సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయాన్ని మూడు దశల్లో అందజేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. రెవెన్యూ శాఖ చేపట్టిన భూప్రక్షాళన రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియ జాప్యం అవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. డిజిటలైజేషన్ అవుతున్న భూముల వివరాలను ఎప్పటికప్పుడు తీసుకుని ఆ మేరకు రైతులకు పెట్టుబడి చెక్కులను పంపిణీ చేస్తామని పేర్కొంటున్నాయి. వచ్చే నెల 19న చెక్కుల పంపిణీ ప్రక్రియను మొదలుపెట్టి.. 45 రోజుల్లో రైతులందరికీ పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు.
అయితే ఒక్కో దశలో కచ్చితంగా ఇంత మందికి పంపిణీ చేయాలన్నట్టుగా కాకుండా.. వీలైనంత మంది రైతులకు ఇస్తూ, మూడు దశల్లో మొత్తం పంపిణీ పూర్తి చేస్తామని వెల్లడిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి, బ్యాంకులకు కూడా నిధుల సమస్య, కరెన్సీ కొరత వంటివి తలెత్తకుండా ఉంటుందని పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం చెక్కులు అందజేయాల్సి ఉండగా.. ఆరు బ్యాంకులకు ఈ బాధ్యతను అప్పగించారు. అందులో ఒక్క ఎస్‌బీఐ ద్వారానే 18 లక్షల మందికి చెక్కుల పంపిణీ జరగనుంది. మిగతా ఐదు బ్యాంకులు మిగతా రైతులకు చెక్కులు పంపిణీ చేస్తాయి. రికార్డుల డిజిటలైజేషన్ పూర్తయిన భూముల వివరాలను, రైతుల సమాచారాన్ని వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు బ్యాంకులకు అందజేస్తుంది. ఆ ప్రకారం చెక్కులను ముద్రించి జిల్లాలకు పంపిస్తారు.
ఖరీఫ్‌లోనే రూ.6,600 కోట్లు..
రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయం పథకాన్ని వచ్చే ఖరీఫ్ నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద రైతులకు ఎకరాకు ఖరీఫ్‌లో రూ.4 వేలు, రబీలో రూ.4 వేల చొప్పున అందజేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 1.65 కోట్ల ఎకరాలకు సంబంధించి సాయం పంపిణీ చేయాల్సి ఉంటుందని అంచనా. ఇందుకోసం ఖరీఫ్ సీజన్‌లోనే రూ.6,600 కోట్లు చెల్లించాల్సి ఉంది. మొత్తంగా రెండు సీజన్లకు కలిపి పెట్టుబడి పథకానికి రూ.12 వేల కోట్లను బడ్జెట్‌లో కేటాయించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
రైతులకు బ్యాంకు ఖాతా తప్పనిసరి
పెట్టుబడి పథకం కింద రైతులకు ‘ఆర్డర్ చెక్కులు’జారీ చేయనున్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో జారీ చేసే ఈ ఆర్డర్ చెక్కులను ఏ బ్యాంకులోనైనా, ఏ బ్రాంచీలోనైనా నగదుగా మార్చుకోవడానికి వీలుంటుందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. అయితే సంబంధిత రైతుకు ఏదో ఒక బ్యాంకులో తప్పనిసరిగా ఖాతా ఉండాలి. చెక్కును క్లియర్ చేసేటప్పుడు బ్యాంకులు సదరు రైతుకు ఖాతా ఉందో లేదో పరిశీలిస్తాయి. సంబంధిత రైతే ‘పెట్టుబడి’చెక్కును క్లియర్ చేసుకుంటున్నాడో లేదో గమనించడానికి.. దుర్వినియోగం కాకుండా నియంత్రించడానికి ఈ నిబంధన పెట్టినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. రైతులెవరికైనా బ్యాంకు ఖాతా లేకుంటే వెంటనే తెరవాలని సూచిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment