ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలి | Elections should be conducted objectively | Sakshi
Sakshi News home page

ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలి

Published Thu, Apr 24 2014 2:21 AM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM

Elections should be conducted objectively

ఖమ్మం కలెక్టరేట్,న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రిటర్నింగ్ అధికారులు ప్రధాన భూమిక పొషించాలని ఎన్నికల పరిశీలకులు జశ్వంత్‌సింగ్, ఆశిష్‌కుమార్‌ఘోష్‌అన్నారు. బుధవారం సాయంత్రం సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ చాంబర్‌లో కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేష్‌తో కలసి రిటర్నింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని 2291 పోలింగ్ కేంద్రాల్లో  మౌలిక వసతులు కల్పించాలన్నారు. నియోజకవర్గ పరిధిలో ఈవీఎంలను తప్పనిసరిగా పరిశీలించి, పోలింగ్‌కు సిద్ధం చేసుకోవాలని చెప్పారు.

 సున్నిత,అతిసున్నిత ప్రాంతాలపై ప్రత్యేకదృష్టి సారించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్నికల ఫిర్యాదులు స్వీకరించేందుకు రిటర్నింగ్ అధికారులు తమ సెల్ నంబర్లు పత్రికలు, టీవీ చానల్స్ ద్వారా ప్రకటించాలన్నారు. పోలింగ్ మెటీరియల్ స్వీకరణ, అప్పగింతకు ఏర్పాటు చేసే రిసెప్షన్ కేంద్రాల వద్ద మైక్రో అబ్జర్వర్ల  డైరీల స్వీకరణకు అదనంగా కౌంటర్ ఏర్పాటు చేయాలని చెప్పారు.

 రెండు గంటలకోసారి నివేదిక పంపాలి
 పోలింగ్‌శాతాన్ని ప్రతి రెండు గంటలకు పంపి నివేదికలను సకాలంలో పంపాలని పరిశీలకులు ఆదేశించారు. పోలింగ్‌ఏజెంట్ల నియామకాల ప్రక్రియను సకాలంలో పూర్తిచేసి నియామక పత్రాలను అందించాలని ఎన్నికల పరిశీలకులు, రిటర్నింగ్ అధికారులకు సూచించారు. ప్రతి పోలింగ్‌కేంద్రంలో లైటింగ్ ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. పోలింగ్ రోజున సెక్టోరియల్ అధికారులు తమ సెక్టోరల్ పరిధిలో మాత్రమే ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో సత్వరమే స్పందించాలని వారు సూచించారు.

 జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్‌ల ఏర్పాట్లను ముందుగానే సరి చూసుకోవాలన్నారు. ప్రతి మండలానికి సంబంధించి ఒక ప్రాంతంలో మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. జిల్లాలో ఓటరు స్లిప్‌ల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.  చనిపోయిన, వలస వెళ్లిన, స్థానికంగా లేని వారి జాబితాను పోలింగ్ కేంద్రాల వారీగా సిద్ధం చేసి ఈ నెల 26వ తేదీలోగా సమర్పించాలని సూచించారు. జిల్లాలో 757  సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని,  ఆ ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్‌ను అతిక్రమించిన వారిపై నిబంధనల మేరకు సత్వరమే చర్యలు తీసుకోవాలని నోడల్ అధికారికి సూచించారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ టీమ్‌లు గ్రామాలలో పర్యటించాలని చెప్పారు.  సమావేశంలో జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్, ఐటీడీఏ పీవో దివ్య, నియోజకవర్గాల అధికారులు, నోడల్ అధికారులు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement