సాక్షి, కొత్తగూడెం: అకాల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులను ఓదార్చేందుకు ఈనెల 31వ తేదీన వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ జిల్లాలో పర్యటించనున్నారు. మధిర, వైరా, పాలేరు నియోజకవర్గాలు, ఖమ్మంఅర్బన్ మండలంలో ఆమె పంటలను పరిశీలించనున్నట్లు ఆపార్టీ జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయ కర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మంగళవారం వారు ‘సాక్షి’తో మాట్లాడుతూ విజయమ్మ పర్యటనకు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు.
శ్రీకాకుళం నుంచి రైలు మార్గం ద్వారా మధిరకు గురువారం ఉదయం 7.30 గంటలకు ఆమె చేరుకుంటారని తెలిపారు. ఆతర్వాత మధిర, వైరా, ఖమ్మంఅర్బన్ మండలంతో పాటు పాలేరు నియోజకవర్గంలో విజయమ్మ పంటలను పరిశీలిస్తారన్నారు. పాలేరు నియోజకవర్గంలో పంటల పరిశీలన అనంతరం అక్కడి నుంచి నల్లగొండ జిల్లా కోదాడకు వెళతారని తెలిపారు. విజయమ్మ తన పర్యటనలో రైతులతో మాట్లాడడంతో పాటు అండగా మేమున్నామంటూ భరోసా ఇస్తారన్నారు. జిల్లాలో సాగు చేసిన పంటలకు అపార నష్టం జరిగినా ప్రభుత్వం మొద్దునిద్రలో ఉందని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేలా విజయమ్మ పర్యటన ఉంటుందన్నారు. జిల్లాలో నష్టాన్ని పరిశీలించిన తర్వాత రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాలకు లేఖ రాస్తారన్నారు. ప్రభుత్వ యంత్రాంగం ఇంకా నష్టం అంచనాకు దిగకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, వారి ఆవేదనకు విజయమ్మ పర్యటన కొండంత భరోసా ఇస్తుందన్నారు. పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
విజయమ్మ పర్యటన ఇలా..
రైలు మార్గంలో ఉదయం 7.30 గంటలకు మధిర చేరుకుంటారు. అక్కడ నుంచి బోనకల్ మండలం కలకోటకు బయలు దేరి తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతుల పంటలను పరిశీలిస్తారు.
కలకోట, వైరా మీదుగా కొణిజర్ల మండలం పల్లిపాడులో నష్టపోయిన పంటలను చూస్తారు. అనంతరం ఖమ్మంఅర్బన్ మండలం వి.వెంకటాయపాలెం చేరుకుం టారు. ఇక్కడ పంటలను పరిశీలిస్తారు.
ఖమ్మం పట్టణం, ముదిగొండ మీదుగా నేలకొండపల్లి వెళ్లి అక్కడ పంటలు చూడడంతో పాటు రైతులతో మాట్లాడతారు. అనంతరం మధ్యాహ్నం అక్కడి నుంచి నల్లగొండ జిల్లా కోదాడకు వెళతారు.
రేపు విజయమ్మ పర్యటన
Published Wed, Oct 30 2013 4:44 AM | Last Updated on Sat, Sep 2 2017 12:06 AM
Advertisement
Advertisement