wilderness
-
మాయా ఉంగరం
పురవీధుల్లో ప్రజలు జయజయ ధ్వానాలు చేస్తుండగా జంట పంచకళ్యాణి గుర్రాలను పూన్చిన స్వర్ణరథంపై విజయోల్లాసంతో ఊరేగుతూ యుద్ధరంగం నుంచి తన రాజ్యంలోకి ప్రవేశించాడు ఆనందవర్మ. ప్రజల జేజేలు అందుకుంటూ కోటలోకి చేరాడు. మహారాణి మంజులతాదేవి ఆయనకు హారతిపట్టి ఆహ్వానించింది. సుగంధ తైలాలు కలిపిన నీటితో జలకాలాడిన ఆయన యుద్ధ బడలికతో విశ్రమించాడు. మంత్రి కుశలపాలుడు ఆస్థానవైద్యుడిని పిలిపించగా ఆయన రాజుగారి గాయానికి మూలికలతో వైద్యం చేయటం ప్రారంభించాడు. సరిగ్గా అప్పుడు వేటకువెళ్ళిన యువరాజు ప్రద్యుమ్నుడు రాజమందిరంలోకి ప్రవేశించాడు.‘నాన్నగారూ..విజయాన్ని చేపట్టి వచ్చిన మీకు మా ప్రణామాలు. మన మహోజ్వల రాజ్యానికివే నా జేజేలు‘ అన్నాడు తండ్రి చెంతకు వచ్చి.‘నాయనా..ధన్యవాదాలు. తండ్రిగారిమీది గౌరవం, సామ్రాజ్యముపైన భక్తి హర్షదాయకం. కానీ, వేటనుంచి వచ్చిన నీ ముఖంలో ఉల్లాసానికి బదులు నిరుత్సాహం ప్రతిఫలిస్తోంది. ఏమైంది?’ అంటూ లాలనగా అడిగాడు ఆనందవర్మ.‘మరేమీ లేదు నాన్నగారూ! మీరు క్షేమంగా రావాలని ఆత్రుతగా ఎదురుచూడటం వల్ల మీకలా కనిపిస్తున్నానేమో. మీరు విశ్రమించండి. మనం తరువాత మాట్లాడుకుందాం‘ అని చెప్పి తన మందిరానికి వెళ్ళిపోయాడు ప్రద్యుమ్నుడు. అప్పుడు ప్రద్యుమ్నునితో కలిసి వేటకు వెళ్ళివచ్చిన అతడి మిత్రుడు(మంత్రి కుమారుడు) జయపాలుడు కూడా రాజుగారికీ తన తండ్రికీ అభివాదములు చేసి ఇలా అన్నాడు.‘క్షమించండి ప్రభూ..! మన ప్రద్యుమ్నుడు మహా బలశాలి. సింహాన్ని సైతం తన భుజబలంతో చంపివేసిన సింహబలుడు. తెలివిలో ఎన్నో ధర్మసూక్ష్మాలు, అర్థశాస్త్రము, రాజనీతి శాస్త్రము మున్నగు విద్యలలో ఆరితేరినవాడు. కానీ, పుట్టుకతోనే బొటనవేలు లేని కారణంగా యుద్ధవిద్యలు నేర్వలేని బలహీనుడయ్యాననే బాధ ఆయనలో అనుక్షణం తొలుచుచున్నది. అందుకే అలా నిర్లిప్తంగా వున్నట్టున్నారని నేను భావిస్తున్నాను‘ అంటూ అసలు విషయం తెలిపాడు. ఆ మాటలు విని మహారాణి మంజులతాదేవి చాలా బాధపడింది.‘చింతించకండి మహారాణి. యువరాజు బుద్ధి బలం మీద మాకు అపారమైన నమ్మకం వుంది. ఇక ఉపేక్షింపక వచ్చే విజయదశమి రోజున పట్టాభిషేకం జరిపించండి. అంతా మంచే జరుగుతుంది‘ అన్నాడు రాజగురువు అనంతాచార్యుడు. ‘నాన్నగారూ.. నేను పట్టాభిషిక్తుడ్ని కావడానికి ఆరునెలల ముందు దేశాటనకు వెళ్ళి రావాలని భావిస్తున్నాను. అందుకోసం రాత్రి నా స్వప్నంలో మాత అనుగ్రహం కూడా లభించింది. కాబట్టి నేను దక్షిణ దిశగా వెళ్ళిరావాలని భావిస్తున్నాను‘ అన్నాడు ప్రద్యుమ్నుడు ఒకరోజు.