సాక్షి, హైదరాబాద్
ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా 74 లక్షల తప్పులు. ఏళ్ల తరబడి దిద్దుబాటుకు నోచుకోని భూ రికార్డుల్లో ఉన్న లోపాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనలో వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1.7 కోట్ల సర్వే నంబర్లలో 2.4 కోట్ల ఎకరాల భూ విస్తీర్ణం ఉంటే అందులో దాదాపు మూడో వంతు.. అంటే 74 లక్షల ఎకరాలకు సంబంధించిన రికార్డుల్లో తప్పులు నమోదయ్యాయనే గణాంకాలు ఇన్నాళ్లూ తప్పులతడకగా సాగిన రెవెన్యూ వ్యవహా రాలను ఎత్తిపొడుస్తున్నాయి. చిన్నదైనా, పెద్దదైనా తప్పులను సరిచేయకపోవడం, దశాబ్దాల తరబడి ఆ తప్పులు అలాగే కొనసాగడం రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.
లక్షల ఎకరాల రికార్డుల్లో తప్పులు
గత ఏడాది సెప్టెంబర్ 15 నుంచి రాష్ట్ర ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టింది. ఎప్పుడో నిజాం కాలంలో సరిచేసిన రికార్డులను పూర్తిగా సవరించి రైతులకు పెట్టుబడి సాయం అందిస్తామంటూ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రక్రియలో మొదటి నుంచీ విస్మయకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డిసెంబర్ 31, 2017 నాటికే ఈ ప్రక్షాళన కార్యక్రమం గడువు అధికారికంగా ముగిసినా అక్కడక్కడా ఇంకా జరుగుతూనే ఉంది. అయితే, సోమవారం వరకు అందిన లెక్కల ప్రకారం మొత్తం 74,42,910 ఎకరాల రికార్డుల్లో తప్పులున్నాయని తేలింది. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో అయితే ఈ తప్పులు లక్షల సంఖ్యలో నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో 9,44,290 ఎకరాల భూ విస్తీర్ణం ఉంటే అది కాస్తా భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత ఏకంగా 13,86,943 ఎకరాలకు పెరిగింది. ఇందులో 8,09,827 ఎకరాల రికార్డుల్లో తప్పులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మేడ్చల్–మల్కాజ్‌గిరి మినహా అన్ని జిల్లాల్లో లక్ష ఎకరాలకు పైగానే తప్పులు కనిపించాయి.
ఖమ్మం, కామారెడ్డి జిల్లాల్లో ఇలా నమోదయిన తప్పుల సంఖ్య 5 లక్షలు దాటింది. మంచిర్యాలలో 4.38 లక్షలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3.46 లక్షల ఎకరాల రికార్డుల్లో తప్పులు నమోదయ్యాయని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ పరిశీలిస్తే అత్యల్పంగా మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా రికార్డుల్లో తప్పులు తక్కువగా ఉన్నాయని తేలింది. ఇక్కడ మొత్తం భూ విస్తీర్ణం 2,63,582 ఎకరాలుంటే, రికార్డుల పరిశీలన తర్వాత అది 2,92,788 ఎకరాలకు చేరగా, అందులో 2,75,171 ఎకరాల రికార్డులు సరిగా ఉన్నాయని తేలింది. అంటే ఆ జిల్లాలో కేవలం 17,617 ఎకరాల రికార్డుల్లోనే తప్పులు తేలాయి. అందులోనూ 10,935 ఎకరాల రికార్డులను సరిచేయగా, ఇంకా 6,681 ఎకరాల రికార్డులను సరిచేయాల్సి ఉంది. ఇలా లక్షల సంఖ్యలో నమోదయిన తప్పుల్లో ఇప్పటివరకు 66,52,986 ఎకరాల విస్తీర్ణంలోని రికార్డులను సరిచేశారు. మరో 28 లక్షల ఎకరాల్లో రికార్డులను సరిచేసే ప్రక్రియలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమై ఉంది.
మరో వారం ఆగితేనే...
వాస్తవానికి, గత ఏడాది డిసెంబర్ 31తోనే భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం ముగియాల్సి ఉన్నా ఇప్పటి వరకు 22 జిల్లాల్లోనే ఈ ప్రక్రియ పూర్తయిందని గణాంకాలు చెబుతున్నాయి. సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, పెద్దపల్లి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో కొంత మేర పూర్తి కావాల్సి ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లో పాత సేత్వార్‌లు, ఖాస్రా పహాణీలలో ఉన్న సర్వే నంబర్ల కన్నా ఎక్కువ సర్వే నంబర్లలోనే పరిశీలన పూర్తయింది. ఈ ఎనిమిది జిల్లాల్లోనూ నేడో, రేపో ప్రక్రియ పూర్తి కానుంది. అయితే, తప్పులను సరిచేయడంతో పాటు అన్‌లైన్ రికార్డులను కేటగిరీల వారీగా తయారు చేసేందుకు మరో వారంరోజులు పడుతుందని అధికారులంటున్నారు. ఈ వారం ఆగితేనే రాష్ట్రంలోని భూ కమతాలకు సంబంధించిన పక్కా లెక్కలు తేలుతాయని వారంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment