మంత్రి జగదీశ్‌రెడ్డి
♦ఎస్సారెస్పీ కాలువను పొడిగిస్తే ఎందుకు ఊరుకున్నారు...
♦ ఎక్కడా లేని విధంగా ఎస్సెల్బీసీ టన్నెల్ రూపొందిస్తే మాట్లాడలేదేం..
♦ అప్పులు తెచ్చిన పార్టీల్లోనే మీరు పనిచేయలేదా..
♦ జానా, ఉత్తమ్, సుఖేందర్, కోమటిరెడ్డి అప్పుడేం చేశారు..
♦ కాంగ్రెస్ దిగ్గజాలపై మంత్రి జగదీశ్‌రెడ్డి ఫైర్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : సాగునీటి ప్రాజెక్ట్‌లపై అసెంబ్లీలో సీఎం ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ వినకుండా.. దొంగల్లా పారిపోయిన కాంగ్రెస్ నేతలు చిలువలు పలువలు చేసి మాట్లాడుతున్నారని, 30 ఏళ్ల పాటు ప్రజలకు ప్రాతినిధ్యం వహించిన ఘనత కలిగిన ఈ నేతలు సమైక్య రాష్ట్రంలో నల్లగొండ జిల్లాకు జరిగిన అన్యా యం గురించి ఎందుకు మాట్లాడలేదని రాష్ట్ర మంత్రి జి.జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. నాడు పదవుల కోసం, బీ ఫారాల కోసం పెద్ద బానిసలుగా పనిచేసిన కాంగ్రెస్ నేతలు... ఇప్పుడు కేసీఆర్ స్పష్టమైన అవగాహనతో తెలంగాణను బాగు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు.
జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, నల్లగొండ నియోజకవర్గ ఇన్‌చార్జి దుబ్బాక నర్సింహారెడ్డితో కలిసి మాట్లాడారు. జిల్లాకు చెందిన కాంగ్రెస్ పెద్దలపై ఫైర్ అయ్యారు. జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాడు నల్లగొండకు జరుగుతున్న అన్యాయం గురించి ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు.
సీఎం అసెంబ్లీలో చేసిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై జిల్లా కాంగ్రెస్ నేతలు తలోరకంగా మాట్లాడుతున్నారని, అసలు వారు మాట్లాడేది వాళ్లకు అర్థం అవుతుందా అని ప్రశ్నించారు. తామేమీ అసెంబ్లీలో వారి నోట్లో గుడ్డలు పెట్టలేదని, కళ్లకు గంతలు కట్టలేదని, తెలంగాణ ప్రజలకు నీళ్లెలా తాపాలో చెప్పామన్నారు. అయినా.. కాంగ్రెస్ నేతలు పారిపోయారని, ఓట్లేసిన ప్రజలు నిలదీస్తారనే అక్కసుతోనే చిల్లర రాజకీయాలకు కాంగ్రెస్ నేతలు పాల్పడుతున్నారన్నారు.
అందుకే ఓ నాయకుడు ప్రాజెక్టుల్లో కుంభకోణం జరుగుతుందంటే... మరో నేత తాను ప్రిపేర్ అయి రాలేదని, ఇంకో నాయకుడు అప్పులివ్వద్దని లేఖలు రాస్తున్నామని అంటున్నారని కాంగ్రెస్ నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. 30 ఏళ్లుగా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని గొప్పలకు పోతున్న కాంగ్రెస్ నేతలు ఒక్కరోజైనా ప్రజల గురించి ఆలోచించలేదన్నారు. తాము కాంగ్రెస్ నాయకుల్లా డప్పాలు కొట్టలేమని.. చేసిన పనిని చూసిన తర్వాతే ఓట్లేయమని ప్రజలను అడుగుతామని.. అదే టీఆర్‌ఎస్, కేసీఆర్ నైజమని అన్నారు.
ఆ ఆలోచన ఎందుకు రాలేదు...
జిల్లా కాంగ్రెస్ నేతలు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడాల్సిన మాటలను ఎందుకు మాట్లాడలేకపో5యారని, ప్రపంచంలో ఎక్కడా లేని సమస్యలు తెలంగాణ ప్రాజెక్ట్‌లకే ఎందుకు వస్తాయని, అన్ని సమస్యలూ తెలంగాణ చుట్టూనే ఎందుకు తిరుగుతాయనే ఆలోచన కాంగ్రెస్ నేతలకు ఎందుకు రాలేదని మంత్రి జగదీశ్ నిలదీశారు. ‘నీటి సామర్థ్యంతో సంబంధం లేకుండా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (ఎస్సారెస్పీ) కాల్వలను హనుమంతుడి తోకలా పెంచుకుంటూ పోతుంటే ప్రశ్నించే దమ్ము ఈ కాంగ్రెస్ నేతలకు ఎందుకు లేదు..
ఎందుకు దద్దమ్మల్లా కూర్చున్నారు.. 10 టీఎంసీల నీటిని 16లక్షల ఎకరాలకు పారిస్తామని చెప్పి ప్రాణహిత - చేవెళ్ల ప్రారంభించినప్పుడు ఎందుకు సంకలు గుద్దుకుని కొ బ్బరికాయలు కొట్టి వచ్చారు.. ఆనాడు ఏ క్షణమైనా ఆలోచించారా.. ప్రపంచం లో ఎవరికీ అర్థం కాని విధంగా శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్సెల్బీసీ) సొ రం గం డిజైన్ రూపొందించినప్పుడు ఏం చేశారు.. నాలుగు దశాబ్దాలైనా ఈ ప్రాజెక్ట్ పూర్తి కాకపోతే ఏం చేశారు..’ అని ప్రశ్నించారు. తామేదో అప్పులు తెస్తున్నామని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని... అప్పులు తేవడం నేర్పిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లో ఎంపీ సుఖేందర్‌రెడ్డి పనిచేయలేదా అని అడిగారు. మున్సిపల్ వైస్‌చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, టీఆర్‌ఎస్ నేతలు రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, మాలె శరణ్యారెడ్డి, అబ్బగోని రమేశ్‌గౌడ్, బకరం వెంకన్న పాల్గొన్నారు.