‘దేవి అనుగ్రహమైతే మరి తిరుగేముంది? వెళ్ళిరా నాయనా’ అంటూ ఆశీర్వదించారు తల్లిదండ్రులు.ప్రద్యుమ్నుని మిత్రుడు జయపాలుడు కూడా అతడి వెంటే బయలుదేరాడు. ఐదునెలల పాటు వారి పర్యటన నిర్విఘ్నంగా సాగింది. ఎంతో జ్ఞానం సముపార్జించి తిరుగుప్రయాణంలో ఓ కారడవిలోనే దారి తెలియక తిరిగి తిరిగి అడవి దాటలేక వారం రోజులపాటు చిక్కుకుపోయారు. ఆకలిదప్పులతో అరణ్యం నడుమ కనిపించిన ఓ శిథిలాలయంలో పడుకుని నిద్రించారు. ప్రద్యుమ్నునికి స్వప్నంలో జగన్మాత కనిపించింది.‘ప్రద్యుమ్నా.. ఈ గుడి కోనేటి జలంతో ఉదయాన్నే స్నానమాచరించి, ప్రక్కనున్న మర్రివృక్షం మొదలులో విషనాగుల సంరక్షణలో ఉన్న మాయా ఉంగరాన్ని వశం చేసుకో. నీకు శుభం కలుగుతుంది’ అనిచెప్పి మాయమైంది. చప్పున మేల్కొన్న ప్రద్యుమ్నుడు ఆనందించి మిత్రున్ని నిద్రలేపి స్వప్నవృత్తాంతం వివరించాడు. ఇద్దరూ ఉదయాత్పూర్వమే కాలకృత్యాలు తీర్చుకుని కొలనులో శుభ్రంగా స్నానం చేసి గుడిలోని జగన్మాతను పూజించి భక్తిగా నమస్కరించారు. పక్కనున్న మర్రివృక్షానికి ఆనుకున్న పుట్ట పైభాగంలో మాత చెప్పినట్లే ప్రకాశిస్తున్న ఓ ఉంగరం కనిపించింది. అయితే దానిచుట్టూ కొన్ని వందల నాగులు సంచరిస్తున్నాయి. దాంతో ప్రద్యుమ్నుడు కొద్దిగా ఎండుగడ్డిని సేకరించి పెద్ద చాపలా పేని, చెకుముకిరాళ్ళతో వెలిగించి ‘జై జగన్మాతా’ అని అరుస్తూ పుట్టపై విసిరాడు. నాగులన్నీ మంటల్లో కాలి బూడిదకావడంతో ఉంగరాన్ని అందుకున్నాడు. అంతలో నాగరాజు కోపోద్రిక్తుడై ప్రత్యక్షమై ‘ఓరీ..పాపి! అమాయకులైన నా నాగులను పొట్టనబెట్టుకుంటావా? ఈ ఉంగరం తీర్చిన ప్రతికోరికకూ నీవద్దనున్న దానినది సంగ్రహిస్తుంది గాకా’ అంటూ శపించి మాయమయ్యాడు. ఆ శాపానికి చింతిస్తున్న ప్రద్యుమ్నునికి అశరీరవాణి ఇలా వినిపించింది ‘ప్రద్యుమ్నా.. అంతా నీ మంచికే అనుకో. నీ తెలివితేటలతో శాపాన్నే వరంగా ఉపయోగించుకో’. తీవ్రంగా ఆలోచించిన ప్రద్యు ఓ నిర్ణయానికొచ్చి.. ‘ఓ మహిమాన్వితమైన అంగుళీకమా..! వెంటనే మా ఇద్దరినీ మా కోటలో మా తల్లిదండ్రుల ఎదుట నిలుపు’ అని ఆదేశించాడు. వెంటనే ఇద్దరూ కోటలో నిలిచారు. ఆ వెంటనే ప్రద్యుమ్నునికే వినిపించేలా ‘ప్రద్యుమ్నా! నీ కోరిక నెరవేర్చా. మరి నీ వద్ద వున్న దేనిని నాకర్పిస్తావు?’ అని అడిగింది అంగుళీకం.‘నా కోరిక నెరవేర్చిన నీకు సదా కృతజ్ఞుడను. నాలోని ఈర్షా్యద్వేషాలను నీకు అర్పిస్తున్నాను దయచేసి తీసుకో’ అన్నాడు. అంగుళీకం అతని నుంచి ఈర్షా్యసూయల్ని తీసివేసుకుంది. మహారాణి మంజులతాదేవి అప్పటికే పలురాజ్యాల రాజకుమార్తెల తైలవర్ణ పటాలను తెప్పించి ప్రద్యుమ్నుని ముందుంచింది. మయూర రాజ్య కన్యకామణి అయిన మందాకినిని ప్రద్యుమ్నుడు మెచ్చగానే, వారికి అంగరంగ వైభవంగా వివాహం జరిపించి, విజయదశమి రోజున పట్టాభిషిక్తుడ్ని చేశాడు మహారాజు ఆనందవర్మ.ప్రద్యుమ్నుడు మాయా ఉంగరాన్ని రాత్రి సమయంలో పూజగదిలోని జగదాంబ పాదాల దగ్గర ఉంచి నిద్రకుపక్రమించేవాడు. అలాగే, ప్రతి ఉదయం పూజతరువాత కళ్ళకద్దుకుని ఉంగరాన్ని ధరించేవాడు.అలా కొంతకాలం గడిచేసరికి ఒకసారి శత్రుదేశమైన శృంఖల దేశరాజు విరూపుడు తన అసంఖ్యాక సేనలతో దండెత్తివచ్చి తన రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని సన్నాహాలు మొదలుపెట్టాడనే వార్త వేగులద్వారా అందింది. అప్పుడు ప్రద్యుమ్నుడు పూజ తరువాత ధరించే ముందు ‘ఓ మాయా ఉంగరమా..! నా కింతవరకు ఎటువంటి కోరికలు కలుగలేదు. కానీ, ఇప్పుడు రాజ్యసంక్షేమం కోరి నిన్ను కోరుతున్నాను. నాకు బొటనవ్రేలిని ప్రసాదించు. దయచేసి ఈ సహాయంచేసి మా ప్రజలను కాపాడగలిగే అవకాశం నాకు కలిగించు’ అని అన్నాడు. వెంటనే అతనికి బొటనవేలు వచ్చేసింది. చిన్ననాటినుంచీ బాధపడినా ఉంగరాన్ని తన ఆనందంకోసం కోరుకోని బొటనవ్రేలిని పదే పదే చూసుకుని మురిసిపోయాడు ప్రద్యుమ్నుడు. రాజు, రాణి, మందాకినితో పాటూ జయపాలుడు కూడా సంతోషించాడు.‘దీనికి ప్రతిగా నాలో వున్న బలహీనతలన్నిటినీ నీ సొంతం చేస్తున్నాను స్వీకరించు‘ అన్నాడు చిరునవ్వుతో.ఏకసంథాగ్రాహి అయిన ప్రద్యుమ్నుడు మంచి గురువుల శిక్షణలో యుద్ధవిద్యలను అనతికాలంలోనే అవలీలగా నేర్చి యుద్ధంలో విరూపుడి సైన్యాన్ని సమర్థ వంతంగా తిప్పికొట్టాడు. ప్రజలంతా జయజయధ్వానాలతో పండుగ జరుపుకున్నారు. తమ రాజుగారికి లోపం తొలిగి బొటనవేలు వచ్చేసిందని ఆనందించారు.ఆ తరువాత తన వంశ వారసులు కూడా ఉంగరపు మహిమను కేవలం రాజ్య ప్రయోజనం కోసం తప్ప మరే దురుద్దేశంతోనూ ఉపయోగించరాదని శిలాశాసనాన్ని చెక్కించి దేవీ విగ్రహం పక్కనే ప్రతిష్ఠింపజేశాడు. - డేగల అనితాసూరి -
దానం అంటే అది..!
