ఖమ్మం గాంధీచౌక్, న్యూస్‌లైన్: వ్యవసాయాధికారులు పంట నష్టం అంచనాలను తేల్చేశారు. జిల్లాలో 696 ఎకరాల్లో మాత్రమే పంట నష్టం జరిగినట్లు నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి పంపారు. దీంతో 807 మంది రైతులకు రూ. 27.03 లక్షల పరిహారం మాత్రమే మంజూరు కావడంతో మిగిలిన వారు గగ్గోలు పెడుతున్నారు. గత అక్టోబర్ 21 నుంచి 29 వరకు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఖరీఫ్ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి, సోయాబీన్ తదితర పంటలు చేతికందే దశలో దెబ్బతిన్నాయి. తీసే దశలో ఉన్న పత్తి నేల రాలిపోగా, మిగిలిన పంట కూడా మొలకొచ్చి నాణ్యత, రంగు మారాయి.
రెండు, మూడు దఫాలుగా తీయాల్సిన పత్తి చేలు పూర్తిగా నాశనమయ్యాయి. కంకి దశలో ఉన్న వరి పైర్లు సైతం నేలవాలాయి. మొక్కజొన్న కల్లాల్లోనే మొలకెత్తింది. మిరప తోటలు ఊటబట్టిపోయాయి. పత్తి, మిర్చి తోటలు పనికి రాకుండా పోవడంతో వాటిని దున్ని ఇతర పంటలు వేశారు. ఇలా జిల్లాలో లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, వాటికి పరిహారం అందించాలని రైతు సంఘాలు కోరాయి. ఈ మేరకు కలెక్టర్‌కు, జిల్లా వ్యవసాయాధికారులకు వినతి పత్రాలు అందజేశాయి. అయితే అంతకుముందే ప్రభుత్వ ఆదేశాలతో వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు ప్రాథమిక సర్వే చేసి, దెబ్బతిన్న పంటల వివరాలను ఉన్నతాధికారులకు అందించారు. లక్షలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లగా, అధికారులు 70 వేల ఎకరాల్లో మాత్రమే దెబ్బతిన్నట్లు నివేదిక సమర్పించారు.
సగం పంట కోల్పోతేనే పరిహారమట...
పంటలో 50 శాతం మేరకు దెబ్బతింటేనే నష్టపరిహారం పొందేందుకు రైతులు అర్హులని ప్రభుత్వం నిబంధన విధించింది. దీంతో అంతకంటే తక్కువగా నష్టపోయిన రైతు ఒక్క రూపాయి పరిహారానికి కూడా నోచుకునే అవకాశం లేదు. అధికారులు పంపిన నష్ట పరిహారం అంచనాను పరిశీలించిన ప్రభుత్వం.. 50 శాతం పైగా నష్టం వాటిల్లిన పంటలను గుర్తించి నివేదిక ఇవ్వాలని, శాస్త్రవేత్తలతో కూడా నష్టాలను అంచనా వేయించాలని వ్యవసాయాధికారులను ఆదేశిం చింది. దీంతో అధిక వర్షాలు కురిసిన ప్రాంతాల్లో వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు తమకున్న నిబంధనలు, ప్రామాణికాల ఆధారంగా సర్వే చేసి అంచనాలను రూపొందించారు. వీటి ఆధారంగా ప్రభుత్వం జిల్లాలో 278.5 హెక్టార్లలో(696 ఎకరాలు) మాత్రమే పంటలకు నష్టం జరిగిందని నిర్ణయించింది. ఇందులో వరి 260 హెక్టార్లు(650 ఎకరాలు), సోయాబీన్ 13 హెక్టార్లు (32.5 ఎకరాలు), పత్తి 5.5 హెక్టార్ల(13 ఎకరాలు)లో 50 శాతానికిపైగా నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. సత్తుపల్లి, తల్లాడ, పెనుబల్లి మండలాల్లో వరి, పినపాకలో సోయాబీన్, పత్తి కేవలం కొత్తగూడెం మండలంలో మాత్రమే దెబ్బతిన్నట్లు గుర్తించారు. వరికి ఎకరానికి రూ.10 వేలు, సోయాబీన్‌కు రూ.6,250, పత్తికి రూ.10 వేల చొప్పున నష్టపరిహారం అందించేలా చర్యలు చేపట్టినట్లు జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు పి.బి.భాస్కర్ రావు ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. పంటలు నష్టపోయిన 807 మంది రైతులకు రూ. 27.03 లక్షలు ప్రభుత్వం పరిహారంగా అందజేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
అప్పుల ఊబిలో రైతన్న...
చేతికి అందిన పంట నీటిపాలై పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతులను ప్రభుత్వ నిబంధనలు నట్టేట ముంచాయి. అప్పు చేసి పండించిన పంట చేతికందే దశలో తుపాను ప్రభావంతో దెబ్బతిన్నది. ఇక తమకు ప్రభుత్వ పరిహారమే దిక్కని ఆశపడిన అన్నదాతలను ప్రస్తుత నిబంధనలు నిలువునా ముంచాయి. జిల్లాలో 1.68 లక్షల హెక్టార్లలో పత్తి, 1.38 లక్షల హెక్టార్లలో వరి సాగు చేశారు. అధిక వర్షాల కారణంగా ఈ పంటలు బాగా దెబ్బతిన్నాయి. వీటితో పాటు మిర్చి, మొక్కజొన్న పంటలకు కూడా నష్టం వాటిల్లింది. పంట దిగుబడి లేక, కనీసం పెట్టుబడి కూడా రాక అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. పరిహారం పంపిణీలోనూ ప్రభుత్వం మొండిచేయి చూపడంతో ఇప్పుడేం చేయాలోనని ఆందోళన చెందుతున్నారు. అర్థం లేని నిబంధనలు పెట్టి తమ జీవితాలతో ఆడుకోవద్దని కోరుతున్నారు.