గడువులోగా భూసర్వే పూర్తిచేయాలి: సీఎం జగన్‌ | CM YS Jagan Review Meeting On Land Survey In AP | Sakshi
Sakshi News home page

గడువులోగా భూసర్వే పూర్తిచేయాలి: సీఎం జగన్‌

Published Fri, Oct 15 2021 2:15 AM | Last Updated on Fri, Oct 15 2021 9:36 AM

CM YS Jagan Review Meeting On Land Survey In AP - Sakshi

ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రులు, అధికారులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర భూ సర్వేను నిర్దేశించుకున్న గడువులోగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు ఆదేశించారు. భూ క్రయ విక్రయాలు జరిగినప్పుడే రికార్డులను కూడా అప్‌డేట్‌ చేయాలని.. గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌కు సంబంధించిన ప్రక్రియలు చేపట్టాలన్నారు. ప్రతియేటా ఒక వారంలో భూ రికార్డుల అప్‌డేషన్‌ కార్యక్రమం చేపట్టాలని ఆయన సూచించారు. అలాగే, నిషేధిత భూముల వ్యవహారాలకు చెక్‌ పెట్టాల్సిందేనని.. ఆ జాబితాలో చేర్చాలన్నా, తొలగించాలన్నా సరైన విధానాలు పాటించాలని, లోపాలు లేకుండా ఆధీకృత వ్యవస్థలను బలోపేతం చేయాలని కూడా ఆదేశించారు. వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష పథకంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చకు వచ్చిన అంశాలు..    

ఎస్‌ఓపీలు రూపొందించండి
భూముల క్రయవిక్రయాలు జరిగినప్పుడు పట్టాదారు పుస్తకానికి సంబంధించిన వివరాలు అమ్మకందారులు, కొనుగోలుదారుల రికార్డుల్లో అప్‌డేట్‌ కావాలని, అప్పుడే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయినట్లుగా భావించాలని సీఎం స్పష్టంచేశారు. దీనిపై ప్రత్యేక టీంను పెట్టి.. తగిన విధానాన్ని రూపొందించాలన్నారు. భూ రికార్డుల్లో నిపుణులైన వారిని, న్యాయపరమైన అంశాల్లో అనుభవం ఉన్నవారిని ఈ టీంలో నియమించాలన్నారు. వీరి సిఫార్సుల ఆధారంగా రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌ ప్రక్రియలకు సంబంధించి స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌లు రూపొందించాలని సూచించారు. గ్రామ సచివాలయాల్లోనే ఈ ప్రక్రియ పూర్తయ్యేలా ఉండాలని, ప్రజలు వీటి కోసం ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా తగిన విధానం రూపొందించాలని ఆదేశించారు. 

భూ సర్వేకు సాంకేతిక పరికరాలు సమకూర్చుకోవాలి
భూ సర్వే త్వరితగతిన పూర్తిచేయడానికి తగినన్ని సాంకేతిక పరికరాలను సమకూర్చుకోవాలని, ఇందుకు తగినన్ని డ్రోన్లు పెట్టుకోవాలని సీఎం సూచించారు. సర్వేకు సంబంధించి డేటా భద్రతపైనా తగిన చర్యలు తీసుకోవాలని.. దీనిపై అనుభవం ఉన్న వ్యక్తులు, సంస్థలతో మాట్లాడాలని అధికారులను ఆదేశించారు. ల్యాండ్‌ రికార్డుల అప్‌డేషన్‌ను ఏటా ఒక వారంలో చేపట్టాలని, దీనిపై తగిన కార్యాచరణ రూపొందించాలన్నారు. భూ రికార్డుల అప్‌డేషన్, రిజిస్ట్రేషన్‌ తదితర ప్రక్రియలన్నీ అత్యంత పారదర్శకంగా ఉండాలన్నారు. మనం తీసుకొస్తున్న సంస్కరణలతో అవినీతికి ఆస్కారం ఉండకూడదని.. రైతులకు, భూ యజమానులకు మేలు చేసేలా ఉండాలని.. ఇందుకోసం సమర్థవంతమైన మార్గదర్శకాలను తయారుచేయాలని జగన్‌ ఆదేశించారు. 

నిషేధిత భూముల విషయంలో ‘అవి’ పునరావృతం కాకూడదు
నిషేధిత భూముల అంశానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో రికార్డుల్లో చోటుచేసుకున్న వ్యవహారాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు. 22–ఎ (నిషేధిత భూములు) విషయానికి సంబంధించి అనేక వ్యవహారాలు బయటకొస్తున్న నేపథ్యంలో ఇలాంటి వాటికి చెక్‌ పెట్టాల్సిన అవసరముందన్నారు. అధికారులు సమావేశమై దీనిపై ఒక విధానం రూపొందించాలని.. ఇలాంటి పొరపాట్లు, ఉద్దేశపూర్వక చర్యలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన ఆదేశించారు.

తగినన్ని మార్గదర్శకాలు పటిష్టంగా రూపొందించాలని, నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలన్నా, ఆ జాబితాలో చేర్చాలన్నా అనుసరించాల్సిన విధానాన్ని లోపాలు లేకుండా తీసుకురావాలని సూచించారు. దీనికి సంబంధించి ఆధీకృత వ్యవస్థను కూడా బలోపేతం చేయాలని అధికారులకు వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్, పురపాలక–పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సమగ్ర భూ సర్వే ప్రగతి ఇలా..
సమీక్షలో అధికారులు సమగ్ర భూ సర్వే పనుల్లో జరిగిన  ప్రగతిని, లక్ష్యాలను సీఎంకు వివరించారు. ఆ వివరాలు..
 పైలట్‌ ప్రాజెక్టు కింద చేపట్టిన 51 గ్రామాల్లో సర్వే పూర్తయింది.
 డిసెంబర్‌ 2021 నాటికి మరో 650 గ్రామాల్లో పూర్తవుతుంది.
మండలానికి ఒక గ్రామం చొప్పున ఈ 650 గ్రామాల్లో సర్వే పూర్తిచేస్తాం.
 జూన్‌ 22, 2022 నాటికి 2,400 గ్రామాల్లో సర్వే పూర్తిచేస్తాం.
ఆగస్టు 2022 నాటికి మరో 2,400 గ్రామాల్లో పూర్తవుతుంది. è మొత్తంగా ఆగస్టు 2022 నాటికి దాదాపు 5,500 గ్రామాల్లో సర్వే పూర్తవుతుంది.
 అక్టోబరు 2022 నాటికి 3 వేల గ్రామాల్లో, అదే ఏడాది డిసెంబరుకు మరో 3వేల గ్రామాల్లో.. అలాగే మార్చి 2023కల్లా మరో మూడువేల గ్రామాల్లో సర్వే పూర్తిచేస్తాం.
  ఇక జూన్, 2023 నాటికి ఇంకో 3 వేల గ్రామాలతో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సర్వే పూర్తిచేస్తాం.

51 గ్రామాల్లో ‘పైలెట్‌’ సర్వే
 అలాగే, పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే 51 గ్రామాల్లో 30,679 కమతాలను సర్వేచేశాం.
 3,549 పట్టాదారుల వివరాలను అప్‌డేట్‌ చేశాం.
 రెవెన్యూ నుంచి 572, సర్వే వైపు నుంచి వచ్చిన 1,480 అభ్యర్థనలను పరిష్కరించాం.
 235 సరిహద్దు వివాదాలను పరిష్కరించాం.
 సంబంధిత రికార్డులను అప్‌డేట్‌ చేయడమే కాకుండా వాటిని స్వచ్ఛీకరించాం.
  సర్వే అనంతరం పూర్తి వివరాలు, మ్యాపులతో కూడిన పట్టాదారు పుస్తకాన్ని రైతులకు అందిస్తున్నాం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement