
1,193 బృందాలు.. మూడు నెలలు
రాష్ట్రంలో ఒక్క రైతుకూ నష్టం జరగని రీతిలో పూర్తి పారదర్శకంగా భూ రికార్డుల ప్రక్షాళన జరగాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
► పారదర్శకంగా భూ రికార్డుల ప్రక్షాళన.. రెవెన్యూ సమీక్షలో సీఎం
► తుది జాబితాపై రైతులందరి సంతకాలు
► పహాణీ, సేత్వారీ వంటి పదాలకు చెల్లు.. రికార్డులన్నీ ఆన్‌లైన్
సాక్షి, హైదరాబాద్
రాష్ట్రంలో ఒక్క రైతుకూ నష్టం జరగని రీతిలో పూర్తి పారదర్శకంగా భూ రికార్డుల ప్రక్షాళన జరగాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ‘‘రికార్డులన్నీ సవరించాక రైతుల భూముల వివరాలతో కూడిన తుది జాబితాపై గ్రామంలోని రైతులందరి సంతకాలూ తీసుకోవాలి. దాన్ని బహిరంగంగా, ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రచురించాలి. భూ రికార్డుల ప్రక్షాళన ఆసాంతం సులభంగా, సరళంగా, పారదర్శకంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో జరగాలి. ముందుగా చిక్కులు, వివాదాలు, సమస్యల్లేని 95 శాతం భూముల వివరాలు ఖరారు చేయాలి’’ అని సూచించారు. భూ రికార్డుల ప్రక్షాళనపై బుధవారం ప్రగతి భవన్‌లో రెవెన్యూ అధికారులతో సీఎం సమీక్ష జరిపారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి కె.తారకరామారావు, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మాహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. భూ రికార్డుల ప్రక్షాళనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సీఎం వివరించారు.
రికార్డుల గోల్‌మాల్ పోవాలి
భూ రికార్డుల ప్రక్షాళనకు 1,193 బృందాలు ఏర్పాటు చేసి ఒక్కోదానికి 9 గ్రామాల చొప్పున కేటాయించాలని సీఎం నిర్దేశించారు. ‘‘మొత్తం భూ రికార్డుల ప్రక్షాళన, సవరణకు 3 నెలలు పడుతుంది. ఏ గ్రామాలను ఏ బృందాలను కేటాయించాలనే అధికారం కలెక్టర్లది. ఇది ప్రధానంగా భూ రికార్డుల ప్రక్షాళన. రికార్డుల్లో ఉడే చిత్ర విచిత్రమైన చిక్కులు, వివాదాస్పద అంశాలన్నిటికీ ఇక తెర పడాలి. బై నంబర్ల గోల్‌మాల్ లేకుండా పోవాలి. రైతుకు న్యాయపరమైన చిక్కులు తొలగి వారు ప్రశాంతంగా సాగు చేసుకోవాలి. పహాణి, సేత్వారీ వంటి పాతకాలపు పదాల స్థానంలో సరళమైన సులభమైన తెలుగు పదాలు పెట్టండి. పహాణీలో మరీ ఎక్కువ కాలమ్స్ కూడా అనవసరం. భూ రికార్డుల ప్రక్షాళన తరవాత ఎప్పటికప్పుడు చోటుచేసుకునే మార్పులను కోర్ బ్యాంకింగ్ తరహాలో ఆన్‌లైన్ చేయాలి. ఏ సమాచారమైనా పట్టాదారులకు ఆన్‌లైన్‌లో లభ్యం కావాలి’’ అని సూచించారు.
ఇక రికార్డులన్నీ ఆన్‌లైన్‌లో
బ్యాంకుల్లో రైతుల పాస్ పుస్తకాలను కుదువ పెట్టించుకునే విధానం పోవాలని సీఎం ఆకాంక్షించారు. కంప్యూటర్ ఆధారిత సమాచారం ఆధారంగా రైతులకు రుణాలివ్వాలిన. భూ ప్రక్షాళన పూర్తయ్యేసరికి ఐటీ ఆఫీసర్ల నియామకం, కంప్యూటర్లు, సర్వర్ల కొనుగోలు, కంప్యూటర్ అనుసంధానం పూర్తవాలి. రిజిస్ట్రేషన్ జరగ్గానే మ్యుటేషన్ ప్రక్రియనూ ఎప్పటికప్పుడే చేయాలి. రైతులు తమ క్రయవిక్రయాల కోసంరిజిస్ట్రేషన్ ఆఫీసుకు ఒకేఒక్కసారి వెళ్తే పని పూర్తవాలి. తర్వాత పాస్ పుస్తకాలు కొరియర్ ద్వారా ఇంటికే రావాలి. కలెక్టర్ కోర్టు మినహా మిగతా రెవెన్యు కోర్టులన్నిటినీ రద్దు చేయాలి. భూ సంబంధ వ్యవహరాలు రాష్ట్ర పరిధిలోవే. వాటిపై రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం గనుక తదనుగుణంగా న్యాయపరమైన చిక్కులకు ఆస్కారం లేకుండా రికార్డుల ప్రక్షాళన జరగాలి’’ అని ఆదేశించారు.
త్వరలోనే తహసీల్దార్లతో భేటీ
భూ ప్రక్షాళన, రికార్డుల సవరణలను పకడ్బందీగా, త్వరితగతిన పూర్తి చేసే ఎమ్మార్వోలు, ఆర్డివోలు, అధికారులకు ప్రోత్సాహకాలు, సర్టిఫికెట్లు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. కలెక్టర్లు, ఆర్డీఓలు, రెవెన్యూ అధికారులతో గురువారం భేటీ జరగనుంది. తహశీల్దార్లందరితో త్వరలో సమావేశం ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు.