అడుగడుగునా ఆదరణ | Warm welcome to YS Vijayamma in Khammam | Sakshi
Sakshi News home page

అడుగడుగునా ఆదరణ

Published Fri, Nov 1 2013 3:35 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

అడుగడుగునా ఆదరణ - Sakshi

అడుగడుగునా ఆదరణ

సాక్షి, ఖమ్మం: వర్షాలు సృష్టించిన కల్లోలంతో బరువెక్కిన గుండెతో ఉన్న ఖమ్మం జిల్లా రైతుకు ‘మేమున్నాం.. అధైర్య పడకండి’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఓదార్పునిచ్చారు. గురువారం జిల్లాలో సాగిన ఆమె పర్యటన సందర్భంగా రైతులు తమ సమస్యలను ఆమెకు చెప్పుకొన్నారు. వారి కష్టాలు విని చలించిపోయిన ఆమె.. రైతులకు వెంటనే పరిహారం ఇవ్వాల్సిందిగా కేంద్రంపై ఒత్తిడి తెస్తామంటూ భరోసానిచ్చారు.

 

గురువారం ఆమె ఖమ్మం జిల్లాలో పర్యటించి మధిర నియోజకవర్గంలోని మధిర మండలం సిరిపురం, బోనకల్లు మండలం కలకోట, వైరా నియోజకవర్గం కొణిజర్ల మండలం పల్లిపాడు, ఖమ్మం అర్బన్ మండలం వీవీపాలెం, ముదిగొండ మండలం వెంకటాపురం గ్రామాల్లో దెబ్బతిన్న పత్తి, వరి, మిర్చి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు కలిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. ‘కౌలుకు తీసుకున్నాం.. పంట చేతికి రాలేదు.. మీరే దిక్కు’ అంటూ కలకోట మిర్చి రైతులు ఆమెకు తన సమస్యను ఏకరువు పెట్టారు. ‘అమ్మా వైఎస్ హయాంలో మేం దర్జాగా ఉన్నాం.. ఇప్పుడు ఎట్లా బతకాలిరా దేవుడా అన్నట్లున్నాయి పరిస్థితులు’ అంటూ గోడు వెళ్లబోసుకున్నారు.
 
కొణిజర్ల మండలం పల్లిపాడు, ఖమ్మంఅర్బన్ మండలం వి.వెంకటాయపాలెం, ముదిగొండ మండలం వెంకటాపురంలో ఆమె పత్తి పంటలను పరిశీలించారు. పూర్తిగా తడిసిన పత్తిని చూసి రైతులకు మద్దతు ధర ఇచ్చేలా సీసీఐతో పంట కొనుగోలు చేయించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మధిర నుంచి నేలకొండపల్లి జిల్లా నలుమూలల నుంచి రైతులు ఆమె పర్యటనకు భారీగా తరలివచ్చారు. ఇటు రైతులు.. అటు పార్టీ క్యాడర్‌తో పాటు ప్రజలు విజయమ్మ పర్యటనకు అడుగడుగునా నీరాజనం పలికారు. కాగా విజయమ్మ పర్యటన సందర్భంగా ఖమ్మం జిల్లాలోఒకరిద్దరు ఆమెను అడ్డుకునేందుకు యత్నించారు. వైరా నియోజకవర్గం పల్లిపాడులో రైతులను పరామర్శించి వస్తున్న విజయమ్మ కారును తెలంగాణ విద్యార్థి సంఘం నాయకులు ఇద్దరు అడ్డుకోవడానికి యత్నించారు. కారుపై కోడిగుడ్డు వేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నేలకొండపల్లిలో టీఆర్‌ఎస్ నాయకుడొకరు విజయమ్మను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. తర్వాత పోలీసులు రంగప్రవేశం చేసి అతడిని నిలువరించారు.
 
సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నాం: విజయమ్మ
‘రాష్ట్రం విడిపోయే ప్రసక్తేలేదు.. ఇది నేను మనస్సాక్షిగా చెబుతున్న మాట. విభజన అనేది తండ్రిలాగా చేయాలి.. కానీ కేంద్రం అలా చేయడం లేదు. అందుకే 60 శాతం మంది రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని రోడ్డెక్కారు.. విభజిస్తే వీరికి అందరికీ సమస్యలు ఎదురవుతున్నాయి. భాషా ప్రయుక్త రాష్ట్రాలను విడగొడితే అసెంబ్లీకి తీర్మానం రావాలి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్యాంధ్రకే కట్టుబడి ఉంది’ అని విజయమ్మ స్పష్టంచేశారు. ఖమ్మం జిల్లాలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం ఆమె నేలకొండపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నల్గొండ జిల్లాలో దివంగత వైఎస్ విగ్రహాల ధ్వంసం విషయాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని.. విగ్రహాలు ధ్వంసం చేసినంత మాత్రాన ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న నేతను ఎవరూ తీసేయలేరన్నారు.
 
 రాష్ట్రంలో మూడు ప్రాంతాలను వైఎస్ సమంగానే అభివృద్ధి చేశారన్నారు. 2010 నుంచి 2013 వరకు రూ.700 కోట్లు రైతులకు పంట నష్టపరిహారంగా విడుదల చేశామని ప్రభుత్వం ప్రకటిస్తే.. అది ఎక్కడా అందలేదని రైతులు చెబుతున్నారన్నారు. పంట నష్టం వివరాలు తెలుసుకోవడానికి అధికారులను కూడా పంపలేదంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతుందన్నారు. చంద్రబాబు లాగా తాము అబద్ధాలు చెప్పమని, పంట పరిహారం ఇచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని అన్నారు. పంట నష్టంపై జిల్లాల వారీ నివేదికలు తయారు చేసి రాష్ర్ట ప్రభుత్వంతో పాటు ప్రధాని, కేంద్ర వ్యవసాయ మంత్రికి అందజేసి పరిహారం వెంటనే అందించేలా చర్యలు తీసుకోవాలని ఒత్తిడి తెస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement