సాక్షి, అమరావతి: భూముల రీ సర్వే జరుగుతున్న క్రమంలో క్లిష్టతరమైన అంశాలు కూడా తేలిగ్గా పరిష్కారమవుతున్నాయి. రెవెన్యూ వ్యవస్థలో తమ భూములకు సంబంధించి మ్యుటేషన్లు, సబ్ డివిజన్లు చేయించుకోవడం ఎంత కష్టమైన వ్యవహారమో అందరికీ తెలిసిందే. వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ పనుల్ని చాలా సులభతరంగా మార్చింది. రీ సర్వేలో రైతులు అడగకుండానే అవసరమైతే మ్యుటేషన్, సబ్ డివిజన్ చేస్తున్నారు.
అలా ఇప్పటివరకు రెండేళ్లలో లక్షల సంఖ్యలో మ్యుటేషన్లు, సబ్ డివిజన్లు జరిగాయి. ప్రస్తుతం రెండోదశగా రెండువేల గ్రామాల్లో రీ సర్వే జరుగుతున్న క్రమంలో 2.69 లక్షల మ్యుటేషన్లు, 4.4 లక్షల సబ్ డివిజన్లు చేశారు. తొలిదశ రీ సర్వే పూర్తయిన రెండువేల గ్రామాల్లో గతంలోనే రెండులక్షల మ్యుటేషన్లు, 4.3 లక్షల సబ్ డివిజన్లు చేశారు. మొత్తం ఈ నాలుగువేల గ్రామాల్లో ఇప్పటివరకు 4.69 లక్షల మ్యుటేషన్లు, 8.7 లక్షల సబ్ డివిజన్లు చేయడం గమనార్హం.
అదే రైతులు చేయించుకుంటే రూ.80 కోట్లు కట్టాలి
మామూలుగా అయితే పట్టా సబ్ డివిజ న్, మ్యుటేషన్ కోసం రైతులు దరఖాస్తు చేసుకుని ఫీజు కట్టాలి. సబ్ డివిజన్‌కి రూ.600, మ్యుటేషన్‌కి రూ.100 చెల్లించాలి. దానికి గతంలో ఎక్కువ సమయం పట్టేది. దాంతోపాటు అనేక సమస్యలు. తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సివచ్చేది. మధ్యలో లంచావతారులు. ఇప్పుడు రీ సర్వేలో ఇవేమీ లేకుండానే ప్రభుత్వం రైతుల భూమిని కొలిచి వారికి యాజమాన్య హక్కు పత్రాలు ఇవ్వడం, డిజిటల్ రికార్డులు రూపొందించడంతోపాటు అవసరమైతే సొంత ఖర్చులతో మ్యుటేషన్, సబ్ డివిజన్లు కూడా చేసేస్తోంది.
నాలుగువేల గ్రామాల్లో చేసిన మ్యుటేషన్లు, సబ్ డివిజన్లకు రైతులు ఫీజు చెల్లిస్తే.. రూ.80 కోట్లకుపైనే కట్టాలి. కానీ ప్రభుత్వమే ఉచితంగా చేసి రైతులకు వాటిని బహుమానంగా ఇస్తోంది. అది కూడా రికార్డు సమయంలో లక్షల మ్యుటేషన్లు, సబ్ డివిజన్లు పూర్తిచేస్తోంది. రెండేళ్లలో ఇన్ని లక్షల మ్యుటేషన్లు జరగడం సాధారణ విషయం కాదని నిపుణులు సైతం చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment