- వీర్లపాలెం ప్లాంటుపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక
- 10,656 ఎకరాల్లో సర్వే.. ప్లాంటుకు అవసరమయ్యేది 7,500 ఎకరాలే
- మెయిన్ ప్లాంటుకు 2,200 ఎకరాలు.. గ్రీన్‌బెల్ట్‌కు 1,000 ఎకరాలు
- నల్లగొండ జిల్లాలో 46 చోట్ల ప్రభుత్వ భూమి గుర్తింపు
- ఆ మేరకు అటవీశాఖకు బదలాయింపు
- రాష్ట్రవ్యాప్తంగా 10,140 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రయత్నాలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని వీర్లపాలెం-దిలావర్‌పూర్ అటవీభూముల్లో ఏర్పాటు చేయతలపెట్టిన 6,800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక దశ పూర్తయింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన భూములను జిల్లా యంత్రాంగం సర్వే చేసి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది. మొత్తం 10,656 ఎకరాల్లో సర్వే చేయగా, థర్మల్ ప్లాంటు ఏర్పాటుకు 7,500 ఎకరాలు సరిపోతుందని అధికారుల అంచనా. ఈ మేరకు అన్ని వివరాలతో కూడిన నివేదికను నల్లగొండ కలెక్టర్ టి.చిరంజీవులు ప్రభుత్వానికి పంపారు. ఇందులో జిల్లా పూర్తి సమాచారంతో పాటు జిల్లాలో ప్రాజెక్టు ఏర్పాటుకు ఉన్న సానుకూలాంశాలు, కావాల్సిన భూముల వివరాలు, అటవీభూములకు ప్రత్యామ్నాయంగా ఇవ్వాల్సిన ప్రభుత్వ భూముల వివరాలు, పునరావాసం, పరిహారం చెల్లింపు తదితర అంశాలను పొందుపర్చారు.
1,314 ఎకరాల పట్టా భూమి
థర్మల్ ప్లాంటు ఏర్పాటు కోసం గత నెల 26వ తేదీ నుంచి దామరచర్ల మండలంలోని ముదిమాణిక్యం వీర్లపాలెం, తాళ్లవీరప్పగూడెం, దిలావర్‌పూర్, కొండ్రపోలు, నర్సాపురం, కల్లేపల్లి, తిమ్మాపురం, కొత్తపల్లి గ్రామాల్లోని 10,656 ఎకరాల్లో సర్వే నిర్వహించారు. ఇందులో 1,314 ఎకరాలు పట్టా భూమి కాగా, మిగిలినదంతా అటవీభూమే. ఈ 1,314 ఎకరాల్లో 339 మంది పట్టాదారులకు సంబంధించిన 405 ఎకరాల భూమి ఉంది. మరో 531 మందికి సంబంధించిన 909 ఎకరాల భూమికి ఆర్‌వోఎఫ్‌ఆర్ చట్టం కింద హక్కులు కల్పించాలన్న దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నా యి.
ఇవి, మినహా అటవీభూమి అందుబాటులో ఉందని రెవెన్యూ యంత్రాంగం తేల్చింది. పట్టా భూములకు సంబంధించి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని నివేదికలో వివరించారు. అటవీభూమికి ప్రత్యామ్నాయంగా ఇవ్వాల్సిన ప్రభుత్వ భూమిని కూడా గుర్తించినట్టు ఆ నివేదికలో పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 46 చోట్ల 7,100 ఎకరాలను గుర్తించామని, వీర్లపాలెం భూములను తమకు బదలాయిస్తే ఆ మేరకు ప్రభుత్వ భూమిని అటవీశాఖకు ఇస్తామని కలెక్టర్ పంపిన నివేదికలో వివరించారు. ప్రాజెక్టు కోసం తలపెట్టిన భూమికి రోడ్డు, రైలుమార్గాలు అందుబాటులో ఉన్నాయని, 30 కి.మీ.దూరంలో మిర్యాలగూడ ఉందని, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 200 కి.మీ. దూరంలో ఈ స్థలం ఉందని నివేదికలో వివరించారు. దీంతోపాటు ఏడాదంతా ప్రవహించే కృష్ణానది సమీపంలోనే ఉందని, వాతావరణ పరిస్థితులు పూర్తిస్థాయిలో అనుకూలంగా ఉన్నాయని ఆ నివేదికలో వివరించారు.
400 ఎకరాల్లో కాలనీ ఏర్పాటు
ప్రధాన ప్లాంటు (టర్బైన్లు) నిర్మాణానికి 2,200 ఎకరాలు, బొగ్గు నిల్వ, సరఫరా ఏర్పాట్లకు 400, బూడిద, ఇతర వ్యర్థాలను వదిలేందుకు 2,000, గ్రీన్‌బెల్ట్ కింద 1,000 చొప్పున ఎకరాలు అవసరం అవుతాయని, మరో 400 ఎకరాల్లో ప్లాంటు నివాస కాలనీని ఏర్పాటు చేయవచ్చని, మరో 1,500 ఎకరాలు ప్లాంటు మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగపడుతుందని నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదికనే సీఎం కేసీఆర్ తన తదుపరి ఢిల్లీ పర్యటనలో కేంద్రం ముందుంచుతారని తెలుస్తోంది. మరోవైపు ఈ ప్రాజెక్టును ఎన్టీపీసీ, జెన్‌కో సంయుక్తంగా చేపట్టాలని నిర్ణయం తీసుకున్నందున, జెన్‌కో సమగ్ర నివేదిక సిద్ధమవుతోందని, ఇక, ఎన్టీపీసీ బోర్డు ఢిల్లీలో సమావేశమై ప్లాంటు నిర్మాణానికి ఆమోదం తెలిపితే అనుమతుల ప్రక్రియ ప్రారంభం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అన్నీ సవ్యంగా జరిగి అటవీభూముల బదలాయింపునకు కేంద్రం అంగీకరిస్తే... భూమిని ఏడాదిలోపు ప్రాజెక్టు నిర్మాణదారులకు అప్పగించేస్తామని, దీనిపై సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నారని కలెక్టర్ టి.చిరంజీవులు ‘సాక్షి’కి తెలిపారు.
భూముల క్రమబద్ధీకరణతో రూ.15 వేల కోట్ల ఆదాయం
పెబ్బేరు: రాష్ట్రంలోని ప్రభుత్వ భూములన్నీ క్రమబద్ధీకరించి వేలం వేస్తే సుమారు రూ.15 వేల కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ భూములను గుర్తించి ఆక్రమణలకు గురికాకుండా చూస్తామన్నారు. దీంతోపాటు కొన్ని భూములను వేలం వేసి వాటిద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్రాభివృద్ధికి వినియోగించుకుంటామని తెలిపారు.
కొత్త రాష్ట్రం ఏర్పాటు కావడం వల్ల ఐఏఎస్‌ల కొరత ఏర్పడిందని.. వారం రోజుల్లో ఈ సమస్య పరిష్కారం అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఎంసెట్ నోటిఫికేషన్ జారీ చేశామని, కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొండి వైఖరితో ఇబ్బందులు తలెత్తుతున్నాయని రాజీవ్‌శర్మ చెప్పారు. త్వరలోనే సమస్యను అధిగమించి ఎంసెట్ నిర్వహిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకం, ప్రాణహిత-చేవెళ్ల తదితర సాగునీటి పథకాలను వీలైనంత త్వరగా పూర్తయ్యేలా చూస్తామన్నారు.
వ్యవసాయరంగంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తామని తెలిపారు. గతంలో ఉన్న పింఛన్‌దారులలో అనర్హులను తొలగించడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయని.. అర్హులైన ప్రతి ఒక్కరికీ తప్పకుండా పింఛన్ అందుతుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒకేచోట ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు. దీంతో పాలనాపరంగా సులభంగా ఉండటంతో పాటు ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు.