సీఎం జగన్‌ నూజివీడు పర్యటన.. భూముల పట్టాలు పంపిణీ | CM YS Jagan has solved all the Land problems | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ నూజివీడు పర్యటన.. అసైన్డు, లంక భూములకు పట్టాలు పంపిణీ

Published Fri, Nov 17 2023 4:53 AM | Last Updated on Fri, Nov 17 2023 1:13 PM

CM YS Jagan has solved all the Land problems - Sakshi

సాక్షి, అమరావతి: ఆంక్షలు, వివాదాల్లో ఇరుక్కు­పోయిన భూముల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించిన సీఎం వైఎస్‌ జగన్‌­మోహన్‌రెడ్డి ఆ దిశగా మరో కీలక ముందడుగు వేస్తున్నారు. భూ­ము­­లకు సంబంధించి కొద్ది నెలలుగా ప్రభుత్వం తీసు­కున్న కీలక నిర్ణయాలను అమల్లోకి తెస్తూ శుక్రవారం ఏలూరు జిల్లా నూజివీడులో నిర్వహి­స్తున్న బహిరంగ సభలో సీఎం జగన్‌ పాల్గొన­ను­న్నారు. దళితులు, పేదల జీవితాలు పూర్తిగా మారి­పోయే అత్యంత కీలకమైన 12 అంశాలు ఇందులో ఉన్నాయి.

నిరుపేదలకు భూముల పంపిణీని ప్రారం­భించడంతోపాటు అసైన్డ్‌ భూములకు యా­జమాన్య హక్కులు కల్పించడం, లంక భూములకు పట్టాల­తోపాటు చుక్కల భూములు, షరతుల గల పట్టా భూ­ములు, సర్వీస్‌ ఈనాం భూములను 22 ఏ జా­బితా నుంచి తొలగించడం, దళిత వాడలకు శ్మశాన వాటి­కలు కేటాయిస్తూ పత్రాలు ఇవ్వడం, భూమి కొనుగోలు పథకం కింద ఇచ్చిన భూము­లపై హక్కుల కల్పన, గిరిజనులకు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీని సీఎం జగన్‌ ఈ సభలో ప్రారంభించనున్నారు.

46 వేల ఎకరాలకుపైగా పంపిణీ 
రాష్ట్రంలో సుదీర్ఘకాలం తర్వాత భూముల పంపిణీని ముఖ్యమంత్రి జగన్‌ చేపడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను ఆర్థికంగా మెరుగైన స్థితికి చేర్చడమే లక్ష్యంగా భూ పంపిణీకి శ్రీకారం చుట్టా­రు. రాష్ట్రవ్యాప్తంగా 46,463.82 ఎకరాలను వ్యవసా­యం కోసం కొత్తగా 42,307 మందికి డీకేటీ పట్టాలుగా ఇవ్వనున్నారు. జిల్లాల వారీగా అందు­బా­టులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి ఇప్ప­టికే పంపిణీకి అసైన్‌మెంట్‌ కమిటీల ఆమోదం తీసు­కున్నారు. డీకేటీ పట్టాలతోపాటు ఎఫ్‌ఎంబీ, అడంగల్‌ కాపీలు కూడా జారీ అయ్యాయి. వాటిని అర్హులకు ఇచ్చే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు. 

లంక భూములకు పట్టాలు 
దశాబ్దాల నాటి లంక భూముల సమస్యను పరిష్కరించి అర్హులైన రైతులకు పట్టాలు ఇవ్వనున్నారు. ఏళ్ల తరబడి వీటిని సాగు చేసుకుంటున్నా పత్రాలు లేకపోవడంతో రైతు భరోసా, ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటల బీమా లాంటి ప్రయోజనాలు అందుకోలేకపోతున్నారు. ఎనిమిది జిల్లాల్లో విస్తరించిన లంక గ్రామాల్లోని 9,064 ఎకరాలు 17,768 మంది రైతుల సాగులో ఉన్నట్లు ఎంజాయ్‌మెంట్‌ సర్వే ద్వారా గుర్తించారు. ఏ, బీ కేటగిరీ లంక భూములకు డీకేటీ పట్టాలతోపాటు  సీ కేటగిరీ భూములకు లీజు పట్టాల పంపిణీని సీఎం ప్రారంభించనున్నారు.

సర్వీస్‌ ఈనాం భూములపై ఆంక్షల తొలగింపు
ఏళ్ల తరబడి గ్రామాల్లో వివాదాస్పదంగా ఉన్న సర్వీస్‌ ఈనాం భూముల సమస్యను సైతం సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పరిష్కరించింది. 1,61,584 మంది రైతులకు సంబంధించి 1,58,113 ఎకరాలను నిషేదిత జాబితా నుంచి తొలగించారు. గతంలో ఈనాం చట్టం ప్రకారం దేవదాయ భూములను 22 ఏ జాబితాలో పొందుపరచిన­ప్పుడు కుల వృత్తులు చేసుకునే వారికిచ్చిన సర్వీస్‌ ఈనాం భూములు కూడా పొరపాటున అందులో చేరిపోయాయి. అప్పటి నుం­చి వాటిపై ఆంక్షలు తొలగించకపోవడంతో లక్షలాది మంది రైతులు ఇబ్బందులు పడుతున్నా­రు. ఇప్పుడు కుమ్మరి, కమ్మరి, రజక, నాయీ బ్రాహ్మణులు తదితర వృత్తుల వారికి కేటాయించిన సర్వీస్‌ ఈనాం భూములపై ఆంక్షలు తొలగిపో­యాయి.

దళిత వాడలకు శ్మశాన వాటికలు
శ్మశాన వాటికలు లేని దళిత వాడలు ఉండరాదనే ఉద్దేశంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  రాష్ట్రంలో 1,563 గ్రామాల్లో 951 ఎకరాల ప్రభుత్వ భూమిని శ్మశాన వాటికల కోసం కేటాయించారు. ఈ భూమిని ఇప్పటికే ఆయా గ్రామ పంచాయతీలకు అప్పగించారు.  

2.06 లక్షల ఎకరాల చుక్కల భూములకు విముక్తి 
గత సర్కారు తప్పిదాలతో వివాదాస్పదంగా మారిన చుక్కల భూముల సమస్యను వైఎస్సార్‌సీపీ ప్రభు­త్వం సునాయాసంగా పరిష్కరించింది. ఒకే­సారి 15 జిల్లాల్లో 2.06 లక్షల ఎకరాల చుక్కల భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించింది. తద్వారా సంబంధిత రైతులకు తమ భూములపై సర్వ హక్కులు లభించాయి. ఈ సమస్య పరిష్కారంతో చాలా ఏళ్లుగా నిలిచి­పోయి­న రిజిస్ట్రేషన్లు ఇప్పుడు జరుగుతు­న్నాయి. పంట రుణాలు కూడా వస్తున్నాయి. రాష్ట్ర చరిత్రలో లక్షల ఎకరాల భూములకు విముక్తి కల్పించడం ఇదే తొలిసారి. వాటిని రైతులు స్వేచ్ఛగా అమ్ముకునే హక్కు కల్పించడంతోపాటు రుణాలు పొందేందుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

షరతుల పట్టా భూముల సమస్యకు పరిష్కారం
సమస్యాత్మకంగా మారిన షరతుల గల పట్టా భూములకు ప్రభుత్వం పరిష్కారం చూపింది. 33 వేల ఎకరాల షరతుల గల పట్టా భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించి  రైతులకు మేలు చేకూర్చింది. బ్రిటీష్‌ హయాం నుంచి రైతుల చేతుల్లో ఉన్న భూములను టీడీపీ పాలనలో 22 ఏ కేటగిరీలో చేర్చారు. ఈ అన్యాయాన్ని సరిదిద్దుతూ నిబంధనల ప్రకారమే వాటిని ఆ జాబితా నుంచి ప్రభుత్వం తొలగించింది. 17,730 సర్వే నెంబర్లకు సంబంధించి 33 వేలకుపైగా ఎకరాలను 22ఏ జాబితా నుంచి తీసివేసింది. ఒక్క కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోనే 18 వేలకుపైగా ఎకరాలను 22ఏ నుంచి తొలగించడం గమనార్హం. 

భూమి కొనుగోలు పథకం భూములకు హక్కులు
భూమి లేని నిరుపేద దళితులకు భూమి కొనుగోలు పథకం ద్వారా ఇచ్చిన భూములపైనా అమలులో ఉన్న ఆంక్షలను ప్రభుత్వం తొలగించింది. ఆ భూములు ఎస్సీ కార్పొరేషన్‌ తనఖాలో ఉండడంతో వాటిని నిషేధిత జాబితాలో చేర్చారు. దీనికి సంబంధించి 22,837 ఎకరాలకు ఇప్పుడు విముక్తి లభించడంతో 22,346 మంది దళితులకు మేలు జరిగింది. సీఎం వైఎస్‌ జగన్‌ ఈ సమస్య తన దృష్టికి రాగానే సత్వరమే పరిష్కరించారు.

అసైన్డ్‌ భూములపై హక్కులు
రాష్ట్రంలో తొలిసారిగా అసైన్డ్‌ భూములకు యాజ­మా­న్య హక్కులు కల్పించేందుకు వాటిని 22 ఏ జాబితా నుంచి తొలగిస్తున్నారు. భూములున్నా వాటికి విలువ లేకుండాపోవడంతో హక్కులు కల్పించాలని దీర్ఘకాలంగా దళిత, పేద రైతులు కోరు­తున్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఈ నేప­థ్యంలో విస్తృత అధ్యయనం, ఇతర రాష్ట్రాల్లో విధానాలపై ప్రజాప్రతినిధుల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం అసైన్‌మెంట్‌ జరిగి 20 ఏళ్లు పైబడిన భూములపై పేదలకు పూర్తి యాజమాన్య హక్కు­లు కల్పించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభు­త్వం ఆ మేరకు చట్ట సవరణ చేసింది.

ఒరిజినల్‌గా భూముల పొందిన రైతులకు హక్కులు ఇవ్వాలని నిర్ణ­యించి అమలు చేయడం ప్రారంభించింది. దీని­వల్ల రాష్ట్రవ్యాప్తంగా 15,21,160 మంది  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన పేద రైతులు తమకు అసైన్‌ అయిన 27,41,698 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు పొందనున్నారు. ఆ భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించారు. 

నేడు నూజివీడుకు సీఎం జగన్‌
సాక్షి ప్రతినిధి, ఏలూరు: భారీ భూ పంపిణీ కార్యక్రమానికి నేడు నూజివీడు వేదికగా సీఎం జగన్‌ శ్రీకారం చుట్టనున్నారు. ఒక్క ఏలూరు జిల్లాలోనే 10,303 మందికి 12,886.37 ఎకరాల భూమిని శాశ్వత హక్కుతో అందించనున్నారు. 31 గ్రామాల్లో ఎస్సీ శ్మశాన వాటి­కలకు 33.32 ఎకరాలను ఇదే వేదిక నుంచి మంజూరు చేయనున్నారు. శుక్రవారం సీఎం జగన్‌ నూజివీడు రాక సందర్భంగా హెలీ­ప్యాడ్, బహిరంగ సభ వద్ద భద్రతా ఏర్పాట్లను ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావు, కలెక్టర్‌ వై.ప్రసన్న వెంకటేష్, ఎస్పీ డి.మేరిప్రశాంతి ఏర్పాట్లను  పర్యవేక్షించారు. 

