గవర్నర్లుగా బీజేపీ సీనియర్ నేతలు!
న్యూఢిల్లీ : కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల గవర్నర్ల మీద దృష్టి కేంద్రీకరించింది. యూపీఏ హయంలో నియమితులైన గవర్నర్లను సాగనంపేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు గవర్నర్ల వ్యవహారంపై కేంద్ర హోంశాఖ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వంలో లేని బీజేపీ సీనియర్ నేతలను గవర్నర్లుగా నియమించే అవకాశం ఉంది. ఇక మహారాష్ట్ర గవర్నర్గా మురళీ మనోహర్ జోషీని నియమించే అవకాశం ఉంది.
దేశవ్యాప్తంగా దాదాపు 15 రాష్ట్రాల్లో కొత్త గవర్నర్ల నియామకం జరగనుంది. అప్పట్లో యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రాగానే అంతకుముందు ఎన్డీఏ ప్రభుత్వం నియమించిన గవర్నర్లను తొలగించింది. తమకు అనుకూలంగా ఉండే వ్యక్తులను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నియమించారనే అపవాదును యూపీఏ ప్రభుత్వం మూటగట్టుకుంది. బీజేపీ ప్రభుత్వాలను ఇరుకున పెట్టేలా అప్పుడు యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బాటలోనే మోడీ ప్రభుత్వం నడిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
కాంగ్రెస్ గవర్నర్ల జాబితాలో తమిళనాడు గవర్నర్ రోశయ్య కూడా ఉన్నారు. ఆయన స్థానంలో గవర్నర్‌గా బీజేపీ బహిష్కృత నేత జశ్వంత్ సింగ్‌ను నియమించనున్నట్టు ప్రచారం సాగుతోంది. యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లను తొలగించే ప్రక్రియను చేపడతారన్న సమాచారంతో ప్రస్తుత గవర్నర్ల పరిస్థితి డోలాయమానంలో పడిపోయింది.