్మానాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.
ఇక సమావేశంలో అద్దె వాహనాలకు చార్జీల అలవెన్స్ పెంపు, పదోన్నతుల అంశాలపై చర్చించారు. ప్రధానమంత్రి విజ్ఞాపన మేరకు వంట గ్యాస్ సబ్సిడీని వదులుకునేందుకు సభ్యులంతా అంగీకారం తెలిపినట్లు టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి ప్రకటించారు. ఈ సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి నరేందర్, కోశాధికారి చంద్రకళ, అసోసియేట్ అధ్యక్షుడు గోపీరామ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు వంశీమోహన్, కోశాధికారి సుజాత, ఇతర జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.