ప్రతిపక్షాలకు అవకాశం లేకుంటే సభలో ఎందుకు..?
♦ సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వ ప్రెజెంటేషన్‌కు వ్యతిరేకత
♦ సభలో సమయం ఇవ్వకుంటే జనంలోకి వెళ్తామంటున్న కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులపై శాసనసభలో ప్రభుత్వం ఇవ్వదలిచిన పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌పై కాంగ్రెస్‌పార్టీలో చర్చ తీవ్రం అవుతోంది. భావితరాలపై కీలకప్రభావం చూపించే సాగునీటి ప్రాజెక్టులపై నిర్ణయాలను తీసుకోవడానికి ముందు ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు చర్చకు పెట్టడం వల్ల ప్రజలకు ఉపయోగం లేదని కాంగ్రెస్‌పార్టీ వాదిస్తోంది. తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్ జిల్లాలపై ప్రభావం చూపించే ప్రాణహిత డిజైన్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టం వచ్చినట్టుగా మార్చేశారని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. ముఖ్యమంత్రిగా వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ఉన్నప్పుడు తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో నిర్మించ తలపెట్టిన ప్రాణహితను 148 మీటర్లకు తగ్గించడం వల్ల తెలంగాణకు భవిష్యత్తులో తీవ్ర నష్టమని, దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
అయితే ప్రాణహిత ప్రాజెక్టు ఎత్తును 4 మీటర్ల మేర తగ్గిస్తూ మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడాన్ని సమర్థించుకోవడానికి శాసనసభను వేదికగా చేసుకోవాలనే వ్యూహంతో సీఎం కేసీఆర్ ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. ప్రాణహిత ఎత్తును తగ్గిస్తూ తెలంగాణ ప్రయోజనాలను సీఎం కేసీఆర్ తాకట్టుపెట్టారనే ప్రచారం క్రమంగా ప్రజల్లోకి వెళుతున్నదని.. దీనికి భయపడిన ప్రభుత్వం పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా దాన్ని అడ్డుకోవాలని అనుకుంటుందని కాంగ్రెస్‌పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు విశ్లేషిస్తున్నారు.
ప్రజెంటేషన్‌పై చర్చకు ఒత్తిడి
అధికారపక్షమే ఏకపక్షంగా తన వాదనను శాసనసభలో వినిపించి, ప్రతిపక్షాల వాదనలను వినిపించకుండా గొంతునొక్కే కుట్రలకు దిగుతుందని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. దీనిని అడ్డుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించాలని, అవసరమైతే శాసనసభలో మిగిలిన పార్టీలతో సమన్వయం చేసుకుని ఈ అంశంపై చర్చకు ఒత్తిడి తేవాలని భావిస్తోంది. ‘ఒక్క అధికారపక్ష వాదనకే పరిమితమై పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలనుకుంటే కమిటీ హాలులోనూ, పార్టీ కార్యాలయంలోనూ చేసుకోవచ్చు. శాసనసభలోనే మాట్లాడాలనుకుంటే సభలోని అన్ని పక్షాలకు సమానమైన అవకాశం, సమయం ఇవ్వాలి. 152 మీటర్లున్న ప్రాజెక్టు ఎత్తును 148 మీటర్లకు ఎందుకు తగ్గించిందో? తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టును నిర్మిస్తే గ్రావిటీ ద్వారా వచ్చే అవకాశముంది. అలా కాకుండా గోదావరిపై కిందభాగంలో తక్కువ ఎత్తు ప్రాజెక్టులను నిర్మించడం వల్ల శాశ్వతంగా లిఫ్టుల ద్వారా నీటిని అందించాల్సి ఉంటుంది.
సహజంగా నీటి పారుదలను కాదని, లిఫ్టులను నిర్మించడం, వాటికి శాశ్వతంగా నిర్వహణ వ్యయం వంటి పెనుభారాలను రాష్ట్ర ప్రజలపై మోపాల్సిన అవసరం ఏమిటి? ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం తీసుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇందుకు భిన్నంగా 152 మీటర్ల ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తూ 148 మీటర్లకు అంగీకరిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తూ, తెలంగాణ ప్రభుత్వమే మహారాష్ట్ర ప్రతినిధిగా వ్యవహరించింది. పాలమూరు ఎత్తిపోతల పథకంలోనూ జూరాల నుంచి కాకుండా శ్రీశైలం నుంచి ఎత్తిపోతలకోసం లిఫ్టులను నిర్మించాలని ప్రతిపాదించింది.
దీనివల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. వీటిని శాసనసభలో మాట్లాడే విధంగా ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తామంటే శాసనసభలో అధికారపక్షం చేస్తున్న ప్రతిపాదనను అంగీకరిస్తాం. లేకుంటే అడ్డుకోవడానికి అన్ని మార్గాలను అనుసరిస్తాం. అవసరమైతే జనంలోకి వెళ్తాం’ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ శాసనసభ్యుడొకరు స్పష్టం చేశారు. అయితే ప్రతిపక్షాల అభిప్రాయాలను పట్టించుకోకుండా, అధికారపక్షం ఏకపక్షంగా వ్యవహరిస్తే ఈ అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోతామని చెప్పారు.