సీఎం పర్యటన ఇలా..
► ఉదయం 10.25 గంటలకు నూజివీడులోని హెలీప్యాడ్‌కు చేరుకుని ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో మాట్లాడతారు. 
► 10.55 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుని వివిధ శాఖలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ స్టాల్స్, ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు. 
► 11.10 నుంచి 12.25 గంటల వరకు భూ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పట్టాలు పంపిణీ చేసి సభలో ప్రసంగిస్తారు. 
► 12.50 గంటలకు హెలీప్యాడ్‌కు చేరుకుని స్థానిక నాయకులు, ప్రజలను కలుసుకుంటారు. అనంతరం 1.55 గంటలకు తాడేపల్లి పయనం కానున్నారు.   

గోడు విన్నారు.. పోడు భూములిచ్చారు 
సాక్షి, అమరావతి: గిరిజనుల గోడును ఆలకించి నేను ఉన్నానంటూ భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోడు భూములకు అటవీ హక్కుల గుర్తింపు చట్టం(ఆర్వోఎఫ్‌ఆర్‌ యాక్ట్‌) ద్వారా పట్టాలిచ్చి రికార్డు సృష్టించారు. గిరిజనులకు పోడు భూముల పంపిణీలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శంగా నిలిపారు. 2008 నుంచి 2019 వరకు గత ప్రభుత్వాలు 95,649 గిరిజన కుటుంబాలకు 2,33,410 ఎకరాలకు ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలిచ్చాయి. వీటిల్లో గత పదకొండేళ్లలో ఇచ్చిన మొత్తం పట్టాల్లో అ­త్యదికంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పంపిణీ చేసినవే కావడం గమనార్హం.

వాస్తవానికి పోడు భూములకు పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టింది కూడా వైఎస్సారే. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గత నాలుగున్నరేళ్లలో ఏకంగా మొత్తం 1,30,368 కుటుంబాలకు 2,87,710 ఎకరాలకు పట్టాలిచ్చి పేదలకు మేలు చేయడంలో తండ్రి కంటే రెండు అడుగులు ముందుంటానని నిరూ­పించుకున్నారు. వీటిలో 1,29,842 మందికి 2,19,763 ఎకరాలు, 526 సామూహిక(కమ్యూనిటీ) టైటిల్స్‌ ద్వారా 67,947 ఎకరాల పోడు భూములకు పట్టాలుగా పంపిణీ చేయడం విశేషం.  

డీకేటీ పట్టాల పంపిణీ.. 
గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ భూమిని (రిజర్వ్‌ ఫారెస్ట్‌ కాని భూమి) వారు సాగు చేసుకొని జీవించేలా రాష్ట్ర ప్రభుత్వం డీకేటీ పట్టాల రూపంలో పంపిణీ చేస్తుంది. గత నాలుగున్నరేళ్ల కాలంలో ఈ కార్యక్రమం ద్వారా 26,287 మంది గిరిజనులకు 39,272 ఎకరాల భూమిని పంపిణీ చేయడం గమనార్హం.  

పునర్విచారణతో లబ్ధి 
అడవులు, గ్రామ పొలిమేర (సరిహద్దు) భూములు తదితర కారణాలతో గత ప్రభుత్వాల హయాంలో 73,469 మంది గిరిజనుల దరఖాస్తులను తిరస్కరించారు. తమకు పట్టాలివ్వాలని గిరిజనులు గోడు వెళ్లబోసుకోవడంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక పునర్విచారణ చేసి పట్టాలిచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటివరకు అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో సుమారు 25,380 దరఖాస్తులపై పునర్విచారణ జరిపి 40,930 ఎకరాలను పట్టాలుగా ఇచ్చారు.

గతంలో తిరస్కరణకు గురైన పోలవరం ముంపు గ్రామాలకు చెందిన దరఖాస్తులను సైతం పునఃపరిశీలించి 2,372 గిరిజన కుటుంబాలకు 6,407 ఎకరాలను పోడు వ్యవసాయం కోసం పట్టాలుగా ఇచ్చారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై పునర్విచారణ జరిపి అర్హత ఉన్న వారికి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించడం గమనార్హం. 

పెద్దమనసు చాటుకున్న జగన్‌ 
అటవీ భూములకు హక్కు పత్రాల పంపిణీలో మన రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. 2005 డిసెంబర్‌ 13కు ముందు సాగులో ఉన్న అటవీ భూమిపై మాత్రమే పోడు భూమి హక్కులను గుర్తించేలా చట్టం ఉంది. పట్టాలు పంపిణీకి శ్రీకారం చుట్టిన 2008 జనవరి 1 నుంచి ఆ చట్టాన్ని పొడిగించాలని, దానివల్ల ఎక్కువ మంది గిరిజనులకు మేలు జరుగుతుందని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ సీఎం జగన్‌ లేఖ రాశారు. ఇది పేద గిరిజనులపై సీఎం జగన్‌కు ఉన్న ప్రేమ, పెద్దమనసుకు నిదర్శనం.

ఏజెన్సీ ప్రాంతంలో పట్టా భూములు, సొంత భూముల సాగులో గిరిజన రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోంది. రాష్ట్రంలో 3,40,043 మంది గిరిజన రైతులకు రైతు భరోసా పథకం ద్వారా సుమారు రూ.484.02 కోట్లు వారి ఖాతాలకే జమ చేసి అండగా నిలిచారు. రైతు భరోసా అందుకునే గిరిజన రైతుల సంఖ్య 2019–20లో 2,82,871 మంది కాగా.. ఇప్పుడు ఆ సంఖ్య 3,40,043కు పెరిగింది. ఎటువంటి పక్షపాత ధోరణి లేకుండా అర్హులైన వారందరికీ లబ్ధి చేకూర్చాలన్నదే సీఎం జగన్‌ ఉద్దేశం. 
 –పీడిక రాజన్నదొర, ఉపముఖ్యమంత్రి 

రీ సర్వే మహాయజ్ఞం
రాష్ట్రంలో వివాదరహితంగా భూ యాజమాన్య హక్కులు, క్లియర్‌ టైటిలింగ్‌ వ్యవస్థ అమలు కోసం నిర్వహిస్తున్న వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం విజయవంతంగా అమలు జరుగుతోంది. దీనిద్వారా ప్రభుత్వ హామీతో శాశ్వత ఆస్తి హక్కు పత్రాన్ని భూ యజమానికి ఇస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం 10,185 మంది గ్రామ సర్వేయర్లు, 2688 మంది వీఆర్‌ఓలు, 5417 మంది పంచాయతీ కార్యద­ర్శులు, 3786 మంది ప్లానింగ్‌ కార్యదర్శులు, 679 మంది మొబైలు మేజిస్ట్రేట్ల సేవలను ప్రత్యేకంగా వినియోగిస్తున్నారు.

గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ సేవలు అందిస్తున్నారు. ఇప్పటికే రెండు దశల్లో నాలుగు వేల గ్రామాల్లో భూముల రీ సర్వే పూర్తయింది. ఆయా గ్రామాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. 42.6 లక్షల ఎకరాల భూముల రీ సర్వే పూర్తి కాగా 4.8 లక్షల మ్యుటేషన్లు జరిగాయి. సరిహద్దు వివాదాలకు సంబంధించి 45 వేల కేసులను పరిష్కరించారు. 17.53 లక్షల భూహక్కు పత్రాలు పంపిణీ చేశారు. భూముల సరిహద్దులు గుర్తిస్తూ 49.04 లక్షల రాళ్లు పాతారు. మూడో విడతలో మరో 2 వేల గ్రామాల్లో సర్వేను వచ్చే ఏడాది జనవరి 31కి పూర్తి చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement