అద్వానీతో జశ్వంత్ మంతనాలు
న్యూఢిల్లీ: బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి జశ్వంత్‌సింగ్ అగ్రనేత అద్వానీని శుక్రవారం ఢిల్లీలో కలుసుకున్నారు. అద్వానీ నివాసానికి వచ్చిన జశ్వంత్ అరగంటపాటు ఉన్నారు. రాజస్థాన్‌లోని బార్మర్ లోక్ సభ స్థానం టికెట్‌ను తనకు ఇవ్వకపోవడంతో, ఎన్నికల్లో అదే స్థానం నుంచి జశ్వంత్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోవడం తెలిసిందే. తాజా భేటీ నేపథ్యంలో బీజేపీలోకి జశ్వంత్ తిరిగి రానున్నారంటూ వదంతులు మొదలయ్యాయి.
అయితే, అద్వానీ వర్గాలు మాత్రం దీన్ని మర్యాద పూర్వక భేటీగా పేర్కొన్నాయి. జశ్వంత్ తన కుమారుడు, రాజస్థాన్ ఎమ్మెల్యే మన్వేంద్రసింగ్ భవిష్యత్తుపై అద్వానీతో చర్చించినట్లు తెలుస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే అయిన మన్వేంద్ర కూడా సస్పెండ్ అయ్యారు. బార్మర్‌లో తన తండ్రి జశ్వంత్ తరఫున ప్రచారం చేసి, పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా వ్యవహరించినందున బీజేపీ ఆయనపై ఈ చర్య తీసుకుంది.