ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధమేనా?: పొన్నాల
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల రీడిజైన్, అంచనాల పెంపు, అక్రమాలు, ప్రజాభిప్రాయ సేకరణ తీరుపై బహిరంగ చర్చకు సిద్ధమేనా.. అని సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సవాల్ విసిరారు. హైదరాబాద్‌లో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు, ప్రగతిభవన్‌కు పలువురు నేతలను పిలిపించుకొని కేసీఆర్ పొగిడించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
ప్రాజెక్టులు పూర్తి, రైతాంగానికి సాగునీరు అందించాలనే చిత్తశుద్ధి సీఎం కేసీఆర్‌కు లేదన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ జీవో ఇచ్చినా న్యాయస్థానాల నుంచి మొట్టికాయల్లేకుండా ఉంటున్నాయా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిరంకుశ, గఢీల పాలన సాగిస్తున్నారని విమర్శించారు.