ప్రాజెక్టులపై సీఎం ప్రజెంటేషన్ ఆకట్టుకుంది
♦ డబుల్ బెడ్‌రూం ఇళ్లు, ముస్లిం,
♦ గిరిజనులకు రిజర్వేషన్లు సాధ్యం కాదు
♦ సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నల్లగొండ టూ టౌన్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై అసెం బ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ బాగుందని, రైతుల గురించి ఆలోచించే వ్యక్తిగా తనను ఆకట్టుకుందని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతుల కోసం ప్రాజెక్టులు కట్టాల్సిన అవసరముందని, వీటి నిర్మాణాల్లో అభ్యంతరాలుంటే ఉండవచ్చని, కానీ, రీ డిజైనింగ్ చేయడంలో తప్పులేదన్నారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారి అసెంబ్లీలో ముఖ్యమంత్రి మూడు గంటలపాటు ప్రజెంటేషన్ ఇచ్చిన విధానం బాగుందని కితాబిచ్చారు. అయితే, కేవలం మాటలకే పరిమితం కాకుండా ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. ప్రాణహిత - చేవెళ్లపై అసెం బ్లీలో చర్చకు వచ్చినప్పుడు ఓ కాంగ్రెస్ నేత తాను ప్రిపేర్ అయి రాలేదని చెప్పాడని, ఇది సరైంది కాదన్నారు.
సాధ్యంకానివి.. కావు అని చెప్పండి
టీఆర్‌ఎస్‌తో పాటు సీఎం కేసీఆర్ చెబుతున్న విధంగా రాష్ట్రంలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం, గిరిజనులకు, ముస్లింలకు అదనపు రిజర్వేషన్లు సాధ్యమయ్యే పని కాదని కోమటిరెడ్డి అన్నారు. సాధ్యం కాని పనులను.. కావు అని సీఎం కేసీఆర్ ప్రజలకు చెప్పాలన్నారు. అయితే గ్రామానికి 50 చొప్పున, హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని తానే ప్రజలను కోరుతానన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒకవేళ తాను పోటీ చేయకపోయినా టీఆర్‌ఎస్ తరఫున ప్రచారం చేస్తానని చెప్పారు. ఎస్సెల్బీసీ టన్నెల్‌ను మూడేళ్లలో, బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు పనులను ఏడాదిలో పూర్తి చేస్తానని చెప్పిన సీఎం కేసీఆర్‌కు నల్లగొండ జిల్లా ప్రజల పక్షాన తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని కోమటిరెడ్డి పేర్కొన్నారు.