నా తెలంగాణ.. కోటి ఎకరాల మాగాణ
- ప్రాణం పోయినా నీళ్లు పారిస్తా
- అసెంబ్లీలో సాగునీటి విధానం ప్రజెంటేషన్‌లో సీఎం కేసీఆర్
- ఐదేళ్లలో కోటి ఎకరాలకు సాగునీరు
- మూడేళ్లలోనే 70% దాకా లక్ష్యాన్ని చేరుకుంటాం
- ప్రాజెక్టులన్నీ కడతాం.. రైతుల కన్నీళ్లు తుడుస్తాం
- సాగునీటికి రూ. 25 వేల కోట్లిచ్చాం..
- వచ్చే బడ్జెట్‌లో మరో 5 వేల కోట్లు పెంచుతాం
- గత పాలకులు మన ప్రాజెక్టులను వివాదాల్లో పెట్టారు
- మోసం చేసి నీటిని తరలించుకుపోయే యత్నం చేశారు
- మహారాష్ట్ర, కర్ణాటక ప్రాజెక్టులతో ముప్పు
- మనకు గోదావరి తప్ప గత్యంతరం లేదు
- ఇంద్రావతి, ప్రాణహితలో తప్ప నీళ్లు లేవు
- అందుకే ప్రాజెక్టులకు రీఇంజనీరింగ్ చేస్తున్నాం
- ప్రాణహిత-చేవెళ్ల, దుమ్ముగూడెం ప్రాజెక్టులు రద్దు
- కాళేశ్వరం ప్రాజెక్టుకు త్వరలోనే పునాది రాయి
- గూగుల్ మ్యాప్‌లతో ప్రజెంటేషన్ ఇచ్చిన సీఎం
సాక్షి. హైదరాబాద్: ‘‘నా ప్రాణం పోయినా సరే... రాబోయే ఐదేళ్లలో కోటి ఎకరాలకు సాగునీటిని అందిస్తా... నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నిరూపించి తీరుతా.. ఆరు నూరైనా, ఎన్ని ఆటంకాలు కల్పించినా, అవరోధాలు సృష్టించినా మా ప్రస్థానం ఆగేది కాదు. మమ్మల్నెవరూ ఆపలేరు. ఆపుదామనుకుంటే అది భ్రమే..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ప్రజల సహకారంతో ప్రాజెక్టులు కట్టి తీరుతామని... హరిత తెలంగాణ సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ‘తప్పకుండా సాగునీటిని తెస్తాం.. రైతుల కన్నీళ్లు తుడుస్తా’మని ప్రతినబూనారు. శాసనసభలో గురువారం సాగునీటి ప్రాజెక్టుల రీఇంజనీరింగ్‌పై ముఖ్యమంత్రి సమగ్ర వివరణ ఇచ్చారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గూగుల్ మ్యాప్‌ల సాయంతో ప్రాజెక్టుల వివరాలను డిజిటల్ స్క్రీన్లపై చూపుతూ.. వివరాలు తెలిపారు. ఇదే సమయంలో ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వాలు వ్యవహరించిన తీరును సీఎం కేసీఆర్ ఎండగట్టారు. రీఇంజనీరింగ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో విశ్లేషించారు. ప్రజలకు తెలియజెప్పడంతోపాటు, అసెంబ్లీ రికార్డుల్లో ఉంచేందుకే తాను ప్రజెంటేషన్ ఇచ్చినట్లు తెలిపారు. తెలంగాణను ప్రస్తుతం వేధిస్తున్న ప్రధాన సమస్య నీటి కొరతేనని చెప్పారు. తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాల నినాదంగా ఏర్పడిందని.. ప్రజల ఆశలను నెరవేర్చే బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. కేసీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే...
కోటి ఎకరాలకు నీళ్లిస్తాం
‘‘గోదావరిలో 954 టీఎంసీల వాటాను వాడుకుని తీరుతాం. ఐదేళ్లలో అన్ని జిల్లాల పరిధిలో కోటి ఎకరాలకు సాగునీటిని అందించేలా ప్రాజెక్టులు పూర్తిచేస్తాం. మూడేళ్ల వ్యవధిలోనే 60 నుంచి 70 శాతం లక్ష్యం సాధిస్తం. గతంలో ప్రాజెక్టులంటే పదేళ్ల పాటు కొనసాగేవి. ఆ సంప్రదాయాన్ని తుడిచిపారేసే నిర్ణయాలు తీసుకున్నాం. ఆర్థిక శాఖ, నీటిపారుదల శాఖల మధ్య సమన్వయంతో నిధుల వినియోగానికి గ్రీన్‌చానల్ ఏర్పా టైంది. ఈ ఏడాది బడ్జెట్‌లో ఇరిగేషన్‌కు రూ.25 వేల కోట్లు కేటాయించాం. ఇదేదో తమాషాకో, చక్కిలిగింతలు పెట్టేందుకో చెప్పే విషయం కాదు. వచ్చే ఏడాది బడ్జెట్‌లో మరో రూ.5,000 కోట్లు ఎక్కువ కేటాయిస్తాం.
ప్రాణహిత-చేవెళ్ల లేనే లేదు
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రద్దయింది. ఇకపై ఆ పేరు కూడా ఉండదు. దాని స్థానంలోనే తమ్మిడిహెట్టి బ్యారేజీ ద్వారా ఆదిలాబాద్ జిల్లాకు నీరందిస్తాం. మహారాష్ట్ర సీఎంను పిలిచి కాళేశ్వరం ప్రాజెక్టుకు త్వరలోనే పునాది రాయి వేస్తాం. మహారాష్ట్రతో పంచాయితీ కావాలా.. పొలాలకు నీళ్లు రావాలా.. అని సభ్యులే ఆలోచించాలి. గోదావరి నీటిని వాడుకోవడం తప్ప గత్యంతరం లేదు. ఇంద్రావతి, ప్రాణహితలో తప్ప నీళ్లు లేవు. తెలంగాణ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కాళేశ్వరం నిర్మించాల్సి ఉంది. దీంతోనే నిజాంసాగర్‌కు పూర్వవైభవం. మేడిగడ్డ నుంచి శ్రీరాంసాగర్ వరకు 250 కిలోమీటర్ల పొడవునా గోదావరికి జలకళ, జీవకళ వస్తుంది.
మహారాష్ట్ర ప్రాజెక్టులతో ముప్పు
గోదావరి, కృష్ణా వాటి ఉప నదులపై మహారాష్ట్ర, కర్ణాటక నిర్మిస్తున్న ప్రాజెక్టులతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు ముప్పే. రెండు రాష్ట్రాలు దాదాపు 450 బ్యారేజీలు నిర్మించాయి. పెన్‌గంగపై మహారాష్ట్ర ఇప్పటికే 31 ప్రాజెక్టులు కట్టింది. మరో 9 కడుతున్నారు. వాటితో దాదాపు 1,300 టీఎంసీల నీరు ఆగిపోతోంది. ప్రతి నదిపై ఇబ్బడి ముబ్బడిగా బ్యారేజీలు కట్టి లిఫ్ట్‌లతో నీటిని తరలించుకుపోతున్నారు. దాంతో మంజీరా, ఎస్సారెస్పీ, శ్రీశైలం ప్రాజెక్టులకు చుక్కనీరు రాక ఎండిపోతున్నాయి. ఎగువన భారీగా వర్షాలు కురిసి చెరువులు, ప్రాజెక్టులన్నీ నిండితే తప్ప తెలంగాణకు నీళ్లు రావు. కేంద్రం, సీడబ్ల్యూసీ, సుప్రీంకోర్టుకు వెళ్లినా వివాదాలే తప్ప నీళ్లు వచ్చే పరిస్థితి లేదు.
తెలంగాణ ప్రాజెక్టులంటేనే కిరికిరి
సమైక్య పాలకులకు సద్భుద్ధి లేదు. నీళ్లిచ్చే ఉద్దేశం లేదు. తెలంగాణ ప్రాజెక్టులంటేనే వివాదంలో పెట్టారు. అంతర్రాష్ర్ట వివాదాల్లో కూరుకుపోయేలా కుట్రలు చేశారు. పర్యావరణ అనుమతుల నెపంతో మోసం చేశారు. ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి అప్పట్లో బీజేపీ నేతలు గోదావరి జల యాత్ర చేశారు. అప్పట్నుంచీ ఇదే దుస్థితి. నిజాంసాగర్ వట్టి పోయేటట్లు చేసిన ఘనత సమైక్య పాలకులదే.
వాటా ఉన్నా నీరు ఎందుకు రాలేదు
ఉమ్మడి రాష్ట్ర లెక్కల ప్రకారమే తెలంగాణ వాటాగా గోదావరిలో 954 టీఎంసీలు, కృష్ణాలో 299 టీఎంసీల నికర జలాలు, 77 టీఎంసీల మిగులు జలాలున్నాయి. మైనర్ ఇరిగేషన్ చెరువులు, కుంటల కింద 259 టీఎం సీలు, మధ్యస్థాయి, పెద్ద ప్రాజెక్టుల కింద 1,071 టీ ఎంసీల వాటా ఉంది. ఇప్పుడున్న ఒక లెక్క ప్రకారం తెలంగాణలో 1.65 కోట్ల ఎకరాల సాగు యోగ్య భూ మి ఉంది. మరో లెక్క ప్రకారం 1.11 కోట్ల ఎకరాలుం ది. గోదావరి, కృష్ణాలలో 1,330 టీఎంసీలు వాటా ఉంటే ఈ మాత్రం భూమికి నీరు ఎందుకు అందలేదు.
