* ప్లాంట్ల నిర్మాణ అంచనాలతో టీ సర్కారుకు జెన్ కో నివేదిక
* మణుగూరు, కొత్తగూడెంపై ప్రత్యేకంగా దృష్టి
* విదేశీ బొగ్గును వినియోగించే యోచన
* భూసేకరణే ప్రధాన అవరోధం
* మిగతా విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి కొనసాగుతున్న పరిశీలన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిర్మించ తలపెట్టిన కొత్త థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులకు రూ.39 వేల కోట్లు ఖర్చవుతాయని జెన్‌కో లెక్కగట్టింది. స్థానికంగా బొగ్గు లభ్యం కాకపోతే... మొత్తం విదేశీ బొగ్గుతోనే ఈ కొత్త ప్రాజెక్టులను నిర్వహించాలని యోచిస్తోంది. అయితే ప్రాజెక్టులన్నింటికీ భూసేకరణే ప్రధాన అవరోధంగా మారనున్నట్లు భావిస్తోంది. ఈ మేరకు కొత్త ప్లాంట్లకు అంచనా వ్యయంతో పాటు యూనిట్ల నిర్మాణానికి ఎంత విస్తీర్ణంలో భూములు అవసరం? అందుబాటులో ఉన్నదెంత? అదనంగా ఏ మేరకు భూసేకరణ చేపట్టాలి? ఎంత మేరకు నీరు, బొగ్గు అవసరం? అనే వివరాలతో తాజా నివేదికను రాష్ట్ర ఇంధన శాఖకు సమర్పించింది.
భారీగా నిధులు అవసరం..
జెన్‌కో అంచనాల ప్రకారం కొత్తగా ప్రతిపాదించిన మణుగూరు థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం కోసం రూ.7,020 కోట్లు కావాలి. కొత్తగూడెం థర్మల్ ప్రాజెక్టులో నిర్మించనున్న ఏడో యూనిట్‌కు రూ. 5,200 కోట్లు, తర్వాత చేపట్టనున్న కాకతీయ థర్మల్ ప్లాంట్ మూడో దశ, రామగుండం, సత్తుపల్లి ప్రాజెక్టులకు రూ. 26,780 కోట్లు అవసరం. ఇక అవసరమైన భూమిని పరిశీలిస్తే... కొత్తగూడెంలో 800 మెగావాట్ల యూనిట్ నిర్మాణానికి మొత్తం 460 ఎకరాలు కావాల్సి ఉంది.
ప్రస్తుతం పాల్వంచలో ఉన్న కేటీపీపీ పరిసరాల్లోనే 230 ఎకరాలు అందుబాటులో ఉంది. అదనంగా మరో 230 ఎకరాల భూమి సేకరించాలి. ఈ మేరకు ప్రతిపాదనలను జెన్‌కో ఇప్పటికే పాల్వంచ ఆర్డీవోకు అందజేసింది. ఈ ప్లాంటు నిర్వహణకు 25 క్యూసెక్కుల నీరు అవసరం. బూర్గంపాడు సమీపంలో గోదావరి నుంచి ప్రస్తుతమున్న 25 కిలోమీటర్ల పైపులైన్ ద్వారా ఈ నీటిని సరఫరా చేసుకునే వీలుంది. ఇక ఈ యూనిట్‌కు ఏడాదికి 4.72 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం. ఎక్కువ నాణ్యత ఉండే విదేశీ బొగ్గును వాడితే.. 2.70 మిలియన్ టన్నులు సరిపోతుందని అంచనా.
దేశీయంగా సరిపడేంత బొగ్గు లభ్యం కాని పక్షంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకుని.. 440 కిలోమీటర్ల దూరంలోని కాకినాడ పోర్టు నుంచి రవాణా చేసుకునే వీలుందని జెన్‌కో నివేదికలో పొందుపరిచింది. సగం దేశీయ బొగ్గు, సగం విదేశీ బొగ్గు వినియోగించే ప్రతిపాదనలతో పాటు పూర్తిగా విదేశీ బొగ్గును వాడుకునేలా... రెండు విధాలుగా ప్రాజెక్టు రిపోర్టులను సిద్ధం చేసింది.
ఇక మణుగూరు థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులో మొత్తం 1080 మెగావాట్ల ఉత్పత్తికి నాలుగు 270 మెగావాట్ల యూనిట్లను స్థాపించనున్నారు. మొత్తం 1,031 ఎకరాల భూమి అవసరమని జెన్‌కో గుర్తించింది. ఇటీవలే భూసేకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు సంబంధించి రూ. 51 కోట్లను జెన్‌కో ఇప్పటికే రెవెన్యూ విభాగానికి డిపాజిట్ చేసింది. మణుగూరు ప్లాంట్‌కు 40 క్యూసెక్కుల నీరు అవసరం. ప్రాజెక్టుకు అవసరమైన 3.40 మిలియన్ టన్నుల విదేశీ బొగ్గును దిగుమతి చేసుకుని, కాకినాడ పోర్టు నుంచి 500 కిలోమీటర్లు రవాణా చేసుకోవాల్సి ఉంటుందని జెన్‌కో నివేదికలో పేర్కొంది.
బీహెచ్‌ఈఎల్‌కు పనులు..
మణుగూరు, కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని ప్రభుత్వం ఈపీసీ విధానంలో బీహెచ్‌ఈఎల్‌కు అప్పగించింది. ఒప్పందం ప్రకారం కేవలం 30 నెలల వ్యవధిలోనే మణుగూరు ప్లాంట్ నిర్మాణానికి బీహెచ్‌ఈఎల్ అంగీకరించింది. నిర్మాణానికి సంబంధించిన ధరలతో పాటు యంత్రాలు, ప్లాంటుకు సంబంధించిన సాంకేతిక అంశాలపై జెన్‌కో నియమించిన కమిటీ బీహెచ్‌ఈఎల్ మధ్య చర్చలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.
పాల్వంచ, మణుగూరు, పినపాక మండలాల్లో భూ సేకరణ ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి కీలకంగా మారనుంది. భూసేకరణ పూర్తయ్యేందుకు కనీసం ఆరు నెలల నుంచి ఏడాది పడుతుందని రెవెన్యూ యంత్రాంగం అంచనా వేస్తోంది. దీంతో జెన్‌కో ఆశించిన సమయంలో ఈ ప్రాజెక్టులు పూర్తవుతాయా.. లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రూ. 39,000 కోట్లతో కొత్త కాంతులు
Published Mon, Dec 15 2014 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 6:10 PM
Advertisement
Advertisement