‘పవర్’ వరం...!
నవరాష్ట్రంలో ఏర్పడిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం పాలమూరుకు తొలి కేటాయింపు చేసింది. రాజధానిలో నిర్వహించిన విద్యుత్తు సమీక్షలో జిల్లాకు వేయి మెగావాట్ల థర్మల్ విద్యుత్తు కేంద్రం ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తన తొలి వరంగా ప్రకటించారు. అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. అదీ ప్రాజెక్టుల కేంద్రంగా పరిఢవిల్లుతున్న గద్వాలకు కేటాయించడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు.
గద్వాల, న్యూస్‌లైన్ : సాగునీటి ప్రాజెక్టుల కేంద్రంగా ఖ్యాతిగాంచిన గద్వాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు గురువారం భారీ థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు పచ్చజెండా ఊగింది. జూరాల ప్రాజెక్టు వద్ద, లోయర్ జూరాల వద్ద జెన్‌కో ఆధ్వర్యంలో దాదాపు 500 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు పూర్తయి విద్యుత్‌ను అందిస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న వాతావరణం, రేడియేషన్ ఆధారంగా ఇక్కడ సౌర విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే విజయవంతమవుతాయన్న లక్ష్యంతో జూరాల ప్రాజెక్టు వద్ద ఒక మెగావాట్ సౌర విద్యుత్ కేంద్రాన్ని జెన్‌కో ఏర్పాటు చేసింది. ఇది జయప్రదం కావడంతో గట్టు మండలంలో ఎన్‌ఆర్‌ఐలు దాదాపు వంద మెగావాట్ల సామర్థ్యంతో ప్రైవేటు సౌర విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే భూములను సేకరించారు. జెన్‌కో ఆధ్వర్యంలోనే గట్టు మండలంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో వేయి మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు గత మార్చినెలలో జెన్‌కో ఎంఓయూను కుదుర్చుకుంది. దీంతో గట్టు ప్రాంతంలో సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. గద్వాల మీదుగా రాయచూర్‌కు రైల్వే బ్రాడ్‌గేజ్‌లైన్ ప్రారంభం కావడంతో గద్వాల జంక్షన్‌గా అవతరించింది. ధరూరు మీదుగా వెళ్తున్న ఈ లైన్‌ద్వారా సింగరేణి, షిప్‌యార్డుల నుంచి బొగ్గును ఈ ప్రాంతానికి తీసుకొచ్చేందుకు అవకాశం ఏర్పడింది. జూరాల రిజర్వాయర్ నుంచి థర్మల్ విద్యుత్ కేంద్రానికి కావల్సిన నీటిని సరఫరా చేసే అవకాశం ఉండటంతో ఇక్కడ వేయి మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రానికి గతంలోనే ప్రతిపాదించారు. అప్పటి మంత్రి డీకే అరుణ కూడా వేయి మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇలా పెండింగ్‌లో ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో మార్గం సుగమమైంది. రీఆర్గనైజేషన్ బిల్లులోనే భారీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు అవసరమని పేర్కొన్నారు.
విద్యుత్తు లోటును భర్తీ చేసేందుకే..
తెలంగాణలో ఉన్న విద్యుత్ లోటును భర్తీ చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో భూపాలపల్లి గద్వాల వద్ద విద్యుదుత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులను ఆదేశించారు. గద్వాల వద్ద ఏర్పాటయ్యే థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ప్రభుత్వమే సొంత నిధులతో నిర్మిస్తుందని సీఎం పేర్కొన్నారు. ఈ కేంద్రానికి సింగరేణితో పాటు, విదేశాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకునే ఏర్పాట్లు చేయాలని సీఎం అదేశించినట్లు అధికారుల ద్వారా తెలిసింది. దీంతో గద్వాల ప్రాంతం విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులతో జిల్లాలోనే ప్రాజెక్టుల కేంద్రంగా నిలవబోతోంది.