నెలాఖరు వరకు ఇళ్ల పట్టాల పంపిణీ: సీఎం | CM YS Jagan Review Meeting On Comprehensive Land Survey Today | Sakshi
Sakshi News home page

క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహించండి: సీఎం జగన్‌

Published Wed, Jan 20 2021 7:18 PM | Last Updated on Wed, Jan 20 2021 7:33 PM

CM YS Jagan Review Meeting On Comprehensive Land Survey Today - Sakshi

సాక్షి, అమరావతి: దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ 90 రోజుల్లోగా పట్టా ఇస్తామని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ విధానం సమర్థవంతంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇళ్ల పట్టాల పంపిణీని జవనరి నెలాఖరు వరకూ పొడిగించనున్నట్లు తెలిపారు. వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకంపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ బుధవారం సమీక్ష నిర్వహించారు. 

ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూశాఖ) ధర్మాన కృష్ణదాస్, సీఎస్‌ ఆదిత్యనాద్‌ దాస్, సీఎం ముఖ్య సలహాదారు నీలం సాహ్ని, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, రెవెన్యూశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వై. శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ ఎం గిరిజా శంకర్, సర్వే, సెటిల్‌మెంట్స్‌ అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ కమిషనర్‌ సిద్దార్ధ జైన్ సహా ఇతర ఉన్నతాధికారులు ఈ సమవేశంలో పాల్గొన్నారు. 

సర్వే సిబ్బందికి శిక్షణ
ఈ సందర్భంగా సమగ్ర సర్వేలో పాల్గొంటున్న సిబ్బందికి పలు దఫాలుగా శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ‘ఇప్పటికే రెండు స్థాయిల్లో పరీక్షలు నిర్వహించాం.ఇందులో 92శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మిగిలిన వారికి అవగాహన కల్పించేలా, పరిజ్ఞానం పెంచేలా శిక్షణ ఇస్తున్నాం. ఫిబ్రవరిలో మూడో స్థాయి పరీక్షలు నిర్వహిస్తాం’’ అని పేర్కొన్నారు. ఇందుకు స్పందనగా.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులకు సంబంధిత అంశాలపై సమర్థతను పెంచడానికి అవగాహన, శిక్షణ, పరీక్షలు నిర్వహించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. క్రమం తప్పకుండా ఈ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. సంబంధిత అంశాల్లో పరిజ్ఞానం, సమర్థత పెంచడమే లక్ష్యం కావాలని దిశా నిర్దేశం చేశారు. 

అదే విధంగా.. పరీక్షల్లో ఉత్తీర్ణులు అయ్యేంతవరకూ వారికి శిక్షణ ఇవ్వడంతో పాటు, సంబంధిత అంశాల్లో పరిజ్ఞానం పెంచేలా ప్రణాళిక ఉండాలని సూచించారు. తద్వారా పనితీరులో సమర్థత కనబరుస్తారని పేర్కొన్నారు. ఇక పేదలకు కొత్తగా నిర్మించనున్న కాలనీలను కూడా సర్వేలో భాగంగా తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ‘‘మ్యాపుల తయారీలో వీటినీ పరిగణలోకి తీసుకోవాలి. కాలనీల్లో ప్రతి ఇంటికీ కూడా యూనిక్‌ ఐడీ నంబరు ఇవ్వాలి. సర్వేకు గ్రామ సచివాలయ సిబ్బంది వెళ్తున్న సందర్బంలో ప్రతిరోజూ కనీసం 2 గంటల పాటు ప్రజల ఫిర్యాదులు స్వీకరణ, వాటి పరిష్కారంపై దృష్టి పెట్టాలి’’ అని సూచించారు.

రిజిష్ట్రార్‌ కేంద్రాలుగా సచివాలయాలు
గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కార్యాచరణను అధికారులు ముఖ్యమంత్రికి వివరించగా.. ఒక గ్రామంలో సమగ్ర భూ సర్వే పూర్తైన తర్వాత సంబంధిత గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రారంభం కావాలని సీఎం జగన్‌ ఆదేశించారు. గ్రామ సచివాలయాల్లోని సిబ్బంది రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో పనితీరును స్వయంగా చూసి నేర్చుకునేలా కార్యాచరణ ఉండాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఎప్పటికప్పుడు సిబ్బందికి వచ్చే సందేహాలను నివృత్తి చేయడానికి నిపుణులు, సీనియర్‌ అధికారులతో కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేయాలి. దీనివల్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు ఎలాంటి అవాంతరాలు లేకుండా నిబంధనల ప్రకారం చేసే అవకాశం సిబ్బందికి ఉంటుంది. ఇప్పటికే ఎక్కడైనా రిజిస్ట్రేషన్‌ చేసుకునే సదుపాయం ఉంది, ఇదికూడా కొనసాగేలా తగిన చర్యలు తీసుకోవాలి’’ అని ఆదేశాలు జారీ చేశారు.

ఎస్‌ఓపీ
సర్వేయరు నుంచి జేసీ వరకూ ఈ ప్రక్రియపై కచ్చితమైన ఎస్‌ఓపీలు ఉండాలని సీఎం జగన్‌ అధికారులకు స్పష్టం చేశారు. లంచాలకు తావులేని వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నంలో భాగమే సరికొత్త వ్యవస్థలు అని, మొబైల్‌ ట్రైబ్యునల్స్‌పైన కూడా ఎస్‌ఓపీలను తయారుచేయాలని ఆదేశించారు.

జనవరి 30 వరకూ ఇళ్ల పట్టాల పంపిణీ పొడిగింపు: సీఎం
ఇక ఇళ్లపట్టాలకు సంబంధించి... ప్రతి లబ్ధిదారునికి నేరుగా పట్టా పత్రం అందిస్తున్నామని, తన ఇంటి స్థలం ఎక్కడో చూపిస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఇందుకు బదులుగా.. లబ్ధిదారులకు సంతృప్తి కలిగించేలా కార్యక్రమం కొనసాగించాలని సీఎం జగన్‌ సూచించారు. ‘‘ఇళ్ల పట్టాల పంపిణీని జవనరి నెలాఖరు వరకూ పొడిగించాలి. ఇదొక నిరంతర ప్రక్రియ. ఈ విధానం సమర్థవంతంగా కొనసాగాలి. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోండి’  అని ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement