- ఒక్కో డబుల్ బెడ్రూం ఇంటికి మూడున్నర లక్షల వ్యయం
- గృహ నిర్మాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో 10 లక్షల పేద కుటుంబాలకు పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వనున్నట్టు గృహ నిర్మాణ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు. ఏడాదికి రెండు లక్షల చొప్పున ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేయనున్నట్టు తెలిపారు. ఎన్నికల హామీలో పేర్కొన్నట్టుగా ప్రతి ఇంటికి మూడున్నర లక్షలు వెచ్చిస్తామన్నారు. సోమవారం ఆయన గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. రెండు పడక ఇల్లు విస్తీర్ణం ఎంత ఉండాలనే విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. 550 చదరపు అడుగుల ఇంటి నిర్మాణానికి రూ. 4.86 లక్షలు, 490 చదరపు అడుగులైతే రూ. 4.60 ల క్షల చొప్పున ఖర్చవుతుందని తేల్చినట్లు వివరించారు. ప్రభుత్వం ఇచ్చే రూ. 3.50 లక్షలు పోను లబ్ధిదారులు కొంత భరించాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. వచ్చే నెలలో ఈ పథకానికి శ్రీకారం చుడతామన్నారు.
సీఎం గతంలో హామీ ఇచ్చినట్టుగా నిజామాబాద్ జిల్లాలో ముందుగా ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టనున్నట్లు తెలిపారు. ఎకరం స్థలంలో 20 ఇళ్ల నిర్మాణానికి అవకాశం ఉంటుందని, స్థలాలు అందుబాటులో ఉన్న ప్రాంతాలకు తొలి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. స్థలాలు అందుబాటులో లేనిచోట భూ సేకరణ జరిపి ఇళ్లు కట్టిస్తామన్నారు.
అలాగే మౌలిక వసతుల కల్పనకు సగటున ఒక్కో ఇంటికి రూ. లక్ష వరకు ఖర్చవుతుందని లెక్క తేల్చినట్టు వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల అవకతవకలపై సీఐడీ నివేదిక అందిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఖాళీగా ఉన్న స్వగృహ ఇళ్లను ఉద్యోగులకు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నామని, ధర విషయంలో ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.