ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: భూ సంబంధ సమస్యల పరిష్కారంలో రాజకీయ పార్టీల పాత్ర కీలకమైందని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అన్నారు. వచ్చే నెల 10 నుంచి 25వ తేదీ వరకు జరిగే మూడోవిడత రెవెన్యూ సదస్సుల సందర్భంగా శనివారం కలెక్టరేట్‌లోని ప్రజ్ఞ మందిరంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భూసమస్యల పరిష్కారానికి ఎస్సీ, ఎస్టీ వాడలలో రెవెన్యూ గ్రామానికొక సదస్సు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. రెవెన్యూ వ్యవస్థకు కీలకమైన వీఆర్‌ఓ కార్యాలయాలను పటిష్టపరుస్తున్నట్లు చెప్పారు.
అందులో భాగంగా జిల్లాలో 1242 రెవెన్యూ గ్రామాలుంటే 935చోట్ల రెవెన్యూ కార్యాలయాలు ఏర్పాటు చేశామన్నారు. మిగిలిన 307 గ్రామాల్లో కంపెనీల సామాజిక బాధ్యత నిధుల నుంచి కార్యాలయ సొంత భవనాలు నిర్మించనున్నట్టు చెప్పారు.
2005 నుంచి ఇప్పటివరకు ఏడు విడతలుగా పంపిణీ చేసిన భూముల స్థితిగతులను పరిశీలిస్తామన్నారు. అసైన్‌మెంట్ భూములను కొనుగోలు చేసిన వారిపై పీఓటీ చట్టం కింద కేసులు పెట్టనున్నట్టు తెలిపారు. ఇ-పాస్ బుక్‌ల జారీకిగాను ఖమ్మం జిల్లాను పెలైట్ ప్రాజెక్టుగా ప్రభుత్వ ఎంపిక చేసినట్టు తెలిపారు. మూడోవిడత రెవెన్యూ సదస్సులలో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఈ నెలాఖరు వరకు రెవెన్యూ, ఐకేపీ బృందాలు గ్రామాలలో పర్యటిస్తాయన్నారు. నిరుపేద ఎస్సీలకు భూముల కొనుగోలు కింద యూనిట్‌కు ఐదులక్షల రూపాయల చొప్పున 100 యూనిట్ల కేటాయింపునకు లబ్ధిదారులను గుర్తించనున్నట్టు చెప్పారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్, అడిషనల్ జాయింట్ కలెక్టర్ కె.బాబూరావు, డీఆర్‌ఓ శివశ్రీనివాస్, సర్వే అండ్ ల్యాండ్స్ ఏడీ అశోక్, ఐకేపీ లీగల్ కో-ఆర్డినేటర్ ఎ.శ్రీకాంత్, రాజకీయ పార్టీల ప్రతినిధులు భాగం హేమంతరావు(సీపీఐ), ఎన్.వెంకయ్య(కాంగ్రెస్), ఎం.నాగేశ్వరరావు, తాతా భాస్కర్‌రావు(సీపీఎం), కె.రంగారెడ్డి(న్యూడెమోక్రసీ), ఎల్.పుల్లారావు(లోక్‌సత్తా), ఎన్.వెంకటేశ్వరరావు(టీడీపీ), హెచ్.వెంకటేశ్వరరావు(వైఎస్‌ఆర్ సీపీ), దాసు మహారాజు, కె.కృష్ణ(బీఎస్పీ) తదితరులు పాల్గొన్నారు.
భూ సమస్యల పరిష్కారంలో...రాజకీయ పార్టీల పాత్ర కీలకం
Published Sun, Jan 26 2014 5:36 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM
Advertisement
Advertisement