మూర్ఖపు కుట్రలు
1960లోనే సమైక్య ప్రభుత్వం కిన్నెరసాని ప్రాజెక్టును కేవలం విద్యుత్ కోసం చేపట్టింది. అదో కుట్ర. 20వేల ఎకరాలకు నీటిని అందించాలని గిరిజనులు కోరినా పట్టించుకోలేదు. రీజనరేటెడ్ నీటిని తమ ప్రాంతానికి మళ్లించుకునే మోసం అది. 1996-99లో ఈ ప్రాజెక్టును వన్యప్రాణి సంరక్షణ ప్రాంతంలోని ఎకో జోన్‌గా గుర్తించారు. దీంతో మరో నష్టం జరిగింది. 18 కిలోమీటర్లు ఎకో జోన్, 22కిలోమీటర్లు అటవీ భూములు.. ఇలా 40 కిలోమీటర్ల పొడవునా రాజీవ్‌సాగర్ పైపులైన్ పనులు మధ్యలో ఆగిపోయాయి. మిగతా పనులకు మాత్రం రూ.150 కోట్లు అంచనాలు పెంచారు. ప్రాజెక్టు పూర్తయ్యాక చేయాల్సిన మోటార్లు, పంపుల కొనుగోళ్లకు రూ.750 కోట్లు బిల్లులు ముందే చెల్లించారు. ఎవరి కమీషన్లు వాళ్లు తీసుకుని, పైపులు పక్కన పడేశారు. దుమ్ముగూడెం టెయిల్‌పాండ్‌తో తెలంగాణకు లాభమేమీ లేదు. సాగర్ ఎడమకాల్వకు నీటిని బంద్‌పెట్టి టెయిల్‌పాండ్ నీటిని లిఫ్ట్ ద్వారా పాలేరులో ఎత్తిపోస్తారట. ధవళేశ్వరానికి గోదావరి నీటిని తరలించే కుట్ర ఇది. ఇక రుద్రంకోట వద్ద ఇందిరాసాగర్ ప్రాజెక్టును నిర్మించాల్సిన అవసరం లేదు. ఏడు మండలాలు ఏపీలో కలవడంతో ఆ ప్రాజెక్టు వాళ్ల భూభాగంలోకి వెళ్లింది. అలాంటప్పుడు ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ రీడిజైనింగ్ అవసరమా, కాదా ఆలోచించండి.
కంతనపల్లితో ఆదివాసీల ముంపు: 2001లో టీఆర్‌ఎస్ వరంగల్‌లో బహిరంగ సభ పెట్టంగానే... ఆగమాగం దేవాదుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 50 టీఎంసీల నీటితో ఐదు లక్షల ఎకరాలకు నీరందించే ఈ ప్రాజెక్టును 18 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. ఇప్పుడు 2016. అది పూర్తి కాలేదు. ఇప్పటికే రూ.8,000 కోట్లు ఖర్చయింది. ఆ ప్రాజెక్టును వినియోగంలోకి తెచ్చుకోవాల్సి ఉంది. దేవాదుల పంప్‌హౌజ్‌కు నీటిని అందించే కంతనపల్లి దగ్గర బ్యారేజీ మరో కుట్ర. అది నిర్మిస్తే 11,500 ఎకరాల ఆదివాసీల భూములు ముంపునకు గురవుతాయి. ఛత్తీస్‌గఢ్‌తోనూ అంతర్రాష్ట వివాదం పెట్టారు. తుపాకులగూడెం దగ్గర బ్యారేజీ కడతాం. ముంపు లేకుండా చేస్తాం. ఇది రీడిజైన్ చేయాల్సిన అవసరం లేదా..
సొరంగంలో ఆగిన ఎస్‌ఎల్‌బీసీ
కొనసాగించడం తప్ప గత్యంతరం లేని ప్రాజెక్టు ఎస్‌ఎల్‌బీసీ. లిఫ్టా, సొరంగమా అన్న చర్చల తర్వాత ప్రపంచంలోనే పొడవైన టన్నెల్‌తో ప్రాజెక్టు చేపట్టారు. ఇప్పటికీ సొరంగం తవ్వకం పూర్తికాలేదు. టన్నెల్ బోర్ మెషీన్లు భూగర్భంలోనే ఉన్నాయి. ఎప్పుడు తవ్వకం పూర్తవుతదంటే ఇంకో మూడేళ్లు పడుతుందంటున్నారు. అప్పటిదాకా ఎదురుచూడ్డం తప్ప చేసేదేం లేదు. ఈ ప్రాజెక్టును కూడా టైగర్ వ్యాలీ జోన్‌తో ముడిపెట్టారు.
పాలమూరును సస్యశ్యామలం చేస్తాం
పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తాం, వలసలను నివారిస్తాం. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అత్యంత వేగంగా పూర్తి చేస్తాం. దీనిద్వారా దక్షిణ తెలంగాణకు పూర్తిస్థాయిలో నీళ్లు వస్తాయి. ఈ ప్రాజెక్టులో అవకతవకలు ఉన్నాయని ఆ జిల్లా నేతలే కోర్టులో పిటిషన్ వేయడం సరికాదు. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా జూన్ నాటికి 1.50 లక్షల ఎకరాలకు నీళ్లిస్తాం. నార్లాపూర్, వట్టెం, కరివెన, ఉద్దండపూర్ రిజర్వాయర్లను పూర్తిచేస్తాం. ఈ ప్రాజెక్టు ద్వారా 8 లక్షల ఎకరాలకు నీళ్లిస్తాం. నెట్టెంపాడు నిర్మాణం పూర్తికావచ్చింది. దీనిలో ప్రతిపాదిత ఆయకట్టు కంటే అదనంగా 25 వేల ఎకరాలకు నీరు అందిస్తాం. భీమా ప్రాజెక్టు వచ్చే ఏడాదికల్లా పూర్తవుతుంది. ఆర్డీఎస్ కింద నష్టపోయిన ఆయకట్టును తుమ్మిళ్ల వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి తిరిగి రాబట్టుకుంటం. నెట్టెంపాడు రెండో దశలో గట్టు మండలంలో అదనంగా 20 వేల ఎకరాలకు నీరిస్తాం. డిండి రిజర్వాయర్ నుంచి దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సాగునీటిని అందిస్తాం. ఇదే నీటిని రాచకొండ వరకు తరలించి హైదరాబాద్‌కు తాగునీటి అవసరాలు తీర్చే రిజర్వాయర్‌ను నింపుతాం. ఎస్‌ఎల్‌బీసీలో అంతర్భాగమైన ఉదయసముద్రం నుంచి బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టుకు నీటిని తరలిస్తాం.
ఈ ఏడాదిలోనే ఆయకట్టుకు నీటిని అందిస్తాం. ఖమ్మం జిల్లాలో చేపట్టనున్న భక్త రామదాసు, శ్రీసీతారామ ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేస్తాం. ఆదిలాబాద్ జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టులైన రోళ్లవాగు, మత్తడివాగు ఈ సీజన్‌లోనే పూర్తవుతాయి. గొల్లవాగు, జగన్నాథపూర్ ప్రాజెక్టులు వచ్చే సీజన్‌లో, కొమురం భీమ్ ప్రాజెక్టును 2018లో పూర్తిచేస్తాం. సదర్‌మాట్ వద్ద బ్యారేజీ నిర్మించి ఆయకట్టును 20 వేల ఎకరాలకు పెంచుతాం. కడెం వాగుపైన 6.5 టీఎంసీలతో కుట్టి ప్రాజెక్టు నిర్మిస్తాం. డీపీఆర్‌లు తయారవుతున్నాయి. కుంటాల జలపాతం జీవంగా ఉండటంతో పాటు కడెం ప్రాజెక్టుకు నీటి నిల్వకు ఢోకా ఉండదు. ఈ ప్రాజెక్టులో ఉన్న లోటు ఆయకట్టుకు నీటిని అందించేందుకు గూడెం ఎత్తిపోతల పథకం నిర్మించాం. లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టు తెలంగాణలో పెద్ద జోక్. మరో యాభై ఏళ్లు నిరీక్షించినా జరిగే పని కాదు. లెండి ప్రాజెక్టు దొంగది కాదు.. దొడ్లకు రాదు అన్నట్లుగా ఆగిపోయింది. అందుకే 50 వేల ఎకరాలకు నీటిని అందించేందుకు ఛనఖా-కొరటా బ్యారేజీని కడుతున్నాం. బాసర దగ్గర గోదావరిపై చెక్‌డ్యామ్ నిర్మిస్తున్నాం...’’