కురేశులు రామానుజాచార్యులకు ప్రధానమైన శిష్యుడు. కుర్ అనేగ్రామానికి అధినేత మహాసంపన్నుడు అయిన కురేశుడు తెల్లవారినప్పడి నుంచి రాత్రి దాకా దానాలు చేస్తూనే ఉంటాడు. వచ్చిన వారందరికీ దానాలుచేసిన తరువాత ఒక రోజు రాత్రి కురేశుని భవనం ప్రధాన ద్వారాన్ని మూసినప్పుడు దఢేలని ధ్వని వచ్చింది. ఆ ధ్వని ఏమిటని వరదరాజ పెరుమాళ్‌ను లక్ష్మీదేవి అడిగింది. కురేశుడు రోజంతా వచ్చిన వారికి దానధర్మాలు చేసి ఇప్పుడే తలుపు మూసుకున్న చప్పుడు దేవీ అది అంటూ, ఎంత మంది వచ్చినా కాదనని కురేశుడి దానశీలాన్ని వరదుడు వివరిస్తే ఆయనను ఒకసారి చూడాలని లకీ‡్ష్మదేవి భర్తను అడిగింది. సరేనని కురేశుడిని సతీసమేతంగా తీసుకురమ్మని వరదుడు కాంచీపూర్ణులను ఆదేశించారు. కాంచీపూర్ణుల వారు కురేశుని ఇంటికి వచ్చి, విషయమంతా వివరించి, తనతో రమ్మని కురేశుని అడుగుతారు. తన ఇంటి తలుపు చప్పుడు గురించి కంచి వరదుడు, లక్ష్మీదేవి మాట్లాడుకున్నారని తెలిసి కురేశుడు, ఆండాళ్ ఆశ్చర్యపోతారు. అలా తలుపు చప్పుడయ్యేట్టుగా వేయడం అహంకారానికి నిదర్శనంగా మారిందని తెలుసుకుని, అందుకు ఎంతో బాధపడతారా దంపతులు. ఎవరెవరో తమ ఇంటికి వచ్చి తమను దానం చేయమని అడగడం కాదు, తామే వెళ్లి అందరికీ దానాలు చేయాలని ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నాడు కురేశుడు. తనకు ఏమీ మిగుల్చుకోకుండా మొత్తం ఆస్తినంతా పేదలకు పంచి పెట్టారు. ఆ తరువాత కంచి వరదుడిని కురేశ దంపతులు దర్శనం చేసుకున్నారు. కురేశుని భార్య ఆండాళ్, కంచి వరదుని క్షమాపణ వేడింది. స్వామి తీర్థ ప్రసాదాలు తీసుకుని ఆచార్యుడైన రామానుజుడి దగ్గరకు వెళ్లాలని వారిరువురూ శ్రీరంగం బయలుదేరారు. దారిలో అరణ్యమార్గంలో ప్రయాణించినపుడు ఆండాళ్ భయపడితే, ‘‘ఎందుకు భయపడుతున్నావు? చేపలు నీటిలో పురుగులను తినేస్తాయి. మరణం జీవితాన్ని తినేస్తుంది. దొంగలు ధనాన్ని తింటారు. మనదగ్గర ధనం ఏమీ లేదుకదా దొంగలేం చేస్తారు?’’ అని అడిగాడు కురేశుడు.‘‘మీరు నీళ్లు తాగడానికని ఒక బంగారు పాత్రను వెంట తెచ్చుకున్నాను స్వామీ’’ అంటుంది ఆండాళ్. ‘‘ఓస్, దీని కోసమే కదా, నీవు భయపడుతున్నది, ఇది మన వద్ద లేకపోతే, ఇక మనం ఏమీ పోతుందని భయపడాల్సిన అవసరం ఉండదు కదా అనుకుంటూ, దాన్ని తీసుకుని విసిరి పారేస్తారు కురేశులు. తర్వాత నిర్భయంగా ప్రయాణం చేసి, రామానుజుని వద్దకు చేరుకుంటారా దంపతులు. శిష్యుని సంతోషంతో కౌగిలించుకుంటాడు రామానుజులు.దానం చేసేటప్పుడు అవతలి వారికి తాను సహాయం చేస్తున్నాను అనే భావన దాతకు కలిగితే, అది దానం అనిపించుకోదు. సహాయ పడే అవకాశాన్ని కల్పించినందుకు అవతలి వారికి ధన్యవాదాలు చెప్పుకోవడం వినయం అవుతుంది. అలాంటి దానాన్నే భగవంతుడు ఆమోదిస్తాడు. – డి.వి.ఆర్. -
‘థర్మల్’ తొలిదశ పూర్తి
వీర్లపాలెం ప్లాంటుపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక 10,656 ఎకరాల్లో సర్వే.. ప్లాంటుకు అవసరమయ్యేది 7,500 ఎకరాలే మెయిన్ ప్లాంటుకు 2,200 ఎకరాలు.. గ్రీన్‌బెల్ట్‌కు 1,000 ఎకరాలు నల్లగొండ జిల్లాలో 46 చోట్ల ప్రభుత్వ భూమి గుర్తింపు ఆ మేరకు అటవీశాఖకు బదలాయింపు రాష్ట్రవ్యాప్తంగా 10,140 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రయత్నాలు సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని వీర్లపాలెం-దిలావర్పూర్ అటవీభూముల్లో ఏర్పాటు చేయతలపెట్టిన 6,800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక దశ పూర్తయింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన భూములను జిల్లా యంత్రాంగం సర్వే చేసి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది. మొత్తం 10,656 ఎకరాల్లో సర్వే చేయగా, థర్మల్ ప్లాంటు ఏర్పాటుకు 7,500 ఎకరాలు సరిపోతుందని అధికారుల అంచనా. ఈ మేరకు అన్ని వివరాలతో కూడిన నివేదికను నల్లగొండ కలెక్టర్ టి.చిరంజీవులు ప్రభుత్వానికి పంపారు. ఇందులో జిల్లా పూర్తి సమాచారంతో పాటు జిల్లాలో ప్రాజెక్టు ఏర్పాటుకు ఉన్న సానుకూలాంశాలు, కావాల్సిన భూముల వివరాలు, అటవీభూములకు ప్రత్యామ్నాయంగా ఇవ్వాల్సిన ప్రభుత్వ భూముల వివరాలు, పునరావాసం, పరిహారం చెల్లింపు తదితర అంశాలను పొందుపర్చారు. 1,314 ఎకరాల పట్టా భూమి థర్మల్ ప్లాంటు ఏర్పాటు కోసం గత నెల 26వ తేదీ నుంచి దామరచర్ల మండలంలోని ముదిమాణిక్యం వీర్లపాలెం, తాళ్లవీరప్పగూడెం, దిలావర్పూర్, కొండ్రపోలు, నర్సాపురం, కల్లేపల్లి, తిమ్మాపురం, కొత్తపల్లి గ్రామాల్లోని 10,656 ఎకరాల్లో సర్వే నిర్వహించారు. ఇందులో 1,314 ఎకరాలు పట్టా భూమి కాగా, మిగిలినదంతా అటవీభూమే. ఈ 1,314 ఎకరాల్లో 339 మంది పట్టాదారులకు సంబంధించిన 405 ఎకరాల భూమి ఉంది. మరో 531 మందికి సంబంధించిన 909 ఎకరాల భూమికి ఆర్వోఎఫ్ఆర్ చట్టం కింద హక్కులు కల్పించాలన్న దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నా యి. ఇవి, మినహా అటవీభూమి అందుబాటులో ఉందని రెవెన్యూ యంత్రాంగం తేల్చింది. పట్టా భూములకు సంబంధించి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని నివేదికలో వివరించారు. అటవీభూమికి ప్రత్యామ్నాయంగా ఇవ్వాల్సిన ప్రభుత్వ భూమిని కూడా గుర్తించినట్టు ఆ నివేదికలో పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 46 చోట్ల 7,100 ఎకరాలను గుర్తించామని, వీర్లపాలెం భూములను తమకు బదలాయిస్తే ఆ మేరకు ప్రభుత్వ భూమిని అటవీశాఖకు ఇస్తామని కలెక్టర్ పంపిన నివేదికలో వివరించారు. ప్రాజెక్టు కోసం తలపెట్టిన భూమికి రోడ్డు, రైలుమార్గాలు అందుబాటులో ఉన్నాయని, 30 కి.మీ.దూరంలో మిర్యాలగూడ ఉందని, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 200 కి.మీ. దూరంలో ఈ స్థలం ఉందని నివేదికలో వివరించారు. దీంతోపాటు ఏడాదంతా ప్రవహించే కృష్ణానది సమీపంలోనే ఉందని, వాతావరణ పరిస్థితులు పూర్తిస్థాయిలో అనుకూలంగా ఉన్నాయని ఆ నివేదికలో వివరించారు. 400 ఎకరాల్లో కాలనీ ఏర్పాటు ప్రధాన ప్లాంటు (టర్బైన్లు) నిర్మాణానికి 2,200 ఎకరాలు, బొగ్గు నిల్వ, సరఫరా ఏర్పాట్లకు 400, బూడిద, ఇతర వ్యర్థాలను వదిలేందుకు 2,000, గ్రీన్‌బెల్ట్ కింద 1,000 చొప్పున ఎకరాలు అవసరం అవుతాయని, మరో 400 ఎకరాల్లో ప్లాంటు నివాస కాలనీని ఏర్పాటు చేయవచ్చని, మరో 1,500 ఎకరాలు ప్లాంటు మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగపడుతుందని నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదికనే సీఎం కేసీఆర్ తన తదుపరి ఢిల్లీ పర్యటనలో కేంద్రం ముందుంచుతారని తెలుస్తోంది. మరోవైపు ఈ ప్రాజెక్టును ఎన్టీపీసీ, జెన్కో సంయుక్తంగా చేపట్టాలని నిర్ణయం తీసుకున్నందున, జెన్కో సమగ్ర నివేదిక సిద్ధమవుతోందని, ఇక, ఎన్టీపీసీ బోర్డు ఢిల్లీలో సమావేశమై ప్లాంటు నిర్మాణానికి ఆమోదం తెలిపితే అనుమతుల ప్రక్రియ ప్రారంభం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అన్నీ సవ్యంగా జరిగి అటవీభూముల బదలాయింపునకు కేంద్రం అంగీకరిస్తే... భూమిని ఏడాదిలోపు ప్రాజెక్టు నిర్మాణదారులకు అప్పగించేస్తామని, దీనిపై సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నారని కలెక్టర్ టి.చిరంజీవులు ‘సాక్షి’కి తెలిపారు. భూముల క్రమబద్ధీకరణతో రూ.15 వేల కోట్ల ఆదాయం పెబ్బేరు: రాష్ట్రంలోని ప్రభుత్వ భూములన్నీ క్రమబద్ధీకరించి వేలం వేస్తే సుమారు రూ.15 వేల కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ భూములను గుర్తించి ఆక్రమణలకు గురికాకుండా చూస్తామన్నారు. దీంతోపాటు కొన్ని భూములను వేలం వేసి వాటిద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్రాభివృద్ధికి వినియోగించుకుంటామని తెలిపారు. కొత్త రాష్ట్రం ఏర్పాటు కావడం వల్ల ఐఏఎస్‌ల కొరత ఏర్పడిందని.. వారం రోజుల్లో ఈ సమస్య పరిష్కారం అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఎంసెట్ నోటిఫికేషన్ జారీ చేశామని, కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొండి వైఖరితో ఇబ్బందులు తలెత్తుతున్నాయని రాజీవ్‌శర్మ చెప్పారు. త్వరలోనే సమస్యను అధిగమించి ఎంసెట్ నిర్వహిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకం, ప్రాణహిత-చేవెళ్ల తదితర సాగునీటి పథకాలను వీలైనంత త్వరగా పూర్తయ్యేలా చూస్తామన్నారు. వ్యవసాయరంగంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తామని తెలిపారు. గతంలో ఉన్న పింఛన్దారులలో అనర్హులను తొలగించడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయని.. అర్హులైన ప్రతి ఒక్కరికీ తప్పకుండా పింఛన్ అందుతుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒకేచోట ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు. దీంతో పాలనాపరంగా సులభంగా ఉండటంతో పాటు ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు.