సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రీ సర్వే శరవేగంగా జరుగుతోంది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం ఇప్పటికే అనేక మైలురాళ్లు అధిగమించింది. తొలి దశలో 2 వేల గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసి, దేశంలోనే ప్రప్రథమంగా ఆ గ్రామాలకు డిజిటల్ రికార్డులను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.
స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ ఒక్క గ్రామంలో కూడా భూముల రీ సర్వే పూర్తి చేయలేదు. అన్ని రాష్ట్రాల్లోనూ బ్రిటిష్ కాలం నాటి భూమి రికార్డులే ఇప్పటికీ చెలామణిలో ఉన్నాయి. వాటి ఆధారంగానే భూముల కార్యకలాపాలు, రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. కానీ మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం 2 వేల గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసి కొత్త భూముల రికార్డులను డిజిటల్ రూపంలో తయారు చేసింది.
ఆ గ్రామాల్లోనే గ్రామ సచివాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. రైతుల భూముల హద్దులను అక్షాంశ, రేఖాంశాలతో సహా ఎవరూ అక్రమ పద్ధతుల్లో మార్చలేని విధంగా నిర్ధారించింది. ప్రతి భూ కమతానికి ఒక విశిష్ట సంఖ్యను కూడా కేటాయించింది. ఏపీలో రూపొందుతున్న డిజిటల్ భూ రికార్డులు ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు సైతం మోడల్‌గా నిలిచాయి.
ఇప్పటికే పలు రాష్ట్రాలు మన మోడల్‌పై అధ్యయనం చేశాయి. రీ సర్వే ఎలా చేయాలనే అంశంపై ఏపీ సర్వే అధికారులతో ఆ రాష్ట్రాల అధికారులకు శిక్షణ కూడా ఇప్పిస్తున్నాయి. ఉత్తరాఖండ్, పాండిచ్చేరిలో ఈ శిక్షణ తరగతులు జరగ్గా, మరికొన్ని రాష్ట్రాలూ ఇదే బాటలో ఉన్నాయి.
క్షేత్ర స్థాయి నిజనిర్ధారణలోనూ దూకుడు
ఇప్పటివరకు అందిన ఓఆర్‌ఐలతో క్షేత్రస్థాయి నిజ నిర్ధారణను వేగంగా చేపడుతున్నారు. రైతులు చూపించే వాస్తవ సరిహద్దులను డ్రోన్ చిత్రాలతో పోల్చి చూసే అతి ముఖ్యమైన నిజనిర్ధారణ 4,283 గ్రామాల్లో 57 లక్షలకుపైగా ఎకరాల్లో పూర్తయింది. దీంతో ఆయా గ్రామాల్లోని భూముల కమతాలకు సర్వే నంబర్లకు బదులుగా ఇచ్చే ల్యాండ్ పార్సిల్ మ్యాప్(ఎల్‌పీఎం)లు 43.42 లక్షలు జారీ చేశారు.
మిగిలిన 2,246 గ్రామాల్లో నిజనిర్ధారణ జరుగుతోంది. ఆ తర్వాత మరోసారి రైతుల సమక్షంలో జరిగే గ్రౌండ్ వాలిడేషన్ (క్షేత్ర స్థాయి ధ్రువీకరణ) 3,428 గ్రామాల్లో (37.39 లక్షల ఎకరాలు) పూర్తవగా 855 గ్రామాల్లో జరుగుతోంది. ఇప్పటివరకు 3,092 గ్రామాల్లో (28.33 లక్షల ఎకరాలు) సర్వే పూర్తయినట్లు నంబర్ 13 నోటిఫికేషన్లు జారీ చేశారు. ఈ లెక్కలనుబట్టి రీ సర్వే ఎంత శాస్త్రీయంగా, పక్కాగా వేగంగా జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు.
1.08 లక్షల చదరపు కిలోమీటర్లలో డ్రోన్, ఏరియల్ సర్వే పూర్తి
రాష్ట్రంలో అత్యంత ఆధునిక పద్ధతుల్లో రీ సర్వే జరుగుతోంది. ఇందులో భాగంగా చేపట్టిన డ్రోన్, ఏరియల్ సర్వేలు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. మొత్తం 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కొలవాల్సివుండగా 1.08 లక్షల చదరపు కిలోమీటర్లను ఈ సర్వే ద్వారా ప్రభుత్వం కొలిచింది. 17,460 గ్రామాలకుగాను 12,230 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయింది.
ఈ గ్రామాల్లో డ్రోన్లు, విమానాల ద్వారా 1.8 కోట్ల ఎకరాల కొలతలను పూర్తి చేశారు. అతి త్వరలో మిగిలిన గ్రామాల్లోనూ ఈ సర్వే పూర్తికానుంది. డ్రోన్, ఏరియల్ సర్వే ద్వారా తీసిన చిత్రాలను అభివృద్ధి చేసి 6,529 గ్రామాల ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ (ఓఆర్‌ఐ) లను సర్వే బృందాలకు అందించారు. మిగిలిన గ్రామాల ఓఆర్‌ఐలను నిర్ణీత సమయంలో సర్వే బృందాలకు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment