పర్యావరణ పరిరక్షణ చట్టానికి తూట్లు | Kakarapalli thermal power plant ownership | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణ చట్టానికి తూట్లు

Published Thu, Jul 23 2015 12:33 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

Kakarapalli thermal power plant ownership

శ్రీకాకుళం అర్బన్: సంతబొమ్మాళి మండలం కాకరాపల్లి ఈస్ట్‌కోస్ట్ థర్మల్ ప్రాజెక్టు యాజమాన్యం పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని కాకరాపల్లి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ ప్రతినిధులు ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలోని ఎన్జీవో కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పోరాట కమిటీ ప్రతినిధి తాండ్ర ప్రకాష్ మాట్లాడారు. కాకరాపల్లి ఈస్ట్‌కోస్ట్ థర్మల్ ప్లాంట్ యాజమాన్యం సాగిస్తున్న చట్టవిరుద్ధ నిర్మాణాలను క్రమబద్ధీకరించడానికి పర్యావరణ మంత్రిత్వశాఖ ఐదుగురితో సబ్‌కమిటీని నియమించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. కాకరాపల్లి ఈస్ట్‌కోస్ట్ థర్మల్ ప్లాంట్ యాజమాన్యం మొదటి నుంచి అబద్దాలతో, మోసాలతో పాలకపార్టీల నాయకులను లోబరుచుకోవడం, అధికారులను లొంగదీసుకోవడం, చట్టవిరుద్ధ చర్యలను యథేచ్ఛగా సాగించడం వంటివి చేస్తోందన్నారు. పంట భూములు, చిత్తడి నేలల్లో ప్లాంట్‌లు కట్టరాదనే ప్రభుత్వాల జీవోలను ఉల్లంఘించిందన్నారు.
 
   పెద్ద ఎత్తన తాగునీటిని, సాగునీటిని అందిస్తూ, వేలాది మత్స్యకారుల కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తూ వస్తున్న చిత్తడి నేలల్లో బీల భూములను భంజరు భూములుగా చూపిస్తూ ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. పోరాట కమిటీ ప్రతినిధి ఎ.హన్నూరావు మాట్లాడుతూ ప్లాంట్ నిర్మాణంతో వేలాది ఎకరాల్లో ఉప్పు పండించే 10 వేల మంది రైతులు జీవనాధారం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు.థర్మల్‌ప్లాంట్ ప్రభావం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తేలినీలాపురం వలస పక్షుల విడిది కేంద్రంపై పడే ప్రమాదం ఉందన్నారు.
 
  పర్యావరణ అనుమతి ఉల్లంఘనను క్రమబద్ధీకరించుకునేందుకు ఐదుగురితో సబ్‌కమిటీని రూపొందించుకుందని విమర్శించారు. ఈ కమిటీ ఈనెల 24వ తేదీ సాయంత్రం 5గంటలకు విశాఖపట్టణం చేరుకుని 25, 26 తేదీల్లో పరిశీలనకు రానున్నదని పేర్కొన్నారు. బాదిత రైతాంగం, మత్స్యకారులు, ఉప్పురైతులు, పర్యావరణకారులు, మేధావులు స్పందించి ఈ సబ్ కమిటీకి వాస్తవాలను వివరించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పోరాటకమిటీ ప్రతినిధులు ఎం.నరసింగరావు, ఎన్.వెంకటరావు, ఎన్.ఎస్.విజయ్‌కుమార్, కె .వి.జగన్నాథరావు, మార్పు మల్లేశ్వరరావు, పోరాట కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement