సాక్షి, హైదరాబాద్: ధరణిలో పొరపాటున నిషేధిత జాబితా చేర్చిన పట్టా భూములను తొలగించేందుకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) చేపట్టిన కసరత్తుపై విమర్శలు వస్తున్నాయి. సరైన రికార్డులు, క్షుణ్ణమైన పరిశీలన లేకుండానే నిషేధిత జాబితా నుంచి తొలగించాలని సీసీఎల్‌ఏ ఒత్తిళ్లు వస్తున్నాయని.. అందులో అసైన్డ్, కోర్టు కేసుల్లో ఉన్న భూములూ ఉంటున్నాయని తహసీల్దార్లు చెప్తున్నారు. అది కూడా మౌఖిక ఆదేశాలే ఇస్తున్నారని.. దీనివల్ల భవిష్యత్తులో తాము సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో ఎక్కువ సర్వే బైనంబర్లను నిషేధిత జాబితా నుంచి తొలగించామని చెప్పుకోవడానికి సీసీఎల్‌ఏ తాపత్రయ పడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తూతూమంత్రంగా, తప్పుల తడకగా పరిష్కరించడం వల్ల సమస్య మరింత జటిలం అవుతుందనే విమర్శలు వస్తున్నాయి.
రికార్డుల ప్రకారం రాష్ట్రంలో నిషేధిత భూముల సర్వే బైనంబర్లు 7లక్షల వరకు ఉన్నట్టు రెవెన్యూ వర్గాల అంచనా. అయితే ధరణి పోర్టల్‌లో నమోదు సమయంలో తప్పుల వల్ల వాటి సంఖ్య 20లక్షల వరకు చేరింది. రెండేళ్లు గడిచినా ఈ రికార్డులను సరిచేయడంలో పురోగతి లేదు. తమ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని రైతులు తహసీల్దార్, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా ఫలితం లేదు.
ఈ క్రమంలో తామే సుమోటోగా ఈ సమస్యను పరిష్కరిస్తామని సీసీఎల్‌ఏ ముందుకొచ్చింది. నిషేధిత జాబితా నుంచి తొలగించాలో, లేదో నిర్ణయించాలంటూ 5,14,833 సర్వే బైనంబర్లను రాష్ట్రంలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాలకు పంపింది. ఇందులో 3,12,976 సర్వే బైనంబర్లను పరిశీలించిన స్థానిక రెవెన్యూ యంత్రాంగం కేవలం 85,132 (27.2 శాతం) నంబర్లలోని భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి, 2,27,843 (72.8 శాతం) నంబర్లలోని భూమిని నిషేధిత జాబితాలో కొనసాగించాలని నిర్ణయించింది.
కలెక్టర్లకు ‘హైదరాబాద్’ పిలుపు
నిషేధిత జాబితాల నుంచి భూములను తొలగించే ప్రక్రియపై తుది నిర్ణయం పేరుతో కలెక్టర్లను హైదరాబాద్ రావాలని సీసీఎల్‌ఏ నుంచి ఆదేశాలు వెళ్లాయి. వారం రోజులుగా కలెక్టర్లతోపాటు సదరు జిల్లాలోని ఆర్డీవోలు, తహసీల్దార్లు, తహసీల్ కార్యాలయ సిబ్బంది అందుబాటులో ఉన్న రికార్డులతో సీసీఎల్‌ఏ కార్యాలయానికి వస్తున్నారు. ఆయా జిల్లాలకు కేటాయించిన సర్వే బైనంబర్లలో ఎన్ని పరిష్కారమయ్యాయి? పరిష్కారమైన వాటిలో ఎన్ని నంబర్లను నిషేధిత జాబితా నుంచి తొలగించారు? ఎన్ని నంబర్లను కొనసాగించారనే వివరాలను, వాటికి కారణాలను సీసీఎల్‌ఏ వర్గాలకు వివరిస్తున్నారు. ఎక్కువ సర్వే బైనంబర్లను నిషేధిత జాబితా నుంచి తొలగించామని చెప్పుకోవడానికి సీసీఎల్‌ఏ తాపత్రయ పడుతున్నట్టు సమాచారం.
క్షేత్రస్థాయి యంత్రాంగం చెప్పిన కారణాలను వినకుండా.. అసైన్డ్ భూమి అయినప్పటికీ 20 ఏళ్లుగా పట్టాభూమి అని రాసి ఉందిగనుక ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ఒత్తిడి చేస్తున్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న వాటిని కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించాలని జిల్లాల యంత్రాంగంపై ఒత్తిడి తెస్తున్నట్టు పేర్కొంటున్నాయి. ఇప్పటివరకు భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, నారాయణపేట జిల్లాలకు చెందిన కసరత్తు పూర్తికాగా.. నల్లగొండ, కరీంనగర్, మేడ్చల్, రంగారెడ్డి, జగిత్యాల, ఖమ్మం జిల్లాలకు చెందిన అధికారులు ప్రస్తుతం సీసీఎల్‌ఏ కార్యాలయంలో ఈ విధుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాల నుంచి వస్తున్న యంత్రాంగానికి ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు హైదరాబాద్‌లోనే ఉండాలని ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.
మొత్తం మీద ఇంకా నిషేధిత జాబితాలోనే కొనసాగించాలని క్షేత్రస్థాయిలో నిర్ణయించిన వాటిలో నుంచి కనీసం 30 శాతం సర్వే బైనంబర్లను తొలగించడమే లక్ష్యంగా సీసీఎల్‌ఏ కార్యాలయంలో కసరత్తు జరుగుతున్నట్టు తెలిసింది.
అన్నీ మౌఖిక ఆదేశాలే..
వాస్తవానికి భూరికార్డులను పరిశీలించి నిర్ణయం తీసుకునే అధికారం మండల తహసీల్దార్లకు మాత్రమే ఉంటుంది. కానీ ధరణి పోర్టల్ తర్వాత జిల్లా కలెక్టర్లు భూసమస్యలను పరిష్కరిస్తున్నారు. కానీ ఆయా పరిష్కార పత్రాలపై ఉండేది తహసీల్దార్ల డిజిటల్ సంతకాలే. దీనివల్ల కలెక్టర్లు తీసుకునే నిర్ణయాలపై ఎవరైనా కోర్టులకు వెళితే తహసీల్దార్లే బాధ్యత వహించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు సీసీఎల్‌ఏ కార్యాలయం వేదికగా జరుగుతున్న కసరత్తు మరీ ఘోరంగా ఉందని తహసీల్దార్లు వాపోతున్నారు.
తమకు కేటాయించిన సర్వే బైనంబర్లలోని భూముల రికార్డులను పరిశీలించి వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలా, వద్దా అన్నదానిపై నిర్ణయం తీసుకుంటున్నామని.. అయితే దీనికి సంబంధించి తమకు ఎలాంటి లిఖితపూర్వక మార్గదర్శకాలు ఇవ్వలేదని చెప్తున్నారు. ఇప్పుడు సీసీఎల్‌ఏ కార్యాలయానికి పిలిపించి కూడా ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వకుండా.. కేవలం మౌఖికంగా ఫలానా సర్వేబై¯ð నంబర్‌లోని భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటూ ఆదేశాలు ఇస్తున్నారని వివరిస్తున్నారు. ఇది భవిష్యత్తులో తమ ఉద్యోగాలకు ముప్పు తెచ్చి పెడుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తొలగించారా, లేదా?.. తెలిసేదెలా?
ఎవరైనా రైతుల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించారా లేదా అన్నది సదరు రైతులకు తెలియడం లేదు. చాలా మంది రైతులకు తెలియకుండానే వారి భూములపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోంది. అంతేగాకుండా సుమోటోగా తీసుకున్న 5 లక్షలకుపైగా సర్వే నంబర్లు మినహా ఇతర సర్వే నంబర్లలోని భూములపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు.
నిషేధిత జాబితా నుంచి తమ భూమిని తొలగించాలని రైతు దరఖాస్తు చేసుకుంటే.. ధరణి పోర్టల్‌లో ప్రాసెస్ చేసే విధానాన్ని కూడా ఇప్పుడు తొలగించారు. దీంతో తమ భూమి నిషేధిత జాబితాలో ఉందా, తొలగించారా? తమ దరఖాస్తును ఏం చేశారు? అసలు పరిష్కరిస్తారా లేదా? అన్న విషయాల్లో రైతులకు ఎలాంటి స్పష్టత లేకుండా పోవడం గమనార్హం.
చదవండి: మీ వెనుక ఎవరున్నారు?
Comments
Please login to add a commentAdd a comment