jaswanth singh
-
జశ్వంత్ సింగ్ కన్నుమూత
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన జశ్వంత్ సింగ్(82) ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. చాన్నాళ్లుగా ఆయన పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మాజీ ఆర్మీ అధికారి అయిన జశ్వంత్ సింగ్ మాజీ ప్రధాని అటల్ బిçహారీ వాజ్‌పేయికి సన్నిహితుల్లో ఒకరు. జశ్వంత్ సింగ్ మృతిపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, పార్టీలకతీతంగా పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. కేంద్రంలో ఆయన ఆర్థిక, రక్షణ, విదేశాంగ తదితర కీలక శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. 2014లో తన ఇంట్లో ఆయన కింద పడి, తీవ్రంగా గాయపడడంతో ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ వైద్యశాలలో చేర్చి చికిత్స చేశారు. ఆ తరువాత కూడా పలు అస్వస్థతలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. ఈ జూన్‌లో మరోసారి ఆస్పత్రిలో చేరారు. ‘కేంద్ర మాజీ మంత్రి, మేజర్(రిటైర్డ్) జశ్వంత్ సింగ్ సెప్టెంబర్ 27 ఉదయం 6.55 గంటలకు మరణించారు. 25 జూన్, 2020లో ఆయన ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి సెప్సిస్, మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్, గతంలో తలకు తగిలిన దెబ్బకు చికిత్స అందిస్తున్నాం. ఆదివారం ఉదయం తీవ్రస్థాయిలో గుండెపోటు వచ్చింది. ఆయనను కాపాడేందుకు వైద్యులు చేసిన కృషి ఫలించలేదు’ అని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రి ఒక ప్రకటనలో వివరించింది. రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు ముగిశాయి. జశ్వంత్ సింగ్ కుమారుడు మానవేంద్ర సింగ్ అంత్యక్రియలు నిర్వహించారు. మాజీ సైనికుడు, సమర్థుడైన పార్లమెంటేరియన్, అద్భుతమైన నాయకుడు, మేధావి అయిన జశ్వంత్ సింగ్ మృతి తననెంతో కలచివేసిందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. దేశానికి జశ్వంత్ సింగ్ ఎన్నో సేవలందించారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మానవేంద్ర సింగ్‌కు ప్రధాని ఫోన్ చేసి సంతాపం తెలిపారు. జశ్వంత్ తనకు అత్యంత సన్నిహితుడైన సహచరుడని బీజేపీ సీనియర్ నేత అడ్వాణీ పేర్కొన్నారు. రెండు సార్లు బీజేపీ నుంచి బహిష్కరణ 1938 జనవరి 3న రాజస్తాన్‌లోని బార్మర్ జిల్లా, జాసోల్ గ్రామంలో జశ్వంత్ సింగ్ జన్మించారు. విద్యాభ్యాసం అనంతరం ఆర్మీలో చేరారు. అనంతరం రాజీనామా చేసి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ప్రారంభం నుంచీ బీజేపీలో ఉన్నారు. ఎంపీగా పలు పర్యాయాలు పనిచేశారు. సభలో పదునైన గళంతో స్పష్టంగా తన అభిప్రాయాలను వెల్లడించేవారు. జశ్వంత్ సింగ్ రెండుసార్లు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ‘జిన్నా– ఇండియా, పార్టిషన్, ఇండిపెండెన్స్’ పుస్తకంలో జిన్నాను ప్రశంసించడంతో తొలిసారి 2009లో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. 2010లో మళ్లీ ఆయన బీజేపీలో చేరారు. ఆ తరువాత, పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా లోక్‌సభకు పోటీ చేయడంతో 2014లో మరోసారి ఆయనను పార్టీ నుంచి తొలగించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ సంతాపం సాక్షి, అమరావతి: కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. సైనికుడి నుంచి పార్లమెంటేరియన్‌గా మారి దేశానికి ఎంతో సేవ చేసి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి అని కొనియాడారు. జశ్వంత్ సింగ్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. -
కేంద్ర మాజీమంత్రి జశ్వంత్ సింగ్ కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీమంత్రి, బీజేపీ సీనియర్ నేత జశ్వంత్ సింగ్ (82) కన్నుమూశారు. ఆదివారం ఉదయం ఆయన మృతి చెందారు. జశ్వంత్ సింగ్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన సేవలను కొనియాడుతూ ప్రధాని ట్వీట్ చేశారు. పలువురు బీజేపీ నేతలు జశ్వంత్ సింగ్ మృతిపట్ల సంతాపం తెలిపారు. కాగా భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో జశ్వంత్ సింగ్ ఒకరు. పార్లమెంటు సభ్యుడిగా అత్యధిక కాలం పనిచేసిన నేతగా ఆయనకు పేరుంది. ఇక వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో జశ్వంత్ సింగ్ కీలక శాఖలు చేపట్టారు. ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాల్లాంటి కీలక శాఖలన్నింటినీ నిర్వహించిన అతి కొద్దిమందిలో ఆయన ఒకరు. ఇక 1999 డిసెంబరులో భారతీయ విమానం హైజాక్‌కు గురైనప్పుడు హైజాకర్లతో పాటు జశ్వంత్ కూడా కాందహార్ వెళ్లారు. ఇక 2014లో పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన జశ్వంత్ సింగ్‌పై బీజేపీ వేటు వేసింది. అప్పటి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. అలాగే 2018 రాజస్తాన్ ఎన్నికల సందర్భంగా జశ్వంత్‌సింగ్ కుమారుడు మన్వేంద్ర సింగ్ కూడా భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. Jaswant Singh Ji served our nation diligently, first as a soldier and later during his long association with politics. During Atal Ji’s Government, he handled crucial portfolios and left a strong mark in the worlds of finance, defence and external affairs. Saddened by his demise. — Narendra Modi (@narendramodi) September 27, 2020 -
గవర్నర్లుగా బీజేపీ సీనియర్ నేతలు!
న్యూఢిల్లీ : కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల గవర్నర్ల మీద దృష్టి కేంద్రీకరించింది. యూపీఏ హయంలో నియమితులైన గవర్నర్లను సాగనంపేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు గవర్నర్ల వ్యవహారంపై కేంద్ర హోంశాఖ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వంలో లేని బీజేపీ సీనియర్ నేతలను గవర్నర్లుగా నియమించే అవకాశం ఉంది. ఇక మహారాష్ట్ర గవర్నర్‌గా మురళీ మనోహర్ జోషీని నియమించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా దాదాపు 15 రాష్ట్రాల్లో కొత్త గవర్నర్ల నియామకం జరగనుంది. అప్పట్లో యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రాగానే అంతకుముందు ఎన్డీఏ ప్రభుత్వం నియమించిన గవర్నర్లను తొలగించింది. తమకు అనుకూలంగా ఉండే వ్యక్తులను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నియమించారనే అపవాదును యూపీఏ ప్రభుత్వం మూటగట్టుకుంది. బీజేపీ ప్రభుత్వాలను ఇరుకున పెట్టేలా అప్పుడు యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బాటలోనే మోడీ ప్రభుత్వం నడిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ గవర్నర్ల జాబితాలో తమిళనాడు గవర్నర్ రోశయ్య కూడా ఉన్నారు. ఆయన స్థానంలో గవర్నర్‌గా బీజేపీ బహిష్కృత నేత జశ్వంత్ సింగ్‌ను నియమించనున్నట్టు ప్రచారం సాగుతోంది. యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లను తొలగించే ప్రక్రియను చేపడతారన్న సమాచారంతో ప్రస్తుత గవర్నర్ల పరిస్థితి డోలాయమానంలో పడిపోయింది. -
తమిళనాడు గవర్నర్‌గా జశ్వంత్‌సింగ్!
జైపూర్: సీనియర్ నేత జశ్వంత్సింగ్కు గవర్నర్ పదవి కట్టబెట్టే అవకాశాలున్నాయనే వార్తల నేపథ్యంలో.. ఆయన తిరిగి బీజేపీ గూటికి చేరనున్నారనే ఊహాగానాలు మరోమారు పతాక శీర్షికలకెక్కా యి. బీజేపీ బహిష్కృత నేత జశ్వంత్‌ను తమిళనాడు గవర్నర్‌గా నియమించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల సమాచారం. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొణిజేటి రోశయ్య ప్రస్తుతం తమిళనాడు గవర్నర్‌గా ఉన్నారు. దీనిపై వ్యాఖ్యానించేందుకు సింగ్ అందుబాటులో లేనప్పటికీ.. ఆయన సన్నిహితులు మాత్రం తమ నేత బీజేపీలోకి తిరిగివెళ్లేందుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఆయనకు బర్మేర్ టికెట్‌ను బీజేపీ నిరాకరించింది. దీంతో అక్క డి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడంతో పార్టీ ఆయనపై బహిష్కరణ వేటు వేసింది. -
అద్వానీతో జశ్వంత్ మంతనాలు
న్యూఢిల్లీ: బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి జశ్వంత్‌సింగ్ అగ్రనేత అద్వానీని శుక్రవారం ఢిల్లీలో కలుసుకున్నారు. అద్వానీ నివాసానికి వచ్చిన జశ్వంత్ అరగంటపాటు ఉన్నారు. రాజస్థాన్‌లోని బార్మర్ లోక్ సభ స్థానం టికెట్‌ను తనకు ఇవ్వకపోవడంతో, ఎన్నికల్లో అదే స్థానం నుంచి జశ్వంత్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోవడం తెలిసిందే. తాజా భేటీ నేపథ్యంలో బీజేపీలోకి జశ్వంత్ తిరిగి రానున్నారంటూ వదంతులు మొదలయ్యాయి. అయితే, అద్వానీ వర్గాలు మాత్రం దీన్ని మర్యాద పూర్వక భేటీగా పేర్కొన్నాయి. జశ్వంత్ తన కుమారుడు, రాజస్థాన్ ఎమ్మెల్యే మన్వేంద్రసింగ్ భవిష్యత్తుపై అద్వానీతో చర్చించినట్లు తెలుస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే అయిన మన్వేంద్ర కూడా సస్పెండ్ అయ్యారు. బార్మర్‌లో తన తండ్రి జశ్వంత్ తరఫున ప్రచారం చేసి, పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా వ్యవహరించినందున బీజేపీ ఆయనపై ఈ చర్య తీసుకుంది. -
ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలి
ఖమ్మం కలెక్టరేట్,న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రిటర్నింగ్ అధికారులు ప్రధాన భూమిక పొషించాలని ఎన్నికల పరిశీలకులు జశ్వంత్‌సింగ్, ఆశిష్‌కుమార్‌ఘోష్‌అన్నారు. బుధవారం సాయంత్రం సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేష్‌తో కలసి రిటర్నింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని 2291 పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. నియోజకవర్గ పరిధిలో ఈవీఎంలను తప్పనిసరిగా పరిశీలించి, పోలింగ్‌కు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. సున్నిత,అతిసున్నిత ప్రాంతాలపై ప్రత్యేకదృష్టి సారించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్నికల ఫిర్యాదులు స్వీకరించేందుకు రిటర్నింగ్ అధికారులు తమ సెల్ నంబర్లు పత్రికలు, టీవీ చానల్స్ ద్వారా ప్రకటించాలన్నారు. పోలింగ్ మెటీరియల్ స్వీకరణ, అప్పగింతకు ఏర్పాటు చేసే రిసెప్షన్ కేంద్రాల వద్ద మైక్రో అబ్జర్వర్ల డైరీల స్వీకరణకు అదనంగా కౌంటర్ ఏర్పాటు చేయాలని చెప్పారు. రెండు గంటలకోసారి నివేదిక పంపాలి పోలింగ్‌శాతాన్ని ప్రతి రెండు గంటలకు పంపి నివేదికలను సకాలంలో పంపాలని పరిశీలకులు ఆదేశించారు. పోలింగ్ఏజెంట్ల నియామకాల ప్రక్రియను సకాలంలో పూర్తిచేసి నియామక పత్రాలను అందించాలని ఎన్నికల పరిశీలకులు, రిటర్నింగ్ అధికారులకు సూచించారు. ప్రతి పోలింగ్‌కేంద్రంలో లైటింగ్ ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. పోలింగ్ రోజున సెక్టోరియల్ అధికారులు తమ సెక్టోరల్ పరిధిలో మాత్రమే ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో సత్వరమే స్పందించాలని వారు సూచించారు. జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్‌ల ఏర్పాట్లను ముందుగానే సరి చూసుకోవాలన్నారు. ప్రతి మండలానికి సంబంధించి ఒక ప్రాంతంలో మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. జిల్లాలో ఓటరు స్లిప్‌ల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. చనిపోయిన, వలస వెళ్లిన, స్థానికంగా లేని వారి జాబితాను పోలింగ్ కేంద్రాల వారీగా సిద్ధం చేసి ఈ నెల 26వ తేదీలోగా సమర్పించాలని సూచించారు. జిల్లాలో 757 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, ఆ ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్‌ను అతిక్రమించిన వారిపై నిబంధనల మేరకు సత్వరమే చర్యలు తీసుకోవాలని నోడల్ అధికారికి సూచించారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ టీమ్‌లు గ్రామాలలో పర్యటించాలని చెప్పారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్, ఐటీడీఏ పీవో దివ్య, నియోజకవర్గాల అధికారులు, నోడల్ అధికారులు పాల్గొన్నారు.