పురవీధుల్లో ప్రజలు జయజయ ధ్వానాలు చేస్తుండగా జంట పంచకళ్యాణి గుర్రాలను పూన్చిన స్వర్ణరథంపై విజయోల్లాసంతో ఊరేగుతూ యుద్ధరంగం నుంచి తన రాజ్యంలోకి ప్రవేశించాడు ఆనందవర్మ. ప్రజల జేజేలు అందుకుంటూ కోటలోకి చేరాడు. మహారాణి మంజులతాదేవి ఆయనకు హారతిపట్టి ఆహ్వానించింది. సుగంధ తైలాలు కలిపిన నీటితో జలకాలాడిన ఆయన యుద్ధ బడలికతో విశ్రమించాడు. మంత్రి కుశలపాలుడు ఆస్థానవైద్యుడిని పిలిపించగా ఆయన రాజుగారి గాయానికి మూలికలతో వైద్యం చేయటం ప్రారంభించాడు. సరిగ్గా అప్పుడు వేటకువెళ్ళిన యువరాజు ప్రద్యుమ్నుడు రాజమందిరంలోకి ప్రవేశించాడు.‘నాన్నగారూ..విజయాన్ని చేపట్టి వచ్చిన మీకు మా ప్రణామాలు. మన మహోజ్వల రాజ్యానికివే నా జేజేలు‘ అన్నాడు తండ్రి చెంతకు వచ్చి.‘నాయనా..ధన్యవాదాలు. తండ్రిగారిమీది గౌరవం, సామ్రాజ్యముపైన భక్తి హర్షదాయకం. కానీ, వేటనుంచి వచ్చిన నీ ముఖంలో ఉల్లాసానికి బదులు నిరుత్సాహం ప్రతిఫలిస్తోంది. ఏమైంది?’ అంటూ లాలనగా అడిగాడు ఆనందవర్మ.‘మరేమీ లేదు నాన్నగారూ! మీరు క్షేమంగా రావాలని ఆత్రుతగా ఎదురుచూడటం వల్ల మీకలా కనిపిస్తున్నానేమో. మీరు విశ్రమించండి. మనం తరువాత మాట్లాడుకుందాం‘ అని చెప్పి తన మందిరానికి వెళ్ళిపోయాడు ప్రద్యుమ్నుడు. అప్పుడు ప్రద్యుమ్నునితో కలిసి వేటకు వెళ్ళివచ్చిన అతడి మిత్రుడు(మంత్రి కుమారుడు) జయపాలుడు కూడా రాజుగారికీ తన తండ్రికీ అభివాదములు చేసి ఇలా అన్నాడు.‘క్షమించండి ప్రభూ..! మన ప్రద్యుమ్నుడు మహా బలశాలి. సింహాన్ని సైతం తన భుజబలంతో చంపివేసిన సింహబలుడు. తెలివిలో ఎన్నో ధర్మసూక్ష్మాలు, అర్థశాస్త్రము, రాజనీతి శాస్త్రము మున్నగు విద్యలలో ఆరితేరినవాడు. కానీ, పుట్టుకతోనే బొటనవేలు లేని కారణంగా యుద్ధవిద్యలు నేర్వలేని బలహీనుడయ్యాననే బాధ ఆయనలో అనుక్షణం తొలుచుచున్నది. అందుకే అలా నిర్లిప్తంగా వున్నట్టున్నారని నేను భావిస్తున్నాను‘ అంటూ అసలు విషయం తెలిపాడు. ఆ మాటలు విని మహారాణి మంజులతాదేవి చాలా బాధపడింది.‘చింతించకండి మహారాణి. యువరాజు బుద్ధి బలం మీద మాకు అపారమైన నమ్మకం వుంది. ఇక ఉపేక్షింపక వచ్చే విజయదశమి రోజున పట్టాభిషేకం జరిపించండి. అంతా మంచే జరుగుతుంది‘ అన్నాడు రాజగురువు అనంతాచార్యుడు.
‘నాన్నగారూ.. నేను పట్టాభిషిక్తుడ్ని కావడానికి ఆరునెలల ముందు దేశాటనకు వెళ్ళి రావాలని భావిస్తున్నాను. అందుకోసం రాత్రి నా స్వప్నంలో మాత అనుగ్రహం కూడా లభించింది. కాబట్టి నేను దక్షిణ దిశగా వెళ్ళిరావాలని భావిస్తున్నాను‘ అన్నాడు ప్రద్యుమ్నుడు ఒకరోజు.‘దేవి అనుగ్రహమైతే మరి తిరుగేముంది? వెళ్ళిరా నాయనా’ అంటూ ఆశీర్వదించారు తల్లిదండ్రులు.ప్రద్యుమ్నుని మిత్రుడు జయపాలుడు కూడా అతడి వెంటే బయలుదేరాడు. ఐదునెలల పాటు వారి పర్యటన నిర్విఘ్నంగా సాగింది. ఎంతో జ్ఞానం సముపార్జించి తిరుగుప్రయాణంలో ఓ కారడవిలోనే దారి తెలియక తిరిగి తిరిగి అడవి దాటలేక వారం రోజులపాటు చిక్కుకుపోయారు. ఆకలిదప్పులతో అరణ్యం నడుమ కనిపించిన ఓ శిథిలాలయంలో పడుకుని నిద్రించారు. ప్రద్యుమ్నునికి స్వప్నంలో జగన్మాత కనిపించింది.‘ప్రద్యుమ్నా.. ఈ గుడి కోనేటి జలంతో ఉదయాన్నే స్నానమాచరించి, ప్రక్కనున్న మర్రివృక్షం మొదలులో విషనాగుల సంరక్షణలో ఉన్న మాయా ఉంగరాన్ని వశం చేసుకో. నీకు శుభం కలుగుతుంది’ అనిచెప్పి మాయమైంది. చప్పున మేల్కొన్న ప్రద్యుమ్నుడు ఆనందించి మిత్రున్ని నిద్రలేపి స్వప్నవృత్తాంతం వివరించాడు. ఇద్దరూ ఉదయాత్పూర్వమే కాలకృత్యాలు తీర్చుకుని కొలనులో శుభ్రంగా స్నానం చేసి గుడిలోని జగన్మాతను పూజించి భక్తిగా నమస్కరించారు. పక్కనున్న మర్రివృక్షానికి ఆనుకున్న పుట్ట పైభాగంలో మాత చెప్పినట్లే ప్రకాశిస్తున్న ఓ ఉంగరం కనిపించింది. అయితే దానిచుట్టూ కొన్ని వందల నాగులు సంచరిస్తున్నాయి. దాంతో ప్రద్యుమ్నుడు కొద్దిగా ఎండుగడ్డిని సేకరించి పెద్ద చాపలా పేని, చెకుముకిరాళ్ళతో వెలిగించి ‘జై జగన్మాతా’ అని అరుస్తూ పుట్టపై విసిరాడు. నాగులన్నీ మంటల్లో కాలి బూడిదకావడంతో ఉంగరాన్ని అందుకున్నాడు.
అంతలో నాగరాజు కోపోద్రిక్తుడై ప్రత్యక్షమై ‘ఓరీ..పాపి! అమాయకులైన నా నాగులను పొట్టనబెట్టుకుంటావా? ఈ ఉంగరం తీర్చిన ప్రతికోరికకూ నీవద్దనున్న దానినది సంగ్రహిస్తుంది గాకా’ అంటూ శపించి మాయమయ్యాడు. ఆ శాపానికి చింతిస్తున్న ప్రద్యుమ్నునికి అశరీరవాణి ఇలా వినిపించింది ‘ప్రద్యుమ్నా.. అంతా నీ మంచికే అనుకో. నీ తెలివితేటలతో శాపాన్నే వరంగా ఉపయోగించుకో’. తీవ్రంగా ఆలోచించిన ప్రద్యు ఓ నిర్ణయానికొచ్చి.. ‘ఓ మహిమాన్వితమైన అంగుళీకమా..! వెంటనే మా ఇద్దరినీ మా కోటలో మా తల్లిదండ్రుల ఎదుట నిలుపు’ అని ఆదేశించాడు. వెంటనే ఇద్దరూ కోటలో నిలిచారు. ఆ వెంటనే ప్రద్యుమ్నునికే వినిపించేలా ‘ప్రద్యుమ్నా! నీ కోరిక నెరవేర్చా. మరి నీ వద్ద వున్న దేనిని నాకర్పిస్తావు?’ అని అడిగింది అంగుళీకం.‘నా కోరిక నెరవేర్చిన నీకు సదా కృతజ్ఞుడను. నాలోని ఈర్షా్యద్వేషాలను నీకు అర్పిస్తున్నాను దయచేసి తీసుకో’ అన్నాడు. అంగుళీకం అతని నుంచి ఈర్షా్యసూయల్ని తీసివేసుకుంది. మహారాణి మంజులతాదేవి అప్పటికే పలురాజ్యాల రాజకుమార్తెల తైలవర్ణ పటాలను తెప్పించి ప్రద్యుమ్నుని ముందుంచింది. మయూర రాజ్య కన్యకామణి అయిన మందాకినిని ప్రద్యుమ్నుడు మెచ్చగానే, వారికి అంగరంగ వైభవంగా వివాహం జరిపించి, విజయదశమి రోజున పట్టాభిషిక్తుడ్ని చేశాడు మహారాజు ఆనందవర్మ.ప్రద్యుమ్నుడు మాయా ఉంగరాన్ని రాత్రి సమయంలో పూజగదిలోని జగదాంబ పాదాల దగ్గర ఉంచి నిద్రకుపక్రమించేవాడు. అలాగే, ప్రతి ఉదయం పూజతరువాత కళ్ళకద్దుకుని ఉంగరాన్ని ధరించేవాడు.అలా కొంతకాలం గడిచేసరికి ఒకసారి శత్రుదేశమైన శృంఖల దేశరాజు విరూపుడు తన అసంఖ్యాక సేనలతో దండెత్తివచ్చి తన రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని సన్నాహాలు మొదలుపెట్టాడనే వార్త వేగులద్వారా అందింది.
అప్పుడు ప్రద్యుమ్నుడు పూజ తరువాత ధరించే ముందు ‘ఓ మాయా ఉంగరమా..! నా కింతవరకు ఎటువంటి కోరికలు కలుగలేదు. కానీ, ఇప్పుడు రాజ్యసంక్షేమం కోరి నిన్ను కోరుతున్నాను. నాకు బొటనవ్రేలిని ప్రసాదించు. దయచేసి ఈ సహాయంచేసి మా ప్రజలను కాపాడగలిగే అవకాశం నాకు కలిగించు’ అని అన్నాడు. వెంటనే అతనికి బొటనవేలు వచ్చేసింది. చిన్ననాటినుంచీ బాధపడినా ఉంగరాన్ని తన ఆనందంకోసం కోరుకోని బొటనవ్రేలిని పదే పదే చూసుకుని మురిసిపోయాడు ప్రద్యుమ్నుడు. రాజు, రాణి, మందాకినితో పాటూ జయపాలుడు కూడా సంతోషించాడు.‘దీనికి ప్రతిగా నాలో వున్న బలహీనతలన్నిటినీ నీ సొంతం చేస్తున్నాను స్వీకరించు‘ అన్నాడు చిరునవ్వుతో.ఏకసంథాగ్రాహి అయిన ప్రద్యుమ్నుడు మంచి గురువుల శిక్షణలో యుద్ధవిద్యలను అనతికాలంలోనే అవలీలగా నేర్చి యుద్ధంలో విరూపుడి సైన్యాన్ని సమర్థ వంతంగా తిప్పికొట్టాడు. ప్రజలంతా జయజయధ్వానాలతో పండుగ జరుపుకున్నారు. తమ రాజుగారికి లోపం తొలిగి బొటనవేలు వచ్చేసిందని ఆనందించారు.ఆ తరువాత తన వంశ వారసులు కూడా ఉంగరపు మహిమను కేవలం రాజ్య ప్రయోజనం కోసం తప్ప మరే దురుద్దేశంతోనూ ఉపయోగించరాదని శిలాశాసనాన్ని చెక్కించి దేవీ విగ్రహం పక్కనే ప్రతిష్ఠింపజేశాడు.
- డేగల అనితాసూరి
మాయా ఉంగరం
Published Sun, Oct 28 2018 2:00 AM | Last Updated on Sun, Oct 28 2018 2:00 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment