ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న పంటల నష్టాన్ని అంచనా వేయాలని రెవెన్యూ, వ్యవసాయాధికారులను ఆదేశించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ కె.సురేంద్రమోహన్ తెలిపారు. ఈ విషయంపై శనివారం ఆయన ‘న్యూస్‌లైన్’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల పత్తి, మొక్కజొన్న, వరి పంటలు దెబ్బతిన్నాయని, రైతులను ఆదుకునేందుకు వ్యవసాయాధికారులు సోమవారం నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం అంచనాలను రూపొందించాలని ఆదేశించినట్లు తెలిపారు.
న్యూస్‌లైన్: జిల్లాలో ఏయే పంటలు అత్యధికంగా దెబ్బతిన్నాయి?
జేసీ: జిల్లాలో పత్తి, మొక్కజొన్న, వరి, వేరుశనగ పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయాధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. 75వేల ఎకరాల్లో పత్తి, 4వేల ఎకరాల్లో మొక్కజొన్న, 800 ఎకరాల్లో వరి, 250 ఎకరాల్లో వేరుశనగకు నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం.
న్యూస్‌లైన్: పంట నష్టాన్ని ఎలా గుర్తిస్తున్నారు..?
జేసీ: జిల్లాలో పత్తి రెండోసారి తీసే దశలో ఉన్న సమయంలో ఎక్కువ రోజులు వర్షం కురవడంతో ఫంగస్ వచ్చి పూర్తిగా దెబ్బతిన్నది. ఇన్సూరెన్స్ చేసుకున్న రైతులకు వ్యవసాయ, రెవెన్యూ అధికారులు కలిసి పంట నష్టం అంచనాలను రూపొందించనున్నారు. ఆ నివేదికల ద్వారా పరిహారం అందేలా చర్యలు చేపడతాం. అలాగే ఇన్సూరెన్స్ లేని రైతులకు కూడా ప్రకృతి వైపరీత్యాల విభాగం నుంచి వ్యవసాయ కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపి ఇన్సూరెన్స్ చెల్లించేలా చర్యలు చేపడతాం.
న్యూస్‌లైన్: వరదలపై ముందస్తుగా ఏం చర్యలు తీసుకున్నారు..?
జేసీ: ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎలాంటి నష్టం కలగకుండా ఉండేందుకు అన్ని శాఖల అధికారులను ముందస్తుగా అప్రమత్తం చేశాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు మండలస్థాయిలో తహశీల్దార్, వీఆర్వోలు మండల కేంద్రాల్లో ఉండేలా ఆదేశాలు జారీ చేశాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని సూచించాం.
న్యూస్‌లైన్: వరదలపై ఎక్కడెక్కడ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు.?
జేసీ: వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా సమాచారం అందించేందుకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటు చేశాం. ప్రజలకు ఎలాంటి సహాయం కావాలన్నా, ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తినా జిల్లా అధికారులకు వివరించేలా ప్రత్యేక బృందాలను నియమించాం. 24 గంటలు అందుబాటులో ఉండేలా అధికారులను నియమించాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా కంట్రోల్‌రూమ్ నెంబర్ 08742-231600కు ఫోన్ చేయాలి.
న్యూస్‌లైన్: రైతులకు అధికంగా పంట నష్టం జరగడానికి కారణమేంటి?
జేసీ: సాధారణంగా 46 మండలాల్లో 944 మిల్లీమీటర్ల వర్షపాతం పడాలి. అయితే 8,566 మిల్లీమీటర్ల వర్షపాతం పడటం వల్ల అత్యధికంగా పంట నష్టం జరిగింది. ఐదు రోజులుగా వర్షం పడటం వల్ల పత్తి పూర్తిగా దెబ్బతిన్నది.
న్యూస్‌లైన్: ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారా?
జేసీ: జిల్లాలో నవంబర్ మొదటి వారంలో భద్రాచలం డివిజన్‌లో ధాన్యం చేతికి అందుతుంది. ధాన్యం కొనుగోలులో గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ సారి పటిష్ట చర్యలు చేపట్టాం. ఆర్డీఓ, తహశీల్దార్లను ఇందులో భాగస్వాములను చేసి అన్ని పరికరాలు, గోడౌన్స్, టార్పాలిన్‌లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నాం.
న్యూస్‌లైన్: పత్తి కొనుగోలుకు సీసీఐ కేంద్రాలను ఎందుకు ఏర్పాటు చేయలేదు?
జేసీ: జిల్లాలో రైతులకు మేలు చేసేందుకు సీసీఐని ఈసారి ముందస్తుగా అనుమతించలేదు. 12శాతం తేమ ఉంటే సీసీఐ నిబంధనల ప్రకారం పత్తిని కొనుగోలు చేయరు. రైతుల శ్రేయస్సు కోసం సీసీఐని అనుమతించకుండా మార్కెట్ కమిటీల ద్వారానే రైతులకు లబ్ధి చేకూర్చేలా చర్యలు చేపడుతున్నాం
న్యూస్‌లైన్: భూ పంపిణీకి ఎలాంటి చర్యలు చేపట్టారు?
జేసీ: జిల్లాలో 7వ విడత భూ పంపిణీకి 14,280 ఎకరాలు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లుచేశాం. ప్రభుత్వ భూములను సర్వే చేసి అసైన్‌మెంట్ కమిటీ అప్రూవల్ కూడా తీసుకున్నాం. ఈసారి నూతనంగా సీసీఎల్‌ఏ నుంచి ప్రత్యేకంగా సెక్యూరిటీ ప్రింటింగ్‌తో కూడిన పత్రాలను ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
న్యూస్‌లైన్: రెండో విడత రచ్చబండలో లబ్ధిదారులకు రేషన్‌కార్డులు ఎందుకు ఇవ్వలేదు?
జేసీ: రెండో విడత రచ్చబండలో దరఖాస్తు చేసుకున్న 34వేల మంది లబ్ధిదారులకు మూడో విడత ప్రారంభంలో రేషన్‌కార్డులను అందించేందుకు చర్యలు చేపడుతున్నాం.
న్యూస్‌లైన్: జిల్లాలో ప్రభుత్వ భూముల రక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టారు?
జేసీ: జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. మొదటి విడతగా విలువైన భూములు 200 ఎకరాలను గుర్తించాం. వాటికి రక్షణ చర్యలు చేపట్టేందుకు రూ.3కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వం రూ70 లక్షలు మంజూరు చేసింది. వీటిని ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు కేంద్రాల్లో ప్రభుత్వ భూములకు ప్రహరీలు, ఫెన్సింగ్ ను ఏర్పాటు చేస్తున్నాం.
న్యూస్‌లైన్: నగదు బదిలీ పథకం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కదా?
జేసీ: గ్యాస్‌కు నగదు బదిలీ పథకాన్ని నవంబర్ నుంచి అమలుచేయాలని ప్రభుత్వం సూచించింది. అయితే ఇప్పటి వరకు ఆధార్ అనుసంధానం జరిగిన లబ్ధిదారులు గ్యాస్ తీసుకునే సమయంలో రూ.1090 చెల్లించి తీసుకుంటున్నారు. మొదటిసారి ఆయా బ్యాంక్ అకౌంట్‌లలో రూ.435 వస్తాయి. రెండు, మూడు రోజుల అనంతరం రూ.621 జమ అవుతుంది. రెండో సారి గ్యాస్ తీసుకున్న తర్వాత రూ.621 మాత్రమే జమ అవుతుంది. నగదు బదిలీ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.
పంటనష్టం సర్వేకు చర్యలు...
Published Sun, Oct 27 2013 7:08 AM | Last Updated on Sat, Sep 2 2017 12:02 AM
Advertisement
Advertisement