సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తప్పుల తడకలుగా ఉన్న భూ రికార్డులను రెండు నెలల్లో పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆదేశించారు. సచివాలయంలోని తన చాంబర్ నుంచి బుధవారం జాయింట్ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అర్హులందరికీ ఉగాది రోజున నివాస స్థల పట్టాల పంపిణీ, భూముల సమగ్ర రీసర్వే అనేవి సీఎం వైఎస్ జగన్ అత్యంత ప్రాధాన్యమైన పథకాలని ఉప ముఖ్యమంత్రి వివరించారు.
భూముల రీసర్వే చేయడానికి ముందే భూ రికార్డులను పూర్తిగా అప్‌డేట్ చేయాల్సి ఉంటుందన్నారు. రీసర్వే సెటిల్‌మెంట్ రిజిస్టర్ (ఆర్‌ఎస్‌ఆర్), వెబ్‌ల్యాండ్ మధ్య భూముల విస్తీర్ణంలో భారీ తేడా ఉందని, చాలా చోట్ల చనిపోయిన వారి పేర్లతోనే భూములు ఉన్నాయని వివరించారు.
కొన్నిచోట్ల వాస్తవ విస్తీర్ణానికి, రికార్డుల్లో ఉన్న గణాంకాలకు పోలిక లేదన్నారు. రీసర్వే చేయాలంటే వీటన్నింటినీ ముందుగా సరిదిద్దాల్సి ఉంటుందని తెలిపారు. రికార్డుల స్వచ్చికరణకు మార్గదర్శకాలతో (ఫార్మట్‌తో సహా) రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నడుచుకోవాలని సూచించారు. ఇందుకోసం ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి నెల రోజుల్లో ప్రక్రియను పూర్తిచేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 8 మండలాలకు ఒకటి చొప్పున ఆధునిక స్టోరేజీ గదుల నిర్మాణాన్ని సెప్టెంబర్ 15 కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. రికార్డులు స్వచ్ఛీకరించేప్పుడు తప్పులు, పొరపాట్లకు ఆస్కారం లేకుండా క్షేత్రస్థాయిలో ఒకటికి రెండుసార్లు చెక్ చేసి కచ్చితంగా నిర్ధారించుకున్న తర్వాతే మార్పులు చేయాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్‌సింగ్, సీసీఎల్‌ఏ కార్యదర్శి చక్రవర్తి ఆదేశించారు.
రెండు నెలల్లో రికార్డుల ప్రక్షాళన
Published Thu, Aug 22 2019 4:51 AM | Last Updated on Thu, Aug 22 2019 4:51 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment